నా జీవన గమనంలో…!-37

66
2

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

91

[dropcap]అ[/dropcap]నుకున్నట్లే, ఉదయాన్నే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రికి బయలుదేరాను. రాత్రంతా ఆలోచనలతో సతమతమయ్యానేమో, మధ్య మధ్యన కునుకుపట్టింది. ఇంతలో నిడదవోలు స్టేషన్‌లో ఆగింది రైలు. రైల్వే కాంటీన్‌కి వెళ్ళి భోజనం చేశాను. తిరిగి రైలు బయలుదేరింది. మరి కొద్ది గంటలలో రాజమండ్రి చేరుకోబోతున్నాను. నిజానికి రాజమండ్రి పట్టణం గురించి కొంత తెలిసినప్పటికి, చూడడం మాత్రం ఇదే మొదటిసారి. ఒకప్పుడు రాజమహేంద్రవరంగా పిలవబడిన చారిత్రాత్మక పట్టణమే ప్రస్తుత రాజమండ్రి. తూర్పు గోదావరి జిల్లాలో జిల్లా కేంద్రమైన కాకినాడ తరువాత, అతి పెద్ద పట్టణం అంటే రాజమండ్రే.  అదియును గాక, తెలుగు భాషకు పుట్టినిల్లు రాజమండ్రి అంటారు. పవిత్ర గోదావరి నది ఒడ్డున విరాజిల్లుతున్న నగరం రాజమండ్రి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సాంస్కృతిక ముఖ్య పట్టణంగా, అభివర్ణిస్తారు రాజమండ్రిని. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులుగారి పుట్టినిల్లు రాజమండ్రి. ఆదికవి నన్నయ పుట్టింది కూడా రాజమండ్రిలోనే. తిక్కన మరియు ఎర్రన గార్లతో కలిసి సంస్కృత భాషలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి, మనకందించిన మహానుభావుడు ఆదికవి నన్నయ.

అలా ఆలోచిస్తూ ప్రయాణిస్తుండగా, రైలు కొవ్వూరు దాటింది. అప్పుడే పెద్దగా శబ్దాలు చేస్తూ నడుస్తుంది రైలు. ఒక్కసారి ఉలిక్కిపడి చూస్తే, రైలు గోదావరి బ్రిడ్జి మీదకు ప్రవేశించింది. ఈ బ్రిడ్జి కొవ్వూరు రాజమండ్రి మధ్య, గోదావరి నదిపై, సుమారు 4.1 కిలోమీటర్లు పొడవున నిర్మించబడివుంది. విశేషమేమిటంటే, ఇది రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి. క్రింది భాగంలో రైల్వే బ్రిడ్జి, పై భాగంలో రోడ్ బ్రిడ్జి వుండడం ఓ ప్రత్యేకత.

భారతదేశంలోనే మూడవ అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి, రాజమండ్రి బ్రిడ్జి. అస్సాం రాష్ట్రంలో దిబ్రుగర్ జిల్లాలోని, బ్రహ్మాపుత్ర నదిపై నిర్మించబడిన బోగీబీల్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి మన దేశంలో కెల్లా ఒకటవ అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి. బీహార్ రాష్ట్రంలో గంగానదిపై నిర్మింపబడిన దిఘా సోన్‌పూర్ బ్రిడ్జి, దేశంలో కెల్లా రెండవ అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి.

అలా రాజమండ్రి బ్రిడ్జిపైన ప్రయాణిస్తూ, దిగువన పరుగులు తీస్తున్న గోదావరీ నదీ ప్రవాహాన్ని వీక్షించడం ఓ మధురానుభూతి.

అంతలోనే తోటి ప్రయాణీకులంతా, చిల్లర నాణాలను గోదావరి నదిలోకి విసురుతున్నారు.

“ఎందుకలా చేస్తున్నారు?” అని అమాయకంగా అడిగాను నేను. “అలా చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి!” అని చెప్పారు వాళ్ళు.

వెంటనే నేను కూడా, నా జేబులోని చిల్లర నాణాలను చేతుల్లోకి తీసుకుని, గోదావరి నదీమతల్లికి మనసారా నమస్కరించి, “మేమంతా బాగుండాలి! మా అందరికీ అంతా మంచి జరగాలి!!” అని కోరుకుంటూ, ఆ నాణాలను కిటికీ గుండా నదిలోకి జారవిడిచాను.

కాసేపటికి రైలు రాజమండ్రి మెయిన్ స్టేషన్‍లో ఆగింది. రైలు దిగి దగ్గరలోనే వున్న హోటల్‍లో ఓ రూమ్ తీసుకుని, ఫ్రెష్ అప్ అయి, ఆంధ్ర బ్యాంకు రీజినల్ ఆఫీసుకు బయలుదేరాను.

92

రీజినల్ ఆఫీసుకు వెళ్ళి అక్కడ తేరిపార చూస్తే, అన్నీ కొత్త ముఖాలే! అందుకే సరాసరి రీజినల్ మేనేజర్ శ్రీ వై భాస్కరరావు గారి క్యాబిన్ లోకి నడిచి, ఆయనకు నమస్కరించి, నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నన్ను సాదరంగా ఆహ్వానించిన రీజినల్ మేనేజర్ గారు…

“ఆ! రండి రండి! ఈరోజు మీరొస్తారని డి.జి.యం గారు చెప్పారు. సంతోషం! కూర్చోండి!” అంటూ ఎదురుగా వున్న కుర్చీ చూపించారు.

