Site icon Sanchika

నా జీవన గమనంలో…!-38

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

95

[dropcap]ఆ[/dropcap]ల్‌కాట్ గార్డెన్స్ మీదుగా డెయిరీ పాల ఫ్యాక్టరీకి వెళ్ళే మెయిన్ రోడ్‌లో ఊరు దాటంగానే రోడ్డు ప్రక్కనే ఎడమవైపు ఉంటుంది ఆ భవనం. అందరం అక్కడికి చేరేసరికి అక్కడ పనులు చేయిస్తున్న కాంట్రాక్టరు శాస్త్రి గారు కూడా అక్కడికి చేరుకున్నారు. అందరం కలిసి ఆ ప్రాంగణం అంతా కలియతిరిగాము. భవనం మొత్తాన్ని నిశితంగా పరిశీలించాము. అప్పటి వరకు జరిగిన పనులన్నింటిని గమనించి, సంతృప్తి చెందిన డి.జి.యమ్. గారు, జరగాల్సిన పనుల గురించి కాంట్రాక్టరు గారికి అవసరమైన సూచనలను చేశారు. మన సంస్థను నవంబరు 14న ప్రారంభించబోతున్నామని, ఆ సమయానికి అన్ని పనులను పూర్తి చేయించాలని కాంట్రాక్టరుకి ప్రత్యేకంగా చెప్పారు. అవన్నీ తాను చూసుకుంటానని, ఆ సమయానికి అనుకున్న పనులన్నింటిని తప్పక పూర్తి చేయిస్తానంటూ, కాంట్రాక్టరు హామీ ఇచ్చారు.

తరువాత డి.జి.యమ్. గారు, ఆర్. యమ్. గారు స్థానికంగా ఉన్న ఆంధ్రా బ్యాంకు శాఖలను సందర్శించడానికి బయలుదేరారు. నేనూ, మా సంస్థ సిబ్బంది అక్కడే వుండిపోయాము.

వెళ్తూ వెళ్తూ ఆర్.యమ్. గారు నాతో…

“ఆ! సాయంత్రం ఆరు గంటలకు హోటల్‍ లోని కాన్ఫరెన్స్ హాల్లో స్టాఫ్ మీటింగ్ వుంటుంది. మీరందరూ కూడా ఆ మీటింగ్‌కి రండి! డిన్నర్ తరువాత, డి.జి.యమ్. గారు హైదరాబాద్ వెళ్తారు. రైల్వే స్టేషన్‍కి వెళ్ళి సార్‌కి సెండాఫ్ ఇద్దాం! ప్రస్తుతం మీరంతా ఇక్కడే వుండి, ఇక్కడి పనులను చూసుకోండి! సరే… మేం వెళ్ళొస్తాం!” అని చెప్పారు.

“అలాగే సార్!” చెప్పాము మేమంతా.

96

ఇక నేను, మా సిబ్బంది… మరలా ఒకసారి ఆ సంస్థ ప్రాంగణమంతా తిరిగి చూశాము. అప్పుడు మా వాళ్ళు చెప్తే నాకు తెలిసింది.

ఈ భవనాన్ని ‘స్టూడియో’ అని కూడా అంటారట! ఎందుకంటే, ఈ భవనంలోనే పూర్వపు రోజుల్లో సినిమా షూటింగులు జరిగేవట! ‘భక్తప్రహ్లాద’ అనే మొట్టమొదటి తెలుగు మూకీ సినిమాని ఈ ప్రాంగణంలోనే, ఈ భవనంలోనే షూట్ చేశారట!

‘అంత ప్రాచీనమైన, అంత ప్రశస్తమైన భవనంలో, మన సంస్థను స్థాపించబోతున్నాము’ అని తలచుకుంటేనే, ఎంతో ఆనందంగా, సంతోషంగా, గర్వంగా కూడా ఉంది.

ఇక ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే, ఇంకా పూర్తి చేయాల్సిన పనులు చాలానే వున్నాయ్! మా సిబ్బంది కూర్చునే కార్యాలయం, డైరక్టర్ రూమ్, తరగతి గదులు, హాస్టల్, అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. అందుకు అవసరమయ్యే ఫర్నీచర్, ఇతర సామాన్లను సమకూర్చుకోవాలి. ప్రారంభోత్సవానికి నిర్ణయించిన తేదీ దగ్గరలోనే వుంది. యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగితే తప్ప, అనుకున్నవి అనుకున్నట్లు జరగవు. అందుకే కాంట్రాక్టర్ శాస్త్రిగారిపై ఒత్తిడి పెంచాలి. ఇలా మాలో మేము చర్చించుకుంటూ, ఆ ప్రాంగణంలోనే వున్న ఓ పెద్ద చెట్టు క్రిందనే కూర్చుని మాట్లాడుకోడం మొదలుపెట్టాము. ఇకపై ఆ రోజు నుండి ఇక్కడే మన విధులు నిర్వహిద్దామని, అవసరమైతేనే రీజినల్ ఆఫీసుకు వెళ్దామని అనుకున్నాము. మధ్యాహ్నం భోజనం కూడా అక్కడికే తెప్పించుకుని ఆ చెట్టు క్రిందనే కూర్చుని భోంచేశాము.

