Site icon Sanchika

నా జీవన గమనంలో…!-27

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

44

[dropcap]ఆ[/dropcap] రోజే మహబూబాబాద్ బ్రాంచిలో రిలీవ్ అయ్యాను. మహబూబాబాద్‌తో నా అనుబంధం, ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా ఆరు సంవత్సరాలు. మూడు సంవత్సరాలు ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘంతో, మరో మూడు సంవత్సరాలు ఆంధ్రా బ్యాంకు మహబూబాబాద్ బ్రాంచితో. మహబూబాబాద్‌‍లో పని చేయడం, మొదట్లో ఒకింత ఇబ్బందిగా అనిపించినా, రోజులు గడిచే కొద్ది, అక్కడి వాతావరణం, అక్కడి ప్రజలు, ఖాతాదారులు, స్నేహితులు, మరీ ముఖ్యంగా సిబ్బంది… ప్రతీ విషయం, నా వ్యక్తిత్వానికి చాలా అనుకూలించాయి. ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా, అంతా సవ్యంగా, సాఫీగా జరిగిపోయాయి. అక్కడున్నన్ని రోజులు, ఎంతో జాబ్ శాటిస్‌ఫాక్షన్ నా సొంతమైంది. ఆ ప్రాంతంతో విడదీయలేని బంధం నన్ను పెనవేసుకుందని నాకప్పుడే తెలిసింది.

మరుసటి రోజంతా సందడి, సందడిగా గడిచింది. కురవి కర్షక సేవా సహకార సంఘ సిబ్బంది, ఆంధ్రా బ్యాంకు మహబూబాబాద్ శాఖ సిబ్బంది, సంయుక్తంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో – మా ఖాతాదారులు, సంఘ పాలకవర్గ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, నా మిత్రులు అందరూ పాల్గొన్నారు. నా సేవలను వాళ్ళంతా కొనియాడుతుంటే కళ్ళంట నీళ్ళు కారుతున్నాయి గాని, నోటంట మాటలు పెగలట్లేదు. అతి కష్టం మీద, మనసు దిటవు చేసుకుని వాళ్లందరూ నాపై చూపించిన అభిమానానికి, నా కర్తవ్య నిర్వహణలో, వాళ్ళందంచిన సహాయ సహకారాలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.

ఇక ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు, గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో గుంటూరుకి కుటుంబ సమేతంగా బయలుదేరాను. మమ్మల్ని రైలెక్కించి ఘనంగా వీడ్కోలు పలికేందుకు, చాలామంది స్టేషన్‍కు చేరుకున్నారు. వాళ్ళంతా పూలదందలతో నన్ను ముంచెత్తారు.

ఇక్కడో వ్యక్తి గురించి చెప్పుకోవాలి. అతనే నా ప్రియ మిత్రుడు డాక్టర్ ప్రసాద్. ఈ రోజు జరిగిన వీడ్కోలు సభలో వున్నాడు. ఇప్పుడు రైల్వే స్టేషన్‍లో కూడా ఉన్నాడు. అయితే మేమిద్దరం ఒకరినొకరం సూటిగా చూసుకునే ధైర్యం చేయలేకపోతున్నాము. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ స్టేషన్‍లోకి రావడానికి సిగ్నల్ దాటింది. అప్పుడే డాక్టర్ ప్రసాద్ నా దగ్గరకొచ్చి…

“మరలా ఎప్పుడు కలుసుకుంటాం మిత్రమా!” అని అడిగాడు.

“టైం వచ్చినప్పుడు తప్పకుండా కలుసుకుంటాం!” అన్నాను. వెంటనే ప్రసాద్ నన్ను ఆలింగనం చేసుకున్నాడు. దగ్గరగా చేరిన ఇరువురి గుండెలు, లబ్ డబ్ అంటూ పెద్దగా శబ్దం చేస్తున్నాయి. చెంతకు చేరిన ఇరువురి మనసులు ఉద్వేగంతో గుససుసలాడుకున్నాయి.

