నా జీవన గమనంలో…!-4.1

49
5

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

[dropcap]సో[/dropcap]మవారం తెల్లవారు ఝామునే ఒంగోలుకు బయలుదేరాను. అంతకుముందు ఓ నెల క్రితమే నా కజిన్ బ్రదర్ శ్రీ బొప్పి సాంబశివరావు గారు ఒంగోలుకు బదిలీపై వెళ్ళి, వదినతో కలిసి అక్కడే వుంటున్నాడు. తనొక ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో ఒంగోలు బ్రాంచికి మేనేజరు. అన్న అక్కడే వుంటున్నాడు కాబట్టి, నాకు తోడుగా, అండగా ఉంటాడని అనుకుంటే… కొండంత ధైర్యం వచ్చింది నాకు. నేను కూడా ఒంగోలుకు వస్తున్నానని తెలుసుకున్న అన్న చాలా సంతోషించాడు.

బస్సు దిగి సరాసరి అన్న ఇంటికి వెళ్ళాను. అన్న ఆఫీసు వెనకాలే ఇల్లు కూడా… ఇల్లు చాలా సౌకర్యంగా వుంది. నన్ను చూసిన అన్నా, వదినలు ఎదురొచ్చి… ఇంట్లోకి ఆహ్వానించారు. ఇద్దరూ నాపై అపారమైన అభిమానం చూపించారు. అన్నే నన్ను వెంటబెట్టుకుని ఆంధ్రా బ్యాంకు దగ్గర వదిలేసి వెళ్ళారు.

లోపలి కెళ్ళి చూశాను. బ్యాంకు విశాలంగా వుంది. సుమారు 15 మంది దాకా సిబ్బంది పని చేస్తున్నారు. అప్పుడప్పుడే కస్టమర్లు లోపలికి వస్తున్నారు. నేను సరాసరి మేనేజర్ గారి క్యాబిన్‍లోకి వెళ్ళాను. వారి పేరు శ్రీ. పి. జగన్నాథాచార్యులు. ఆయన టేబుల్‍పై తన ముందు టైపింగ్ మెషీన్ పెట్టుకుని సీరియస్‍గా టైపు చేసుకుంటున్నారు.

శ్రీ. పి. జగన్నాథాచార్యులు

“నమస్కారం సార్” అన్నాను.

“ఆ! నమస్కారం! ఏంటి చెప్పండి…?” అని తల తిప్పకుండానే అడిగారు.

“సార్! నేను అగ్రికల్చరల్ క్లర్కుగా ఇక్కడ జాయిన్ అవడానికి వచ్చాను సార్!”

“ఓ! అలాగా! కూర్చోండి!” అంటూ ఎదురుగా ఉన్న కుర్చీ చూపించారు.

కొంచెం సర్దుకుని కూర్చున్నాను.

“గుంటూరు బ్రాంఛ్‍లో ఎన్ని రోజులు పని చేశారు? ఏయే కౌంటర్లలో పని నేర్చుకున్నారు?”

“మూడు రోజులే పని చేశాను సార్! అక్కడ నా చేత డిమాండ్ డ్రాఫ్టులు మాత్రమే వ్రాయించారు సార్!”

“సరే… పదండి!” అంటూ హాల్లోకి తీసుకెళ్ళారు.

మేనేజర్ గారు అక్కడ నన్ను సబ్ మేనేజర్‍ గారికి పరిచయం చేశారు.

“ఏవండీ! రత్నం గారూ! ఈ అబ్బాయి మన బ్రాంచిలో కొత్తగా జాయిన్ అవుతున్నాడు. ఒక రెండు రోజులు డ్రాఫ్టు కౌంటర్‍లో పెట్టండి. తరువాత, రెండు రోజులకొక కౌంటర్ చొప్పున… అన్ని కౌంటర్లలో పని నేర్పించండి. చివరగా క్యాష్ కౌంటర్‍లో కూడా!” చెప్పారు మేనేజరు గారు.

“అలాగేనండీ!” సవినయంగా చెప్పారు రత్నం గారు.

వెంటనే డ్రాఫ్టు కౌంటర్‍లో వున్న క్లర్కుని వేరే కౌంటర్‍కి పంపించి నన్నా కౌంటర్‍లో కూర్చోబెట్టారు.

