Site icon Sanchika

నా జీవన గమనంలో…!-32

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

61

[dropcap]1[/dropcap]988-89 సంవత్సరానికి గాను పొన్నూరు నిడుబ్రోలు లయన్స్ క్లబ్ కార్యవర్గ సభ్యుల ఎన్నికలలో, నన్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎన్నికైన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం. సఫారీ సూట్‌లో అధ్యక్షుడిగా ఎన్నికకాబడిన రచయిత

బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ పదవికి న్యాయం చేయడం ఇప్పుడు నా ముందున్న ప్రధాన కర్తవ్యం. ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేయడంలో మా క్లబ్‌కు మంచి పేరుంది. ప్రతి సంవత్సరంలా, మరి, ఈ సంవత్సరం కూడా చేపట్టే ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, ఉచిత దంత వైద్య శిబిరాలు, ఇవే కాకుండా… ఇంతవరకు మా క్లబ్ ద్వారా చేయనటువంటి, వినూత్న కార్యక్రమాలను, నా ఆధ్వర్యంలో, ఈ సంవత్సరాంతానికి చేయాలి. అందుకు సొంతంగా నా ప్రణాళికలను తయారు చేసుకోవాలి. ఆ ప్రణాళికలకు క్లబ్ కార్యవర్గ సభ్యుల ఆమోదాన్ని పొందాలి. తదుపరి ఆ ప్రణాళికలను, సభ్యులందరి సహాయ సహకారాలతో సమర్థవంతంగా అమలు చేయాలి.

ఆ క్రమంలో, నా ప్రణాళికలను తయారు చేసుకోవడం, వాటికి ఆమోదం పొందడం చకచకా జరిగిపోయాయి. ఇక అమలు చేయడమే తరువాయి.

62

మొదటిగా, ప్రతి సంవత్సరం సభ్యుల ద్వారా, మరియు ఇతర దాతల ద్వారా వచ్చే విరాళాలకు అదనంగా, పెద్ద మొత్తాల్లో విరాళాలు సేకరించేందుకు గాను, స్థానిక శ్రీనివాస థియేటర్‍లో ‘అభిలాష’ అనే సినిమాను బెనిఫిట్ షో గా ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశాము. ప్రత్యేకంగా ముద్రించిన టిక్కెట్ల అమ్మకం ద్వారా, బెనిఫిట్‌ షోతో ఆశించిన దాని కంటే అధికంగానే విరాళాలు సేకరించగలిగాము.

ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత పశు వైద్య శిబిరాలు, ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ముందు కెళ్తున్నాము. మధ్య మధ్యలో ఏదో ఒక వినూత్న సేవా కార్యక్రమాన్ని నిర్వహించాము.

63

సాధారణంగా మనం చూస్తుంటాము. ఇళ్ళ గోడలలో, దేవాలయ బురుజుల్లో, బ్రిడ్జీల జాయింట్లలో… మర్రి మొక్కలు, రావి మొక్కలు మొలిచి పెరుగుతుంటాయ్… అవి పెరిగే చోట బీటలు వారి, నెర్రెలు విచ్చుకుంటాయి. ఆ మొక్కలను పీకేసినా కూడా, తిరిగి పెరుగుతూనే ఉంటాయి. అంటే ఆ మొక్కల వేర్లు ఇంకా లోపల మిగిలి ఉండడం వలన అవి, తిరిగి పెరుగుతుంటాయ్. తద్వారా పగుళ్ళు పెరిగి పెద్దవై, హాని జరగవచ్చు. అలాంటి హాని జరగకుండా చూసేందుకు మా లయన్స్ క్లబ్ ద్వారా ఓ కార్యక్రమాన్ని చేపట్టాము.

పట్టణంలో అలాంటి మొక్కలు ఎక్కడ కనిపించినా, ప్రత్యేకమైన రసాయనిక ద్రావణాన్ని వేర్ల ద్వారా తుదకంటూ ప్రసరింపజేయడం ద్వారా, నష్టకారక మొక్కల నన్నింటిని దాదాపుగా నిర్మూలించగలిగాము.

