నా జీవన గమనంలో…!-3

41
2

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

[dropcap]1[/dropcap]972వ సంవత్సరం… సెప్టెంబరు నెల… 14వ తారీఖు. ఆ రోజే ఆంధ్రా బ్యాంకు ఉద్యోగంలో చేరడానికి ముహూర్తం పెట్టుకున్న రోజు.

అంతకు ముందు రోజు రాత్రంతా కలత నిద్రలోనే గడిపాను. ఎందుకంటే… తెల్లారితే ఉద్యోగంలో చేరాల్సిన రోజు. తలచుకుంటేనే ఓ వింత అనుభూతి. అమితమైన ఆనందం.

తెల్లవారు ఝామునే లేచి తయారయ్యాను. పూజగదిలో కూర్చుని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థించాను. ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా, అన్నీ సవ్యంగా… సాఫీగా… సంతోషంగా… ప్రశాంతంగా… విజయవంతంగా… నా ఉద్యోగపర్వం నడవాలని వేడుకొన్నాను.

పూజ ముగించుకుని బయటకొచ్చేసరికి, మా వాళ్ళంతా నా కోసం ఎదురుచూస్తూ… నిల్చొని వున్నారు. ముందుగా నాయనమ్మ, తాతలకు, తరువాత అమ్మానాన్నలకు పాదాభివందనం చేసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకున్నాను. తరువాత, చెల్లెళ్ళు, తమ్ముళ్ళతో నా సంతోషాన్ని పంచుకున్నాను. వారందరూ పట్టరాని ఆనందంతో నా చుట్టూ మూగారు.

ఇంతలో… అమ్మ, అక్కడి నుండి ఆవల గదిలోకి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళింది. ఏమయ్యుంటుందా… అని అనుకుంటూ, అక్కడికి వెళ్ళి అమ్మను చూశాను. పైట చెంగుతో కళ్ళు తుడుచుకుంటుంది. ఎందుకో తెలియదు. ఆ సన్నివేశం చూసి, నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. చిన్నగా నడుచుకుంటూ అమ్మ దగ్గరకి వెళ్ళాను. అమ్మ మౌనంగా నేల కేసి చూస్తోంది.

“అమ్మా! ఏంటమ్మా!? ఈ సంతోష సమయంలో బాధపడుతున్నావేంటమ్మా? చెప్పమ్మా!?” బొంగురు గొంతుతో అడిగాను.

“ఏం లేదు నాయనా! ఒక పక్క చాలా సంతోషంగా ఉంది. గర్వంగా కూడా ఉంది. మరో పక్క చిన్నపాటి దిగులు! అంతే… నాయనా” ఒకింత బాధగా చెప్పింది.

“దిగులా!… అదేంటమ్మా!… దిగులెందుకమ్మా!?” ఆశ్చర్యంగా అడిగాను.

“మరేం లేదు నాయనా! బుల్లెమ్మక్క చెప్పింది… ఒక్కసారి ఉద్యోగంలో చేరితే… ఎక్కడెక్కడికో పంపుతారట! బదిలీలపై ఎన్నో ఊర్లు తిప్పుతారట! దూరాభారం కూడా వెళ్ళాల్సివస్తుందట! అప్పుడు నువ్వు మమ్మల్ని కలవాలంటే చాలా ఇబ్బందట! అది తలచుకుంటేనే దిగులుగా ఉందయ్యా!” అని చెప్తూ తన మనసులోని బాధను బయటపెట్టింది అమ్మ…!

“ఓ… అదా… నీ బాధ!… అలాంటిదేం లేదమ్మా!… ఏ ఊరికెళ్ళినా… వారాంతపు శలవులుంటాయి… పండగ శలవులుంటాయి… అవసరమైతే, నేను కూడా శలవలు పెట్టుకోవచ్చు! అలాంటప్పుడు… తరచూ మిమ్మల్నందరినీ కలుసుకుని, మీతో సంతోషంగా గడిపేందుకు ఇబ్బంది ఏముంటుందమ్మా?… ఆ విషయంలో నువ్ ధైర్యంగా ఉండు…! సరేనా?… అయినా మీ అందరితో ఇప్పటిలాగా కలిసిమెలిసి ఉండాలనే కోరిక నాకు మాత్రం ఉండదా?… అవకాశం దొరికినప్పుడల్లా మీ దగ్గరకి వస్తాను…. నాకు కుదరకపోతే… మీరే… నా దగ్గరకు రావచ్చు… ఆ… సరేనా! బాధపడకమ్మా!… సంతోషంగా ఉండు!… సరేనా!” అంటూ అమ్మను ఓదార్చాను.

“సరే నాయనా! అట్లాగేలే!” అంటూ తలాడించింది అమ్మ.

“ఒక విషయం నాయనా!”

“ఏంటమ్మా?”

“ఉద్యోగం కోసం ఎక్కడికైనా, ఎంత దూరమైనా, ఏ ఊరైనా వెళ్ళు! నీకా దేవుడి దయ వుంది! నీకు అంతా మంచే జరుగుతుంది!”

