నా జీవితంలో లలితా సహస్ర నామ స్తోత్రం-2

0
2

[dropcap]శ్రీ[/dropcap] మాత్రే నమః.

శ్రీమతి పద్మ గారి ఆహ్వానం అందుకున్న నేను వారింటికి వెళ్లి కలవాలి అనే ఉత్సహంతో ఓ శనివారం సాయంత్రం దుబాయ్‌లో గుళ్ళ దర్శనం అయ్యాక వారు చెప్పిన అడ్రస్‌కి వెళ్లి వారింటి తలుపు తట్టాను.

ఆవిడ వచ్చి నన్ను ఆహ్వానించి వారి డ్రాయింగ్ రూమ్‌లో కూర్చోబెట్టి వారి శ్రీవారిని పిలిచి నా పరిచయం చేసారు. వారిద్దరూ నా వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారు అమలాపురం వాస్తవ్యులు అవ్వడంతో రాజమండ్రి వాడిని అయిన నా మీద కొద్దిగా ఇష్టం కలిగింది. నా దినచర్య అడిగి తెలుసుకున్నారు. మా నాన్న గారి గురించి చెప్పి వారే నా ఆధ్యాత్మిక గురువుగారు అని చెప్పడం జరిగింది. వారు వారి మందిరం చూపించారు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని అన్నారు.

మళ్ళీ ఓ నెల తరువాత వారిని కలవడం జరిగింది.

అప్పుడు మాటల్లో నేను నా భార్య, బిడ్డని వదిలేసి రావడానికి గల ఆర్థిక పరిస్థితులు వివరించి వారు తరచూ గుర్తుకు వస్తున్నారు, చాలా బాధ కలుగుతుంది, వారిని వదిలి రావడమనే తప్పు చేసానేమో అని బాధ పడ్డాను. అప్పుడు ఆవిడ “ఎక్కువ బాధ పడినందువల్ల ప్రయోజనం ఉండదు. దాని కంటే అన్ని చూసే అమ్మ ని ‘లలితా సహస్ర నామ స్తోత్రం’ ద్వారా ప్రార్థన చేసుకోండి, సాంత్వన కలుగుతుంది” అని చెప్పారు.

తరువాత ఆవిడ మొదటిసారి ‘లలితా సహస్ర నామ స్తోత్రం’ నేర్పారు. ఆవిడ చదువుతూ ఎలా చదవాలో నేర్పారు. అలా వారింటికి ప్రతి శనివారం వెళ్లి వారి దగ్గర ‘లలితా సహస్ర నామ స్తోత్రం’ చదవడం నేర్చుకున్నా. ఈ విధంగా ఆవిడ నాకు లలిత చదవాలి అని ఆదేశించి నేర్పించి చదివించేలా చేశారు.

నేను మా ఇంట్లో ప్రతి శుక్రవారం వీలు కుదిరినప్పుడు నా పూజ మందిరంలో (రూంలో) నెమ్మదిగా చదవడం మొదలు పెట్టాను. ఓ అరగంట పట్టేది ఒకసారి చదవడానికి.

కార్తీక మాసం వచ్చింది. ఓ కార్తీక సోమవారం నాడు నన్ను వారింటికి భోజనానికి బ్రాహణుడిగా రమ్మన్నారు. సాయంత్రం స్నానం చేసి బయలుదేరి వెళ్ళాను. వారు నాకు పంచ కండువా ఇచ్చారు. కట్టుకున్న తరువాత ‘లలితా సహస్ర నామ స్తోత్రం’ చదివాము.

తరువాత భోజనానికి రమ్మన్నారు. వారు శ్రీవారికీ, నాకు భోజనాలు విస్తరాకులో శాస్త్రబద్ధంగా వడ్డించి తినిపించారు.

