నా జీవన గమనంలో…!-42

45
3

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

116

[dropcap]మ[/dropcap]రునాడు ఉదయం 10 గంటల కల్లా మేము ఖరీదు చేసిన మొక్కలను, ఆ నర్సరీ యజమానులు పకడ్బందీగా ప్యాకింగ్ చేసి, వారి వాహనంలోనే మా సంస్థకు చేర్చారు. అప్పటికే మా తోటమాలి తన సహాయకులతో తయారుగా వున్నాడు. మొక్కలను మా సంస్థకు తెచ్చిన వ్యక్తి, ఆ రోజు సాయంత్రం వరకు మాతోనే వుండి, మా తోటమాలికి, మొక్కలు నాటడంలో సహాయపడ్డాడు. ఏ మొక్కలను ఎక్కడ నాటితో బాగుంటుందో, ఎలా నాటాలో, అనే విషయాలపై మంచి సలహాలను కూడా ఇచ్చి సాయంత్రానికి వెనుదిరిగాడు. ఇక మా వాళ్ళు, మరో మూడు రోజుల్లో తెచ్చిన మొక్కలన్నింటినీ, నాటే కార్యక్రమం ముగించారు.

***

రోజులు గడుస్తున్నాయి. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఆకుకూరల మొక్కలు, కూరగాయల మొక్కలు ఆరోగ్యంగా, ఏపుగా పెరుగుతూ, రోజు రోజుకీ కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. వాటిని అలా రోజూ చూస్తూ అక్కడ తిరుగుతుంటే కలిగే ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు.

117

అధిక పాల దిగుబడితో, గ్రామీణ ప్రజల దినసరి రాబడి పెంచేందుకు, సంక్షేమ పథకాల ద్వారా బ్యాంకులు అందించే ఋణాలతో, సంకర జాతి ఆవులను కొనిస్తుంది ప్రభుత్వం. అవి సాధారణ ఆవుల కంటే… దాదాపు ఏడెనిమిది రెట్లు అధికంగా పాలిస్తాయి. కానీ ఆ సంకర జాతి ఆవుల పెంపకంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి పోషణ, సంరక్షణ విషయాల్లో అత్యంత శ్రద్ధ వహించాలి. ఆ విషయాలన్నీ లబ్ధిదారులకు ముందుగానే తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. లేకపోతే లబ్ధిదారులు ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడం అటుంచి, విపరీతంగా నష్టపోయే ప్రమాదం వుంది. ఆ విషయాలను దృష్టిలో వుంచుకుని, ఆంధ్రా బ్యాంకు లబ్ధిదారుల ప్రయోజనార్థం ‘సంకర జాతి ఆవుల పెంపకం’ పై ఓ ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమం, మా సంస్థలో నిర్వహించాము. ఆ శిక్షణా కార్యక్రమ నిర్వహణలో జిల్లా పశువర్ధక శాఖ వైద్యులు మరియు ఇతర అధికారుల సహకారాన్ని కూడా తీసుకున్నాము.

ఆ శిక్షణా కార్యక్రమం జరిగే సమయంలోనే, ఆంధ్రా బ్యాంకు విశాఖపట్టణం జోన్ సందర్శనార్థం, విశాఖపట్టణానికి విచ్చేసిన ఆంధ్రా బ్యాంకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ. కె. ఆర్. నాయక్ గారు, జోనల్ మేనేజర్ శ్రీ గుర్రాల వెంకటేశ్వరరావు గారితో కలిసి, మా సంస్థను కూడా సందర్శించారు. శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులతో కొద్ది సేపు ముచ్చటించారు. ఆ తరువాత సంకర జాతి ఆవులతో, లబ్ధిదారులతో కలిసి ఫోటోలు కూడా దిగారు.

‘సంకర జాతి ఆవుల పెంపకం’ పై శిక్షణ – వేదికపైన ఎడమ నుండి కుడికి… రచయిత, ఆంధ్రా బ్యాంకు విశాఖపట్టణం జోనల్ మేనేజర్ శ్రీ గుర్రాల వెంకటేశ్వరరావు గారు, శిక్షణలో పాల్గొన్న లబ్ధిదారుల నుద్దేశించి ప్రసంగిస్తున్న ఆంధ్రా బ్యాంకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ. కె. ఆర్. నాయక్ గారు, ఆంధ్రా బ్యాంకు జనరల్ మేనేజర్ శ్రీ ఆర్. శంకరన్ గారు.
సంకర జాతి ఆవులు, లబ్ధిదారులతో…. ఎడమ నుండి కుడికి… శ్రీ హరకృష్ణ గారు, రచయిత, శ్రీ గుర్రాల వెంకటేశ్వరరావు గారు, శ్రీ. కె. ఆర్. నాయక్ గారు, శ్రీ ఆర్. శంకరన్ గారు, శ్రీ జగన్నాధ రాజు గారు, శ్రీ శ్రీకాంత్ గారు.