భోజనానంతరం, నేనూ, మా సిబ్బంది – హరకృష్ణ, జగన్నాధ రాజు, శ్రీకాంత్ – అందరం మనసు విప్పి మాట్లాడుకున్నాము. అప్పుడు నాకర్థమయింది- ఆ ముగ్గురు చాలా అనుభవజ్ఞులని, మంచి తెలివితేటలున్నవారని, కార్యదక్షులని తెలుసుకోగలిగాను. వారితో కలిసి మా సంస్థను విజయవంతంగా నడపవచ్చనే విశ్వాసం నాకు కుదిరింది.

ఆ తరువాత నవంబర్ 14వ తేదీన, ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేయవలసిన ఏర్పాట్ల గురించి సుదీర్ఘంగా చర్చించాము. చివరికి మా చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. ఆ రోజు కార్యక్రమ నిర్వహణ గురించి ఒక అవగాహనకు రాగలిగాము.

మిగతా విషయాలు రేపు ఉదయం 10 గంటలకు మాట్లాడుకుందామని నిర్ణయించుకుని, సాయంత్రం ఆరు గంటలకు జరగబోయే స్టాఫ్ మీటింగులో పాల్గొనేందుకు హోటల్‌కు బయలుదేరాము.

97

సాయంత్రం ఆరు గంటల కల్లా ఆంధ్రా బ్యాంకు శాఖల శాఖాధిపతులు, సిబ్బంది, అందరూ స్టాఫ్ మీటింగులో పాల్గొనేందుకు హోటల్ లోని కాన్ఫరెన్స్ హాల్‍కి చేరుకున్నారు. వేదికపైన ఆర్.యమ్. గారు, డి.జి.యమ్. గారు ఆశీనులయ్యారు. ముందుగా ఆర్.యమ్. భాస్కరరావు గారు అందరినీ ఆహ్వానిస్తూ స్వాగతోపన్యాసం ఇస్తూ, రాజమండ్రి రీజియన్‍లో ఆంధ్రా బ్యాంకు పురోగతి గురించి వివరించారు.

తరువాత డి.జి.యం మాలకొండారెడ్డి మాట్లాడడం మొదలెట్టారు.

“వర్తమాన కాలంలో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో పోటీతత్వం ఊపందుకుందని మీ అందరికీ తెలుసు. ఈ పోటీలో నిలదొక్కుకుని, మన బ్యాంకును ఒక గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టాలంటే, అన్ని అంశాల్లో మన అందరి కృషి ఎంతో అవసరం! మీ అందరికీ తెలుసు…! ఆంధ్రా బ్యాంకుకు, ఖాతాదారుల సేవలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు వుంది! ఆ అంశంలో మనం ఎప్పుడూ ముందే ఉంటాము! మన సేవలకు సంతృప్తి చెందిన మన ఖాతాదారులు కూడా ఎల్లవేళలా, మనకు వెన్నుదన్నుగా నిలబడుతున్నారు.

ఖాతాదారులకు విశిష్టమైన సేవలందించడంలో మీరంతా ఆరితేరినవారని నాకు తెలుసు. చారిత్రాత్మకంగా, సంప్రదాయబద్ధంగా, ఖాతాదారులలో మన బ్యాంకుపై వున్న ప్రేమాభిమానాలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం!”

..అని చెప్తూ రానున్న రోజుల్లో మన బ్యాంకు ప్రవేశబెట్టబోయే నూతన పథకాలను గురించి వివరించారు. తదుపరి బ్యాంకు సిబ్బంది సంక్షేమం కోసం అమలు చేయబోయే పథకాల గురించి విశదీకరించారు. ఈ సంవత్సరం ఏయే గ్రేడ్‍లలో ఎంత మందికి పదోన్నతులు కల్పించబోతున్నారో… అనే విషయం కూడా చెప్పారు.

ఆ తరువాత జరిగిన ఓపెన్ డిస్కషన్‍లో, బ్రాంచ్ మేనేజర్లు, తమ తమ అనుభవాలను చెప్తూ, బ్యాంకు అభివృద్ధి కొరకు మంచి సలహాలను కూడా ఇచ్చారు. కొంతమంది, కొన్ని సందేహాలను లేవనెత్తారు. తగిన సమాధానాలు చెప్తూ, ఆ సందేహాలన్నింటిని నివృత్తి చేశారు డి.జి.యమ్. గారు. బ్రాంచి మేనేజర్లు సూచించిన సలహాలను బ్యాంకు యాజమాన్యం ముందుంచి, పరిశీలించి, పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.

