నా జీవన గమనంలో…!-40

41
2

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

104

[dropcap]మ[/dropcap]రుసటి రోజు ఉదయం, అన్ని దినపత్రికలలో, ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రారంభోత్సవం గురించి, ఫోటోలతో సహా సవిస్తరంగా ప్రచురించారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మా సంస్థ గురించి పూర్తిగా తెలుస్తుంది.

ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి ఫోటోలను, న్యూస్ పేపర్ క్లిప్పింగ్‍లను జతపరుస్తూ,  ఒక చక్కటి సమగ్ర నివేదికను తయారు చేశాము. ఆ నివేదిక ప్రతులను ఆంధ్రా బ్యాంకు రాజమండ్రి రీజినల్ ఆఫీసుకు, హైదరాబాద్ హెడ్ ఆఫీసుకు పంపాము.

తరువాత ప్రస్తుతం నడుస్తున్న మొట్టమొదటి శిక్షణా కార్యక్రమంపై దృష్టి సారించాము. తరగతుల నిర్వహణపై శ్రద్ధను పెంచాము. శిక్షణార్థులకు ఆశించిన ప్రయోజనాలు ఒనగూరేటట్లు, అంతకుముందే తయారు చేసుకున్న సిలబస్ ఆధారంగా, నిర్ధారించుకున్న టైమ్ టేబుల్ ప్రకారం తరగతులను నిర్వహిస్తున్నాము. ఇంకో వైపు శిక్షణ కోసం వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, సమయోచితంగా కావలసినవన్నీ అందుబాటులో ఉండేటట్లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ఎందుకంటే, ఈ మొదటి శిక్షణా కార్యక్రమ నిర్వహణయే, రాబోయే రోజుల్లో మేము నిర్వహించబోయే అనేక శిక్షణా కార్యక్రమాలకు మార్గదర్శకము కాబోతుంది.

***

మొట్టమొదటి శిక్షణా కార్యక్రమం నవంబరు 18 నాటికి ముగిసింది. ఆనాటి ముగింపు సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్.యమ్. భాస్కరరావు గారు, శిక్షణ పొందిన వారందరికీ ధ్రువపత్రాలను కూడా అందజేశారు.

అలా మొట్టమొదటి శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

105

గుంటూరు నుండి వచ్చినప్పటి నుండి సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమము, మొదటి శిక్షణా కార్యక్రమము ముగిసేవరకు తీరిక లేకుండా పనుల్లో మునిగిపోయాను. ఇప్పుడొకసారి గుంటూరు వెళ్ళి అక్కడి పనులన్నింటిని చక్కబెట్టుకొని రావాలనిపించింది. వెంటనే ఓ రెండు రోజులు శలవు మంజూరు చేయించుకున్నాను. హరకృష్ణకి, జగన్నాధరాజుకి నేను తిరిగివచ్చే లోపు చేయాల్సిన పనుల గురించి తగు సూచనలు ఇచ్చి గుంటూరు బయల్దేరాను.  రాత్రి 12 గంటలకు గుంటూరులోని మా ఇంటికి చేరుకున్నాను.

ఆదివారం ఉదయమే మా బిల్డింగ్ కాంట్రాక్టర్ మా ఇంటి వద్దకు వచ్చారు. ఇద్దరం కలిసి మొదటి అంతస్తు నిర్మాణ పనులను పరిశీలించాము. నిర్మాణంలో అవసరాలకు తగినట్టు స్వల్ప మార్పులను సూచించాను. పనులు తృప్తికరంగానే సాగుతున్నాయి.

ఆ తరువాత రెండు రోజుల్లో, పిల్లల చదువుల గురించి తెలుసుకునేందుకు, మా అబ్బాయి చదివే కాలేజీ ప్రిన్సిపాల్ గారిని, మా అమ్మాయి చదివే స్కూల్ హెడ్ మిస్ట్రెస్‌ గారిని కలుసుకున్నాను. వాళ్ళ చదువులు బాగానే సాగుతున్నాయని తెలుసుకుని సంతోషించాను. ఒక పూట మా ఊరెళ్ళి అమ్మానాన్నలను, తమ్ముళ్లను, చెల్లెళ్ళను, బంధువులను, స్నేహితులను చూసి వచ్చాను. గుంటూరులో వున్న మా అత్తగారింటికి, ఇతర బంధువుల ఇళ్ళకు వెళ్ళి వారందర్నీ కలుసుకున్నాను. ఇంటికి కావలసిన సరుకులను, ఇతర సామాగ్రిని కూడా సమకూర్చాను.

మూడు రోజులు మూడు క్షణాల్లా గడిచిపోయాయి. నా శ్రీమతికి, పిల్లలకి ధైర్యం చెప్పి, బుధవారం ఉదయమే బయలుదేరి రాజమండ్రి చేరుకున్నాను.

