నా జీవితంలో లలితా సహస్ర నామ స్తోత్రం-1

0
2

[dropcap]శ్రీ[/dropcap]మాత్రే నమః

అంకురార్పణ:

మానవ జీవితంలో భక్తి భావనలు, దైవాన్ని కోలుచుకోవాలి అనే తపన పూర్వ జన్మ సుకృతం మరియు మన తల్లీ తండ్రుల వల్ల కలుగుతుంది.

నా జీవితంలో బాల్యం నుండి మా తండ్రి గారే ఆధ్యాత్మిక గురువై హనుమాన్ చాలీసా నా 5వ ఏట నేర్పారు. తరువాత బాల రామాయణం, రామ రక్ష స్తోత్రం, శివ ద్వాదశ నామ స్తోత్రం నేర్పారు. రామాలయం, శివాలయాలకు వెళ్ళినప్పుడు అవి చదువుకుంటూ దేముళ్లకు దండం పెట్టుకునే వాడిని.

హైస్కూల్ లోకి వచ్చాక మా తెలుగు ఉపాధ్యాయిని శ్రీమతి కృష్ణవేణి గారు ప్రతి సంవత్సరం జరిగే భగవద్గీత పోటీల కోసం భగవద్గీత నేర్పారు. ఆలా 3 అధ్యాయాలు కంఠతా వచ్చాయి. రెండు సార్లు బహుమతులు కూడ వచ్చాయి.

ఇంటర్ అయ్యాక మా ఇంటి పురోహితులు శ్రీ సత్యనారాయణ గారి వద్ద శ్రీ సూక్తం, పురుష సూక్తం, నమకం, చమకం రెండు నెలలు పాటు అనుస్వరంతో నేర్చుకోవడం జరిగింది మా నాన్నగారి అభీష్టం మేరకు.

డిగ్రీ లోకి వచ్చాక నాన్నగారు విష్ణు సహస్ర నామ స్తోత్రం ఖాళీ సమయాల్లో నేర్పేవారు.

ఉద్యోగంలో చేరాక ఇవే ప్రార్థనలుగా చేసుకుంటుండేవాడిని బ్రహ్మచారిగా ఉన్నంత కాలం.

గుళ్ళలోకి వెళ్ళినప్పుడు దైవ ప్రార్థన శ్లోకాలు చదువుకుంటూ ఉండేవాడిని.

ఉపనయనం అయ్యాక ఇంట్లో ఉన్నంత కాలం గాయత్రి జపం చేయనిదే బయటకు వెళ్ళనిచ్చే వారు కాదు.

ఆయన పూజ చేసాక కూర్చుని చేయమనే వారు, పూజ మందిరం దగ్గర లేదా తులసి కోట దగ్గర.

వివాహం అయ్యాక ఇంట్లో మందిరం ఏర్పాటు చేసుకుని నిత్య పూజలు రోజుకి ఒకసారి తప్పకుండా, వీలు కుదిరితే రెండు సార్లు చేయడం అలవాటుగా మారింది. దీపం పెట్టి పూజలు చేసి అప్పుడు బయటకి అడుగు పెట్టే వాడిని.

ఉద్యోగ రీత్యా కాసుల వేటలో ఇండియాలో చేస్తున్న ఉద్యోగంలో ఆర్థిక బాధలు తట్టుకోలేక కడుపుతో ఉన్న భార్యని, 3 ఏళ్ళ కొడుకుని వదిలి ముస్లిం దేశం అయిన దుబాయ్‌కి రావడం జరిగింది. నాతో మొదటిసారి తెచ్చుకున్న పూజ సామాగ్రి వత్తులు, ఇత్తడి కుందు, ఉద్దరణి, పంచ పాత్ర, సిందూరం (ఆంజనేయ పూజ లోది నాన్న ఇచ్చింది), కుంకుమ (అమ్మ ఇచ్చింది), వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ మా స్నేహిత కుటుంబం నన్ను విమానం హైదరాబాద్‌లో ఎక్కించడానికి వచ్చినప్పుడు బిర్లా మందిరంలో షాప్‌లో కొని ఇచ్చింది, స్తోత్రాల పుస్తకాలు.