“అలాగే నమ్మా… నీ సలహాను తప్పకుండా పాటిస్తాను!”

“ఇంకో విషయం నాయనా!”

“ఏంటమ్మా?”

“ఎట్టి పరిస్థితుల్లో, ఎప్పుడూ నువ్ ఉద్యోగంలో బదిలీపై మన ఊరికి రావద్దు. ఈ ఊర్లో తగదాలు, గొడవలు… నువ్వు తట్టుకోలేవ్… అందునా నువ్ చాలా సున్నిత మనస్కుడివి… పైగా… నీది బ్యాంకు ఉద్యోగం… ఎవరికి సహాయం చేయలేకపోయినా, వాళ్ళ కోపానికి గురి కావల్సి వస్తుంది…. ఆ విషయం మాత్రం గుర్తుంచుకో నాయనా!”

“అలాగేనమ్మా… తప్పక గుర్తుంచుకుంటాను!”

“చివరిగా నాదో చిన్న కోరిక నాయనా!”

“ఏంటమ్మా అది?… చెప్పు… తప్పక తీరుస్తాను!”

“ఏం లేదు నాయనా… ఎప్పుడు ఇంట్లోంచి బయటకెళ్ళినా, దేవుడికి దణ్ణం పెట్టుకుని, నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని బయటకు వెళ్తుండు… అదే నీకు శ్రీరామ రక్ష!”

“నువ్ చెప్పినట్లే చేస్తానమ్మా! నువ్ చెప్పిన ఈ మాట ఎన్నటికీ మర్చిపోనమ్మా!” అంటూ అమ్మకు మాటిచ్చాను.

బస్సుకి టైం అవుతోందని అందరి దగ్గర శలవు తీసుకుని బయలుదేరాను. పోలేరమ్మ గుడి దాకా అందరూ నాతో నడిచారు. పోలేరమ్మ మా గ్రామ దేవత… దండం పెట్టుకున్నాను. రాత్రికల్లా తిరిగొస్తానని వాళ్ళందరికీ చెప్పి నేను బస్టాండుకు బయలుదేరాను.

పదిగంటల కల్లా, గుంటూరు జిన్నా టవర్ సెంటర్‍లో, గౌరీశంకర్ హోటల్ పైన నున్న అంతస్తులో ఆంధ్రా బ్యాంకు శాఖ దగ్గరికి వెళ్ళి, సరాసరి మేనేజరు గారి క్యాబిన్‍లోకి వెళ్ళాను. సన్నగా, పొడుగ్గా వున్న వ్యక్తి, చక్కగా ఇన్‌షర్ట్ చేసుకున్న మేనేజరు గారు, కళ్ళద్దాలల్లోంచి తీక్షణంగా ఫైల్స్ చూడ్డంలో నిమగ్నమై వున్నారు.

“నమస్కారం సార్!” అన్నాను

“ఎవరూ?” అంటూ తల పైకెత్తి నా వైపు ప్రశ్నార్థకంగా చూశారు మేనేజరు గారు.

“సార్!… ఈ రోజు కొత్తగా జాబ్‍లో చేరడానికి వచ్చాను సార్!” చెప్పాను.

“ఓ! వెరీ గుడ్!… కూర్చో!” అని ఎదుటి కుర్చీ చూపించారు.

ఇబ్బందిగానే కూర్చున్నాను.

“చూడు బాబూ! బాగా కష్టపడి పని చేయాలి! మంచి పేరు తెచ్చుకోవాలి! మన బ్యాంకులో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది! నీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను…!” అంటూ చాలా పెద్దరికంగా చెప్పారు.

“చాలా థాంక్స్ సార్! తప్పకుండా మీరు చెప్పినట్లే నడుచుకుంటాను సార్!” అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చెప్పాను.

“సరే! పద! నిన్ను ఆఫీసరు గారికి పరిచయం చేస్తాను. వారే నీకు చెయాల్సిన పనుల గురించి చెప్తారు…!” అంటూ బయటకి నడిచారు.

వారిని అనుసరిస్తూ నేను కూడా బ్యాంక్ హాల్లోకి వచ్చాను.

అక్కడొక ఆఫీసరు దగ్గర ఆగి,… “ఏవండీ… ఈ రోజే ఈ అబ్బాయి జాయిన్ అవుతున్నారు. ఫార్మాలిటీస్ పూర్తి చేయించి విధుల్లోకి తీసుకోండి…” అని చెప్పి తిరిగి తన క్యాబిన్‍లోకి వెళ్ళిపోయారు.

తరువాత తెలిసింది… ఆయన గుంటూరు బ్రాంచ్‌కి మేనేజరే కాకుండా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో కూడిన రీజియన్‍కి రీజినల్ మేనేజరు అని!… ఆ రెండు జిల్లాల్లోని ఆంధ్రా బ్యాంకు శాఖలన్నీ ఆయన పర్యవేక్షణలో నడుస్తాయట!

వారి పేరు శ్రీ చెరువు రాధాకృష్ణమూర్తి గారు.

