Site icon Sanchika

నా జీవన గమనంలో…!-39

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

99

[dropcap]మొ[/dropcap]త్తానికి, భవనానికి రిపేర్లు చేయడం, అవసరమైన చోట్ల బాత్‌రూమ్‍లు, టాయిలెట్లు కట్టించడం, వాష్ బేసిన్స్ ఏర్పాటు చేయడం, ఇతర నిర్మాణాలు చేయడం, రంగులు వేయడం, అన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ భవనం సర్వ హంగులతో అతి సుందరంగా కనిపిస్తోంది. మిగతా ఏర్పాట్లన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. ఒక్కొక్కటిగా అన్నీ సమకూరాయి.

* పైన చెప్పినవన్నీ సంస్థ భవనం మొదటి అంతస్తులో ఏర్పాటు చేశాము.

* పైన తెలిపినవన్నీ దిగువ అంతస్తులో ఏర్పాటు చేశాము.

ఆ విధంగా శిక్షణా కేంద్రానికి కావలసిన అన్నింటినీ సమకూర్చుకున్నాము. శిక్షణ నిమిత్తం వచ్చేవారికి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. సంస్థ పనులన్నింటిలో సహాయకులుగా ఉండేందుకు నలుగురు స్వీపర్లను, నలుగురు హెల్పర్లను నెలవారీ జీతంపై తీసుకున్నాము.

నవంబరు 14వ తేదీన పైన చెప్పబడినవన్నీ ప్రారంభించబడతాయి. ఈలోపు ఇంకా ఏమైనా కావాల్సివస్తే, వాటన్నింటిని కూడా ఏర్పాటు చేసుకోవాలి.

ప్రారంభోత్సవానికి తయారైన ‘ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ’ భవనం. భవనం ముందు నిల్చున్నవారు… ఎడమ నుండి కుడికి… రచయిత, శ్రీ జగన్నాధ రాజు గారు, శ్రీ హరకృష్ణ గారు.

100

ఇక ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి.

101

మొత్తానికి రేపు జరిగే సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆ రోజు సాయంత్రం రీజినల్ మేనేజర్ భాస్కరరావు గారు మా సంస్థను సందర్శించి, ఏర్పాట్లన్నింటిని సమీక్షించి సంతృప్తిని వ్యక్తపరుస్తూ…

“ఆ! వెరీ గుడ్! ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. రేపు ఉదయం మా ఆఫీసు నుండి కూడా కొంతమంది స్టాఫ్ మెంబర్స్‌ని ఇక్కడకు పంపిస్తాను. కార్యక్రమం పూర్తయ్యేవరకు, వాళ్ళు మీతోనే వుంటూ, మీకు సహాయకులుగా వుంటారు!” అని చెప్పారు.

“చాలా సంతోషం సార్!” అన్నాను నేను.

“ఇంకో విషయం… రేపు సి.యం.డి. కె. ఆర్. నాయక్ గారితో పాటు, జి.యమ్. ఆర్. శంకరన్ గారు, డి.జి.యమ్. మాలకొండారెడ్డి గారు కూడా వస్తున్నారట! ఇక రైల్వే స్టేషన్‌కి వెళ్ళి వాళ్ళను రిసీవ్ చేసుకోవడం, వాళ్ళను హోటల్‌కి తీసుకువెళ్ళడం, అవన్నీ నేను చూసుకుంటాను! మీరు ఇక్కడే వుండి మీ పనులను చూసుకోండి! నేనే వాళ్ళను తీసుకుని రేపు ఉదయం 11 గంటల కల్లా ఇక్కడకు వస్తాను! ఇక మీరంతా మీ మీ పనుల్లో వుండండి!” అని చెప్పారు ఆర్.యమ్. గారు.

“అలాగే సార్! మీరు చెప్పినట్లే చేస్తాం సార్!” చెప్పాను నేను.

“మరి రేపు కలుద్దాం!” అంటూ బయలుదేరారు ఆర్.యమ్. గారు.

102

నవంబరు 14వ తేదీ రానే వచ్చింది. ఆ రోజు ఉదయం నుండే మా సంస్థ ప్రాంగణంలో హడావిడి మొదలయింది. పది గంటల కల్లా సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమం పూర్తయ్యింది. ఆహ్వానాలు అందుకున్న వారంతా, ఒక్కొక్కరే వచ్చి సభా వేదిక ముందు తమ తమ ఆసనాల్లో ఆశీనులవుతున్నారు. వచ్చిన వారందరికీ అల్పాహారం అందించే ఏర్పాటు చేశాము. నేను, మా సిబ్బందితో పాటు, రీజినల్ ఆఫీసు నుంచి వచ్చిన మరో ఆరుగురు, అందరం ఎవరి పనులు వారు చేసుకుంటున్నాం. అంతా బాగానే వున్నట్లనిపిస్తోంది. సమయం దగ్గర పడే కొద్దీ, లోలోపల ఒక మూల ఏదో అలజడి, ఆందోళన. పనులైతే చేసుకుపోతున్నాం గాని, అంతా సవ్యంగా… అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందో… లేదో!… అనే సంశయం మమ్మల్ని వెంటాడి వేధిస్తోంది!… పైగా ముఖ్య అతిథిగా వచ్చేది ఓ సామాన్యమైన వ్యక్తి కాదు… సాక్షాత్తు ఆంధ్రా బ్యాంకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్!!… సరే! మేం చేయవల్సిందంతా చేశాము! చేస్తున్నాము! ఇక అంతా ఆ పై వాడి దయ!!

