Site icon Sanchika

నా జీవితంలో శివారాధన-5

శ్లో.

మృత్యుంజయాయ రుద్రాయ
నీలకంఠాయ శంభవే|
అమృతేశాయ శర్వాయ
మహాదేవాయ తే నమః||

~

1998లో శ్రీశైలం, మహానంది పుణ్యక్షేత్రాల దర్శనం అనంతరం మహానంది నుండి తెచ్చుకున్న స్పటిక లింగం, స్పటిక గణపతి, అన్నపూర్ణ దేవి, రుద్రాక్షలకు దక్షిణావర్త శంఖంతో రోజు పురుష సూక్తం, శివ అష్టోత్తర నామాలతో శివుడికి శ్రీ సూక్తం చదువుతూ అభిషేకం చేయడం ఓ అలవాటు అయింది పూజలో.

తరువాత

శివోపాసన మంత్రం

(పాణి మంత్రం)

నిధపతయే నమః నిధనపతాంతికాయ నమః
ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః
హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః
సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః
దివ్యాయ నమః దివ్యలింగాయ నమః
భవాయ నమః భవలింగాయ నమః
శర్వాయ నమః శర్వ్ల్లలింగాయ నమః
శివాయ నమః శివలింగాయ నమః
జ్వలాయ నమః జ్వలలింగాయ నమః
ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః
పరమాయ నమః పరమలింగాయ నమః
ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగగ్గ్’ స్థాపయతి పాణి మంత్రం పవిత్రమ్ ||
సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః |
భవే భవే నాతిభవే భవస్వ మామ్ | భవోద్భవాయ నమః ||
వామదేవాయ నమో” జ్యేష్ఠాయ నమ-శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః
కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో
బలప్రమథనాయ నమ-స్సర్వ-భూతదమనాయ నమో మనోన్మనాయ నమః ||
అఘోరే”భ్యో థ ఘోరే”భ్యో ఘోరఘోరతరేభ్యః |
సర్వే”భ్య-స్సర్వశ-ర్వే”భ్యో నమస్తే అస్తు రుద్రరోపేభ్యః ||
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి |
తన్నో రుద్రః ప్రచోదయా”త్ ||
ఈశానః-సర్వ-విద్యానా-మీశ్వర-స్సర్వ-భూతానాం
బ్రహ్మా ధిపతి-ర్బ్రహ్మణో ధిపతి-ర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోమ్ ||

========

ఈ మంత్రాలు చదువుతూ బిల్వ దళాలు, పుష్పాలతో పూజచేయడం ఓ అలవాటు అయ్యింది.

ఇంటి పెరడులో బిల్వ వృక్షం, ఇంటి బాల్కనీలో తులసి, బిల్వ మొక్కలు కుండీల్లో ఉంచి రోజు ఉదయాన్నే దీపం పూజకు ముందు ఉంచడం అలవాటు అయ్యింది. కార్తీక మాఘ మాసాల్లో రెండు పూటలా మొక్కలు దగ్గర దీపాలు పెట్టడం చేయడం జరుగుతుంది.

పూజలో శివ పంచాంక్షరీ, మృత్యుంజయ మంత్రం, దక్షిణమూర్తి మంత్రం జపం రెండు పూటలా యథాశక్తి చేస్తున్నా. రోజు శివ స్తోత్రాలు కొన్ని చదువుతూ ప్రతీ సోమవారం శివ సహస్ర నామ స్తోత్రం పారాయణం చేస్తున్నా. మాఘ, కార్తీక మాసాల్లో ఇంకొన్ని స్తోత్రాలు అదనంగా చదువుతున్నా.

మారేడు కాయలలో గుజ్జు తీసి ఎండబెట్టి చక్కగా ఓ దాంట్లో గో మయంతో చేసిన విభూది, అమ్మ వారికీ పూజలు చేసిన కుంకుమ ఉంచి పూజకు ముందు వాటిని ధారణ చేసి పూజలు చేస్తున్నా.

ఉమా కోటిలింగేశ్వరస్వామి దేవాలయంలో లక్ష పత్రి పూజ ప్రతీ మాస శివరాత్రికి అద్భుతంగా జరుగుతుంది. దైవ అనుగ్రహం వల్ల కొన్ని సార్లు ఆ పూజలో పాల్గొన్నా. ముఖ్యంగా కార్తీక మాసం, మాఘమాసాలలో తప్పకుండ పాల్గొనే వాడిని.

శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం ప్రధాన ద్వారం

మహా శివరాత్రి నాడు రాత్రి 8 గంటలకు లక్ష పత్రి పూజ ఆరంభం చేసి ముందు మహా సంకల్పంతో శరీరం శుద్ధి చేసుకుని భగవత్ సేవకు సిద్ధం చేసి 10.30 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం ఆరంభం చేసి శివ లింగోద్భవ సమయానికి శివుణ్ణి అభిషేకం చేస్తూ హర హర మహాదేవ శంభో శంకర నామ స్మరణతో శివార్చన షుమారు 30మంది వంతులు వారీగా చేసి తదుపరి అమ్మకు కుంకుమ అర్చన అనంతరం లక్ష బిల్వర్చన మహాదేవుడికి చేసి నీరాజనం అనంతరం మంత్రపుష్పం, వేద ఆశీస్సులతో అద్భుతంగా లక్ష పత్రి పూజ వైభవం జరిగేది. ఈ కార్యక్రమం అయ్యేటప్పటికి తెల్లవారు ఝామున 4 గంటలు అయ్యేది.

కార్తీక మాసంలో ఉదయం10 గంటలకు ఆరంభం చేసి సాయంత్రం 7గంటలకు కార్యక్రమం పూర్తి అయ్యేది. గుడిలోనే బహిరంగ ఆవరణలో ప్రత్యేక భోజనం ఏర్పాటు ఉండేది. కార్తీక సోమవారం పూజ ఒక్కొక్కసారి ఇలా జరిగేది.

శ్రీ ఉమా కోటి లింగేశ్వర స్వామి

గుడిలో జరిగే కార్యక్రమాలు అన్నింటిలో వీలు అయినంత మేర పాలుపంచుకునే వాడిని. ఆ విధంగా గుడిలో అర్చకులతో పరిచయం ఇంకా పెరిగింది.

1998 నుండి 2017 వరకు కోటి లింగేశ్వరస్వామి గుడిలో ప్రతీ సోమవారం అభిషేకాల్లో పాల్గొనడం జరిగింది.

పూర్వ జన్మ పుణ్యం ఉంటేనే గాని శివారాధన చెయ్యాలి అనే అదృష్టం కలగదు అని నా అభిప్రాయం.

గుడిలో శివాభిషేకంలో పాలుపంచుకున్న కొందరి గురించి చెప్పడం ఈ సందర్బంలో సముచితం అని నేను భావిస్తున్నాను.

మొదటి వ్యక్తి

నేను ఈ శివాలయంలో అభిషేకంలో పాల్గొన్న తొలినాళ్లలో మొదటి అభిషేకంలో పాల్గొనడానికి ఓ వ్యక్తి కారులో ఒకరిద్దరినీ భారీ పూజ సామాగ్రి, పూల దండలు తీసుకొని వచ్చేవారు. తెల్ల లుంగీ పంచ, తెల్ల చొక్కా వేసుకుని విభూతి ధారణతో వచ్చేవారు. శిరోజాలు జటలు కట్టి ఉండేవి. వారిని చూసి పూజారులు భయపడేవారు. చాలా నిష్ఠగా అభిషేకం చేసేవారు. పూజ ద్రవ్యాలు ఆయన చేత తాకించి అపుడు పరమమేశ్వర అభిషేకంలో వినియోగించే వారు.

గుడిలో ఓ పక్కన ఆయన ఆయనతో వచ్చిన వారు ఉంటే రెండో వైపు మేము సర్దుకుని ఉండే వాళ్ళం. ఆయనతో వచ్చిన వారు పూజరులకు అభిషేకం అనంతరం దక్షిణ సమర్పించేవారు.

ఆయన పూజ చేసిన విభూదిధారణ చేసుకుని బిల్వ దళాలు తీసుకుని నంది మీద ఉంచి వెళ్ళిపోయ్యేవారు.

మిగతా ఆలయాలు బయట ఉండి దర్శనం చేసుకొని హారతి స్వీకరించేవారు. వారు తెచ్చిన పుష్ప మాలలు గుడిలో ఈశ్వరుడికి అమ్మ వారికీ అలంకరించేవారు. అందరు ఆయన అంటే భయం భక్తులతో ఉండేవారు.

తరువాత తెలిసింది ఆయన ‘శ్రీ రామ లింగ సిద్ధాంతి’ గారు. ప్రముఖ జ్యోతిష్కులు, క్షుద్ర పూజలు చేస్తారు అని.

వారు రాజమండ్రి లోనే ప్రత్యేకంగా ఓ పెద్ద స్థలంలో ఓ శివాలయం, గాయత్రి మందిరం నిర్మాణం చేసి అందులో పూజలు చేయడం ఆరంభం చేశారు.