స్వర్గీయ శ్రీ చెరువు రాధాకృష్ణమూర్తి గారు

ఆఫీసరు గారు నాతో కొన్ని ఫారాలను పూర్తి చేయించి, సంతకాలు తీసుకుని, తనకు వెనుక వైపు ఒక చిన్న టేబుల్, కుర్చీ వేయించి, ప్రస్తుతానికి నన్ను అక్కడ కూర్చోమని చెప్పారు.

మొదటిగా, డిమాండ్ డ్రాఫ్టులు వ్రాయమని చెప్తూ, వచ్చిన ఓచరు చూసి డ్రాఫ్ట్ వ్రాయడం, రిజిస్టర్‍లో ఎంట్రీ చేయడం నాకు నేర్పించారు.

నల్ల సిరా కలంతో డ్రాఫ్టులు వ్రాయడం మొదలెట్టాను.

చిన్నతనం నుండి తెలుగు గాని, ఆంగ్లం గాని, గుండ్రంగా, అందంగా వ్రాయడం నాకలవాటైంది. కళాశాలలోనైతే ప్రాక్టికల్ రికార్డులు వ్రాయటంలో, పోస్టర్లు, పాంపెట్లు, ప్రకటనలు తయారు చేయడంలో, అచ్చం ప్రింటులా వ్రాసేవాడ్ని. నా ప్రాక్టికల్ రికార్డులను కళాశాలలో విద్యార్థులకు మోడల్‍గా చూపించేందుకు ప్రొఫెసర్లు తీసుకున్నారు. అందుకుగాను నన్ను అభినందిస్తూ, ఓ ప్రశంసాపత్రం కూడా నాకు ఇవ్వడం జరిగింది.

ఆ అనుభవంతో డ్రాఫ్టులను దాదాపు ప్రింటులా వ్రాశాను. నేను అలా వ్రాయడం ఆఫీసరుగారికి బాగా నచ్చింది. సహోద్యోగులు కూడా కొంతమంది నా దగ్గరకొచ్చి నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. నాకు చాలా సంతోషమైంది.

మొత్తానికి బ్యాంకు ఉద్యోగంలో మొదటి రోజు అలా గడిచింది.

రాత్రి 8 గంటలకల్లా ఇంటికి చేరుకోగానే ఇంట్లో వాళ్ళందరూ నా కోసం ఎదురుచూస్తూ కనిపించారు. నా మీద అందరూ ప్రశ్నల వర్షం కురిపించారు. మొదటి రోజు ఎలా గడిచిందని… కుతూహలంగా అడిగారు. అంతా బాగానే వుందని, పొల్లుబోకుండా ఆ రోజు జరిగినదంతా వివరించాను. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

తరువాత రెండో రోజు పెద్దగా మార్పేమీ లేదు. మూడో రోజున మేనేజరు గారు నన్ను తన క్యాబిన్‍కి రమ్మని అటెండర్‍తో కబురు చేశారు.

‘ఏమయ్యుంటుందబ్బా?’… అనుకుంటూ క్యాబిన్‍లోకి వెళ్ళాను.

“చూడు బాబూ! నిన్ను ఒంగోలు బ్రాంచ్‍కి బదిలీ చేశాము. ఎందుకంటే మన బ్రాంచ్‍లో నీకంటే ముందే ఒక అగ్రికల్చరల్ క్లర్కు జాయిన్ అయ్యారు. ఒంగోలులో నీ అవసరం చాలా ఉంది. ఎల్లుండి సోమవారం… మంచి రోజు… అక్కడకెళ్ళి జాయిన్ అవ్వండి. ఒంగోలు మేనేజరు గారితో కూడా నీ గురించి ఫోన్ చేసి చెప్పాను. అక్కడ నీకు ఏ ఇబ్బందీ వుండదు. అంతా బాగుంటుంది. ఓ.కే.నా!… ఆల్ ది బెస్ట్ టు యు!…” అంటూ విషయం చెప్పారు.

“అలాగే సార్!” అని చెప్పి బయటికొచ్చాను.

మొదట ఈ బదిలీ ఆశ్చర్యం అనిపించినా, ‘బ్యాంకు వారి ఆదేశాలు పాటించాల్సిందే కదా!’ అనుకుని సరిపెట్టుకున్నాను.

సాయంత్రానికి అప్పటివరకు పరిచయమైన వాళ్ళందరి దగ్గర వీడ్కోలు తీసుకుని ఇంటికి బయలుదేరాను.

రాత్రి 8 గంటలకు ఇంటికి చేరి… అందరికీ ఒంగోలు బ్రాంచికి బదిలీ గురించి చెప్పాను. వినగానే వాళ్ళంతా కొంచెం నిరాశపడ్డ మాట నిజం. కాని… వెంటనే… ‘బ్యాంకు వారు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే కదా!’ అనుకుని తమను తాను సంబాళించుకున్నారు.

మరుసటి రోజు ఆదివారం. ఒంగోలు ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాను..

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here