103

అప్పుడే సభలో సందడి ప్రారంభమైంది. మూడు కార్లు వేగంగా వచ్చి, సభా భవనం ముందు ఆగాయి. మేమంతా పరుగెత్తుకుంటూ ఆ కార్ల దగ్గరకు చేరుకున్నాము. రీజినల్ మేనేజర్ భాస్కర రావు గారు, సి.ఎమ్.డి. కె. ఆర్. నాయక్ గారు, జి.యమ్. శంకరన్ గారు, డి.జి.యం. మాలకొండారెడ్డి గారు కార్లలోంచి దిగారు. అప్పుడే, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ కమలాకరం గారు కూడా తన కార్లోంచి దిగారు. నేను, ఆర్.యమ్. గారు, మా సిబ్బంది, వాళ్ళందరినీ సభ లోనికి తోడ్కొని వచ్చి, ముందు వరుసలో కూర్చోబెట్టాము.

సభ ప్రారంభమైంది. సభా ప్రాంగణమంతా ఆహూతులతో కిక్కిరిసి వుంది. ఆర్.యమ్. గారు వేదికపైకి వెళ్ళి, ముందుగా జిల్లా కలెక్టరు గారిని వేదికపైకి ఆహ్వానించారు. ఆ తరువాత వరుసగా డి.జి.యమ్. గారిని, జి.యమ్. గారిని, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టరు గారిని వేదికపైకి ఆహ్వానించారు. వారందరికి నేనూ, మా సిబ్బంది పూలగుచ్ఛాలను అందించి, వారిపై మాకున్న గౌరవాన్ని చాటుకున్నాము.

ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. ఆర్. యమ్. గారు స్వాగతోపన్యాసం చేశారు. ఆ తరువాత డి.జి.యం. గారు, జి.యమ్. గారు మాట్లాడుతూ ‘ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ’ స్థాపన ఉద్దేశాలను వివరించారు. జిల్లా కలెక్టరు గారు మాట్లాడుతూ, ఈ సంస్థ అందించబోయే శిక్షణా కార్యక్రమాలతో గ్రామీణ ప్రజల, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి సాధ్యమవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. తదుపరి సి.యం.డి. గారు మాట్లాడుతూ ఇలాంటి సంస్థను, ఒక బ్యాంకు స్థాపించడం, దేశంలోనే ప్రప్రథమం అని చెప్తూ, ఇలాంటి సంస్థలనే మరి కొన్ని చోట్ల అతి త్వరలో ప్రారంభించబోతున్నామని తెలియజేశారు. తదుపరి ‘ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ’ రాజమండ్రిలో ప్రారంభింపబడినట్లు ప్రకటించారు. సభికులు కరతాళ ధ్వనులతో తమ హర్షాన్ని వెలిబుచ్చారు.

ఆ తరువాత, ఆ సంస్థకు డైరక్టరుగా నియమితుడనైన నన్ను, మా సిబ్బందిని సభకు పరిచయం చేశారు ఆర్.యమ్. గారు.

‘ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంఘ సిబ్బందిని సభికులకు పరిచయం చేస్తున్న దృశ్యం. ఎడమ నుండి కుడికి… శ్రీ మాలకొండారెడ్డి గారు, డిప్యూటీ జనరల్ మేనేజర్; శ్రీ కె. ఆర్. నాయక్ గారు, ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్; శ్రీ ఆర్. శంకరన్ గారు, జనరల్ మేనేజర్; శ్రీ కమలాకరం గారు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్; రచయిత, శ్రీ హరకృష్ణ గారు; శ్రీ జగన్నాధ రాజు గారు; శ్రీ వై. భాస్కరరావు గారు, రీజినల్ మేనేజర్.

ఆర్.యమ్.గారు కోరిన మీదట నేను వందన సమర్పణ చేశాను.

చివరిగా ‘జనగణమన’ గీతాలాపనతో సభ సమాప్తమయింది.

***

అతిథులంతా సంస్థ భవనంలోని వివిధ విభాగాలను సందర్శించి, ఎంతో ఆనందించారు. ముఖ్యంగా శిక్షణ కోసం వచ్చినవారి కోసం ఏర్పాటు చేసిన వసతి, భోజన సదుపాయాలను చూసి ఎంతగానో మెచ్చుకున్నారు.

అప్పుడే ‘గిరిజన వికాస యోజన పథకం’ క్రింద, ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని సి.యం.డి. గారు ప్రారంభించారు. శిక్షణ కోసం వచ్చిన గిరిజన యువతీయువకులతో, కాసేపు ముచ్చటించారు అతిథులంతా.

తరువాత అతిథులంతా తిరిaగి బయలుదేరారు. వారందరికీ వీడ్కోలు చెప్పి తిరిగి మీటింగ్ హాల్లోకి వచ్చాము.

అప్పటికే పత్రికా విలేకరులంతా అక్కడ సమావేశమై వున్నారు. వారందరికీ ‘ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ’  గురించి పూర్తిగా వివరణ ఇచ్చే నివేదికలను ఇచ్చాము. వారు లేవనెత్తిన సందేహాలకు తగిన రీతిలో సమాధానాలు చెప్పాము. అలా పత్రికా విలేకరుల సమావేశం కూడా ముగిసింది.

‘ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ’ ప్రారంభోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. దాంతో నేను, మా సిబ్బంది గట్టిగా ఊపిరి పీల్చుకున్నాము.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version