నా జీవన గమనంలో…!-43

52
2

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

122

[dropcap]ఆ[/dropcap] రోజు, విశాఖపట్టణం జిల్లా, యలమంచిలిలో, గ్రామీణ ప్రాంత ప్రజలకు విద్య, వైద్య, ఇతర సామాజిక సేవలను స్వచ్ఛందంగా అందిస్తూ, ఆ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న ‘భాగవతుల ఛారిటబుల్ ట్రస్ట్’ నుండి నా పేరున ఒక ఉత్తరం వచ్చింది.

దాని సారాంశం…

ఆ ట్రస్టు వారు మా సంస్థ గురించి, గ్రామీణ ప్రజల ఉపయోగార్థం మా సంస్థ చేపడుతున్న వివిధ శిక్షణా కార్యక్రమాల గురించి తెలుసుకోవడం జరిగింది. వారు కూడా గ్రామీణ ప్రజలకు వివిధ అంశాల్లో శిక్షణనిచ్చేందుకు ‘మండల ప్రోత్సాహకుల’ను నియమించుకున్నారు. వారందరికి ‘బ్యాంకుల ద్వారా గ్రామీణాభివృద్ధి’ అనే అంశంపై ఇవ్వబోయే శిక్షణా కార్యక్రమంలో ప్రసంగిచవలసిందిగా నన్ను ఆహ్వానించారు.

వారు తలపెట్టిన ఆ మంచి కార్యక్రమానికి హాజరై, నా వంతు సహకారాన్ని అందించాలని నిర్ణయించుకున్నాను.

***

అనుకున్నట్టే, ఆ రోజు, యలమంచిలి వెళ్ళి భాగవతుల ఛారిటబుల్ ట్రస్టు వారు తమ మండల ప్రోత్సాహకుల కోసం నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో నా ఉపన్యాసాన్ని వినిపించాను. బ్యాంకుల ద్వారా గ్రామీణాభివృద్ధిని గురించి నా ఉపన్యాసం విన్న తరువాత, ఎన్నో తెలియని విషయాలను తెలుసుకున్నందుకు వారంతా ఎంతో సంతోషించారు. వారు లేవనెత్తిన వివిధ సందేహాలకు సవివరమైన సమాధానాలు చెప్పి వారందరిని సంతృప్తి పరిచాను. తిరిగి రాత్రికి రాజమండ్రి చేరుకున్నాను.

***

ఆ తరువాత నాలుగు రోజులకు, భాగవతుల ఛారిటబుల్ ట్రస్టు సెక్రటరీ, శ్రీ బి. వి. పరమేశ్వరరావు గారు నాకో ఉత్తరం పంపారు. ఆనాటి శిక్షణా కార్యక్రమంలో, తమ మండల ప్రోత్సాహకులు ‘బ్యాంకుల ద్వారా గ్రామీణాభివృద్ధి’ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారని, ఆ విషయంలో తమ అవగాహనని బాగా పెంచుకోగలిగారని తెలియజేస్తూ, అందులకు గాను, నాకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు, ఆ ఉత్తరం ద్వారా.

123

ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో వరి పంట సాగు చేయబడుతోంది. అందుకు కారణం ఎక్కువ ప్రాంతాలలో సాగునీరు పుష్కలంగా అందుబాటులో వుండటం. సంవత్సరానికి వరి పంట రెండు సార్లుగా, అంటే మొదటిసారి ఖరీఫ్ సీజన్‍లో, రెండోసారి రబీ సీజన్‌లో సాగు చేస్తారు. సాధారణంగా వరి పంటలో ఖరీఫ్ సీజన్‍లో వచ్చినంత దిగుబడి రబీ సీజన్‍లో రాదు. అయినప్పటికీ వరి పంట సాగు లాభసాటిగానే వుంటుంది. అప్పుడే వ్యవసాయ శాస్త్రవేత్తలు, తమ పరిశోధనల ద్వారా, ఖరీఫ్ సీజన్‍లో మాదిరిగా, రబీ సీజన్‍లో కూడా అధిక దిగుబడిని సాధించగలిగే హైబ్రీడ్ రకం వంగడాలను అభివృద్ధి చేయగలిగారు. రబీ సీజన్‍కు అనువుగా ఉండి, అధిక దిగుబడిని ఇవ్వగలిగే ఆ వంగడాలకు రైతాంగంలో మంచి ఆదరణ లభించింది. తద్వారా రైతాంగం, ఖరీఫ్ సీజన్‍తో పాటు, రబీ సీజన్‌లో కూడా వరి పంటలో అధిక దిగుబడులు సాధిస్తూ, వరి సాగులో ఆదాయాన్ని పెంచుకోగలుగుతున్నారు.