2వ వ్యక్తి

శివాభిషేకంలో పాల్గొనడానికి ఓ వ్యక్తి తనతో ఒకరిని వెంట తెచ్చుకుని గోదావరిలో స్నానం చేసి ఆలా తడి బట్టల తోనే పూజ ద్రవ్యాలు తీసుకుని వచ్చి అభిషేకంలో పాల్గొనే వారు. అక్కడ పూజారులు వారు వచ్చే వరకు ఆగి తరువాత అభిషేకం ఆరంభం చేసేవారు. చాలా శ్రద్ధగా అభిషేకంలో పాల్గొనేవారు. వారివల్ల పూజారులు ఇంకా శ్రద్ధగా అభిషేకం చేసేవారు.

ఆయన శివుడికి మకర తోరణం, వెండి శఠ గోపం సమర్పించారు. అభిషేకం అనంతరం దక్షిణ కూడా బాగా సమర్పించేవారు. మేము ఎం.ఎల్.ఏ. అవ్వాలి మీరు అని హాస్యం చేస్తుండే వాళ్ళం. ఆయన సరదాగా తీసుకునే వారు. వారు ఎం ఎల్ ఏ కాకపోయినా నగర కార్పొరేటర్ అయ్యారు.

అయినా అదే పంథాలో శివాభిషేకానికి వచ్చి అలాగే ఏ భేషజం లేకుండా పలకరించేవారు.

ఆయన చేసేది దొంగ సారా వ్యాపారం, అతనితో వచ్చే ఆయన వృత్తి బట్టలు ఇస్ట్రీ చేస్తారు. ఇద్దరు స్నేహితులు.

కార్పొరేటర్ గారు అనుకోకుండా తక్కువ వయసు లోనే శివ సాయుజ్యం చెందారు. వారికి ఎందరో అభిమానులు ఉన్నారని వారి శవ యాత్ర సమయంలో తెలిసింది. ఆయన ఉన్న ప్రాంతంలో ఎవరికి ఏ కష్టము వచ్చిన ఆదుకునే స్వభావం ఉన్న పుణ్య పురుషుడు.

ఉమా కోటిలింగేశ్వరస్వామి దేవస్థానం స్థల పురాణం

3వ వ్యక్తి

ఆయన వైద్యం చదువుతున్న తన కూతురితో ప్రతీ సోమవారం ప్రథమ అభిషేకానికి తప్పనిసరిగా వివిధ పళ్ళ రసాలు, పంచామృత ద్రవ్యాలు ఇతర పూజ సామాగ్రితో విధిగా హాజరు అయ్యేవారు. పూజారులు వారంటే చాలా గౌరవం చూపేవారు. అభిషేకం అనంతరం మిగతా ఆలయాల్లోకి కూడా వెళ్లి పూజలు చేయించుకుని తరువాత గుడిలో కూర్చుని చక్కగా జపము చేసుకుని, స్తోత్రాలు పారాయణం చేసుకుని ఉదయం 5 గంటలకు వచ్చిన వ్యక్తి 7గంటలకు గుడి నుండి వెళ్లేవారు. అప్పుడప్పుడు వారి శ్రీమతి గారు కూడా అభిషేకంలో పాల్గొనేవారు. వారితో స్నేహం కుదిరింది. నన్ను ఎంతో గౌరవంగా చూసేవారు. వారు ఎంతో ధనికులు అయిన చాలా నిరాడంబరంగా ఉండేవారు. నాకు ప్రతీ సంవత్సరం ఒక పెద్ద క్యాలెండరు తప్పకుండా తెచ్చి ఇచ్చేవారు. వారికి నేను ఆధ్యాత్మిక గ్రంథాలు ఇస్తుండేవాడిని. వారు రెండు సార్లు చాలా గొప్ప సాయం చేశారు.

ఇప్పటికి కోటిలింగేశ్వరస్వామికి ప్రతీ సోమవారం వెళ్లి అభిషేకంలో పాల్గొంటారు.

కాశీ యాత్ర

మా నాన్న గారు నా పేరు కాశీ విశ్వనాధం అని ఉంచారు. కారణం వారు వారి బాల్యంలో ఇంటి నుండి చెప్పకుండా వచ్చి అలహాబాద్‌లో శ్రీ ప్రభుదత్త బ్రహ్మచారి గారి ఆశ్రమంలో ఉండి ఎం.ఏ. హిందీ వరకు బెనారస్ యూనివర్సిటీలో చదివారు. ఆ గుర్తుగా వారు నా పేరు కాశీ విశ్వనాధం అని ఉంచారు. నన్ను ‘కాశీ’ అని పిలిచేవారు. నేను కూడా ఎం.ఏ. ఇంగ్లీష్ బెనారస్ విశ్వ విద్యాలయంలో చేస్తాను అంటే వారు ఒప్పుకోలేదు. ఆ విధంగా నాకు కాశీలో ఉండి చదువుకునే అవకాశం రాలేదు. కాశీ వెళ్ళాలి అని అనుకునే వాడిని కానీ వెళ్లలేక పోయాను.