ఎంతో కాలం తరువాత మా అమ్మ గారు మడితో చేసి కార్తీక సోమవారం నాడు సాయంత్రం తులసి కోట దగ్గర వడ్డీంచిన భోజనం గుర్తుకు వచ్చింది. భోజనానంతరం వారు దంపతులు ఇరువురు నాకు నమస్కారం చేసి రెండు వెండి కుందులు, రెండు పంచలు, అష్టలక్ష్ములు ఉన్న చిన్న వెండి గిన్నె ఇచ్చారు. నాకు చాలా ఆనందం కలిగింది. “ఇవి మీరు మీ పూజలో వినియోగించడం కోసం ఇస్తున్నాం శ్రద్ధగా పూజ చేసుకోండి.” అని చెప్పి నాకు ఇచ్చారు. దుబాయ్‌లో దేశం కాని దేశంలో అమ్మతనం చక్కగా చూపి నాకు ఆధ్యాత్మిక మార్గ నిర్దేశం చేసిన ఆ మాతృమూర్తికి శత సహస్ర వందనాలు.

అప్పటి నుండి నేను కొనుక్కున్న లక్ష్మి, గణపతి ఉన్న పెండంట్ అష్ట లక్ష్మి వెండి గిన్నెలో ఉంచి పూజ చేయడం ఆరంభం చేశాను.

1989లో నాకు మా భవన సముదాయంలో ఉన్న ఇంకో కుటుంబం పద్మ, ప్రసాద్ గారు పరిచయం అయ్యారు. వారికీ ముగ్గురు ఆడపిల్లలు. పిల్లలకు శ్లోకాలు పద్యాలు నేర్పుతా అని అనగానే – తప్పకుండా మీ ఖాళీ సమయంలో వచ్చి నేర్పండి అన్నారు. వారానికి నాకు కుదిరినప్పుడు వెళ్లి శ్లోకాలు ఇంగ్లీష్‌లో వారికి వారు చదవడానికి వీలుగా వ్రాసి ఇచ్చి చిన్న చిన్న శ్లోకాలు నేర్పి తరువాత లక్ష్మి అష్ట్తోత్తర శత నామ స్తోత్రం వారి ఇద్దరు పిల్లలకు నేర్పాను. పిల్లలు తెలివైయిన వారు, నేర్చుకోవాలి అనే శ్రద్ధ ఉన్న వారు, వారి తల్లి తండ్రులకు వారి పిల్లలకు నేర్పించాలి అనే ఆసక్తి ఉండటంతో ఈ కార్యక్రమం విజయవంతం అయ్యి పిల్లలు దసరా పండుగలు రసమయి సమావేశంలో చక్కగా ఈ స్తోత్రం చెప్పారు. దానితో పిల్లలకు మంచి పేరు, నాకు ‘శ్లోకాలు పంతులు గారు’ అనే పేరు వచ్చింది. పద్మ గారు సంతోషించి నాకు దుర్గా దేవి రూపు సిల్వర్ కోట్‌ది బహుమతిగా ఇచ్చారు. ఆ విధంగా ఓ పద్మ గారు ‘లలితా సహస్ర నామ స్తోత్రం’ నేర్పితే, ఇంకో పద్మ గారు అమ్మని ఆరాధించమని అమ్మ బొమ్మ నా మందిరంలోకి ఇచ్చారు.

ఉద్యోగంలో చాలా ఒడిదుడుకులు వచ్చాయి.

  1. నాన్న గారికి గుండె ఆపరేషన్.
  2. అనుకోకుండా నా కాలు మడమ విరిగి కట్టుతో భారతదేశానికి వెళ్లాల్సి రావడం.

కాలు విరిగి రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలి అని వైద్యులు చెబితే దుబాయ్ నుండి భారతదేశానికి వచ్చేటప్పుడు నా మందిరంలో అమ్మని నాకు స్వస్థత త్వరగా చేకూరి మళ్ళీ వచ్చి ఈ మందిరంలో క్రింద కూర్చుని దీపారాధన చేసి నీ సహస్ర నామ స్తోత్రం చదివే అవకాశం త్వరగా ఇవ్వాలి అని మనసారా ప్రార్థించి 50 దినారాలు (దుబాయ్ డబ్బు) అమ్మ దగ్గర ఉంచి ఇద్దరు పద్మ గార్లు మిగతా మిత్రులు వద్ద సెలవు తీసుకుని భారతదేశం వచ్చి విశ్రాంతి తీసుకున్నా. అపుడు రోజు స్నానం చేయగానే కుర్చీలో కూర్చుని స్తోత్రాలతో బాటుగా ‘లలితా సహస్ర నామ స్తోత్రం’ చదివాను మా అమ్మ ఇచ్చిన కుంకుమ ధరించి.

