నా జీవన గమనంలో…!-9

65
2

[box type=’note’ fontsize=’16’] జీవన గమనంలో ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగపర్వంలో తాను చవిచూసిన సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలను… ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటూ సంచిక పాఠకులకు అందిస్తున్నారు తోట సాంబశివరావు. [/box]

[dropcap]ఆ[/dropcap] రోజు నాకో ఆలోచన వచ్చింది. నాకు అక్కౌంట్స్‌లో రోజూ ట్యూషన్ చెప్పడమే కాకుండా, నన్నెంతో ప్రోత్సహించిన మహేష్‌కి ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఎలా వుంటుంది?… బాగానే వుంటుంది… కాని, …మహేష్ మనస్తత్వం నాకు తెలుసు. నేనలా చేస్తే… నేను… స్నేహ ధర్మాన్నే అవమానపరుస్తున్నానని అనుకుని… చాలా బాధపడతాడు మహేష్… మరెలా? చూద్దాం… ఏదో ఒక అవకాశం రాకపోతుందా!!

***

1976 సంవత్సరం. ఒక రోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ నుండి నాకో కవరు వచ్చింది. ఆతృతగా తెరిచి చూశాను. ఓ శుభవార్త!…

‘అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఆఫీసర్’గా గజిటెడ్ హోదాలో నాకు పోస్టింగ్ ఇచ్చారు. వారం రోజుల లోపు ఏలూరులో జాయిన్ అవాలట!

ఆ జాబ్ ఎప్పుడో ఒకప్పుడు గ్రాడ్యుయేషన్ సీనియారిటీలో వస్తుందని నాకు తెలుసు గాని, ఈ బ్యాంక్ జాబ్‍లో పూర్తిగా నిమగ్నమై వున్నానేమో… ఆ ప్రభుత్వ ఉద్యోగం గురించి దాదాపు మరిచిపోయాను.

ఇప్పుడేం చేయాలి?

ప్రస్తుతం నా జీతం నెలకు 560/- రూపాయలు. ఆ ప్రభుత్వ ఉద్యోగంలో చేరితే వచ్చే జీతం నెలకు 740/- రూపాయలు.

ఇప్పుడు నేను ఓ చేస్తుంది… ఓ గుమస్తా ఉద్యోగం.

నాకు వచ్చింది… ఓ గెజిటేడ్ ఆఫీసరుగా ప్రభుత్వోద్యోగం.

ఆలోచించగా, ఆలోచించగా ఇదో పెద్ద సమస్యగా అనిపిస్తుంది. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధం. ఇక్కడే బ్యాంకు ఉద్యోగంలో కొనసాగాలా? లేదా… ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలా?

ఆ రోజంతా నా మనసు అలజడికి, ఆందోళనకి లోనైంది. బ్యాంకు పనిలో ఏకాగ్రత కుదరడం లేదు.

సాయంత్రానికి స్నేహితులను కలిసి, ఈ విషయంపైనే చర్చించాను. కొందరు బ్యాంకులోనే కొనసాగమని, కొందరు ప్రభుత్వ ఉద్యోగంలో చేరమని, ఎవరికి తోచిన విధంగా వారు సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు నేనొక నిర్ణయం తీసుకొనేందుకు ఉపకరించలేదు.

రాత్రికి ఇంటికి చేరుకుని, నా శ్రీమతితో కూడా చాలా సేపు మాట్లాడాను. తను మాత్రం ఏం చెప్పగలదు?… అందుకే “మీరు ఏది మంచిదనుకుంటే అది చేయండి!” అని మాత్రమే చెప్పగలిగింది.

రాత్రి పొద్దుపోయేవరకు ఆ విషయాలపైనే ఆలోచనలు నడిచాయి. చివరిగా ఓ నిర్ణయానికి వచ్చాను. మా ఆఫీసులో నా పై అధికారి శ్రీనివాసరావు గారితో, ఈ విషయం మాట్లాడాలనుకున్నాను. వారికి అటు ప్రభుత్వ వ్యవసాయ శాఖలో, ఇటు బ్యాంకులో, రెండిట్లో అనుభవం ఉంది. ఆ అనుభవాలను పురస్కరించుకుని, వారైతేనే నాకు సరైన సలహా ఇవ్వగలరనిపించింది. అంతులేని ఆలోచనలకు ఫుల్‍స్టాప్ పెట్టి నిద్రలోకి జారుకున్నాను.

