Site icon Sanchika

నా జీవితంలో శివారాధన-3

మహా దేవ మహదేవ
మహాదేవేతి వాదినం
వస్థమ్ గౌరివ గౌరిశో
ధావంత మను ధావతి.

[dropcap]నే[/dropcap]ను దుబాయ్‌లో 1988 నుండి 1991 జనవరి వరకు పని చేసి అనంతరం కొన్ని కారణాలు వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇండియాలో అనుకున్న చోట ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేసినా దొరకలేదు. నిరుద్యోగిగా ఉంటూ, మా ఊరులో రోజు శివాలయం దర్శనం చేసుకుంటూ కాలం గడుపుతున్నా.

మే నెలలో నా పూర్వ మిత్రుడు శివాలయంలో కనబడి మాటల సందర్భంలో నేను ఉద్యోగం వేటలో ఉన్నా అని తెలుసుకుని తాను పని చేస్తున్న పేపర్ మిల్లు కొత్తగా ఆరంభం చేశారు, ఖాళీలు ఉన్నాయి తీసుకుని వెడతాను అంటే నేను నా ఉద్యోగానికి సంబందించిన కాగితాలు తీసుకొని అతని వెంట ఓ రోజు వెళ్ళాను.

అతను ఆ మిల్లు యజమాని గారితో నా పరిచయం చేశారు. అయన నన్ను ప్రశ్నలు వేసి వారి అబ్బాయి, ఆ పేపర్ మిల్లులో ఇంకో డైరెక్టర్ హోదాలో ఉన్నారని, వారిని కలవండి అని చెప్పారు. వారిని కలిసి మాట్లాడాక నాకు అక్కడ ఉద్యోగం దొరికింది.

నా మిత్రుడి పేరు శివ కుమార్ గారు.

ఆ పేపర్ మిల్లు యజమాని గారి పేరు శ్రీ శంభు ప్రసాద్ గారు.

అక్కడ కుటుంబంతో ఉండటానికి దగ్గరలో ఓ ఇంట్లో ఓ వాటా అద్దెకు దొరికింది. అదృష్టం ఏమిటి అంటే ఆ ఇంటికి ఎదురుగా పిల్లల ప్రాథమిక పాఠశాల, దాని పక్కన శివాలయం ఉన్నాయి.

శ్రీ శంభేశ్వర స్వామి, పాలకొల్లు, శంభన్న అగ్రహారం.

నాకు చాలా ఆనందం కలిగింది.

పిల్లవాడికి దగ్గరలో స్కూల్, నాకు దర్శనానికి శివాలయం దొరికినందుకు.

రోజు ఉదయం ఇంట్లో పూజ చేసుకున్న అనంతరం చక్కగా శివాలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ఆ తరువాత మిల్లుకి ఉద్యోగానికి వెళ్లే వాడిని.

శివాలయంలో పూజారి గారు చక్కగా పూజ చేసే వారు గోత్ర నామాలతో.

అలంకరణలో శ్రీ శంభేశ్వరుడు

చాలా చిన్న శివాలయం సందడి ఎక్కువ ఉండేది కాదు. చాలా ప్రశాంతంగా ఉండేది.

ఈ శివాలయంలో స్వామి శంభేశ్వరుడు, అమ్మవారు రత్నమాంబ దేవి, క్షేత్ర పాలకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. శివాలయంలో నవ గ్రహాలు, వల్లీ దేవసేన సమేత సుభ్రమణ్య స్వామి, వెంకటేశ్వర స్వామి ఎదురుగా గరుత్మంతుడు, సీతా లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఉపాలయాలుగా ఉన్నాయి.

శంభేశ్వర స్వామి ఆలయం క్షేత్ర పాలకులు శ్రీ వెంకటేశ్వర స్వామి
నవగ్రహాలు

ప్రస్తుతం ఈ ఆలయం శ్రీ శృంగేరి శంకర పీఠం ఆధ్వర్యంలో ఎంతో చక్కగా నడుస్తోంది. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆయా కాలాలు, పండుగల సందర్భంగా నిర్వహించడం చేస్తున్నారు.

పాలకొల్లు పంచారామ క్షేత్రం

శ్రీ క్షీరా రామ లింగేశ్వరస్వామి కొలువై ఉన్న ఊరు. చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం.