***

అదే సమయంలో, మా సంస్థ పై అంతస్తులో, ఆంధ్రా బ్యాంకు – స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డిపార్టుమెంటు వారి సహకారంతో, చిన్న పరిశ్రమలను స్థాపించబోయే ఔత్సాహికుల కొరకు మరో శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. మా సి.యమ్.డి. గారు ఆ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులతో కొంచెం సేపు ముచ్చటించి, వారితో కలిసి ఫోటోలు కూడా దిగారు.

‘చిన్న పరిశ్రమల స్థాపన’ పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఔత్సాహికులతో… వేదికపై… ఎడమ నుండి కుడికి… శ్రీ గుర్రాల వెంకటేశ్వరరావు గారు, శ్రీ. కె. ఆర్. నాయక్ గారు, శ్రీ ఆర్. శంకరన్ గారు, చివరన రచయిత.

***

ఇలాంటి మంచి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు మా సి.యమ్.డి. గారు నన్ను, మా సిబ్బందిని అభినందించారు.

118

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో వర్జీనియా పొగాకు పంటను చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు.

పైగా, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సి.టి.ఆర్.ఐ.) కూడా రాజమండ్రి లోనే నెలకొల్పబడింది. ఆ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో, ఆంధ్రా బ్యాంకు ద్వారా, వర్జీనియా పొగాకు పంట సాగుకు ఋణాలు పొందిన కొంతమంది రైతులకు ‘వర్జీనియా పొగాకు సేద్యములో యాజమాన్య పద్ధతులు’ అనే అంశంపై శిక్షణా కార్యక్రమాన్ని మా సంస్థలో నిర్వహించాము.

మొదటి రోజు శిక్షణా కార్యక్రమాన్ని సి.టి.ఆర్.ఐ. డైరక్టర్ డా. యమ్.యస్. చారి గారు ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న రైతుల ఉత్సాహాన్ని చూసి ముచ్చటపడిన డైరక్టరు గారు, ఆ రోజంతా తామే స్వయంగా తరగతులను నిర్వహించారు.

‘వర్జీనియా పొగాకు సేద్యములో యాజమాన్య పద్ధతులు’ పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో తరగతులను నిర్వహిస్తున్న సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సి.టి.ఆర్.ఐ.) రాజమండ్రి డైరక్టర్ డా. యమ్.యస్. చారి గారు, ప్రక్కన రచయిత.

తదుపరి మూడు రోజుల్లో సి.టి.ఆర్.ఐ. నుండి వచ్చిన ఇద్దరు శాస్త్రజ్ఞులు, తరగతులను సమర్థవంతంగా నిర్వహించారు.

వర్జీనియా పొగాకు సేద్యంలోని మెళకువలను తెలుసుకున్న రైతులు, చాలా సంతోషించారు. నేర్చుకున్న విషయాలను అమలుపరిచి, పొగాకు సేద్యంలో అధిక దిగుబడి సాధించగలమనే నమ్మకం కలిగింది… ఆ రైతు సోదరులకు.

119

లేత్ మెషీన్ పై డ్రిల్లింగ్, టాపింగ్, గ్రైండింగ్ చేయడంలో అనుభవం చేయించడానికి కొంతమంది గ్రామీణ యువకులకు, మా సంస్థలో ఒక వర్క్‌షాపు నిర్వహించాము.

అందుకవసరమయే లేత్ మెషీన్‌ను, ఇతర సామగ్రిని మా సంస్థలోనే ఏర్పాటు చేసి, ఆ మెషీన్‌ను సమర్థవంతంగా నడపడంలో నిష్ణాతులైన సాంకేతిక నిపుణులతో శిక్షణ ఇప్పించాము.

లేత్ మెషీన్ పై డ్రిల్లింగ్, టాపింగ్ మరియు గ్రైండింగ్ చేయడంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నవారితో… ఎడమ నుండి కుడికి… ఆంధ్రా బ్యాంకు మేనేజర్ శ్రీ సాంబమూర్తి గారు, శ్రీ జగన్నాధ రాజు గారు, రచయిత, శ్రీ హరకృష్ణ గారు.

శిక్షణలో మంచి నైప్యుణ్యతను ప్రదర్శించిన వారికి, వారి గ్రామాల్లోనే లేత్ మెషీన్ వర్క్‌షాపులను ఏర్పాటు చేసుకుని, జోవనోపాధి పొందడానికి అవసరమయ్యే ఋణాలను ఆంధ్రా బ్యాంకు శాఖల ద్వారా మంజూరు చేయించాము.

120

ఆ నెల వ్యవసాయ మాసపత్రికలో బాపట్ల హోమ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారు, పుట్టగొడుగుల పెంపకంపై వ్రాసిన వివరణాత్మక వ్యాసం చదవడం జరిగింది. పుట్టగొడుగులనేవి నిజానికి ఓ రకమైన ఫంగస్ మాత్రమే. పుట్టగొడుగులలో వున్న వివిధ పోషక పదార్థాలు, ఆరోగ్య పరిరక్షణలో వాటి ఆవశ్యకతను గురించి, ఆ వ్యాసంలో సవివరంగా తెలియజేయబడింది. మార్కెట్‌లో వాటికున్న గిరాకీని చూస్తే, పుట్టగొడుగుల పెంపకం ఓ లాభసాటి వ్యాపకంగా చెప్పుకోవచ్చు.