***

మరుసటి రోజు ఉదయం ఆఫీసుకు చేరుకోగానే, నా పై అధికారి శ్రీనివాసరావు గారితో, నా మనసును తొలిచివేస్తున్న సమస్యపై సుదీర్ఘంగా చర్చించాను. విషయమంతా పరిపూర్ణంగా అర్థం చేసుకున్న శ్రీనివాసరావు గారు నింపాదిగా చెప్పడం మొదలుపెట్టారు.

“నువ్వు చెప్పినట్లుగా నేను ప్రభుత్వ ఉద్యోగాన్ని, బ్యాంకు ఉద్యోగాన్ని, రెంటినీ చూశాను. ఇక నీ విషయానికొస్తే, నువ్వీ ఆఫీసులో చేరినప్పటి నుండి గమనిస్తూనే వున్నాను. నువ్వు గాజు లాంటివాడివి. నీది చాలా సున్నితమైన మనస్తత్వం. గట్టిగా ఒక మాట ఎవర్నీ అనలేవు. ఎవరైనా నిన్ను ఒక చిన్నమాట అన్నా తట్టుకోలేవు. నీలాంటివారు ప్రభుత్వ ఉద్యోగంలో నిలదొక్కుకుని రాణించలేరు. అక్కడి ఒత్తిళ్ళకు, ఒడిదుడుకులకు నువ్వు తట్టుకోలేవు. ఈ బ్యాంకు ఉద్యోగమే నీకు సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే మన బ్యాంకులో నీకు మంచి పేరుంది. అది నీ శ్రమకు, తెలివితేటలకు, అంకితభావానికి ప్రతిఫలం. ఇలాంటి మంచి పేరు తెచ్చుకోవడం, ప్రభుత్వ ఉద్యోగంలో చాలా కష్టం. ఎంతో సమయం కూడా పడుతుంది.

పైగా నువ్వు సి.ఎ.ఐ.ఐ.బి. పార్ట్ 1 కూడా పాసయ్యావు. నీ పట్టుదల చూస్తుంటే పార్టు 2 కూడా తొందర్లోనే పాసవుతావనిపిస్తుంది. దాని వల్ల నీకు మన బ్యాంకులోనే ప్రమోషన్ కూడా త్వరలోనే తప్పక వస్తుంది.

వీటన్నిటి దృష్ట్యా, నువ్వు బ్యాంకు ఉద్యోగంలోనే కొనసాగడం సమంజసం. ఉత్తమం కూడా! ఇక పై నీ ఇష్టం మరి!” – అలా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు శ్రీనివాసరావు గారు.

అది నాకు ఓ సరైన నిర్ణయం తీసుకునేందుకు దోహదపడింది. అందుకుగాను వారికి నా ధన్యవాదాలు తెలియజేశాను.

ఇక పై నో సెకండ్ థాట్!

బ్యాంకులోనే కంటిన్యూ అవుదామని తేల్చేశాను. సమస్య పరిష్కారమైంది. మనసు కుదుట పడింది.

వెంటనే ప్రభుత్వ వ్యవసాయ శాఖకు, నేను వాళ్ళు నాకు ఇవ్వజూపిన ఉద్యోగంలో చేరలేకపోతున్నట్టు ఉత్తరం పంపాను. ఎందుకంటే, వెయిటింగ్ లిస్ట్‌లో వున్న మరొకరికి ఉద్యోగం వెంటనే దొరుకుతుంది కదా!

***

ఇకపై ఆంధ్రా బ్యాంకుతోనే నా పయనం అని నిర్ధారించుకున్న తరువాత, త్వరత్వరగా పదోన్నతులను సంపాదించి, ఉన్నత పదవులను అందుకోడానికి, తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకునేందుకు సమాయత్తమయ్యాను.