ఇద్దరం తేనీరు సేవించాము.

“ఆ! ఇప్పుడు మీతో కలిసి పనిచేయబోయేవారిని మీకు పరిచయం చేస్తానుండండి!” అని చెప్పి ఇంటర్‍కమ్‍లో సెక్రటరీతో మాట్లాడారు.

కాసేపటికి ముగ్గురు వ్యక్తులు క్యాబిన్‍లోకి వచ్చారు.

“ఆ! వీళ్ళే! మీతో కలిసి పనిచేయబోయేది! వీరు హరకృష్ణ, టెక్నికల్ ఆఫీసర్… వీరు జగన్నాధరాజు, మీలాగే గ్రామీణాభివృద్ధి అధికారి… ఇక వీరు శ్రీకాంత్, క్లర్క్/ స్టెనో టైపిస్ట్… ఇంకో అటెండర్ కూడా వస్తాడు! వీళ్ళంతా హేమాహేమీలు! మీకు మల్లే వీళ్ళని కూడా ఏరి కోరి ఎంపిక చేశాము! ఇక ఈ సరికొత్త సంస్థని మీ చేతుల్లో పెట్టబోతున్నాము. ఆ సంస్థ పేరుప్రతిష్ఠలు మీ మీదే ఆధారపడి ఉన్నాయ్!” అంటూ ఆర్.యమ్. గారు వాళ్ళందరినీ నాకు పరిచయం చేసి, పరోక్షంగా మాకు ఓ లక్ష్యాన్ని నిర్దేశించారు.

“సార్! మేమంతా కలిసి కష్టపడి పని చేస్తాము. మీరు మా మీద పెట్టిన బాధ్యతను నిష్ఠతో నిర్వహిస్తాము!” అంటూ మా అందరి తరఫున హామీ ఇచ్చాను నేను.

“వెరీ గుడ్! ఆల్ ది బెస్ట్! ఈ పూటకి ఒక పని చేయండి… మీరంతా కలిసి కూర్చుని, మాట్లాడుకుని, ప్రణాళికలు సిద్ధం చేసుకోండి! ఎటూ రేపు, హైదరాబాద్ నుండి డి.జి.యం మాలకొండారెడ్ది గారు వస్తారు! అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం! సరేనా!” అని చెప్పారు ఆర్.యమ్. గారు.

“అలాగే సార్!” అంటూ మేమంతా నిష్క్రమించాము.

రీజినల్ ఆఫీసులో అందర్నీ పరిచయం చేసుకున్న తరువాత, మేం నలుగురుం ఒక చోట కూర్చున్నాము. ఆ సంస్థ తాలూకూ ఫైల్‍ను ముందు పెట్టుకుని, సంస్థ స్థాపన ఉద్దేశాలను ఒక్కొక్కటిగా, కూలంకుషంగా చర్చించాము. ఆ ఉద్దేశాలను నెరవేర్చేందుకు మా ముందున్న అవకాశాలన్నింటిని ఒక ప్రణాళిక రూపంలో పొందుపరిచాము. ఏమైతేనేం, ఆ సంస్థ గురించి నాకు పూర్తి అవగాహన కలిగింది.

ఆ రోజు రాత్రి అల్పాహారంతో సరిపెట్టుకుని, నిద్రకు ఉపక్రమిస్తే, నాకు నిరాశే ఎదురైంది. ఆ సంస్థ గురించి నా మదిలో మెదిలే ఆలోచనలే అందుకు కారణం కాబోలు!

93

వాస్తవానికి ఆ సంస్థ పేరు ‘ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ’. పేరును బట్టే ఆ సంస్థ ఎందుకు స్థాపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు… గ్రామీణాభివృద్ధి అనేది నాకెంతో ఇష్టమైన అంశం అనే విషయం నాకే కాదు, నా పై అధికారులకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే, ఉద్యోగ రీత్యా, ఎక్కడున్నా, ఏ హోదాలో వున్నా, నా విధి నిర్వహణలో గ్రామీణాభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రజలకు, ప్రథమ ప్రయోజనం చేకూర్చాలనేదే, నా అభిమతం. ఆ మాటకొస్తే, నన్ను గ్రామీణాభివృద్ధి అధికారిగా, ఆంధ్రా బ్యాంకు నియమించుకుంది కూడా అందుకే కదా! ఇక ఈ సంస్థ ప్రత్యేకత గురించి చెప్పుకోవాలంటే, ఇదొక శిక్షణా సంస్థ.  రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపైన, గ్రామీణ ప్రజలకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో… అంటే పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఇతర గ్రామీణ వృత్తులకు చెందిన పరిశ్రమలపైన, కుటీర పరిశ్రమల పైన… శిక్షణ ఇస్తారు.

