[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]
128
[dropcap]1[/dropcap]991వ సంవత్సరం.
సాధారణంగా పచ్చిక మైదానాల్లో, కొండ ప్రాంతాలలో, బీడు భూముల్లో తిప్పుతూ మేకలను పెంచుతుంటారు. అవి తమ కందినటువంటి ఆకులు అలములు తింటూ కడుపులు నింపుకుంటాయి. వాస్తవంగా మేకలను మాంసం ఉత్పత్తి కోసం పెంచుతుంటారు.
అలా బయటి ప్రదేశాల్లో తిప్పుతూ పెంచడం కంటే, దడులు కట్టి, వాటి లోపలనే మేకలను ఉంచి గడ్డి గాదంతో పాటు, వివిధ పోషక పదార్థాలతో కూడిన ఆహారం అందిస్తే, అవి బలిష్టంగా పెరగడం వలన, మాంసం దిగుబడి అధికంగా వుంటుందని పరిశోధనల్లో నిరూపించబడింది. అందువల్ల మేకల పెంపకందారుల ఆదాయం ఊహించనంతగా పెరుగుతుందని అంచనా వేశారు శాస్త్రజ్ఞులు.
మేకలను పైన పేర్కొన్న విధంగా పెంచుతూ, అధిక ఆదాయాలను ఆర్జించేందుకు గ్రామాల్లో నివసించే మేకల పెంపకందారులలో అవగాహన పెంచేందుకు మా సంస్థలో ఒక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టాము.
వెంటనే ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, లాం ఫారం, గుంటూరు వారిని సంప్రదించాము. ఆ కేంద్రంలోని పశు సంవర్ధక శాఖ శాస్త్రజ్ఞుల సహకారంతో – ‘స్టాల్ ఫెడ్ గోట్ రేరింగ్’, ‘దడులలో మేకల పెంపకం’- అనే అంశంపై మూడు రోజుల శిక్షణా కార్యక్రమం మా సంస్థలో దిగ్విజయంగా నిర్వహించగలిగాము.
ఈ కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ రణదీప్ సూడాన్, ఐఎఎస్ గారు ప్రారంభిస్తూ – శిక్షణలో తెలుసుకున్న విషయాలతో శిక్షణలో పాల్గొన్న మేకల పెంపకందారులు, అధిక ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంకు రాజమండ్రి రీజినల్ మేనేజర్ శ్రీ వై. భాస్కరరావు గారు, కాకినాడ రీజినల్ మేనేజర్ శ్రీ లక్ష్మయ్య గారు, విశాఖపట్టణం జోనల్ మేనేజర్ శ్రీ జి. వెంకటేశ్వరరావు గారు కూడా పాల్గొనడం మాకెంతో సంతోషాన్ని కలగజేసింది.
మేకల పెంపకందారులలో మంచి అవగాహన పెంచడంతో పాటు, వారి ఆదాయాలను గణనీయంగా పెంచుకునేందుకు బాటలు వేయగలిగాము.
129
బ్యాంకుల జాతీయకరణ తరువాత, బ్యాంకుల పనితీరులో అనేక మౌలికమైన మార్పులు చోటు చేసుకున్నాయి.
వాటిల్లో ముఖ్యమైనవి:
పట్టణ ప్రాంతాలతో పాటు, గ్రామీణ ప్రాంతాలలో కూడా బ్యాంకు శాఖలు తెరవడం. లాభాలకే ప్రాధాన్యతనిస్తూ, పట్టణ ప్రాంతాల్లోని బడా వ్యాపారస్థులకు, పారిశ్రామికవేత్తలకు అధిక వడ్డీలపై అత్యధికంగా ఋణాలను మంజూరు చేసే బ్యాంకులు – తక్కువ వడ్డీలపై ప్రాధాన్యతా రంగాలకు కూడా విరివిగా ఋణాలను ఇస్తూ గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు నందించడం.