నిడుబ్రోలు గ్రామంలో ఓవర్‍బ్రిడ్జ్ పైన పెరుగుతున్న అనవసరమైన మొక్కలను నిర్మూలించే కార్యక్రమం

64

గుంటూరు పట్టాభిపురంలో కార్డియాక్ సెంటర్‍ను నడుపుతున్న ప్రముఖ కార్డియాలజిస్టు డా. జి. కమలేంద్ర కుమార్, నాకు మంచి మిత్రులు. వారి సహకారంతో పొన్నూరులో మా లయన్స్ క్లబ్ ద్వారా, గుండె జబ్బులకు సంబంధించి ఒక కార్డియాక్ క్యాంపును నిర్వహించేందుకు, ఆ డాక్టరు గారి సహాయం కోరాను. స్వతహాగానే, సేవాతత్పరుడైన ఆ డాక్టరు గారు, నా కోరికను మన్నించారు. క్యాంపు నిర్వహించ తలపెట్టిన రోజున, డాక్టరు గారు వారి సిబ్బందితో, ఇతర పరికరాలతో పొన్నూరు వచ్చారు.

సాధారణంగా ఆరోగ్య సంబంధిత క్యాంపులు, అంటే ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత కంటి వైద్య శిబిరాలు, స్థానికంగా ఉన్న ‘సాల్వేషన్ ఆర్మీ హాస్పిటల్’లో నిర్వహిస్తుంటాము. సమాజ సేవే ధ్యేయంగా నడిచే ఆ హాస్పటల్‍లో, మా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతించడమే కాకుండా, అక్కడి సిబ్బంది, నర్సులు, కాంపౌండర్లు, డాక్టర్లు కూడా మాకు సంపూర్ణ సహకారం అందజేస్తుంటారు. ఇప్పుడు ఈ ‘కార్డియాక్ క్యాంప్’ కూడా సాల్వేషన్ ఆర్మీ హాస్పిటల్‌లోనే ఏర్పాటు చేశాము.

ఆ రోజు దాదాపు వంద మందికి గుండె పరీక్షలు నిర్వహించారు డాక్టర్ కమలేంద్ర కుమార్ గారు. పేదవారికి అవసరమైన మందులను మా క్లబ్ ద్వారా ఉచితంగా అందజేశాము.

గుండె పరీక్షలు నిర్వహిస్తున్న డా. కమలేంద్ర కుమార్ గారు

సాయంత్రం ఆరు గంటలకు జరిగిన క్యాంపు ముగింపు సమావేశంలో డా. కమలేంద్ర కుమార్ గారు గుండె జబ్బులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను, పాటించవలసిన నియమాలను సోదాహరణంగా వివరించారు. కొంతమంది లేవనెత్తిన సందేహాలను, వివరణాత్మక సమాధానాలతో నివృత్తి చేశారు డాక్టర్ కమలేంద్ర కుమార్ గారు.

ముగింపు సమావేశంలో గుండె జబ్బులు రాకుండా వుండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరిస్తున్న డా. కమలేంద్ర కుమార్ గారు

65

‘నేటి లేగ దూడలే, రేపటి పశువులు.’

మన దేశంలో పశు సంపదను పెంచుకోవాలంటే, మన లేగ దూడలను సంరక్షించుకోవాలి. వాస్తవానికి, వివిధ రకాలైన రోగాల బారిన పడి చిన్న వయసులోనే చనిపోతుంటాయ్! అలాంటి లేగ దూడల కోసం, ప్రత్యేకంగా ఒక క్యాంపును నిర్వహించ తలపెట్టింది మా లయన్స్ క్లబ్.