2015 గోదావరి పుష్కరాలు సమయంలో ఓ సోమవారం సాయంత్రం 6=7గంటల మధ్య వారు శివైక్యం చెందారు. వారి ఆస్తికలు త్రివేణి సంగమంలో కలపడం కోసం కాశీ యాత్ర చేయవలసివచ్చింది. ఆనందంగా ఎంతో బాగా చెయ్యాల్సిన యాత్ర ఎంతో విషాద పరిస్థితుల్లో పెద్ద కొడుకుగా, బాధ్యతగా వారి ఆస్తికలు త్రివేణి సంగమంలో కలిపి పిండ ప్రదానం చేసి అనంతరం కాశీలో కూడా పిండ ప్రదానం చేయడం కోసం 2016 మార్చ్ నెలలో కాశీకి వెళ్లడం జరిగింది. కాశీలో ఆంధ్ర ఆశ్రమంలో 3 రోజులు ఉన్నాము.

రచయిత నాన్నగారు కోలగంటి శివ సత్యనారాయణ గారు.

కాశీ విశ్వనాథుని దర్శనం మొదటి రోజు చేసుకుని ఆయన్ని తాకరాదు మైలవారు అనే నియమాలు ఉన్నా ఆయన్ని తాకి – కని పెంచి విద్యా బుద్ధులు, సంప్రదాయాలు నేర్పి ఆచరణలో చేసేలా చేసిన నా ప్రత్యక్ష దైవం శివయ్యని దూరం చేసావు, ఇక నువ్వే నాకు దిక్కు విశ్వేశ్వరా – అని మనసారా ఆర్తితో వేడుకున్నా.

ప్రతీ రోజు ఉదయం కాశీలో వివిధ ఆలయాలు దర్శనీయ స్థలాలు సందర్శన చేసుకుని సాయంత్రం ప్రదోషవేళ కాశీ విశ్వనాధ దర్శనం చేసుకునేవాడిని. ఆలయంలో కూర్చుని కొద్దిగా జపం స్తోత్ర పారాయణం చేశాను. ఓ రోజు గంగా హారతి చూడటం జరిగింది.

వచ్చే ముందు మా నాన్నగారు చదువుకున్న అలహాబాద్ లోని ఆశ్రమం దర్శనం చేసుకుని రావడం జరిగింది. అక్కడ మమ్మల్ని ఆ ఆశ్రమం వారు మా నాన్నగారి పేరు విని ఎంతో ఆదరించడం జరిగింది. ఆశ్రమంలో బ్రహ్మచారి గారి పూజ మందిరం చూపించారు.

పెద్ద మారేడు చెట్టు తొర్రలో మందిరం ఏర్పాటు చేసుకుని ఆ చెట్టు ఛాయలో పూజలు చేస్తుండేవారు.

అనేక భాగవత సప్తహాలు చేశారు. ‘భాగవత కధ’ 60 భాగాలుగా వ్రాసారు. వాటిని తెలుగులో అనువదించడం కూడా జరిగింది.

 గో సంరక్షణ ఉద్యమంలో పాల్గొన్నారు. జనసంఘ్ పార్టీ తరపున అలహాబాద్ నియోజకవర్గం నుండి జవహర్ లాల్ నెహ్రుకి పోటీగా అప్పట్లో నిలబడ్డారు. వారిని నా జీవితం లో 4,5 సార్లు దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది.

రచయిత నాన్నగారి గురువుగారు శ్రీ ప్రభుదత్త బ్రహ్మచారి గారు

వారి ఆశ్రమం నిర్వాహకులు ఆశ్రమం, తరువాత ఆశ్రమం నడుపుతున్న వేద పాఠశాల చూపించారు.

ఈ ఆశ్రమం వెనుక గంగా నది ప్రవహిస్తుండటం ఓ విశేషం.

తరువాత నిర్వాహకులు మా నాన్నగారి గురువుగారు, వారి జీవితం మలుపు తిప్పిన శ్రీ ప్రభుదత్త బ్రహ్మచారి గారి జీవితం గురించిన గ్రంథాలు ఇవ్వడం జరిగింది.

నేను మా నాన్నగారి తిధి రోజున ప్రతి సంవత్సరం అన్నదానం చేయమని దానికి సరిపడా డబ్బు జమ చేసి వచ్చాను.

కాశీ యాత్రలో కాశీలో చూడదగ్గ ప్రదేశాలు చూస్తూ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని రావడం జరిగింది.

(సశేషం)

Exit mobile version