ట్రెయిన్ వచ్చి స్టేషన్‍లో ఆగింది. ఎ.సి. చైర్ కార్లో, మేము ముందుగా రిజర్వు చేసుకున్న సీట్లలో నా భార్యా, పిల్లల్ని కూర్చోబెట్టి, నేను డోర్ దగ్గరకు వచ్చాను. అందరికీ రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించాను. ఇంతలో రైలు కదిలింది. తమ కుడి చేతులను గాలిలో ఊపుతూ, నాకు వాళ్ళంతా అభివాదాలు తెలుపుతూ, నా వైపే చూస్తూ నిశ్చేష్టులై నిల్చున్నారు. నేను డోర్ దగ్గర ఎడమ చేత్తో రాడ్‍ని ఆధారంగా పట్టుకుని, ముందుకు వంగి కుడి చేత్తో వాళ్ళందరికీ అభివాదం తెలుపుతూ, వాళ్ళందరినీ చూస్తూ నిల్చుండిపోయాను. నా కళ్ళ నిండా కమ్మిన కన్నీళ్ళతో నా చూపు మసకబారింది. వాళ్లందర్నీ తృప్తిగా చూడలేకపోతున్నాను. ఒక్కసారి రెండు కళ్ళను గట్టిగా నా కుడిచేత్తో నులుపుకున్నాను. పరవాలేదు, ఇప్పుడు కనిపిస్తున్నారు వాళ్ళంతా… కనిపించినంత సేపు వాళ్లందర్ని చూస్తూ నిల్చుండిపోయాను. వేగం పుంజుకుంటున్న రైలు మహబూబాబాద్‌తో నాకున్న ఆరేళ్ళ బంధాన్ని తెగిందాకా లాగింది. ఆ హృద్యమైన దృశ్యం కనుమరుగైన తరువాత డోర్ దగ్గర నుండి వెనక్కి వచ్చి వాష్ బేసిన్‌పై నున్న అద్దంలో నా ముఖాన్ని చూసుకున్నాను. కళ్ళ నుండి జాలువారిన కన్నీళ్ళు బుగ్గలపై చారలు గట్టి కనిపించాయి. నీళ్ళతో ఒకసారి ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని, కర్చీఫ్‌తో తుడుచుకుని, తల దువ్వుకుని, వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను. ఆ క్షణంలో మా వాళ్ళతో మాట్లాడేందుకు మనస్కరించలేదు. నా పరిస్థితిని గమనించి, అర్థం చేసుకున్న మా వాళ్ళు నన్ను పలకరించే సాహసం చేయలేక మిన్నకుండి పోయారు. ఆ వాతావరణాన్ని అలాగే పొడిగించడం అంత మంచిది కాదనుకున్న నేను…

“ఆ చెప్పండి! గుంటూరు కెళ్తున్నాం కదా! హ్యాపీనా?” అని పలకరించి తేలికపరిచాను.

మహబూబాబాద్‌లో మా అనుభవాలను పునశ్చరణ చేసుకుంటూ మా సంభాషణను కొనసాగించాము. రాత్రి పన్నెండు గంటలకు మేమంతా మా అత్తగారింటికి చేరుకున్నాము.

45

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరు రీజినల్ ఆఫీసులో లీడ్ డిస్ట్రిక్టు మేనేజరుగా జాయిన్ అయ్యేందుకు నిర్ణయించుకున్నాను. రీజినల్ మానేజర్ గారిని కలిసి, తరువాత అక్కడి సిబ్బందిని పరిచయం చేసుకుందామని, ఉదయం 10 గంటలకల్లా ఆఫీసుకి చేరుకున్నాను. ముందుగా రీజినల్ మేనేజర్ శ్రీ యల్. వీరభద్రరావు గారిని కలిసేందుకు వారి క్యాబిన్‍లోకి వెళ్ళాను. ఇక్కడే… ఓ ‘ట్విస్టు’… అదే నా బదిలీ ఉత్తర్వులలో ఏదో మార్పు జరిగిందట! గుంటూరు రీజినల్ ఆఫీసుకు బదులుగా, నన్ను నిడుబ్రోలు బ్రాంచికి మేనేజర్‌గా పోస్టు చేసినట్టు, రీజినల్ మేనేజర్ గారు చల్లగా చెప్పారు. వినగానే నాకు కొంచెం సేపు నోట మాట రాలేదు. సొంత ఇంట్లో ఉండొచ్చని, పిల్లలకు నాణ్యమైన విద్యను సమకూర్చవచ్చని, బంధువులందరికీ సమీపంలో ఉండొచ్చని, ఎన్నో కలలు కన్నాను. ఒక్కసారిగా నా కలల సౌధం కుప్పకూలిపోయింది. కలలు కల్లలు అయ్యాయి. వెంటనే తేరుకున్న నేను రీజినల్ మేనేజర్ గారితో…

“అలాగే సార్! అయితే  నేను ఈరోజే నిడుబ్రోలు బ్రాంచికి వెళ్ళి, అక్కడ మేనేజర్‍గా జాయిన్ అవుతాను సార్!… మరి వెళ్ళొస్తాను సార్” అంటూ విసురుగా లేచి బయలుదేరాను.