గ్రామాల్లో, లేగ దూడల కడుపుల్లో నులిపురుగులు చేరుతుంటాయి. ఆ నులిపురుగుల వల్ల లెక్కకు మించిన లేగ దూడలు మృత్యువాతన పడుతుంటాయ్. లేగ దూడలలో నులిపురుగులను నివారించగలిగితే, కొంత వరకు వాటిని కాపాడుకోవచ్చు.

అందుకే, పొన్నూరుకు దగ్గరలో వున్న వడ్డిముక్కల గ్రామంలో ‘లేగ దూడలలో నులిపురుగుల నివారణ శిబిరం’ నిర్వహించాము. పొన్నూరు నుంచి వచ్చిన ప్రభుత్వ పశువైద్యశాల వెటరినరీ డాక్టర్లు, వారి సిబ్బంది శిబిరాన్ని నిర్వహించి, లేగ దూడలను పరీక్షించారు. అవసరమైన మందులను మా లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేశాము.

వడ్డిముక్కల గ్రామంలో నిర్వహించిన ‘లేగ దూడలలో నులిపురుగుల నివారణ శిబిరం’

అన్ని లేగ దూడలు, ఒక చోట గుమిగూడితే ఆ దృశ్యం అద్భుత్వం. అప్పుడు నా చిన్నతనంలో నేను చూసిన ‘నమ్మినబంటు’ అనే సినిమా గుర్తొచ్చింది. అందులో రెండు లేగ దూడలను పెంచుకుంటుంది ఓ అమ్మాయి. అవి పెరిగి పెద్దవై, ఆ కుటుంబానికి అండదండగా వుంటూ అనేక విధాలుగా సహాయం చేస్తాయి. ఆ అమ్మాయి లేగదూడలను పెంచుకుంటూ పాడిన ఓ పాట… వీనుల విందు చేస్తుంది. లేగ దూడలు, వాటి విన్యాసాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

“చెంగు చెంగున గంతులు వేయండి…
చెంగు చెంగునా గంతులు వేయండి…
ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా…
నోరులేని తువ్వాయిల్లారా…
చెంగు చెంగునా గంతులు వేయండి…”.

66

బస్ డిపో లేని గ్రామాల్లో, బస్సుల కోసం ఎండల్లో, వానల్లో, నిరీక్షిస్తూ నానా ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, విద్యార్థులు…. వారి సౌకర్యార్థం కనీసం ఒక బస్ షెల్టర్‌నైనా నిర్మించ తలపెట్టింది లయన్స్ క్లబ్.

అనుకున్నదే తడవుగా, పొన్నూరు దగ్గరలోని చుండూరుపల్లి గ్రామంలోని బస్ స్టాప్ వద్ద ‘ప్రయాణీకుల విశ్రాంతిశాల’ను నిర్మించాము. శాశ్వతంగా వుండబోయే ఆ బస్ షెల్టర్‌ను చూసి, గ్రామస్థులు ఎంతో సంతోషించారు. మా లయన్స్ క్లబ్ సేవలను మరెంతగానో కొనియాడారు.

మా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్, లయన్, డాక్టర్. యమ్. నరశింహులు గారు, తన అధికారిక పర్యటనలో భాగంగా మా క్లబ్‍ను సందర్శించిన రోజున, ఆ ప్ర్రయాణీకుల విశ్రాంతిశాలను కూడా ప్రారంభించారు.

చుండూరుపల్లి గ్రామంలో నిర్మించిన ప్రయాణీకుల విశ్రాంతి శాలను ప్రారంభిస్తున్న లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్, శ్రీ యమ్. నరశింహులు గారు. అందులో కూర్చున్నవారు లయన్ టి.వి. ప్రసాద్ గారు, రచయిత మరియు లయన్ సి. బాలస్వామి గారు

