Site icon Sanchika

నా జీవన గమనంలో…!-6

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

[dropcap]1[/dropcap]975 వ సంవత్సరం. గుంటూరు కొరిటెపాడు సెంటర్‍లో వున్న ఎ. ఇ. ఐ. యల్. చర్చి కాంపౌండ్‌లో వుంది రీజినల్ ఆఫీసు. గ్రౌండ్ ఫ్లోర్‍లో కొరిటెపాడు బ్రాంచి, పై ఫ్లోర్‍లో రీజినల్ ఆఫీసు. అనుకున్నట్లే ఆ రోజు జాయినయ్యాను. ఒక పెద్ద హాల్లో సిబ్బంది, మరో చిన్న హాల్లో రీజినల్ మానేజర్ క్యాబిన్, పక్కనే సహాయకులు ఉన్నారు.

అందర్నీ పరిచయం చేసుకున్నాను. నా పై అధికారి శ్రీనివాసరావు గారు – గ్రామీణ ఋణాధికారి, నా విధుల గురించి, నా బాధ్యతల గురించి వివరించారు. ఆయన ప్రభుత్వ వ్యవసాయ శాఖలో ఉన్నత పదవిలో ఉంటూ, ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆంధ్రా బ్యాంకులో చేరారు. చాలా అనుభవజ్ఞులు. వారి అనుభవం ముందు ముందు నాకెంతో ఉపయోగపడుతుందనే నమ్మకం కుదిరింది. ఆ తరువాత రోజుల్లో, వారితో పాటు కొన్ని బ్రాంచీలు తిరిగాను. కొన్ని గ్రామాలకు వెళ్ళి, ముఖ్యంగా మా బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయం పొందిన క్షేత్రాలను, కోళ్ళ పరిశ్రమ, పాడి పరిశ్రమ యూనిట్లను చూశాను. అప్పుడు వారు రైతులతో మాట్లాడే విధానం, ఋణగ్రహీతల సమస్యలను ఓపికగా వినడం, సరైన పరిష్కారాలు సూచించడం, నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆ క్రమంలో నేనెన్నో విషయాలను అర్థం చేసుకుని, నేర్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. ఆఫీసులో నా విధి నిర్వహణలో అతి కొద్ది రోజుల్లోనే అందరి మన్ననలను చూరగొనగలిగాను.

***

రోజులు సాఫీగా గడుస్తున్నాయ్. కాలక్రమేణా నాకు మంచి స్నేహితులు దొరికారు. స్టేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‍సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి ఒక్కొక్కరు… హిందూ కాలేజ్ లెక్చరర్ ఒకరు… మొత్తం ఐదుగురు. నాతో కలిపితే ఆరుగురురం.

Sitting from L to R: Sarvasri Vararuchi (Lecturer , Hindu College),VenkateswaraRao(IOB),Prasad (SBI),
Standing from L to R: Sarvasri Bapuji(CBI),Mahesh (BOB),Sambasivarao (AB)

మేం ఆరుగురం రోజూ సాయంత్రం ఆరు గంటల కల్లా నాజ్ సెంటర్‌లో కలుసుకుని, కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని, ప్రక్కనే ఉన్న టీ స్టాల్‍లో, వేడి వేడి మసాలా టీ త్రాగి, రాత్రి ఏడు గంటల కల్లా ఇళ్ళకు చేరుకునేవాళ్ళం. అప్పుడప్పుడు పార్టీలు కూడా చేసుకునేవాళ్ళం. ఏ రోజైనా సాయంత్రం ఆరుగంటలకల్లా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా, మాలో ఎవరైనా రాకపోతే, మిగతా వాళ్ళందరం కలిసి రాని వారింటికి వెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కోవడం పరిపాటి. అలా మల్లెపందిరిలా పెనవేసుకుంది మా స్నేహం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version