Site icon Sanchika

నా జీవన గమనంలో…!-25

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

38

[dropcap]బ్రాం[/dropcap]చ్ టార్గెట్లన్నీ రీచ్ అవగలిగాము. మా బ్రాంచి నుండి వితరణ చేసిన వ్యవసాయ ఋణాలను కూడా తొంభై శాతం పైగా వసూలు చేయగలిగాము. అక్కడ కర్షక సేవా సహకార సంఘంలో అవలంబించిన పద్ధతులనే ఇక్కడ బ్రాంచిలో కూడా అమలు చేస్తూ అక్కడి లాగే ఇక్కడ కూడా వ్యవసాయ ఋణాల్లో తొంభై శాతం పైగా వసూలు చేయగలిగాము.

వాస్తవంగా ఎలాంటి బ్యాంకు ఋణాలనైనా వసూలు చేసేందుకు పాటించవలసిన పద్ధతులు ఒకటే!

వాతావరణ పరిస్థితులు అనుకూలించి, సకాలంలో వర్షాలు కురిసి, చాలినంత వర్షపాతం నమోదైతే, పంటల్లో ఆశించినంత దిగుబడి సాధించగలుగుతుంది మన రైతాంగం. వాటికి తోడు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తే రైతుల శ్రమకుదగ్గ ఫలితం తప్పక లభిస్తుంది. అప్పుడు ఏ రైతు కూడా బ్యాంకు అప్పు కట్టకుండా వుండాలని అనుకోడు.

ఇక బ్యాంకుగా వ్యవసాయ ఋణాల్లో అత్యధిక శాతం వసూళ్ళ కొరకు, మా పాత్ర ఎలా ఉంటుందో చూద్దాం.

పైన తెలియజేయబడిన ఎనిమిది రకాల కార్యక్రమాలను ఓ ప్రణాళికాబద్ధంగా అమలుచేయబట్టే వ్యవసాయ ఋణాల్లో తొంభై శాతం పైగా వసూలు చేయగలిగాము.

ఇక్కడ ఓ విషయం గమనించాలి. ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా గ్రామాల్లో ఉండే పరిస్థితులను బట్టి, పైన తెలుపబడిన వాటితో పాటు, వినూత్నమైన కార్యక్రమాలు మరేవైనా అమలు చేయవచ్చు.

39

1985 సంవత్సరం.

గత సంవత్సరం మహబూబాబాద్ లయన్స్ క్లబ్ చేపట్టిన ప్రతి సేవా కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఆ క్రమంలో ఖమ్మం, వరంగల్ పట్టణాల్లోని లయన్స్ క్లబ్ కార్యక్రమాలకు కూడా తోటి సభ్యులతో కలిసి హాజరయ్యాను. ఈ సంవత్సరానికి గాను నన్ను మహబూబాబాద్ లయన్స్ క్లబ్ సెక్రటరీగా ఎన్నుకున్నారు.

1985-86 సంవత్సరానికి మహబూబాబాద్ లయన్స్ క్లబ్ సెక్రటరీగా ఎన్నుకొనబడిన తరువాత క్లబ్ సభ్యుల నుద్దేశించి ప్రసంగిస్తున్న రచయిత

ఆ క్లబ్‍లో అదొక బాధ్యతాయుతమైన పదవి. మొదటిగా క్లబ్ ఈ సంవత్సరం చేపట్టబోయే వివిధ సేవా కార్యక్రమాలు, వాటికి అవసరమైన ఆర్థిక వనరులను విరాళాల రూపంలో సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకుసాగాము.

ప్రణాళికలను సిద్ధం చేసుకునేందుకు కొనసాగ్తున్న చర్చలు… ఎడమ నుండి కుడికి… 1. లయన్ డాక్టర్ జగన్మోహనరావు గారు 2. రచయిత 3. లయన్ డాక్టర్ నరసింహారెడ్డిగారు

క్లబ్ సభ్యులు విరివిగానే విరాళాలు ఇచ్చారు. పట్టణం లోని ఇతర దాతలు కూడా తమ శక్తి మేర విరాళాలు ఇచ్చారు.

బ్యాంకులో నా విధి నిర్వహణలో ఏ మాత్రం లోపం రాకుండా చూసుకుంటూ, లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలలో నా వంతు బాధ్యతలు నేను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాను.

మహబూబాబాద్ లోని అన్ని స్కూళ్ళు, కాలేజీలలో ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహించి, విద్యార్థులకు దంత పరీక్షలు చేయించి, అవసరమైన మందులు ఉచితంగా అందజేశాము.

ఉచిత దంతవైద్య శిబిరంలో దంత పరీక్షలు నిర్వహిస్తున్న మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి దంతవైద్య నిపుణులు లయన్ డాక్టర్ కె.యల్.వి. ప్రసాద్ గారు… కుడి వైపు చివర రచయిత.

చుట్టుపక్కల గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాల ద్వారా పేదవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశాము.