నేను ఉండే నివాసం ఊరికు చివరన భీమవరం వెళ్లే దారిలో ఉంది. మిల్లులో డ్యూటీ అనంతరం ఎక్కువ బయటకు తిరిగింది లేదు, ఎందుకంటే మిల్లులో ఉదయం 9 గంటలకు వెళితే రాత్రి 8 గంటలు అయ్యేది ఇంటికి వచ్చే సమయానికి.

నా జాతకంలో కొంత చెడ్డ దశ నడుస్తుండటం వల్ల ఇలా ఓ చిన్న మిల్లులో ఉద్యోగం చేయవలసిన అవసరం ఏర్పడింది అని జాతకం పరిశీలించినవారు చెప్పారు. నిత్యం కార్తవీర్యార్జున మంత్రం, శివాలయం దర్శనం చేస్తే మంచిది అని సూచనలు చేయడంతో శివాలయం దర్శనం చేస్తూ నిత్య అనుష్టానంలో కార్తవీర్యర్జున మంత్రం జపం చేస్తూ శుభ కాలం కోసం ఎదురు చూస్తున్నా.

నేను పని చేసే మిల్లు యాజమాన్యానికి అనుభవం తక్కువ. ఆదాయం కంటే నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి మిల్లు నుండి. మిల్లు నడవడానికి కావలసిన సొమ్ము కూడా అందుబాటులో లేక చాలా చోట్ల అప్పులు చేయడం మొదలు పెట్టారు. తయారు చేస్తున్న కాగితానికి మార్కెట్ లేదు.

ఆ కాగితాన్ని చాలా తక్కువ ధరకి అమ్మడం మొదలు పెట్టారు.

శ్రీ రత్నమాంబా దేవి అమ్మవారు

ఇక ఈ మిల్లు ఎక్కువ కాలం నడవడం కష్టం. జీతాలు కూడా ఇవ్వడం కష్టం అనిపించింది అక్కడ పరిస్థితి చూసాకా.

పరిస్థితి వివరిస్తూ దుబాయ్‌లో నా శ్రేయోభిలాషులకు ఉత్తరం వ్రాసాను మళ్ళీ అక్కడ ఉద్యోగం చూడమని, అక్టోబర్ నెలలో దసరా నవరాత్రులు తరువాత.

నాకు 1992 జనవరి నెలలో దుబాయ్ ఉద్యోగం వస్తుంది రావడానికి సిద్ధంగా ఉండాలి అని మిత్రులు సందేశం పంపారు. నాకు చాలా ఆనందం కలిగింది.

శివాలయం దర్శనం ఎంతో మేలు చేసింది అని మనసారా భావించి అక్కడ అంతరాలయంలో లైటింగ్ బాగా ఉండేలా ఏర్పాటు చేసి పూజారి గారికి వస్త్రాలు సమర్పణ చేసుకుని వారి దీవెనలు అందుకున్నా.

శ్రీ ఆంజనేయ స్వామి

నాకు నా ఆపత్సమయంలో ఉద్యోగం ఇచ్చి ఆదుకున్న నన్ను వారి కొడుకులా చూసుకున్న మిల్లు యజమాని శ్రీ శంభు ప్రసాద్ గారికి మనసారా నమస్కరించి వారి దీవెనలు అందుకుని ఉద్యోగానికి రాజీనామా చేశాను.

నాకు 1992 జనవరి నెలలో దుబాయ్ నుండి ఉద్యోగం ఆర్డర్ వచ్చింది.. వీసా, విమానం టికెట్ అందుకున్నా.

నేను 1992 మార్చి నెలలో మరల దుబాయ్‌లో అడుగుపెట్టాను.

ఈ సారి నా మిత్రులు వారి భార్యలతో ఉంటున్నారు. అందరికి నేను రావడము చాలా సంతోషం కలిగింది.

ప్రతి శనివారం అందరు కలిసి దుబాయ్ లోని శివ మందిరం, కృష్ణ మందిరానికి విధిగా వెళ్లడం చేసే వాళ్ళం.

శివాలయంలో కూర్చొని శివ పంచాంక్షరీ స్తోత్రం, లింగాష్టకం చక్కగా చదువుకుని కొంత సమయం గడిపి వారిచ్చిన ప్రసాదం లు స్వీకరించి వచ్చేవాళ్ళం.

శ్రీ శంభేశ్వర స్వామి గుడి వివరాలు ఉత్సవాలు వివరాలు

దుబాయ్‌లో ఉన్నంత కాలం వారంలో ఓ రోజు శివాలయానికి విధిగా వెళ్లి దర్శనం చేసుకునేవాడిని.