చివరిగా… నవంబర్ 14వ తేదీన మన సి.యం.డి. కె. ఆర్. నాయక్ గారి చేతుల మీదుగా, ఆంధ్రా బ్యాంకు ప్రారంభించబోయే ‘ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ’ గురించి వివరించారు డి.జి.యమ్. గారు. అప్పుడే, ఆ సంస్థ యొక్క డైరక్టరుగా బాధ్యతలను చేపట్టేబోయే నన్ను, మరియు మా సిబ్బందిని వేదికపైకి పిలిచి, అందరికీ పరిచయం చేశారు.

సమావేశం సజావుగా సాగింది. సంతృప్తికరంగా ముగిసింది.

***

అందరూ డిన్నర్ ముగించుకుని తమ తమ ఇళ్ళకు బయలుదేరారు. ఆర్.యమ్. గారు, బ్రాంచి మేనేజర్లు, నేనూ… మేమంతా రైల్వే స్టేషన్‌కి వెళ్ళి, హైదరాబాద్ వెళ్తున్న డి.జి.యమ్. గారికి ఘనంగా వీడ్కోలు పలికాం.

***

రాత్రికి హోటల్‍ రూముకి చేరుకున్నాను. ఆ రోజంతా విరామం లేకుండా పనుల్లో మునిగిపోయానో, ఏమో, వెంటనే గాఢనిద్ర పట్టింది.

98

మరుసటి రోజు ఉదయం పది గంటలకు నేను, మా సిబ్బంది, మా సంస్థ వద్దకు చేరుకున్నాము. ముందుగా అంతటా పర్యటిస్తూ, జరుగుతున్న పనులను పర్యవేక్షించాము. పనులన్నీ ముమ్మురంగా సాగుతున్నాయి. ఈలోపు దగ్గర లోని టెంట్ హౌస్ నుండి ఓ అర డజను ప్లాస్టిక్ కుర్చీలు తెప్పించుకుని, చెట్టు కింద వేయించి, అందరం కూర్చున్నాము. ఇక ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్ల గురించి సమీక్షించుకున్నాము. ఎక్కడా ఏ  లోటుపాట్లు లేకుండా, ఎవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించుకున్నాము. ఆ ప్రకారం ఈ రోజు నుండే ఎవరికి అప్పగించిన పనులను వారు సక్రమంగా చేసేటట్లు నిర్దిష్టమైన ప్రణాళికలను తయారు చేసుకోవాలని అనుకున్నాము.

“సర్! ఇలాంటి కార్యక్రమాలు గతంలో మనమందరం ఎన్నో చేసే వుంటాం! కాబట్టి పెద్దగా ఇబ్బందేమీ ఉండదు సార్” అన్నాడు హరకృష్ణ.

“అవున్సార్! అన్నీ చేయగలుగుతాం! కానీ ఒక్క విషయాన్ని మాత్రం, ఇప్పుడే మనం ఆలోచించాలి!” అన్నాడు జగన్నాధ రాజు.

“ఏంటా విషయం?” అడిగాను నేను.

“ఆ రోజు ఒక శిక్షణా కార్యక్రమం కూడా ప్రారంభించాలి కదా! దాన్ని గురించి ఇప్పుడే అనుకోవాలి కదా!” అన్నాడు జగన్నాధ రాజు.

“నిజమే… ఇప్పుడే నిర్ణయించాలి! అప్పుడే శిక్షణలో పాల్గొనేవారిని ఆ రోజుకి ఇక్కడికి రప్పించగలుగుతాం!” అన్నాను నేను.

“మరి శిక్షణ కోసం ఏ అంశాన్ని తీసుకుందాం సార్?” అడిగాడు జగన్నాధ రాజు.

ఒక నిమిషం పాటు కనుబొమలు ముడివేసి ఆలోచించిన నేను…

“ఒక పని చేద్దాం! ఈ సారికి మన ముగ్గురమే క్లాసులు తీసుకుందాం! అందుకోసం ‘గిరిజన వికాస్ యోజన’ పథకం క్రింద కొంతమంది గిరిజన యువతీ యువకులను పిలిపిద్దాం! వారికి ఆ పథకం గురించి వివరించి, బ్యాంకు ద్వారా లభించే ఋణ సదుపాయం గురించి చెబుదాం! శిక్షణ ద్వారా వాళ్ళకు ఆ పథకం గురించి మరింత అవగాహన కల్పిద్దాం! అలా శిక్షణ పొందినవారు, వాళ్ళు నివసించే ప్రాంతాల్లో మిగతావారికి, శిక్షణలో తాము తెలుసుకున్న విషయాలను వివరిస్తారు. అలా మనం ఆ ప్రతిష్ఠాత్మకమైన పథకానికి ప్రాచుర్యం కల్పిద్దాం.