67

వయసుతో నిమిత్తం లేకుండా, ఈ రోజుల్లో చాలామంది మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే, మా లయన్స్ క్లబ్ ద్వారా, స్థానిక సాల్వేషన్ ఆర్మీ హాస్పటల్‌లో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో, పొన్నూరు పట్టణంలో పేరు ప్రఖ్యాతులున్న డాక్టర్ కొమ్మినేని శేషగిరిరావు గారు మరియు ఇతర డాక్టర్ల ఆధ్వర్యంలో ఒక ఉచిత మధుమేహ వ్యాధి నివారణ శిబిరాన్ని నిర్వహించాము. వచ్చిన వారందరికీ మధుమేహ వ్యాధి స్థాయిని పరీక్షించారు డాక్టర్లు. చికిత్సకి అవసరమయ్యే మందులను మా లయన్స్ క్లబ్ ద్వారా ఉచితంగా అందజేశాము.

మధుమేహ వ్యాధి నివారణ శిబిరాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ కొమ్మినేని శేషగిరిరావు గారు మరియు ఇతర డాక్టర్లు

చివరగా మధుమేహ వ్యాధి రాకుండా వుండడానికి పాటించవలసిన ఆహార నియమాలు, చేయవలసిన శారీరక వ్యాయామాలు, ఆలోచనలను నియంత్రించుకునేందుకు యోగా, ధ్యానం గురించి అవగాహన కలిగించారు ఆ వైద్య శ్రేష్ఠులు.

68

నేటి తరం ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణ విషయంలో మంచి అవగాహన ఏర్పడింది. ఉదయం పూట నడక, సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, పరుగు పెట్టడం లాంటివి సర్వసాధారణమైపోయాయి. ఈ నేపథ్యంలో యోగాసనాలకు, ధ్యానానికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. ఆ క్రమంలో మా లయన్స్ క్లబ్ ద్వారా ఓ యోగా క్యాంప్ నిర్వహించాలని నిర్ణయించాము.

వెంటనే హైదరాబాదులో ఉంటున్న నా ప్రియమిత్రుడు రవీంద్ర గారిని సంప్రదించాను. ఎందుకంటే వారి త్రండ్రి యోగాసనాచార్య సూరి రాఘవ దీక్షితులు గారు. వారి వయసు ఎనభైకి పైనే. కానీ ఇప్పటికీ శారీరకంగా, మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటూ యోగాసనాలలో ఉచితంగా శిక్షణ ఇస్తూ తన వంతు ప్రజా సేవ చేస్తున్నారు. వారిని మా పొన్నూరు పట్టణానికి ఆహ్వానించాము. వారి గురుత్వంలో ఒక యోగాసన శిక్షణా శిబిరాన్ని నిర్వహించాము. పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు, చాలా ఉత్సాహంగా ఆ శిబిరంలో పాల్గొన్నారు. గురువుగారు నేర్పించిన యోగాసనాలను ఒడిసిపట్టుకున్నారు.

యోగాసన శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్న యోగాసనాచార్య సూరి రాఘవ దీక్షితులు గారు, హైదరాబాద్… దిగువన శిబిరంలో పాల్గొన్న పురుషులు మరియు బాలురు… మూడవ లైనులో మూడవ వ్యక్తి రచయిత
గురువుగారు యోగాసనాచార్య సూరి రాఘవ దీక్షితులు గారితో యోగాసన శిక్షణా శిబిరంలో పాల్గొన్న మహిళామణులు

ముగింపు సమావేశంలో, లయన్స్ జిల్లా జోన్ ఛైర్మన్ లయన్. యన్. వి. నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని, గురువు గారు, యోగాసనాచార్య సూరి రాఘవ దీక్షితులు గారిని ఘనంగా సత్కరించారు. యోగాసన శిబిరంలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు కూడా అందజేశారు.

ఆ తరువాత పొన్నూరు నిడుబ్రోలు లయన్స్ క్లబ్, పొన్నూరులో శాశ్వత ప్రాతిపదికన గీతా యోగ పాఠశాలను నడిపించేందుకు సన్నాహాలు చేసింది.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version