ఆ వంగడాలను మరింత ప్రాచుర్యం కల్పించడానికి, రైతాంగం రబీ పంటలో మరింత దిగుబడిని సాధించడానికి దోహదపడేందుకు ‘రబీలో వరి సాగు’ అనే అంశంపై ఒక శిక్షణా కార్యక్రమం నిర్వహించాము.

ఆ శిక్షణా కార్యక్రమ నిర్వహణలో ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంస్థ శాస్త్రజ్ఞులు, ప్రభుత్వ వ్యవసాయ శిక్షణా సంస్థ బోధనా సిబ్బంది మాకు ఎంతగానో సహకరించారు. వారంతా, శిక్షణలో పాల్గొన్న రైతు సోదరులలో, రబీ వరి పంట సాగులో, హైబ్రీడ్ వంగడాల వాడకం, ఆధునిక యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి సాధించడంపై మంచి అవగాహనను పెంచగలిగారు.

‘రబీలో వరి సాగు’ పై శిక్షణా కార్యక్రమం… వేదికపై శ్రీ జగన్నాధరాజు, రచయిత, శిక్షణనిస్తున్న ప్రభుత్వ వ్యవసాయ శిక్షణా సంస్థ బోధనా సిబ్బంది… ఎదురుగా… శిక్షణలో పాల్గొన్న రైతు సోదరులు

124

ఆ రోజు ఆంధ్రా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మరియు ఇతర డైరక్టర్లు మా సంస్థను సందర్శించారు. మా సంస్థలో జరుగుతున్న వివిధ శిక్షణా కార్యక్రమాలను, వాటి ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు పొందుతున్న ప్రయోజనాలను, సుదీర్ఘంగా సమీక్షించారు. మేమందించిన నివేదికలను కూడా పరిశీలించిన మీదట, వారంతా సంతృప్తిని వ్యక్తపరిచారు.

ఆ రోజే ‘రబీలో వరి సాగు’ అనే అంశంపై శిక్షణా కార్యక్రమం ముగిసింది. ఆంధ్రా బ్యాంకు డైరక్టర్లు, ఆ శిక్షణలో పాల్గొన్న రైతులతో కూడా కొంత సమయం గడిపారు. సంస్థలో వారికి ఏర్పాటు చేసిన భోజన మరియు వసతి సౌకర్యాల గురించి వాకబు చేశారు. శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలు వారికెంతవరకూ ఉపయోగపడగలవో… వారినే అడిగి తెలుసుకున్నారు.

‘రబీలో వరి సాగు’ పై జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులతో సమావేశమైన ఆంధ్రా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ మరియు ఇతర డైరక్టర్లు, ఎడమ వైపు మొదటి వ్యక్తి రచయిత.

అనంతరం మా సంస్థ ప్రాంగణంలోనే, ఆంధ్రా బ్యాంకు శాఖల లబ్ధిదారులకు, బ్యాంకు ఋణాల ద్వారా కొనిచ్చిన కుట్టు మిషన్లను, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు ఆంధ్రా బ్యాంకు డైరక్టర్లు.

ఆంధ్రా బ్యాంకు శాఖల లబ్ధిదారులకు, బ్యాంకు ఋణాల ద్వారా కొనిచ్చిన కుట్టు మిషన్లను, ఇతర సామగ్రిని పంపిణీ చేస్తున్న ఆంధ్రా బ్యాంకు డైరక్టర్లు… మరియు రచయిత

చివరిగా, మా సంస్థ నిర్వహణలో, నేను, మా సిబ్బంది చూపుతున్న శ్రద్ధాసక్తులను మెచ్చుకుంటూ మమ్మల్ని కొనియాడారు ఆంధ్రా బ్యాంకు డైరక్టర్లు.

125

అప్పుడే నాకు తెలిసింది… ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్, బొంబాయి వారు – బ్యాంకుల సిబ్బందికి గ్రామీణ బ్యాంకింగ్‌లో ఒక ప్రత్యేకమైన పరీక్షను నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన వారికి ‘సర్టిఫికెట్ ఇన్ రూరల్ బ్యాంకింగ్’ అందజేస్తున్నారని.