ఈ తరుణంలో, బ్యాంకుల పనితీరును మరింతగా మెరుగుపరిచేందుకు పరిశోధనలు చేయుటకు గాను, ఆంధ్రా బ్యాంకు ప్రధాన కార్యాలయం, హైదరాబాద్ వారు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరును సంప్రదించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అందుకు ఆమోదం తెలిపిన మీదట, పరిశోధనలు చేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులను విరాళంగా సమకూర్చింది ఆంధ్రా బ్యాంకు.
ఆ పరిశోధనలలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యుల బృందం మా సంస్థను సందర్శించారు. గ్రామీణాభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం వివిధ రంగాలలో, మేము ఏర్పాటు చేస్తున్న శిక్షణా కార్యక్రమాల విధి విధానాలను క్షుణ్ణంగా సమీక్షించారు. మా సంస్థ శిక్షణార్థుల సౌకర్యార్థం చేస్తున్న ఏర్పాట్లను, శిక్షణా తరగతుల నిర్వహణను, నిశితంగా పరిశీలించిన పిమ్మట, వాటన్నింటిపై వారి సంతృప్తిని తెలియజేశారు. మా కార్యక్రమాలు సరైన మార్గంలోనే, సజావుగా సాగుతున్నాయని తెలుపుతూ, మరికొన్ని మంచి సూచనలను సలహాలను మాకందించింది ఆ ఆచార్యుల బృందం.
ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరు వారు, వారి పరిశోధనల నిమిత్తం, మా సంస్థను కూడా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారికి ఘనంగా వీడ్కోలు పలికాము.
130
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఎ.) కాకినాడ మరియు తూర్పు గోదావరి జిల్లాకు లీడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రా బ్యాంకు కాకినాడ – సంయుక్తంగా రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం (ఐ.ఆర్.డి.పి.) వర్కుషాపుకు, ఈసారి మా సంస్థ వేదిక కావడం మాకెంతో గర్వకారణమైంది. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ రణదీప్ సూడాన్, ఐఎఎస్ గారు, రాజమండ్రి రీజినల్ మేనేజర్ శ్రీ వై. భాస్కరరావు గారు, కాకినాడ రీజినల్ మేనేజర్ శ్రీ లక్ష్మయ్య గారు, గోదావరి గ్రామీణ బ్యాంకు ఛైర్మన్ శ్రీ ఉపేందర్ రెడ్డి గారు, విశాఖపట్టణం జోనల్ మేనేజర్ శ్రీ జి. వెంకటేశ్వరరావు గారు, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు, జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో ‘సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం’ ద్వారా వివిధ బ్యాంకులు అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమీక్షించారు. ఆయా కార్యక్రమాల అమలు తీరులో బయటపడుతున్న లోటుపాట్లను తెలుసుకుని, వాటిని సరిదిద్ధుకునే మార్గాలను అన్వేషించారు. తద్వారా ప్రతిష్ఠాత్మకమైన సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాన్ని, పకడ్బందీగా అమలుపరుస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ, వారి ఆర్థికాభివృద్ధి కొరకు అవసరమైన పథక రచన చేయడం జరిగింది.
అటు ప్రభుత్వ అధికారులు, ఇటు బ్యాంకు అధికారులలో సమన్వయ లోపం లేకుండా, అందరూ కలిసికట్టుగా ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఇలాంటి జిల్లా స్థాయి కార్యక్రమాలు సాధారణంగా జిల్లా కేంద్రమైన కాకినాడలో జరుగుతుంటాయి. అలాంటిది, ఈసారి ఈ కార్యక్రమాన్ని మా సంస్థలో నిర్వహించడం, మా సంస్థ స్థాయిని పెంచిందని చెప్పుకోవచ్చు.
ఈ రెండు రోజుల కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేందుకు, మా సంస్థలో మేము చేసిన ఏర్పాట్లను ఎంతగానో కొనియాడారు… సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ మరియు బ్యాంకు అధికారులు.