గుంటూరు బ్రాంచ్‍లో, వెనుక కూర్చుని, డ్రాఫ్టులు వ్రాశాను గాని, ఇలా కౌంటర్‍లో కూర్చుని ఖాతాదారులకు ప్రత్యక్షంగా సేవ చేయడం… ఇప్పుడే… ఇక్కడే…

అది కూడా చాలా తృప్తి నిచ్చింది.

కస్టమర్లు నేను వ్రాసిన డ్రాఫ్టులు చూసుకుని… “చాలా బాగా, అందంగా వ్రాస్తున్నారండి” అంటూ నన్ను మెచ్చుకుంటుంటే, చాలా ఆనందపడ్డాను. ఆ తరువాత రత్నం గారు, తోటి ఉద్యోగులు కూడా… మెచ్చుకుంటుంటే… మొదటిరోజునే అందరి ప్రశంసలు అందుకున్నందుకు చాలా సంతోషమైంది.

సాయంత్రానికి అన్న వాళ్ళింటికి వచ్చాను. ఆ బ్రాంచ్‍లో మొదటిరోజు అనుభవాలను వారితో పంచుకున్నాను. వాళ్ళు కూడా సంతోషించారు. తరువాత వేడి నీళ్ళతో స్నానం చేసి, వదిన చేతి వంటలను కడుపునిండా భోంచేసి, బాగా అలసిపోయి ఉన్నానేమో… కంటి నిండా నిద్రపోయాను.

తెల్లారి లేచిం తరువాత, అన్నతో మాట్లాడుతూ… నేను వేరే రూమ్ కోసం వెతుక్కుంటానని, రూమ్‍కి దగ్గరగా వుండే మెస్‍లో భోజనం చేస్తానని చెప్పాను. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏమీ చేయవద్దని, మరి కొద్ది రోజుల పాటు వాళ్ళింట్లోనే వుండమని అన్న నన్ను కోరాడు, నేను ఎంత బ్రతిమాలినా వినలేదు.

“అన్న చెప్పినట్లు వినాలి మరి!” అని ఆప్యాయంగా చెప్తే, కాదనలేక “సరే!” అన్నాను.

***

రెండో రోజు ఓ గమ్మత్తైన విషయం జరిగింది. కస్టమరొకరు, “సార్! నేను డబ్బు కట్టి చాలా సేపయింది, నా డ్రాఫ్టు ఇంకా రాలేదు…” అంటే, చూద్దామని సబ్ మేనేజర్ రత్నం గారి టేబుల్ దగ్గరి కెళ్ళాను. అనుకోకుండా, ఆయన, నేను వ్రాసిన డ్రాఫ్టును ఓచర్‍తో చెక్ చేసే విధానం చూశాను. చాలా ఆశ్చర్యం వేసింది. మొదటిగా ఆంధ్రా బ్యాంకు అనుకుంటూ, డ్రాఫ్ట్ పైన ప్రింటై వున్న ఆంధ్రా బ్యాంకు పక్కన ఓ టిక్కూ, ఓచరు పైన ప్రింటై వున్న ఆంద్రా బ్యాంకు పక్కన ఓ టిక్కూ… తరువాత బ్రాంచి ఒంగోలు అనుకుంటూ, తారీఖు అనుకుంటూ, అమౌంట్ అనుకుంటూ, అక్షరాలా అనుకుంటూ,  పేయబుల్ టు అనుకుంటూ, పేయబుల్ ఎట్ అనుకుంటూ, అటు డ్రాఫ్ట్ పైనా, ఓచరు పైనా టిక్కులు పెట్టుకుంటూ, ‘సరిపోయింది…’ అనుకుంటూ సంతకం చేశారు. ఇంకోసారి చదువుకున్నారు. మరోసారి చదువుకున్నారు. అంత జాగ్రత్తగా చెక్ చేస్తున్నారు రత్నం గారు.

డ్రాఫ్ట్ తీసుకుని కౌంటర్ దగ్గరి కొచ్చి, వెయిట్ చేస్తున్న కస్టమర్‍కి అందజేశాను.

ప్రక్క కౌంటర్‍లో వున్న కొలీగ్‍కి, సబ్ మేనేజర్ గారు డ్రాఫ్ట్‌ని చెక్ చేసే విధానం చెప్తే…

“సరేలే గురూ! నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు ఒకాయన ఉండేవారు. ఆయనైతే, ప్రతీ రోజూ బ్యాంకులోకి ప్రవేశించేటప్పుడు, బయట బోర్డును చూస్తూ…, ఆంధ్రా బ్యాంకు, ఒంగోలు శాఖ అని నిర్ధారించుకున్న తర్వాతనే బ్యాంకు లోపలి కొచ్చేవారు తెలుసా!” అన్నాడు.