1990 మే లో నా కాలు విరిగింది. విశ్రాంతి తీసుకొని మరల జూలైలో ఉద్యోగంలో చేరాను. నా గ్రహ స్థితి బాగోలేక మిల్లులో నా పైన అధికారికి నాకు పడక ఇక మిల్లులో చేయలేను అనే స్థితికి వచ్చింది. ఇద్దరు పద్మ గార్లు “ఉద్యోగం ఎలాగోలా చెయ్యాలి ఎందుకంటే మళ్ళీ ఉద్యోగం దొరకదు. ఇండియాలో ఉద్యోగం దొరకడం కష్టం. పిల్లలు చిన్న వాళ్లు కదా. ఓ పదేళ్లు చేయండి. మేము ఉన్నాం కదా” అని చెప్పేవారు. రోజు ఉద్యోగం చేసాక విరిగిన కాలు బాగా వాచి ఇక నడవలేని స్థితి వచ్చేది. బయటకు వెళ్లలేక పోయేవాడిని.1990 డిసెంబర్ నెలలో నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. 1991 జనవరి 15న ఇండియాకి తిరిగి వచ్చాను. కొంతకాలం అత్తవారింట్లో కొంతకాలం నాన్న గారింట్లో ఉండి ఉద్యోగం కోసం అన్వేషణ ఆరంభం చేశాను. నేను అనుకున్న ఏ పేపర్ మిల్‌లో నాకు ఉద్యోగం దొరకలేదు.

1991 మే నెలలో నాకు ఓ చిన్న మిల్‌లో ఉద్యోగం దొరికింది. నేను ఆ ఊరులో ఇల్లు అద్దెకి తీసుకొని పూజ మందిరంలో దుబాయ్‌లో పూజ మందిరంలోని వస్తువులు ఉంచి రోజు పూజ చేయడం ఆరంభం చేశాను.

రచయిత పూజ మందిరం

మిల్లు యజమాని చాలా మంచివారు. నన్ను చాలా అభిమానంగా చూసేవారు. వారు నన్ను స్వంత కొడుకులా ఆదరంగా చూసేవారు.. వారి దయ వల్ల గాయత్రి మాత దర్శనం జరిగింది.

మా యజమాని శ్రీ శంభు ప్రసాద్ గారు నన్ను వారితో వారు తరచూ దర్శించే ‘గాయత్రి పీఠం’కు తీసుకొని వెళ్లారు. ఆ పీఠంలో శ్రీ నిభానపూడి వెంకయ్య గారు ఎంతో నిష్ఠగా గాయత్రి పూజలు చేస్తుండేవారు. ఎందరో వచ్చి వారి చేత పూజలు చేయించుకుని వారు మంత్రించి ఇచ్చిన రక్ష తాడు కట్టుకునేవారు. వారికి మా మిల్లు యజమాని నన్ను పరిచయం చేస్తూ “వీరు దుబాయ్‌లో పేపర్ మిల్‌లో పనిచేసి వచ్చి మా దగ్గర చేరారు” అని చెప్పారు. అయన నా వంక చూసి “మిల్లులో దెబ్బలాడి వచ్చారు కదా?” అని అడిగారు. ఆశ్చర్యం పోతూ “అవును” అని సమాధానం ఇచ్చాను. “మళ్ళీ వెళతారా?” అని అడిగారు. “అది ఇక సాధ్యం కాదు కదా” అని అన్నా. “మీరు గాయత్రి మాతని నమ్మి రోజు పూజలు చేసుకోండి. అప్పుడప్పుడు ఇక్కడకి రండి.” అని చెప్పారు. మా యజమానితో “వీరిని మీతో తప్పకుండా మీరు వచ్చేటప్పుడు తీసుకొని రావాలి” అని చెప్పారు.

గాయత్రి పీఠం, నిడదవోలు

“అలాగే” అని ఆయన అన్నారు. నాకు పూజ కుంకుమ రక్ష తాడు ఇచ్చారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here