“అలాగే! ఆల్ ది బెస్ట్ టు యూ!”.. అంటూ రీజినల్ మేనేజర్ గారు కొంచెం బాధ పడుతూ చెప్పినట్లనిపించింది నాకు.

ఆఫీసు నుండి బయటకు రాగానే ఎదురుగా కొరిటెపాడు నుండి ఆర్.టి.సి. బస్టాండుకు వెళ్ళే సిటీ బస్సు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. పరిగెత్తుకుంటూ రోడ్డు దాటి వెళ్ళి, ఒక్క ఉదుటున బస్సెక్కాను. బస్టాండుకు చేరుకుని పొన్నూరు వెళ్ళే బస్సెక్కాను. గుంటూరు నుండి పొన్నూరుకు దూరం 35 కిలోమీటర్లు. ఓ ముప్పావు గంటలో చేరుకోవచ్చు. బస్సులో కూర్చున్నంత సేపూ ఏవేవో ఆలోచనలు…

‘ట్విస్టు’ అంటే ‘ఊహించని ఓ మలుపు’ అని అందరికీ తెలుసు. వాస్తవానికి వర్తమాన కాలంలో ట్విస్టులు ఉన్న కథలనే పాఠకులు చదవడానికి మొగ్గు చూపుతున్నారు. ట్విస్టులు ఉన్న సినిమాలనే ప్రేక్షకులు చూడ్డానికి ఇష్టపడుతున్నారు. కాలానుగుణంగా రచయితలు కూడా, ట్విస్టులతో కూడిన కథలనే రచించడానికి సమాయత్తమవుతున్నారు.

ఆ నేపథ్యంలో… మన నిజ జీవితాల్లో కూడా కొన్ని ట్విస్టులు జరుగుతుండడం మనం గమనిస్తుంటాము. ఇక నా విషయానికొస్తే… 1975 సంవత్సరం… ఇదే గుంటూరు రీజినల్ ఆఫీసులో నేను పని చేసేటప్పుడు ఒక ట్విస్టు జరిగింది. సి.ఎ.ఐ.ఐ.బి. పార్ట్-1 … అక్కౌంట్స్ పేపర్‍లో నేను ఫెయిలయినట్టు, ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్, బొంబాయి నాకు వర్తమానం పంపింది. ఎంతో కష్టపడి చదివి వ్రాసిన పరీక్షలో ఫెయిల్ అవడం నన్నెంతో కలవర పరిచింది. కాని నాలో, పాసవుతాననే నమ్మకం మాత్రం, ఆవగింజంతైనా సన్నగిల్లలేదు. అక్కడ ట్విస్టు ఏంటంటే మరో వారం రోజులోనే, ఇండియన్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్, బొంబాయి, జరిగిన పొరపాటుకు చింతిస్తూ, నేను అకౌంట్స్‌లో పాసయినట్లు తెలియజేశారు. అదీ… ట్విస్టు…

ఇప్పుడు ఈ ట్విస్టు మరీ ఆశ్చర్యంగా ఉంది. మహబూబాబాద్‌లో రిలీవ్ అయి గుంటూరులో జాయిన్ అయ్యేలోపే బదిలీ ఉత్తర్వులు తారుమారు అయ్యాయి.

అసలెందుకిలా జరిగింది… ‘తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు’ అంటే ఇదేనేమో! అయినా మన చేతుల్లో ఏముంది? ఎలా రాసి పెట్టి వుంటే అలా జరుగుతుంది. ఇలా కావడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉండి ఉంటుందా? ఏమో మరి! అయినా… ఇప్పుడవన్నీ అప్రస్తుతం. బ్యాంకు ఎక్కడికి బదిలీ చేస్తే అక్కడకు వెళ్ళి విధులను నిర్వహించడం… నా తక్షణ కర్తవ్యం… అందులో వేరే ఊహలకు తావే లేదు… ఒక విధంగా ఆలోచిస్తే ‘అంతయూ మన మంచికే అయ్యుండచ్చు… చూద్దాం… ఏం జరుగబోతోందో…’ అని అనుకుంటుండగానే బస్సు పొన్నూరులో ఆగింది.

