Site icon Sanchika

నా జీవితంలో శివారాధన-1

[dropcap]బా[/dropcap]ల్యం నుండి మా తల్లీ తండ్రులు నన్ను శివాలయానికి తీసుకొని వెళ్లేవారు. మేము ఉండే అద్దె ఇల్లు కూడా శివాలయం దగ్గరగా ఉండటం కూడా ఓ కారణం.

శివాలయంలో అన్ని ఉపాలయాలకి వెళ్లి దండం పెట్టుకోవడం, వచ్చిన శ్లోకాలు చదువుకోవడం, కాసేపు కూర్చుని రావడం ఓ అలవాటుగా మారింది.

వేసవి సెలవల్లో తప్పకుండా రోజు సాయంత్రం శివాలయానికి వెళ్లేవాడిని. కార్తీక మాసం సాయంత్రాలు ఆకాశ దీపంలో పాల్గొనడానికి అమ్మతో వెళ్ళేవాడిని నా 8వ తరగతి చదువు వరకు.

తరువాత శివాలయంలో హరి కథలు, పురాణ ప్రవచనాలకు వెళ్లే వాడిని.

ఇంటర్, బిఎస్‌సి చదువులు చదివేటప్పుడు పరీక్షలు బాగా వ్రాయలేకపోతే ఇక శివాలయంలో ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 40 రోజులు రోజు 108 ప్రదక్షిణాలు చేసే వాడిని, అక్కడ హనుమాన్ చాలీసా చదువుతూ.

అనుకున్న కోరిక లేదా వచ్చిన కష్టం తొలగి పోయేది.

కపిల మల్లేశ్వర స్వామి

దర్శనం విధానం:

శివాలయంలో ముందు నవగ్రహములకు 9 ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉన్న శనీశ్వరునికి నమస్కారం చేసి తరువాత కాళ్ళు కడుక్కుని గుడి చుట్టు 3 ప్రదక్షిణాలు చేసి ఇంకో ఉపాలయం శ్రీ సుభ్రమణ్యస్వామిని దర్శనం చేసుకుని, తరువాత చండీశ్వరుని వద్దకు వెళ్లి చప్పట్లు చరిచి మనం వచ్చినట్లు వారికీ తెలియబరిచి చెవులు పట్టుకుని 3 గుంజీలు తీసి తరువాత ధ్వజస్తంభం వద్ద దండం పెట్టుకుని ఆలయంలో ప్రవేశం చేసి విభూతి, కుంకుమ ధారణ చేసి ఎత్తున ఉన్న గంట 3 సార్లు కొట్టి తరువాత ఎడమ వైపు ఉన్న గణపతి దర్శనం చేసుకుని తరువాత శివలింగం ఉన్న గర్భగుడిలోకి వెళ్లే ముందు నందీశ్వరునితో

“నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం

మహాదేవస్య సేవార్థం అనుజ్ఞామ్ దాతుం అర్హసి”

అని వారి పృష్ఠభాగంలో తోక దగ్గర చేయి వేసి ఎడమ చేయిని ఓ గోపురంల చేసి నందీశ్వరుడి తల మీద ఉంచి చేయి మధ్యలో ఏర్పడిన ఖాళీ లోంచి శివలింగం చూస్తూ చెప్పి శివలింగం ప్రతిష్ఠితం అయిన గర్భగుడిని అనుకుని ఉన్న హాలులో ఓ పక్కగా నిలుచుని శివ పంచాంక్షరీ స్తోత్రం చదువుకుని శివ దర్శనం చేసుకుని నెమ్మదిగా వీపు చూపకుండా వెనక్కి నడుస్తూ ఆలయం బయటకు వచ్చి పక్కన పార్వతి దేవి గుడిలో అమ్మవారి దర్శనం చేసుకుని తరువాత శివ ఉత్సవ విగ్రహ మూర్తులు ఉన్న చోటకు వచ్చి శివ, పార్వతుల దర్శనం చేసుకుని పూజారి గారు ఇచ్చిన తీర్థం స్వీకరించి వారిచ్చిన పుష్పం తీసుకుని నంది మీద ఉంచి కాసేపు దేవాలయంలో కూర్చుని ఓం నమశ్శివాయ జపం చేసుకుని తరువాత సాష్టాంగ ప్రణామం చేసి బయటకు వచ్చి హనుమాన్ విగ్రహం ఉన్న ఉపాలయం దగ్గరికి వెళ్లి అక్కడ ప్లేట్‌లో ఉంచిన సిందూరం ధరించి 11 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుని దగ్గరగా ఉన్న ఉపన్యాస వేదిక మీద కూర్చుని వచ్చేవాడిని.

పార్వతి దేవి

పొరుగూరు చదువులకు వెళ్లి వేసవి సెలవులకు వచ్చినప్పుడు రోజు సాయంత్రం స్నానం అనంతరం శివాలయానికి వెళ్లడం నా దినచర్యలో భాగం అయ్యేది.

ఎప్పుడైనా సాయంత్రం సినిమాకి వెళ్ళాలి అనుకున్నపుడు ముందు శివాలయానికి వెళ్లి దర్శనం అనంతరం సినిమాకు వెళ్లే వాడిని.

మా ఊరు అంటే ఎక్కువ గుర్తుకు వచ్చేది శివాలయం.

నాగంజనేయ స్వామి

ఇంకో విశేషం ఏమిటి అంటే నా బాల్యంలో (1970లలో) ఆంజనేయ స్వామి ఉపాలయం దగ్గర ఉన్న శివాలయం గోడలకు ‘హనుమాన్ చాలీసా’ శిలా ఫలకాలను అతికించి వాటిని మా నాన్నగారి జీవితాన్ని మలుపు తిప్పిన వారి ఆధ్యాత్మిక గురువులు శ్రీ శ్రీ శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామి వారి చేత ఆవిష్కరణ చేయించడం చేశారు. ఆ ఫలకాలు చూస్తూ ఎందరో భక్తులు చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం చేసే వారు.

హనుమాన్ చాలీసా శిలా ఫలకాలు

మా నాన్నగారి ఉద్యోగ విరమణ అనంతరం ప్రతి రోజు సాయంత్రం ప్రదోషసమయంలో సామూహిక స్తోత్ర పారాయణం చేయించేవారు.

పార్వతి సమేత శ్రీ కపిల మల్లేశ్వర స్వామికి నమస్సులు.

నమశ్శివాయ సాంబాయ

శాంతాయ పరమాత్మనే

నీలకంఠాయ రుద్రాయ

సగణాయ సమానవే.

🙏🙏🙏🙏

(సశేషం)

Exit mobile version