106

గుంటూరు నుండి తిరిగి వచ్చిన తరువాత నేను, మా సిబ్బంది, వరుసగా ఓ నాలుగు రోజులు మీటింగ్ హాల్‍లో కూర్చుని, సుదీర్ఘ చర్చల అనంతరం, మా సంస్థ యొక్క భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. అందులో శిక్షణా కార్యక్రమాల నిర్వహణకు పొందుపరిచిన ప్రధాన విషయాలు:

  • తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాగు చేయబడుతున్న వివిధ పంటల సేద్యంలో అధిక దిగుబడులను రాబట్టేందుకు అమలు పరచాల్సిన ఆధునిక వ్యవసాయ పద్ధతులను, రైతాంగానికి తెలియజేయడం.
  • పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకం మొదలైన వ్యవసాయ అనుబంధ పరిశ్రమలలో అధికోత్పత్తి సాధించడానికి అనుసరించవలసిన శాస్త్రీయ పద్ధతులను, లబ్ధిదారులకు తెలియజేయడం.
  • చేతి పనివృత్తులు, కుటీర పరిశ్రమలు, ఇతర చిన్న తరహా పరిశ్రమలలో అధిక రాబడిని పొందేందుకు అవలంబించవల్సిన నైపుణ్యాల గురించి లబ్ధిదారులకు తెలియజేయడం.
  • ఏ ఏ సీజన్‌లలో, ఏ ఏ సమయాల్లో, ఏ ఏ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. అందుకోసం ఒక సంవత్సరం పాటు నెలవారీ శిక్షణా కార్యక్రమాల గురించి ఓ క్యాలెండర్ తయారుచేయడం. ఆ క్యాలెండర్‌ను అనుసరించి తదుపరి నెలలో జరగబోయే శిక్షణా కార్యక్రమాల గురించి, ఒక నెల ముందుగానే, ఆ నెల క్యాలెండర్‌ను, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఆంధ్రా బ్యాంకు శాఖలకు పంపించడం. ఆ శాఖల మేనేజర్లతో మాట్లాడి శిక్షణ కోసం లబ్ధిదారులను పంపవలసిందిగా కోరడం.
  • వ్యవసాయ పరిశోధనా క్షేత్రాలతో, వ్యవసాయ కళాశాలతో, ప్రభుత్వ శిక్షణా సంస్థలతో, వివిధ ప్రభుత్వ శాఖలతో ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపుతూ, అవసరమైతే వ్యక్తిగతంగా సందర్శించి, మన శిక్షణా కార్యక్రమాల నిర్వహణలో, ఆయా సంస్థల సహాయ సహకారాలను కోరడం.
  • ఆయా శిక్షణా కార్యక్రమాలలో ఆయా ఆంశాలపై శిక్షణనివ్వగలిగిన శాస్త్రవేత్తలను, ప్రొఫెసర్లను, ప్రభుత్వశాఖల ఉన్నతోద్యోగులను గుర్తించడం. వారితో ఉత్తర ప్రత్యుత్తరరాలను జరపడం, అవసరమైతే వ్యక్తిగతంగా కలవడం, వారిని శిక్షణ ఇవ్వడానికి మన సంస్థకు ఆహ్వానించడం.
  • ఒక్కో శిక్షణా కార్యక్రమానికి, మా ముగ్గురిలో ఒక్కొకరం, సమన్వయకర్తగా వ్యవహరిస్తూ, ఆ కార్యక్రమం యొక్క పూర్తి బాధ్యతలను చేపట్టాలి. అంటే ఆంధ్రా బ్యాంకు మేనేజర్లతో సంప్రదించి లబ్ధిదారులను రప్పించుకోవడం; శిక్షణనిచ్చేవారిని గుర్తించి, వారిని శిక్షణ ఇచ్చేందుకు మన సంస్థకు రప్పించుకోవడం; వారికి కావలసిన అన్ని వసతులను సమకూర్చడం; ఆయా కార్యక్రమాలపై నివేదికలను తయారు చేసి, రీజినల్ ఆఫీసుకు, హెడ్ ఆఫీసుకు పంపడం; కార్యక్రమం గురించి దినపత్రికలో వచ్చేటట్లు చూసుకోవడం – సమన్వయకర్తలదే బాధ్యత. కానీ, మిగతా ముగ్గురితో కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ ముందుకుపోవాలి.

పైన తెలుపబడిన విషయాలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నేను, హరకృష్ణ, జగన్నాధరాజు, శ్రీకాంత్ – మేమంతా ఒక కృత నిశ్చయానికి వచ్చాము. తదనుసారంగా ఎవరెవరు ఏయే పనులు చేపట్టాలో స్పష్టంగా నిర్ణయించుకున్నాము. రెట్టింపు ఉత్సాహంతో మేమంతా రంగంలోకి దూకాము.