బ్యాంకుల ద్వారా గ్రామీణాభివృద్ధి… అనే అంశంపై అత్యంత మక్కువ కలిగిన నాకు, నా విధుల నిర్వహణలో, అనునిత్యం గ్రామీణాభివృద్ధి గురించే ఆలోచించే నాకు, ఆ ‘సర్టిఫికెట్ ఇన్ రూరల్ బ్యాంకింగ్’ని పొందాలనుకోవడం అత్యాశ కాదు. అందుకే వెంటనే ఆ పరీక్ష తాలూకూ సిలబస్‌ని తెప్పించుకొని చూశాను. గ్రామీణాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర గురించి ప్రాథమిక అవగాహన వుండి, సమకాలీన కాలంలో బ్యాంకింగ్ రంగంలో వచ్చిన సమూల మార్పులు, ఋణవితరణలో వ్యవసాయ మరియు ఇతర ప్రాధాన్యతా రంగాలకు ఇవ్వబడుతున్న ప్రాముఖ్యతను గురించి తెలుసుంటే, ఆ పరీక్షలో నెగ్గడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా, ఇప్పటి వరకూ నా పదవీ కాలంలో నేను నిర్వహించిన వివిధ హోదాల్లో, నా విధుల నిర్వహణ యావత్తూ, బ్యాంకుల ద్వారా గ్రామీణాభివృద్ధి… అనే అంశంతోనే ముడిపడి వుంది. అందుకే, నాకనిపించింది… ఆ పరీక్షలో నేను సునాయాసంగా నెగ్గుకు రాగలనని…

వెంటనే ఆ పరీక్ష వ్రాయడానికి నా దరఖాస్తును పంపాను. పెద్దగా చదవకుండానే, బ్యాంకుల ద్వారా గ్రామీణాభివృద్ధి అనే అంశంపై, నాకున్న అవగాహన మరియు అనుభవంతో పరీక్ష వ్రాసాను. నెల తిరక్కముందే ఫలితం వచ్చింది. నేను ఉత్తీర్ణుడనయ్యాను. సర్టిఫికెట్ కూడా వచ్చింది.

ఇప్పుడు నా విద్యాయోగ్యతల్లో మరో కలికితురాయి ఈ సర్టిఫికెట్.

126

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు, అంతగా చదువుకోనప్పటికీ, వారిలో సృజనాత్మకతకు కొదవేమీ వుండదు. ఆ సృజనాత్మకతను వెలికితీసి, వారు తయారుచేయగలిగే కళాత్మకమైన మరియు ఆకర్షణీయమైన ఆటబొమ్మలు, అల్లికలు, గృహోపకరణాలు, గృహాలంకరణ వస్తువులు… మొదలైన వాటి తయారీకి వారికి చేయూతనివ్వాలి. అందుకవసరమైన ఆర్థిక సాయాన్ని బ్యాంకులు అందజేయాలి. ఆయా ఉత్పత్తులకు ప్రభుత్వమే విక్రయ సౌకర్యాలు కలగజేయాలి. అప్పుడే గ్రామీణ మహిళలకు ఆర్థిక భరోసాను కల్పించినవారమవుతాము.

ఈ విషయాన్ని దృష్టిలో వుంచుకుని, ‘గోరంత దీపం కొండంత వెలుగు – ఆంధ్రా బ్యాంకు గ్రామాలకు వెలుగు’ అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది మా సంస్థ. ఎంపిక చేయబడిన కొంతమంది గ్రామీణ మహిళలకు, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ వారి సహకారంతో, రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించాము.

ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆంధ్రా బ్యాంకు రాజమండ్రి రీజినల్ మేనేజర్ శ్రీ. వై. భాస్కరరావు గారు, గోదావరి గ్రామీణ బ్యాంక్, రాజమండ్రి, ఛైర్మన్ శ్రీ సుదర్శన్ బాబు గారు ముఖ్య అతిథులుగా వేంచేశారు. వారు మా సంస్థ తలపెట్టిన ఈ మహిళాభ్యుదయ కార్యక్రమాన్ని ఎంతగానో శ్లాఘించారు.

‘గోరంత దీపం కొండంత వెలుగు – ఆంధ్రా బ్యాంకు గ్రామాలకు వెలుగు’ శిక్షణా కార్యక్రమంలో వేదిక పైన ఎడమ నుండి కుడికి – ప్రభుత్వ అధికారి, ఆంధ్రా బ్యాంకు రాజమండ్రి రీజినల్ మేనేజర్ శ్రీ. వై. భాస్కరరావు గారు, ప్రభుత్వ అధికారి, ప్రసంగిస్తున్న గోదావరి గ్రామీణ బ్యాంక్, రాజమండ్రి, ఛైర్మన్ శ్రీ సుదర్శన్ బాబు గారు, రచయిత… ఎదురుగా.. శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న గ్రామీణ మహిళలు.