మొదటిగా: ఉత్తర ప్రత్యుత్తరాలను జరపడంలో, డ్రాఫ్టింగ్ స్కిల్స్ పెంచుకునేందుకు, కార్పోరేట్ బిజినెస్ డ్రాఫ్టింగ్స్‌కు సంబంధించిన పుస్తకాలు కొని చదవడం మొదలుపెట్టాను. ఆంధ్రా బ్యాంకు సర్క్యులర్‌లను, రిజర్వ్ బ్యాంకు సర్క్యులర్‍లను క్షుణ్ణంగా చదవడం ప్రారంభించాను.

రెండోది: కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునేందుకు, సంభాషణా చాతుర్యము, గ్రూప్ డిస్కషన్స్‌కు సంబంధించిన పుస్తకాలను కొని చదవడం ఆరంభించాను.

మూడోది: వేదిక పై నుండి సభలో అటు తెలుగులో, ఇటు ఇంగ్లీషు భాషల్లో, అనర్గళంగా, సభికుల మన్ననలను పొందే విధంగా మాట్లాడేందుకు పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. మంచి వక్తలుగా పేరొందినవారు వివిధ సభల్లో మాట్లాడే విధానాన్ని, నిశితంగా పరిశీలించడం మొదలెట్టాను.

నాలుగోది: బ్యాంకుకు సంబంధించిన మాన్యువల్స్‌ను ఒక్కటొక్కటిగా చదవడం ఆరంభించాను. తద్వారా బ్యాంకుకు సంబంధించిన అనేక విధానపరమైన అంశాలు, రూల్స్, రెగ్యులేషన్స్‌ను లోతుగా తెలుసుకోగలుగుతున్నాను.

ఐదోది: మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ప్రస్తుత పరిస్థితులపై అవగాహన పెంచుకునేందుకు, తెలుగు, ఆంగ్ల దినపత్రికలను చదవడం ఓ అలవాటుగా మార్చుకున్నాను.

బంధుత్వ సహకారం, రాజకీయ పలుకుబడి లాంటివి ఏమీ లేని నేను, వృద్ధి లోకి రావడానికి స్వతహాగా కష్టపడటమే ఏకైక మార్గం అని నమ్మాను. అందుకే నన్ను నేను తయారు చేసుకోవడం, తోటి వుద్యోగులతో, పై అధికారులతో సత్సంబంధాలను కలిగి యుండటం, ఎంతో అవసరమనుకుని, ఆ దిశగా అడుగులు వేయడం ప్రారంభించాను. సి.ఎ.ఐ.ఐ.బి. పార్ట్ 2లో వున్న మిగతా రెండు పేపర్లను కూడా వ్రాసేందుకు ప్రిపరేషన్ కూడా మొదలెట్టాను.

ఆ విధంగా నా అంతట నేనే నాకంటూ కొన్ని లక్ష్యాలను ఏర్పరుచుకుని, ఆ లక్ష్యాలను అందుకునేందుకు, పథకాలను తయారు చేసుకుని, ఏకాగ్రతతో ముందుకు సాగుతున్నాను.

అదే సమయంలో మా రీజనల్ మేనేజరుగారు ఉద్యోగ విరమణ చేశారు. వారి స్థానంలో బాగా చదువుకున్న, యువకులు, ఉత్సాహవంతులు శ్రీ యమ్. గోపాలకృష్ణయ్యగారు, కొత్త రీజనల్ మేనేజర్‍గా జాయిన్ అయ్యారు.

శ్రీ యమ్. గోపాలకృష్ణయ్యగారు

నా పై అధికారి శ్రీనివాసరావు గారు, నన్ను కొత్తగా చేరిన రీజనల్ మేనేజర్ గారికి పరిచయం చేస్తూ, నాలోని విశేషతలను కూడా చెప్పారు. అతి కొద్ది రోజుల్లోనే, రీజనల్ మేనేజర్ గారు నా విధి నిర్వహణను, క్రమశిక్షణను, పట్టదలను గమనించి, నన్నొక ఆత్మీయుడిగా చూడడం నేను గమనించాను. వారికి నాపై చాలా మంచి అభిప్రాయం ఏర్పడినట్లు నాకు అవగతమైంది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here