సాధారణ రైతులు, గృహిణులు సైతం పుట్టగొడుగులను చాలా సులభంగా తమ ఇళ్ళ వద్దనే అతి తక్కువ పెట్టుబడితో ఒక కుటీర పరిశ్రమలా చేపట్టి పెంచడానికి వీలవుతుందనియు, అలా పెంచే విధానాన్ని కూడా ఆ వ్యాసంలో తెలియజేశారు డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారు.

ఆ వ్యాసాన్ని ఆసాంతం చదివిన నాకు, పుట్టగొడుగుల పెంపకం గ్రామీణ ప్రాంతంలోని మహిళలకు ఒక ఆధాయ వనరుగా ఉపయోగపడుతుందని… అనిపించింది.

అప్పుడే నాలో ఒక ఆలోచన మొదలైంది. దాని ఫలితమే మా సంస్థలో పుట్టగొడుగుల పెంపకంపై గ్రామీణ ప్రాంత మహిళలకు ఒక శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం.

ఒకసారి గుంటూరు వెళ్ళినప్పుడు బాపట్ల వెళ్ళి డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారిని కలిసి, మా సంస్థ గురించి, మా సంస్థ చేపడుతున్న శిక్షణా కార్యక్రమాల గురించి తెలియజేశాను. తెలుసుకుని చాలా సంతోషించారు డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారు.

అప్పుడే వారిని, మా సంస్థను సందర్శించి, పుట్టగొడుగుల పెంపకంపై ఓ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించమని ఆహ్వానించాను. వారు నా ఆహ్వానాన్ని స్వీకరించి, అందులకు తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. కాని తను రాజమండ్రి వచ్చి మా సంస్థలో శిక్షణా కార్యక్రమం నిర్వహించాలంటే, హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క అనుమతి తప్పనిసరి అని చెప్పారు.

చేసేది లేక నిరాశతో వెనుదిరిగాను.

121

రాజమండ్రి వచ్చిన తరువాత, హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. ఎట్టకేలకు, నా ప్రయత్నాలు ఫలించి డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారికి మా సంస్థను సందర్శించి, పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి లభించింది.

పర్యవసానంగా, మా సంస్థలో మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో, గ్రామీణ ప్రాంతం నుండి విచ్చేసిన మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విషయం తెలుసుకుని, ఆంధ్రా బ్యాంకు రాజమండ్రి శాఖల్లో పని చేస్తున్న కొంతమంది మహిళా సిబ్బంది కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎడమ నుండి కుడికి… శ్రీ శ్రీకాంత్ గారు, శ్రీ జగన్నాధ రాజు గారు, రచయిత, శ్రీ హరకృష్ణ గారు. ఆంధ్రా బ్యాంకు, రాజమండ్రి, రీజినల్ మేనేజర్ శ్రీ వై. భాస్కరరావు గారు; బాపట్ల హోమ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారు మరియు ఆంధ్రా బ్యాంకు మహిళా సిబ్బంది.

మూడు రోజుల పాటు జరిగిన ఆ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారు, ఎంతో ఓపికతో, తనతో పాటు తెచ్చినటువంటి వివిధ దశలలో వున్న, వివిధ రకాలైన పుట్టగొడుగులను, ఇతర సామగ్రిని చూపిస్తూ పుట్టగొడుగుల పెంపకంపై అభ్యాసం చేయించారు.

‘పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణా కార్యక్రమం’లో వేదికపై… ఎడమ నుండి కుడికి… రచయిత, శిక్షణనిస్తున్న బాపట్ల హోమ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారు, శ్రీ జగన్నాధ రాజు గారు.

శిక్షణలో పాల్గొన్న మహిళలందరూ, పుట్టగొడుగుల పెంపకాన్ని ఒక కుటీర పరిశ్రమలా ఎలా నిర్వహించాలో పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగారు. అందుల కవసరమయే వస్తువులు, సామగ్రి, ఫంగస్ ఎక్కడ దొరుకుతాయో కూడా తెలుసుకున్నారు.

పుట్టగొడుగుల పెంపకం తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఓ ఉత్తమ మార్గం అని, శిక్షణ పొందిన మహిళలందరికీ నమ్మకం కుదిరింది.

హోమ్ సైన్స్ కాలేజీకి ప్రిన్సిపాల్‍గా ఒక బాధ్యతాయుతమైన పదవిని నిర్వహిస్తూ, మా ఆహ్వానాన్ని మన్నించి, బాపట్ల నుండి రాజమండ్రి వచ్చి, మా సంస్థలో మూడు రోజుల పాటు పుట్టగొడుగుల పెంపకంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించి, గ్రామీణ మహిళల ఆదాయం పెంపుదలకు మార్గం సూచించిన డాక్టర్ (శ్రీమతి) విజయా ఖాదర్ గారికి, నేను, మా సిబ్బంది, శిక్షణలో పాల్గొన్న మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఘనంగా వీడ్కోలు పలికాము.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here