“ఆ!… అవునా!!…” అంటూ నోరెళ్ళబెట్టాను నేను. కాసేపు ఇద్దరం నవ్వుకున్నాం.

దీనిని అతి జాగ్రత్త అనుకోవాలా? లేక వయసు పెద్దదైం తరువాత సాధారణంగా వచ్చే చాదస్తం అనుకోవాలా?…

ఏమీ తేల్చుకోలేని నేను… ‘నేను కూడా ఆ వయసుకి అలాగే తయారవుతానేమో!’ అనుకుంటూ పనిలో పడ్డాను, మరో సంవత్సరంలో రిటైర్ కాబోతున్న సబ్ మేనేజరు గారిని తలచుకుంటూ.

***

ఇక మూడో రోజు మొదలైంది అసలు ముసలం.

ఆ రోజు సాయంత్రం మేనేజరు గారు నన్ను క్యాబిన్‍లోకి రమ్మని కబురు పంపారు. వెంటనే వెళ్ళి కలిశాను.

“చూడండీ! రేపట్నించి మీరు ఉదయం 8 గంటలకల్లా ఆఫీసుకు రావాలి. 10 గంటల నుండి, సాయంత్రం 5 గంటల వరకు మీ కౌంటర్ పని చేసుకోండి. ఆ తరువాత రాత్రి 8 గంటల వరకు పని చేయాలి. ఉదయం, సాయంత్రం, ఆ అదనపు గంటల్లో నేను ఇచ్చే పెండింగ్ పనులు చేయాలి. సరేనా?… రేపట్నించి ఉదయం 8 గంటలకే వస్తారుగా?…” అంటూ కొంచెం కఠినంగానే చెప్పారు మేనేజరుగారు.

ఆ మాటలు విన్న నేను, మారు మాట్లాడకుండా “అలాగే సార్” అంటూ క్యాబిన్ బయట కొచ్చి నా కౌంటర్‍లో బిజీ అయిపోయాను.

***

మరుసటి రోజు మేనేజరు గారు చెప్పినట్టే ఉదయం 8 గంటలకే బ్యాంకుకి వచ్చాను. అప్పటికే మేనేజరు గారు వచ్చి వున్నారు. నేను చేయాల్సిన పెండింగ్ పనుల గురించి వివరించి, వాటి తాలూకూ రిజిస్టర్‍లను నా చేతికిచ్చారు.

ఆ పెండింగ్ పనులు చేస్తుండగానే, గడియారం 10 గంటలు కొట్టింది. చేతిలో పనిని పక్కన పెట్టి కౌంటర్ పని కోసం సర్దుకున్నాను.

సాయంత్రం 5 గంటల కల్లా కౌంటర్‍లో పని పూర్తి చేసుకుని, తిరిగి పెండింగ్ పనులు చేయడం మొదలుపెట్టాను. రాత్రి 8 గంటలకి అవన్నీ పూర్తి చేసి, రిజిస్టర్‍లను మేనేజరు గారి ముందుంచాను.

“గుడ్! బాగా చేశావ్! ఇప్పుడు ఇవి తీసుకుని పని మొదలెట్టండి! ఇంకో గంటలో నేనూ వెళ్తాను. అప్పుడు నువ్ కూడా వెళ్దువుగాని!”… అంటూ మరికొన్ని రిజిస్టర్లు నా కందించారు.

పనిలో మునిగిపోయానేమో, రాత్రి 9 గంటలయినట్లు గమనించలేదు.

అంతలో మేనేజరు గారు నా దగ్గరికొచ్చి, “ఓ.కే.! పదండి… వెళ్దాం… మిగతా పని రేపు చేద్దురు గాన్లే!” అని చెప్పి బయలుదేరారు.

రిజిస్టర్లన్నింటిని సర్దిపెట్టి భారంగా బయటకి నడిచాను.