నేను 1992 మార్చి నుండి 1996 మార్చి వరకు దుబాయ్‌లో ఉండటం జరిగింది. తరువాత ఇండియాలో గతంలో నేను పనిచేసిన రాజమండ్రి పేపర్ మిల్లులో ఉద్యోగం దొరకడంతో 1996 ఏప్రిల్ నెలలో ఉద్యోగంలో చేరడం జరిగింది.

నాకు మిల్లు లోపల ప్రత్యేక అధికారుల నివాసగృహాల్లో వసతి దొరకడంతో చాలా ఆనందం కలిగింది.

ఈ నివాస గృహాలు ఆరంభంలో మిల్లు యాజమాన్యం వచ్చినపుడు ఉండే వసతి గృహం దగ్గర చిన్న మందిరం (ఠాకూర్ వాడి) ఉండేది. అక్కడ ఉదయం సాయంత్రం పూజ అనంతరం ఆరతి ఇచ్చేవారు ఉత్తర భారత దేశ సంప్రదాయంలో.

ప్రతి మంగళవారం, శనివారం సాయంత్రాలు మిల్లు కాలనీలోని ఉత్తరాది కుటుంబాలు ప్రత్యేక ఆరతిలో పాల్గొనేవి. ప్రత్యేక ప్రసాదం వితరణ చేసేవారు.

మిల్ స్టాఫ్ క్లబ్ వారు శ్రీశైలం, మహానంది, మంత్రాలయం క్షేత్రాలు దర్శనం కోసం యాత్ర ఏర్పాటు చేశారు. ఆ యాత్రలో పాల్గొని శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబ దర్శనం చేసుకోవడం జరిగింది.

తరువాత మహానంది క్షేత్రం పుష్కరిణిలో స్నానం చేసి అనంతరం దర్శనం చేసుకుని అక్కడ ఓ స్ఫటిక లింగం ఇంట్లో పూజార్థం కొనుక్కుని రావడం జరిగింది.

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు ప్రథమంగా ‘శివ తత్వం’ మీద వినడం జరిగి ఎంతో ప్రభావితుణ్ణి అయ్యాను. వారి ఆ ప్రసంగాల సీడీలు తీసుకొని ఎన్నో సార్లు వినడం జరిగి శివారాధన మీద ఇంకా ఆసక్తి కలిగింది.

ముఖ్యంగా శివ కుటుంబం ఆరాధన చేస్తూ ఉండాలి అని వారు ప్రవచనాలలో చెప్పడం జరిగింది.

దక్షిణామూర్తి ఆరాధన ప్రతి గురువారం క్రమం తప్పకుండా చేస్తూ ఆవు నెయ్యి దీపం ఉంచి పూజా మందిరంలో గృహంలో ఉన్న సభ్యులు అందరి జాతకాలూ దక్షిణామూర్తి చిత్ర పటం దగ్గర ఉంచి పూజ చేస్తే గ్రహ దోష నివారణ, కుటుంబంలో శాంతి, సౌఖ్యాలు ఉంటాయి అని వారు ప్రవచనాలలో చెప్పడంతో ఇంట్లో పూజ మందిరంలో దక్షిణామూర్తి పటం ఉంచి ఆవు నెయ్యి దీపం ప్రతి లక్ష్మివారం విధిగా వెలిగించి దీపారాధన చేయడం, దక్షిణామూర్తి స్తోత్రం చదవడం జరిగింది.

దుబాయ్ నుండి ఇండియాకి వచ్చి ఉద్యోగంలో చేరాక ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అలాగే కుటుంబ జీవితంలో కూడా సమస్యలు ఎదురయ్యి ఎంతో మానసిక క్షోభ కలిగేది. జాతకం పరిశీలన చేయిస్తే మండలం రోజులు శివ సహస్ర నామ స్తోత్రం పారాయణం, శివాలయంలో ప్రతి సోమవారం శివాభిషేకాలు చేయిస్తే కొంత పరిస్థితులు అనుకూలిస్తాయి అని చెప్పడం జరిగింది.

మేముండే పేపర్ మిల్ గృహ సముదాయం వెనక కొంత దూరంలో పవిత్ర గోదావరి నదీ తీరాన ‘శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం’ లో అభిషేకాలు చేయిద్దాం అని అనుకున్నా.

ఆ విధంగా ఓ ప్రసిద్ధ శివాలయంలో అభిషేకాలు చేయించుకుని స్వామి సేవ చేసుకునే భాగ్యం కలిగింది.

(సశేషం)

Exit mobile version