అందుకోసం, గిరిజన ప్రాంతాలలో ఉన్న మన బ్యాంకు శాఖల మేనేజర్ల సహకారంతో, గిరిజన యువతీ యువకులను ఎంపిక చేద్దాం!” అని చెప్పాను.

“బాగుంది సార్! అయితే, మేము ఈ రోజు నుండే ఆ పని మీద ఉంటాం సార్!” అన్నాడు హరకృష్ణ.

“నేను శిక్షణ కోసం టైమ్ టేబుల్ తయారు చేసి, మనలో ఎవరెవరు ఏయే విషయలపై శిక్షణ ఇవ్వాలో కూడా తెలియజేస్తాను సార్!” చెప్పాడు జగన్నాధ రాజు.

“గుడ్! మరి మీ అంచనా ప్రకారం ఈ శిక్షణా కార్యక్రమానికి ఎన్ని రోజులైతే సరిపోతుంది?” అడిగాను నేను.

“మొట్టమొదటి శిక్షణా కార్యక్రమం కదా సార్! ఓ ఐదు రోజులయితే, ఆ కార్యక్రమానికి పూర్తి న్యాయం చేయగలుగుతాం సార్!” చెప్పాడు జగన్నాధ రాజు.

“గుడ్! అలాగే చేద్దాం! అంటే… నవంబర్ 14 నుండి 18 వరకు అన్నమాట! ఓ.కే! ఆ తేదీలనే ఖరారు చేద్దాం!” చెప్పాను నేను.

“అలాగే సార్! ఆ విధంగానే బ్రాంచ్ మేనేజర్లకు సమాచారం పంపిస్తామండి!” అన్నాడు హరకృష్ణ.

“ఇకపోతే, మరో ముఖ్యమైన విషయం! మనం చేపట్టబోయే, ఏ శిక్షణా కార్యక్రమమైనా సరే, శిక్షణలో పాల్గొన్నవారి పూర్తి సమాచారాన్ని పొందుపరుస్తూ, వ్యక్తిగత ఫైల్స్‌ని తప్పకుండా మెయిన్‍టెయిన్ చేయాలి! వారి పేరు, చిరునామా, వృత్తి, శిక్షణ పొందిన అంశం, శిక్షణా కాలం, శిక్షణపై వారి అభిప్రాయాలు, సలహాలు, శిక్షణ ఎంత వరకు ఉపయోగపడింది… అనే అంశాలన్నీ ఆ ఫైల్స్‌లో ఉండాలి!

అలాగే శిక్షణా కార్యక్రమాలల్లో పాల్గొనే ప్రతీ ఒక్కరికి ధ్రువపత్రాలను తప్పనిసరిగా ఇవ్వాలి! ఒక సంవత్సరం తరువాత అలా శిక్షణ పొందిన ప్రతి ఒక్కరితో మనం మాట్లాడాలి. శిక్షణ ద్వారా తెలుసుకున్న విషయాలను అమలు పరిచారా? లేదా? అమలు పరిస్తే తద్వారా ఉపయోగం పొందారా? లేదా? అనే విషయాలన్ని తెలుసుకోవాలి! అవసరమైన చోట రిఫ్రెషర్ కోర్సులు కూడా మనం ప్లాన్ చేసుకోవాలి!” అని చెప్పాను నేను.

“మీరు చెప్పినవన్నీ తప్పకుండా చేద్దాం సార్!” అన్నారు హరకృష్ణ, జగన్నాధ రాజు.

అప్పటివరకు మా సంభాషణని తదేకంగా వింటున్న శ్రీకాంత్…

“సార్! వ్యక్తిగత ఫైల్స్‌ని మెయిన్‌టెయిన్ చేయడం, ఉత్తర ప్రత్యుత్తరాలను జరపడం, ప్రతి శిక్షణా కార్యక్రమంపై నివేదికలను తయారు చేయడం, పై అధికారులకు పంపించడం, పత్రికా విలేకరులతో నిరంతరం సత్సంబంధాలను కొనసాగించడం, ఇతర టైపింగ్ పనులు… అన్నీ నేను చూసుకుంటాను సార్!” అంటూ తన వంతు బాధ్యతలను నిర్వహించేందుకు, సంసిద్ధతను వ్యక్తపరిచాడు.

“వెరీగుడ్ శ్రీకాంత్! నీ విధులపై నీకు సంపూర్ణ అవగాహన వుందనిపిస్తోంది! చాలా సంతోషం శ్రీకాంత్!” అంటూ శ్రీకాంత్‌ని ఉత్సాహపరిచాను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version