చివరి రోజున, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. శిక్షణలో పాల్గొన్న మహిళలు తామే స్వయంగా తయారు చేసిన, అత్యంత ఆకర్షణీయమైన ఉత్పత్తులను ప్రదర్శనగా వుంచారు. వాటిని చూసి వారిలోని సృజనాత్మకతను వేనోళ్ళా కొనియాడారు చూసిన వాళ్ళంతా… ముందు ముందు బ్యాంకుల ఆర్థిక సహాయంతో మరెన్నో కళాత్మకమైన ఉత్పత్తులను తయరు చేయడానికి కృతనిశ్చయులయ్యారు ఆ మహిళలు.

భవిష్యత్తులో వారు తయారు చేయబోయే ఉత్పత్తులకు విక్రయ సౌకర్యాలను కలగజేసేందుకు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు, తగు చర్యలు చేపట్టేందుకు తమ సంసిద్ధతను వ్యక్తపరిచారు.

శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న గ్రామీణ మహిళలు, వారు తయారు చేసిన ఉత్పత్తులతో, వేదికపైన ఎడమ నుండి కుడికి… శ్రీ జగన్నాధరాజు, ప్రభుత్వ అధికారి, రచయిత, శ్రీ హరకృష్ణ, ప్రభుత్వ మహిళాధికారులు.

ఈ ప్రత్యేకమైన శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలోని ఉద్దేశం నెరవేరినందుకు నేను, మా సిబ్బంది చాలా సంతోషించాము.

127

ఆ రోజు… ఆంధ్రా బ్యాంకు రాజమండ్రి రీజనల్ ఆఫీసు ఆధ్వర్యంలో, ఒక సామాజిక బాధ్యతను గుర్తు చేసే కార్యక్రమం మా సంస్థలో నిర్వహించబడింది. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన యువతీయువకులు పాల్గొన్న ఆ సభకు రీజినల్ మేనేజర్ శ్రీ. వై. భాస్కరరావు గారు అధ్యక్షత వహించారు.

‘నిరక్షరాస్యత నిర్మూలన’ అనే అత్యంత ప్రాముఖ్యమైన అంశంపై ఆ రోజు సభ నిర్వహించబడింది. ఆ సభలో ఆర్.యమ్.గారు నన్ను కూడా ప్రసంగించవలసిందిగా కోరారు. సామాజిక బాధ్యతగా నిర్వహించబడుతున్న ఆ సభలో ప్రసంగించి, ఎంపికజేయబడిన అంశంలో నా అభిప్రాయాలను కూడా వెల్లడించే అవకాశం దొరికినందుకు సంతోషిస్తూ, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. ఆనాటి నా ప్రసంగం ఇలా కొనసాగింది…

“నిజానికి భారతదేశంలోని చాలా రాష్ట్రాల కంటే మన రాష్ట్రం, అక్షరాస్యతలో బాగా వెనుకబడి వుంది. ‘విద్య లేని వాడు… వింత పశువు…’ అని అంటారు. మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో నిక్షిప్తమైన జ్ఞానాన్ని సముపార్జించి, అజ్ఞానులుగా ఉన్నవారు జ్ఞానులుగా మారారంటే, వాటిని చదివి ఆకళింపు చేసుకోవాలి. చదువే రాకపోతే వాటిని చదివే అవకాశం లేక, అజ్ఞానులుగానే మిగిలిపోవలసి వస్తుంది.

వాస్తవ పరిస్థితులను గమనిస్తే, పట్టణాల కంటే, పల్లెల్లోనే నిరక్షరాస్యత అధికంగా వుంది. నిరక్షరాస్యత అనేది అభివృద్ధికి ఆటకం. అందుకే, గ్రామీణాభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ, గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యతను నిర్మూలించే కార్యక్రమాల్లో సైనికుల్లా పనిచేస్తూ, అందుకోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో పాలుపంచుకుని నిరక్షరాస్యతను పారద్రోలాలి.

గ్రామాల్లో నిరక్షరాస్యతకు ప్రధాన కారణం పేదరికం… కడుపు నింపుకోవడం కోసం రోజంతా శ్రమించే ఆ పేదలకు, చదువు గురించి ఆలోచించే పరిస్థితులు ఉండవు.