కురవి గ్రామంలో నిర్వహించబడిన ఉచిత వైద్యశిబిరంలో వైద్య సేవలను వినియోగించుకునేందుకు బారులు తీరిన, గుమిగూడిన కురవి మరియు పరిసర గ్రామాల ప్రజలు
కురవి గ్రామంలో, లయన్స్ క్లబ్ మహబూబాబాద్ – కాకతీయ వైద్య కళాశాల, వరంగల్, ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం, కురవి – సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, మహబూబాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులు, మరియు కురవి కర్షక సేవా సహకార సంఘ సిబ్బంది.

ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించి, పశువులకు ఆరోగ్య పరీక్షలు చేయించి, అవసరమైన మందులు ఉచితంగా అందజేశాము.

మహబూబాబాద్‍లో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించి, పేదవారికి కంటి ఆపరేషన్లు చేయించి, కళ్ళద్దాలను, మందులను ఉచితంగా అందజేశాము. ఆర్థిక ఇబ్బందులతో చదువులను కొనసాగించలేని పేద విద్యార్థులకు మెరిట్ స్కాలర్‍షిప్‍లు అందజేసి, వారి చదువులను నిరాటంకంగా కొనసాగించేందుకు సహాయపడ్డాము.

40

ఈ సంవత్సరం కూడా మహబూబాబాద్ బ్రాంచి టార్గెట్స్ అన్నీ చేరుకోగలిగాము.

వరంగల్ రీజియన్ లోని శాఖాధిపతుల సమావేశము భువనగిరి దగ్గర యాదగిరిగుట్టలో జరిగింది. నేను కూడా ఆ సమావేశానికి హాజరయ్యాను. ముందుగా ఎంతో ప్రాచుర్యం ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించాము. హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ డి.యన్. మూర్తి గారు, వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీ యల్. వీరభద్రరావు గారు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు.

ఆ తరువాత రీజియన్ లోని అన్ని బ్రాంచీల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్ బ్రాంచిని సమీక్షించిన పిమ్మట, వారు మిక్కిలిగా సంతృప్తిని వెలిబుచ్చారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను, అన్ని బ్రాంచీల టార్గెట్లను బాగా పెంచారు.

సమావేశం ముగింపు కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ డి.యన్. మూర్తి గారు, బ్రాంచి మేనేజర్లను ఉద్దేశించి ఒకింత ఆవేశంగానే ప్రసంగించారు.

“ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగంలో వివిధ బ్యాంకుల మధ్య వ్యాపారాభివృద్ధి కొరకు, పోటీతత్వం విపరీతంగా పెరిగిపోతోంది. ఏ బ్యాంకైనా భవిష్యత్తులో నిలదొక్కుకోవాలంటే, ఇతర బ్యాంకులతో పోటీ పడాల్సిందే… నెగ్గుకు రావల్సిందే! ఆ విషయంలో మన బ్యాంకుకు ప్రత్యేకమైన మినహాయింపు ఏమీ లేదు. అందుకే ఈ సంవత్సరం బ్రాంచీలకు టార్గెట్లు, గడచిన సంవత్సరాలకు భిన్నంగా, మరింతగా పెంచాము.

మీరందరూ… అనుకోవచ్చు – ఈ టార్గెట్లు పెట్టారు గానీ, వాటిని రీచ్ అవగలమా? అని. అవలేమని తెలిసి తెలిసి, ప్రయత్నం చేయడం వృథా ప్రయాస అవుతుందేమో!… అని కూడా మీరు అనుకోవచ్చు. అలా అనుకుంటే – అది చాలా పొరపాటు. ఎందుకంటే, మనందరి భవిష్యత్తు, మన బ్యాంకు భవిష్యత్తు పైనే ఆధారపడి వుంది. అది నిజం అని మీకందరికీ తెలుసు. అందుకే, టార్గెట్స్ ఎక్కువగా ఉన్నాయని మీరెవరూ నిరుత్సాహపడకూడదు. మీ వంతు ప్రయత్నం మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే! మీరు అనుకోవాలే గాని, అది తప్పక సాధిస్తారు… ఎందుకంటే ‘ఆంజనేయస్వామి బలం, ఆంజనేయస్వామికి తెలియదట!’… అలాగే మీలోని శక్తి సామర్థ్యాలు మీకు తెలియవు. మీలో నిగూఢంగా దాగి వున్న ఆ శక్తి సామర్థ్యాలను వెలికి తీయండి, వాటిని ప్రయోగించండి, మీకిక ఎదురనేది ఉండదు. మీరంతా ఈ క్షణం నుండే రంగంలోకి దిగండి. ఆల్ ది బెస్ట్!”… అంటూ తన సందేశాన్ని వినిపించారు.

కళ్ళప్పగించి, చెవులు రిక్కించి ఆ ప్రసంగం విన్న మేమంతా, కరతాళ ధ్వనులతో మా సమ్మతిని తెలియజేశాము. మాలో ప్రతి ఒక్కరం రెట్టింపైన ఉత్సాహాన్ని మూటగట్టుకుని, కదనరంగంలోకి దూకే సైనికుల్లా తిరుగు ప్రయాణమయ్యాం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version