107

అలా ఒక రోజు నేను, మా సిబ్బంది మీటింగ్ హాల్‌లో కూర్చుని చర్చించుకుంటుండగా, నా పేరుతో రెండు కవర్లు అందాయి. మొదటగా, ఆంధ్రా బ్యాంకు హెడ్ ఆఫీసు, హైదరాబాద్ నుండి, జనరల్ మేనేజర్ శంకరన్ గారు పంపిన ఉత్తరం చదివాను. అందులో ‘ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ’కు డైరక్టర్‍గా నియమింపబడిన నన్ను అభినందించారు. ఆ సంస్థ నవంబరు 14వ తేదీన బ్యాంక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ కె. ఆర్. నాయక్ గారి చేతుల మీదుగా ప్రారంభింపబడటం, తనకెంతో సంతోషాన్ని కలిగించిందని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఆ సంస్థ ద్వారా ఎన్నో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడాలని, వాటి ద్వారా గ్రామీణ ప్రజల స్థితిగతులు మెరుగుపడాలని, ఆశాభావం వ్యక్తపరిచారు. చివరిగా సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకుగాను, నాకు, మా సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.

ఆ ఉత్తరాన్ని మేమందరం కలిసి చదువుకుని ఆనందంతో ఉప్పొంగిపోయాము.

108

ఇక… ఆ రెండో కవరు… ఆంధ్రా బ్యాంకు రీజినల్ ఆఫీసు, గుంటూరు నుండి, రీజినల్ మేనేజర్ బి.టి. కాంతారావు గారు పంపారు. కవరు తెరిచి అందులోని ఉత్తరం చదివాను. అందులోని సారాంశం…

గుంటూరు డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డిసిసి), 5వ స్టాండింగ్ కమిటీ మీటింగు, గుంటూరు లోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఎ) మీటింగ్ హాల్లో ది.06-11-1989న జరిగిందని, ఆ మీటింగులో నేను, గుంటూరు జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌గా, లీడ్ బ్యాంక్ పథకాన్ని, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు పరిచినందుకుగాను, నా సేవలను కొనియాడుతూ, ఏకగ్రీవంగా నన్ను అభినందిస్తూ, ఒక రిజల్యూషన్ ద్వారా రికార్డు చేశారని తెలియజేశారు.

ఆ సందర్భంగా ఆ మీటింగుకి అధ్యక్షత వహించిన గుంటూరు జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ శ్రీ ప్రియదర్శి దాష్ గారు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అటు వివిధ బ్యాంకుల అధికారులతోనూ, ఇటు ప్రభుత్వ అధికారులతోనూ సత్సంబంధాలను కొనసాగిస్తూ, సమయానుకూలంగా ఆలోచిస్తూ, డైనమిక్‍గా నిర్ణయాలు తీసుకుంటూ, లీడ్ బ్యాంక్ పథకాన్ని గుంటూరు జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా అమలుపరిచినందుకు గాను, నేనందించిన సేవలకు, వ్యక్తిగతంగా తన తరఫున, గుంటూరు జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ హోదాలోనూ, మరియు డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ ఛైర్మన్ హోదాలోనూ, నన్ను అభినందిస్తున్నట్లు తెలియజేశారు.

ఆ ఉత్తరంతో పాటు ది.06-11-1989న జరిగిన స్టాండింగ్ కమిటీ మీటింగ్ ప్రొసీడింగ్స్ కాపీ కూడా నాకు పంపారు. ఆ ఉత్తరాన్ని చదువుకున్న నేను సంతోషంతో తబ్బిబ్బయ్యాను.

109

మరి కొద్ది రోజుల్లో, పైన ఉటంకించిన రెండో ఉత్తరానికి కొనసాగింపుగా, ఆంధ్రా బ్యాంకు హెడ్ ఆఫీసు నుండి మరో ఉత్తరం అందింది. గుంటూరు జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ మరియు ఛైర్మన్, డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ అధ్యక్షతన ది.06-11-1989న జరిగిన స్టాండింగ్ కమిటీ మీటింగులో, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌గా నేనందించిన సేవలకు గాను, నన్ను ప్రశంసిస్తూ రికార్డు చేసిన ప్రొసీడింగ్స్‌ని నా వ్యక్తిగత ఫైల్‍లో ఉంచుతున్నట్లు తెలియజేశారు.

మరి, నిజంగా నాకు సంతోషమే కదా!

ఎందుకంటే, అలాంటి అప్రీషియేషన్ లెటర్సు, ముందు ముందు నా పై అధికారులు నా పదోన్నతి గురించి పరిశీలించేడప్పుడు, సకారాత్మకంగా ప్రభావితం చేయడం తథ్యం!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here