131
గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు శాఖలను తెరిచి, బ్యాంకింగ్ సౌకర్యాలను గ్రామీణ ప్రాంత ప్రజల ముంగిళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్ళాలనే లక్ష్యంతో, మన దేశంలో ‘ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు’ వెలుగులోకి వచ్చాయి. ఆ బ్యాంకుల శాఖల ద్వారా రైతులకు, వ్యవసాయ పెట్టుబడులకు, ఇతరులకు చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు, చిరు వ్యాపారాలు చేసుకోడానికి, చేతి పని వృత్తుల వారికి – వారికి అవసరమయే సామగ్రి, ఇతర పనిముట్లు కొనుగోలుకు విరివిగా అప్పులు ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం వాణిజ్య బ్యాంకులు వెళ్ళలేని మారుమూల గ్రామాలకు సైతం గ్రామీణ బ్యాంకు శాఖలు విస్తరించబడ్డాయి. కేవలం లాభార్జనే ప్రాతిపదికగా తీసుకోకుండా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, అక్కడ నివసించే ప్రజల ఆర్థిక అభ్యున్నతికి, ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు దోహదపడుతున్నాయి. ఆయా జిల్లాల్లో లీడ్ బ్యాంకులుగా వ్యవహరిస్తున్న జాతీయ బ్యాంకులు, ఆ జిల్లాలలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ప్రతిపాదించి, వాటి నిర్వహణ బాధ్యతను కూడా ఆ వాణిజ్య బ్యాంకులే చేపడుతాయి. వాణిజ్య బ్యాంకులు తమ ఉన్నతాధికారులనే, ఆ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు ఛైర్మన్‍లుగా డెప్యుటేషన్ పద్ధతిపై నియమిస్తాయి.
ఆ నేపథ్యంలో, ఆంధ్రా బ్యాంకు లీడ్ బ్యాంకుగా వ్యవహరిస్తున్న జిల్లాలలో, మూడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్థాపించింది.
మొదటిది, ఒరిస్సా రాష్ట్రంలోని ‘రుషికుల్య గ్రామ్య బ్యాంక్’. గంజాం మరియు గజపతి జిల్లాలు ఆ బ్యాంకు పరిధిలో చేర్చబడ్డాయి. ఆ బ్యాంకు ప్రధాన కార్యాలయం బరంపురంలో వుంది.
రెండోది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ‘గోదావరి గ్రామీణ బ్యాంక్’. ఆ బ్యాంకు, రాజమండ్రి ప్రధాన కార్యాలయంగా, ఉభయ గోదావరి జిల్లాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
ఇక మూడోది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ‘చైతన్య గ్రామీణ బ్యాంక్’. తెనాలి కేంద్ర కార్యాలయంగా, ఆ బ్యాంకు, గుంటూరు జిల్లా వ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించింది.
సుదీర్ఘ అనుభవం కలిగిన గ్రామీణాభివృద్ధి అధికారులను ఆ మూడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు ఛైర్మన్‍లుగా నియమించింది ఆంధ్రా బ్యాంకు.
ఈసారి ఆ ముగ్గురు ఛైర్మన్‍లు, తమ సమావేశాన్ని నిర్వహించుకునేందుకు, మా సంస్థను ఎన్నుకోవడం, మాకెంతో ఆనందాన్ని కలిగించింది.
ఆ రోజు, ఆ ముగ్గుర్ని మేము సాదరంగా మా సంస్థకి ఆహ్వానించాము. వారి సమావేశం సజావుగా జరిగేందుకు కావల్సిన ఏర్పాట్లన్నిటిని, నేను, మా సిబ్బంది దగ్గరుండి చూసుకున్నాము.