46

పొన్నూరు, నిడుబ్రోలు ఒకప్పుడు వేర్వేరు గ్రామాలు కావొచ్చు. ప్రస్తుతం రెండూ కలిసిపోయి, పొన్నూరు మునిసిపాలిటీగా అవతరించాయి. పొన్నూరులో ఆంధ్రా బ్యాంకు శాఖ వుంది. నిడుబ్రోలులో కూడా వుంది. రెండిటికీ మధ్య దూరం ఒక కిలోమీటరు లోపే వుంటుంది.

నిడుబ్రోలు బ్రాంచిలోకి ప్రవేశించి చూడగా, పదిమంది దాకా సిబ్బంది పనిలో నిమగ్నమై వున్నారు. ఖాతాదారులు కొంతమంది కౌంటర్‍ల ముందు, తమ పనులు చూసుకుంటున్నారు. మరి కొంతమంది కుర్చీల్లో కూర్చుని తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. సిబ్బందిలో నాకెవరైనా పరిచయస్తులు ఉన్నారేమోనని అందర్నీ పరిశీలనగా చూశాను. నాకు తెలిసిన ముఖం ఒక్కటి కూడా కనిపించలేదు. వాళ్ళెవరికీ నన్ను గుర్తు పట్టే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళెవరూ ఇంతవరకు నన్ను చూసి వుండరు. చేసేదేం లేక, నేనే సబ్ మేనేజర్‌ని కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను.

“ఓ మీరా సార్! నమస్తే సార్! వెల్‌కం సార్! రండి సార్… మీరు మీ క్యాబిన్‌లో కూర్చోండి. స్టాఫ్ అందర్నీ పిలిచి మీకు పరిచయం చేస్తాను.!”

“నమస్తే అండి! వాళ్ళెవర్నీ డిస్టర్బ్ చేయొద్దు. కస్టమర్స్‌కి ఇబ్బంది కలుగుతుంది. మనమే వాళ్ళ దగ్గరికి వెళదాం. ఎటూ సాయంత్రం నాలుగు గంటలకు స్టాఫ్ మీటింగు పెట్టుకుందాం… పదండి… ఒక్కొక్కరిగా అందర్నీ కలుద్దాం” అంటూ ముందుకు సాగాను.

సబ్ మేనేజర్ గారు… పేరు శ్రీ యన్. అమర్నాధ్ – సొంతూరు నిడుబ్రోలేనట! ప్రతి ఒక్కరినీ పేరు పేరున పరిచయం చేశారు సబ్ మేనేజర్‍ గారు. అక్కడే వున్న ఖాతాదారులకు కూడా నన్ను పరిచయం చేశారు.

పరిచయ కార్యక్రమం ముగిసిన తరువాత క్యాబిన్ లోకి వచ్చి నా సీట్లో కూర్చున్నాను. అటెండెన్స్ రిజిస్టర్, లేటెస్ట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్టు పంపించమని సబ్ మేనేజర్ గారికి చెప్పాను. కాసేపటికి, డఫ్తరీ ఆ రెంటినీ తెచ్చి నా ముందుంచాడు. సరిగ్గా పన్నెండు గంటలకి అటెండెన్స్ రిజిస్టర్‌లో ఇనీషియల్ పెట్టాను. తరువాత ఇన్‌స్పెక్షన్ రిపోర్టు చదవడంలో మునిగిపోయాను.

సాయంత్రం నాలుగు గంటలకు స్టాఫ్ మీటింగులో నా గురించి అంతా చెప్పాను. అలాగే ప్రతి ఒక్కరి గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఈ బ్రాంచిని ప్రగతిపథంలో నడిపేందుకు అందరి సహకారాన్ని అర్థించాను. అందుకు వారంతా తమ అంగీకారాన్ని మనస్ఫూర్తిగా తెలిపారు. వాళ్ళతో ముచ్చటించిన మీదట, బ్రాంచి గురించి అర్థం చేసుకోగలిగాను.

రాత్రి 8 గంటలకు ఇంటికి చేరి జరిగినదంతా మా వాళ్ళకు వివరించాను. నిరాశకు గురైనారు. నేను చెప్పిన మీదట మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాము.

‘తప్పేదేముంది… సర్దుకుపోదాం…!’ అని.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version