ఒక వేళ చదువుకోవాలనుకున్నా, పాఠశాలలు ఉండవు. పాఠశాలలున్నా, తగినంత మంది ఉపాధ్యాయులు అందుబాటులో వుండరు. పాఠశాలలో అవసరమైన కనీస వసతులు వుండవు. కారణాలు ఏమైతేనేం, నిరక్షరాస్యత అనే రక్కసి మన గ్రామాల్లో విలయతాండవం చేస్తూనే వుందనేది పచ్చి నిజం.

ప్రస్తుతం, ప్రభుత్వం మరియు అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, పగలంతా జీవనోపాధి కోసం శ్రమిస్తున్న రైతులకు, ఇతర గ్రామీణ పేదలకు అనువుగా వుండేందుకు రాత్రి బడులు నిర్వహిస్తున్నారు. వయోజన విద్యా కేంద్రాలను నడుపుతున్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రజలు అంది పుచ్చుకుని, విద్యావంతులుగా అవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇక్కడ ఇంకో విషయం మనమంతా గమనించాలి.

ఒక పురుషుడు విద్యావంతుడైతే, తనకు మాత్రమే ఉపయోగం. అదే ఒక మహిళ విద్యావంతురాలైతే, ఆ కుటుంబం మొత్తానికి ఉపయోగకరం.

అందుకే పురుషులతో పాటు, ఎక్కువమంది నిరక్షరాస్యులైన మహిళలు కూడా, రాత్రి బడులకు వెళ్ళి విద్య నభ్యసించాలి.

గ్రామీణ ప్రాంతంలోని చదువుకున్న యువతీయువకులు, తాము స్వచ్ఛందంగా తమ ఇళ్ళల్లో, పొలాల్లో పనిచేస్తున్న పేదవారికి విద్యాదానం చేసి, సమాజ సేవలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి.

వనరులు సమృద్ధిగా ఉన్నవారు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి. వనరులు అంతంత మాత్రంగా వున్నవారు, కనీస అవసరాలకు అవసరమయే, ప్రాథమిక విద్యనైనా అభ్యసించాలి. అంటే వేలి ముద్ర వేస్తూ నిశానిగా పరిగణింపబడేవారు సంతకాలు చేయగలగాలి.

తను ఎంత డబ్బు ఇస్తున్నాడో, అంత డబ్బుకు రశీదు ఇస్తున్నారా… అని తెలుసుకోగలగాలి.

తనకు ఎంత డబ్బును అప్పుగా ఇస్తున్నారో, అంతే డబ్బుకు ఋణపత్రాలపై సంతకాలు చేయించుకుంటున్నారా లేదా అని తెలుసుకోగలగాలి.

అప్పుడే వారు ఇతరులు చేసే మోసాలను కనిపెట్టి, నష్టాల బారిన పడకుండా తమని తాము కాపాడుకోగలుగుతారు.

ఏ బస్టాండుకో, రైల్వే స్టేషన్‌కో వెళ్ళినప్పుడు, తమ ఊరెళ్ళే బస్సును, రైలును ఇతరులను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా, తామే బోర్డుల పైన వ్రాసి వున్న అక్షరాలను చదువుకుని తెలుసుకోవచ్చు.

ఇలా చెప్పుకుంటూ పోతే, అక్షరాస్యత వలన కలిగే ప్రయోజనాలు అనేకం.

మరి మీరంతా బాగా చదువుకోవాలి. మీతోటి వారిని కూడా చదివించాలి. విద్యార్జనతో మీ జీవితాలలో వెలుగును నింపుకోవాలి. గౌరవప్రదమైన జీవనం కొనసాగించాలి. తద్వారా మీ స్వఉన్నతికి, మరియు మీ మీ గ్రామాల అభ్యున్నతికి సహాయపడగలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను…” అని చెప్తూ నా ప్రసంగాన్ని ముగించాను.

‘నిరక్షరాస్యత నిర్మూలన’ కార్యక్రమంలో వేదిక పైన ఎడమ నుండి కుడికి… ప్రసంగిస్తున్న రచయిత, ఆంధ్రా బ్యాంకు రాజమండ్రి రీజినల్ మేనేజర్ శ్రీ. వై. భాస్కరరావు గారు, ప్రభుత్వ అధికారి. ఎదురుగా…ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామీణ ప్రాంతాల యువతీయువకులు.

అక్కడున్న వారంతా సంతోషంగా చప్పట్లు కొడుతుంటే… వారంతా… నా ఆలోచనలతో ఏకీభవించారని నాకర్థమయింది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here