వారు ముందుగా తమ అంతర్గత సమావేశము నిర్వహించుకున్నారు. తమ బ్యాంకుల పనితీరును సమీక్షించుకుని, మరింత పురోగతి సాధించటానికి, ఆంధ్రా బ్యాంకు నుండి, జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నుండి, రిజర్వ్ బ్యాంకు నుండి తమకు కావలసిన మరింత సహకారం గురించి చర్చించుకుని, కొన్ని ప్రతిపాదనలతో సమగ్ర నివేదికను రూపొందించారు.
తదుపరి, ఆ ముగ్గురు ఛైర్మన్‍లు, నాతో, మా సిబ్బందితో సమావేశమై, మా సంస్థ గురించి, గ్రామీణాభివృద్ధి కోసం మా సంస్థ నిర్వహించే శిక్షణా కార్యక్రమాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు.
అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న సమావేశానికి మా సంస్థ ఒక వేదిక కావడం ఎంతో ముదావహం.
132
ఈ సంవత్సరంలో వివిధ సమయాల్లో ఆంధ్రా బ్యాంకు, ప్రధాన కార్యాలయం, హైదరాబాద్ నుండి ఇద్దరు జనరల్ మేనేజర్లు మా సంస్థను సందర్శించారు.
మొదటిగా… జనరల్ మేనేజర్ శ్రీ. ఎ.ఆర్. మూర్తి గారు, తమ రాజమండ్రి రీజియన్ పర్యటనలో భాగంగా మా సంస్థను సందర్శించి, సంస్థ చేపడుతున్న శిక్షణా కార్యక్రమాలను సమీక్షించి తమ సంతృప్తిని వెలిబుచ్చి, నన్ను మా సిబ్బందిని ప్రశంసించారు. ఆ రోజు జనరల్ మేనేజర్ గారితో పాటు, రాజమండ్రి రీజినల్ మేనేజర్ శ్రీ వై. భాస్కరరావు గారు మరియు రాజమండ్రి మెయిన్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ నూకరాజు గారు మా సంస్థకు వచ్చారు.
ఆ తరువాత… జనరల్ మేనేజర్ శ్రీ యమ్. గోపాలకృష్ణయ్య గారు, తమ విశాఖపట్టణం జోన్ మరియు రాజమండ్రి రీజియన్ పర్యటనలో భాగంగా మా సంస్థను కూడా సందర్శించారు. సంస్థ చేపడుతున్న వివిధ శిక్షణా కార్యక్రమాలను సమీక్షించిన తరువాత… ఆయా కార్యక్రమాలలో శిక్షణ పొందినవారినందరినీ వ్యక్తిగతంగా కలిసి, శిక్షణ ద్వారా తాము పొందిన ఉపయోగాలపై ఒక సర్వే నిర్వహించి, తద్వారా తెలుసుకున్న విషయాలతో ఒక నివేదికను తయారు చేసి రీజినల్ మేనేజర్ గారి ద్వారా ప్రధాన కార్యాలయానికి పంపవలసిందిగా నన్ను ఆదేశించారు.
ఆ రోజు మా సంస్థలోనే రాజమండ్రి రీజియన్ లోని వివిధ శాఖల మేనేజర్ల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి జనరల్ మేనేజర్ శ్రీ యమ్. గోపాలకృష్ణయ్య గారితో పాటు రాజమండ్రి రీజినల్ మేనేజర్ శ్రీ వై. భాస్కరరావు గారు మరియు విశాఖపట్టణం జోనల్ మేనేజర్ శ్రీ జి. వెంకటేశ్వరరావు గారు కూడా హాజరయ్యారు. వివిధ శాఖల పనితీరును, వ్యాపార లావాదేవీలను సమీక్షిస్తూ, ఆయా రంగాలలో నిర్దేశించబడిన లక్ష్యాలను చేరుకోవడం గురించి కూడా చర్చించారు.
ఆ సమావేశం సజావుగా సాగడానికి మా సంస్థ చేసిన ఏర్పాట్లను చూసి, అందరూ తమ సంతోషాన్ని బాహటంగానే వెలిబుచ్చారు.
(మళ్ళీ కలుద్దాం)