దుబాయ్‌లో అడుగు పెట్టగానే నాకు ఇచ్చిన రూమ్‌లో ఓ మూల చిన్న పీట మీద ఫోటో పెట్టి దీపం పెట్టి ప్రార్థనలు చేసుకునేవాడిని. దేముళ్ళు పెట్టుకోవడానికి ఓ బల్ల నేను పని చేసే మిల్లులో వడ్రంగి మేస్త్రితో చేయించి తెచ్చుకోవడం జరిగింది. మా వసతి గృహం 2 పడక గదుల గృహం, 4 మంది నివాసం ఉండాలి. నాతో పాటు ఉన్న వారు ఒక తెలుగు వారు, ఇద్దరు మలయాళం దేశస్థులు. ఒకాయన మా మిల్ ముఖ్య అధికారి వ్యక్తిగత కార్యదర్శి కావడాన నా పూజ పీఠం మిల్లు నుండి ఏ ఆటంకం లేకుండా తేవడానికి సులువు అయ్యింది.

దుబాయ్ లో రచయిత పూజ చేసుకున్న మందిరం

నాకు తోచిన రీతిలో నిత్యం పూజ చేసి దీపం నేతి దీపంగా ఆస్ట్రేలియా ఆవు నెయ్యి కేజీ డబ్బా నెల జీతం రాగానే కొని ఉంచుకునే వాడిని. ప్రసాదాలుగా బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు ఉంచేవాడిని ఒక పూట. రెండో పూట అరటిపండు లేదా ఆపిల్ పండు ఉంచే వాడిని. అగరు వత్తి వెలిగించరాదు ఎందుకంటే అవి ఏసీ గృహాలు మరియు ప్రతి రూమ్‌లో ఫైర్ డిటెక్టర్ సాధనం అమర్చి ఉండేది వ్యక్తిగత మరియు భవనం రక్షణ దృష్ట్యా.

కూర్చోడానికి ముందు చిన్న ప్లైవుడ్ చెక్క మీద కూర్చుని తదుపరి నమాజ్ చేయడానికి ఉపయోగించే వస్త్రం మీద కూర్చుని పూజ చేసే వాడిని.

1988వ సంవత్సరం జూన్ నెలలో దుబాయ్ లో అడుగు పెట్టడం జరిగింది.

తరువాత తెలుగు మిత్రులు కుటుంబాల పరిచయం కోసం ఆసక్తిగా ఉన్నవేళ “‘రసమయి ఆంధ్ర అసోసియేషన్’ సభ్యులుగా చేరాలి అనుకుంటే ఈ నెంబర్ వారిని సంప్రదించండి.” అని ఓ దైనిక దిన పత్రిక గురువారం నాడు ప్రకటన రాగా వారికి ఫోన్ చేసి సభ్యులుగా చేరడానికి ఆసక్తిగా ఉంది అని చెప్పడం వారు ఇంటికి ఆహ్వానం ఇవ్వడం తరువాత వారింటికి వెళ్లి పరిచయం చేసుకోవడం జరిగింది.

“త్వరలో ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఓ బోట్‌లో, ఉదయం నుండి సాయంత్రం వరకు. మీరు రావాలి” అని ఆహ్వానించారు. ఆ సమావేశానికి ఎంతో ఆసక్తిగా వెళ్లడం జరిగింది. తెలుగు కుటుంబాలతో పరిచయం అవుతుంది. వారితో అప్పుడప్పుడు కాలం గడిపితే పెళ్ళాం, పిల్లవాడిని వదిలేసి వారి గురించి తలచుకుంటూ బాధలు పడటం నుండి కొంత ఉపశమనం కలుగుతుంది అనే ప్రధాన ఉద్దేశంతో.

అక్కడ అందరిని వారి వారి పరిచయాలు చేసుకొమ్మన్నారు. ఆలా నా పరిచయం చేసుకుని నా వివరాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఒక కుటుంబం లోని మహిళ శ్రీమతి పద్మ గారు నన్ను వారింటికి రమ్మని ఆహ్వానించడం జరిగింది.

ఆవిడతో పరిచయంతో నా జీవితంలో లలితా పరా భట్టారిక ప్రవేశం జరిగింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here