అలా కష్టంగా కదులుతున్నాయి, గంటలు, రోజులు. ఒకో రోజు రాత్రి 10 గంటలు కూడా అవుతోంది బ్యాంకు నుండి బయట పడేటప్పటికి. రోజూ రాత్రి పూట పొద్దుపోయి, ఇంటి కెళ్తున్నందున, అన్నా వదినలను ఇబ్బంది పెడుతున్నాననే గిల్టీ ఫీలింగ్ నాలో బలపడుతూ వచ్చింది. ఎలాగైతేనేం ఓ రోజు అన్నావదినలను, అతి కష్టం మీద ఒప్పించి, బయట రూమ్ కోసం వెతకడం మొదలుపెట్టాను. మొత్తానికి అన్న ఇంటికి దగ్గర్లోనే ఓ రూమ్ దొరికింది. ఆ పక్కనే మెస్ కూడా వుంది.

ఓ ఆదివారం రోజున ఆ రూమ్‍లోకి మారాను. మెస్‍లో నెల వారీ భోజన టిక్కెట్ల పుస్తకం కొనుక్కున్నాను. అప్పుడు మరో కొత్త సమస్య తలెత్తింది. రాత్రి 10 గంటల తర్వాత మెస్ మూసేస్తున్నారు. మరో దారిలేక, రూమ్‍కి తిరిగొచ్చేటప్పుడే, దారిలో ఏదో ఒక చోట దొరికితే చపాతీలు, లేకపోతే ఫ్రూట్స్ తినడం అలవాటయిపోయింది.

***

ఓ రోజు నా ప్రక్క కౌంటర్‍లో పని చేస్తున్న కొలీగ్… శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు గారు…

“ఆ! ఏమిటి విషయం? రోజూ ఉదయం ఎన్ని గంటలకొస్తున్నారు? రాత్రి ఎన్నిగంటలకు ఇంటి కెళ్తున్నారు?”… అని అదో రకంగా నవ్వుతూ అడిగాడు.

“ఉదయం 8 గంటలకే వస్తున్నానండి! రాత్రి 10 గంటలవుతుంది బయటికెళ్ళేసరికి!”

“ఇబ్బందే కదూ! కాని తప్పదు మరి! నువ్ జాబ్‍లో కన్‍ఫర్మ్ అయ్యేవరకు ఈ ఇబ్బంది పడాల్సిందే…, ఆ మాటకొస్తే, ఉద్యోగంలో చేరిన కొత్తలో మా అందరి పరిస్థితి అదే!”

“ఇలా ఎన్ని రోజులండి?”

“ఆ!… ఎంత… ఓ ఆర్నెల్లు…! ఆ తరువాత నువ్వూ కన్‍ఫర్మ్ అవుతావు. మా అందరిలాగా నువ్ కూడా 10 టు 5 వర్క్ చేయొచ్చు… కానీ కన్‌ఫర్మ్ అయితేనే!”

“కన్‍ఫర్మ్ అవడం అంత కష్టమా? ఆటోమాటిక్‍గా అవలేమా?” అమాయకంగా అడిగాను.

“అవలేము…! అందుకు మేనేజరు గారు నిన్ను కన్‌ఫర్మ్ చేయమని రికమెండ్ చేస్తే, హెడ్ ఆఫీస్ వాళ్ళు చేస్తారు. ఆ తరువాత అదనపు గంటలు పనిచేస్తే, మాకు మల్లే, నీకూ ఓవర్ టైం అలవెన్స్ వస్తుంది… అర్థమయిందా?”

“అయిందండీ!”

“ఇంకో విషయం… మేనేజర్ గారు చెప్పిన ప్రతి పనిని మారు మాట్లాడకుండా చేయాలి. ఆయన మనసుని కష్టపెట్టే పనిని ఏదీ చేయకూడదు. ఆయనకు గనక కోపం వస్తే కన్‍ఫర్మ్ చేయమని రికమెండ్ చేయకపోవచ్చు. ఆ రిస్కుంది మరి, జాగ్రత్త సుమా!!”

“అలాగేనండి… మీరు చెప్పినట్లే నడుచుకుంటాను. థాంక్యూ ఫర్ యువర్ అడ్వైస్ సర్!”

“మనదేముంది…! మన ముందు తరం వాళ్ళు బ్యాంకులోనే ఉండేవాళ్ళట! వారానికోసారి మాత్రమే ఇంటికెళ్ళేవారట! వాళ్ళ కష్టాలతో పోలిస్తే, మన ఇబ్బందులు ఓ లెక్కే కాదు! ఆ!!”

మరో మాట లేకుండా ఇద్దరం పనిలో పడిపోయాం.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here