అంటే… ఇది బ్యాంకు సిబ్బందికి శిక్షణనిచ్చే సంస్థ కాదు. బ్యాంకుల ద్వారా ఋణాలు పొందిన గ్రామీణ ప్రజలకు, ప్రభుత్వ పథకాల ద్వారా ఋణాలు పొందిన లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఈ సంస్థ. ఋణాలు పొందిన ఆయా అంశాల్లో శిక్షణ పొంది, తద్వారా ఆ పథకాల అమలు ద్వారా, అధిక దిగుబడిని, అధికోత్పత్తులను సాధించి, వాళ్ళంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే… ఆశయంతో స్థాపించబోతున్న సంస్థ ఈ సంస్థ.

ఒక్కో అంశంపై మూడు, నాలుగు రోజుల వరకు, తరగతి గదుల్లో, ఆయా అంశాలలో నిష్ణాతుల పర్యవేక్షణలో శిక్షణ, ఆ తరువాత క్షేత్ర సందర్శన, చక్కగా నడుస్తున్న యూనిట్ల సందర్శనాలతో సహా; శిక్షణలో పాల్గొన్నవారికి పరిపూర్ణమైన అవగాహన కలిగిస్తుంది ఈ సంస్థ. శిక్షణలో పాల్గొన్నవారికి రానుపోను ఛార్జీలు ఇవ్వడమే కాకుండా, శిక్షణా కాలంలో సంస్థ హాస్టల్‌లోనే వసతి, భోజన సదుపాయాలు కూడా ఉచితంగానే ఏర్పాటు చేస్తుంది ఈ సంస్థ.

ప్రస్తుతానికి ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆంధ్రా బ్యాంకు శాఖల ద్వారా ఋణాలు పొందిన లబ్ధిదారులకు ఈ సంస్థలో శిక్షణ ఇస్తారు.

ఒక బ్యాంకు, ఇలాంటి సంస్థను నెలకొల్పడం, మన రాష్ట్రంలోనే కాదు… దేశంలోనే ప్రప్రథమం. అలాంటి సంస్థకు, నన్ను డైరక్టర్‍గా నియమించడం, నిజంగా, నా అదృష్టంగా భావిస్తున్నాను. డి.జి.యం. మాలకొండారెడ్డి గారు నన్ను ఆ పదవికి, ఎంతో నమ్మకంతో, ఎంపిక చేశారు. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నాకొచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఆ సంస్థ అభివృద్ధికి నా శక్తివంచన లేకుండా, పని చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇలా ఆలోచిస్తూ, ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలియదు.

94

మరుసటి రోజు తెల్లవారు జామునే అలారం పెట్టుకుని లేచి తయారయ్యాను. రీజినల్ మేనేజర్ గారితో కలిసి, హైదరాబాద్ నుండి వస్తున్న డి.జి.యం గారిని రిసీవ్ చేసుకునేందుకు రాజమండ్రి రైల్వే స్టేషన్‍కి చేరుకున్నాను. ట్రయిన్ రైట్ టైమ్‌కే వచ్చింది. డి.జి.యం. గారిని తోడ్కొని అందరం హోటల్‍కి వెళ్ళాము. వారి తయారైన పిమ్మట అందరం కలిసి ఆ హోటల్‍లోనే బ్రేక్‌ఫాస్ట్ చేసి రీజినల్ ఆఫీసు చేరుకున్నాము. డి.జి.యమ్ మాలకొండారెడ్డి గారు ఆ నూతన సంస్థలో చేరబోతున్న మా అందరితో కలిసి, అప్పటి వరకు ఆ సంస్థలో జరుగుతున్న పనులపై ఓ సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ…

“నవంబర్ 14వ తారీఖున సంస్థను ప్రారంభించడానికి నిర్ణయం జరిగిందని తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన బ్యాంక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ కె. ఆర్. నాయక్ గారు రాబోతున్నారు. వారి చేతుల మీదుగానే ఆ సంస్థ ప్రారంభించబడబోతోంది. ఈలోపు సంస్థ భవనానికి అవసరమైన రిపేర్లన్నీ పూర్తి చేయించి, రంగులు వేయించి, తోరణాలు కట్టించి, పూజా కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకుని, ఆ సంస్థ ప్రాంగణాన్ని, భవనాన్ని చక్కగా అలంకరించి ముస్తాబు చేయించాలి.

ఆ రోజు ఏదో ఒక శిక్షణా కార్యక్రమం కూడా తప్పకుండా ప్రారంభించబడాలి. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా చిన్నపాటి పొరపాట్లు కూడా దొర్లకుండా జాగ్రత్త పడాలి! ఇంకో ముఖ్యమైన విషయం! పత్రికా విలేఖరులను ఆహ్వానించడం మరవకండి! వివిధ పత్రికల్లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి వస్తేనే అందరికీ ఈ సంస్థ గురించి తెలుస్తుంది! ఎక్కడా ఏ తేడా రాకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి!” అని చెప్తూ మా అందరికీ దిశానిర్దేశం చేశారు.

ఇక అక్కడి నుండి అందరం కలిసి సంస్థ ప్రారంభించబడే భవనం దగ్గరకి బయలుదేరాము.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here