నా కాశ్మీర్ యాత్రానుభవాలు

18
2

[dropcap]ఈ [/dropcap]వేసవిలో నేను ఆఫీస్‌కు సంబంధించి ఉత్తరాఖండ్ లోని నైనిటాల్‌లో ఒక మీటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. నైనిటాల్‌కు వెళ్లాలంటే ముందు ఢిల్లీ వెళ్లి అక్కడి నుండి పంత్ నగర్ వెళ్ళాలి. అక్కడి నుండి రోడ్డు మార్గంలో మాత్రమే నైనిటాల్ వెళ్ళాలి. ఎలాగూ అంత దూరం వెళ్తున్నాం కదా ఫామిలీని కూడా తీసుకెళ్తే బావుంటుందనిపించింది. పైగా కరోనా వల్ల గత రెండేళ్లుగా ఎక్కడికీ వెళ్ళింది లేదు. అందుకే ఈసారి ఎలాగైనా ఫామిలీని తీసుకెళదామని నిర్ణయించుకున్నాను. మాములుగా అయితే ఇలాంటి ట్రిప్స్ అన్నీ ప్లాన్ చేసాక ఇంట్లో వాళ్లకి సర్ప్రైజ్ ఇచ్ఛే వాణ్ని. ఇప్పుడు అలా కాదు… పిల్లలిద్దరూ పెద్దవాళ్లయిపోయారు. వాళ్ళ క్లాసులు అలాగే వాళ్ళ ప్రాజెక్టులు ఇలా బాగా బిజీ అయిపోయారు. వాళ్ళని అడక్కుండా ఏమీ ప్లాన్ చెయ్యలేని పరిస్థితి.

అందుకే టికెట్స్ బుక్ చెయ్యడానికి ముందే ఇంట్లో ఒకసారి చర్చించడం మంచిదనిపించి శ్రీమతికి చెప్పాను. అవునా… ముందు పెద్దమ్మాయికి పరీక్షలు దగ్గరపడతాయి, తనకి కుదురుతుందో లేదో కనుక్కుని ప్లాన్ చెయ్యండని చెప్పింది శ్రీమతి. పెద్దమ్మాయిని అడిగితే… తనకు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంటుందనీ, “మా గైడ్‍ని అడిగి కుదురుతుందో లేదో రెండ్రోజుల్లో చెపుతా నాన్నా” అని చెప్పింది. ఏంటో అంతా మనం చెప్పినట్లే అవ్వాలనుకుంటాం కానీ… పిల్లల ప్రాధాన్యతలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటున్నాయి. సరే ఓ రెండ్రోజులు ఆగాక టికెట్లు బుక్ చేస్తే సరిపోతుందనిపించి, ఈలోగా చిన్నమ్మాయి సంగతి కనుక్కుందామని అడిగాను.

“మా ఎగ్జామ్స్ డేట్స్ ఇంకా అనౌన్స్ చెయ్యలేదు నాన్నా… ఓ సారి వచ్చి మా ప్రిన్సిపాల్ తో మాట్లాడు. ఆ తరవాతే ప్లాన్ చెయ్యి … సరేనా” అంది సున్నితంగా. అప్పటికి గానీ నాకు అర్థమవ్వలేదు పిల్లలెంత ఎదిగి పోయారో.

ఏదేమైనా రెండు రోజులు ఆగక తప్పింది కాదు నాకు. ఈ లోపల ఇంట్లో ఎన్నో సమాలోచనలు. ఎలాగూ ఢిల్లీ వెళ్తున్నాం కదా, మా అక్కా వాళ్ళ ఇంటికెళ్దాం అంది శ్రీమతి. మా శ్రీమతి వాళ్ళ అక్కవాళ్ళు వాళ్ళ బావ గారి ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉంటారు. మొత్తానికి పెద్దమ్మాయి తనకు కుదరదని చెప్పేటప్పటికి, చిన్నమ్మాయి పరీక్షలు అయ్యాక ఢిల్లీ బయలుదేరేలా ప్లాన్ చేసి టికెట్స్ బుక్ చేశాను. ఇలా పెద్దమ్మాయి లేకుండా ఒక ట్రిప్ ప్లాన్ చెయ్యడం ఇదే మొదటిసారి. ఏదేమైతే నేం ఢిల్లీ బయల్దేరే రోజు రానే వచ్చింది. మా ఆఫీసు మీటింగ్‌కి నాలుగు రోజుల ముందే వెళ్తుండడంతో ఓ రెండు రోజులు ఢిల్లీలో మా తోడల్లుడు వాళ్ళతో గడపొచ్చని సంతోషం గానే ఉంది.

ఈ విమానంలో ప్రయాణం ఏంటో గాని, ప్రయాణం రెండు గంటలు, తయారవ్వడం రెండు రోజులు. మా ఫ్లైట్ హైదరాబాదు నుండీ ఉదయం ఏడు గంటలకే అవడంతో నాలుగింటికే ఇంటి నుండి బయలుదేరాం. ఆ రాత్రంతా నిద్రపోనే లేదు. వేకువజాము కావడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకే ఐదింటికే ఎయిర్ పోర్ట్ చేరుకోగలిగాం. లగేజ్ చెకిన్ అయ్యేటప్పటికి ఆరు. విమానం అనుకున్నట్లు గానే ఏడింటికే బయలుదేరింది. కార్పొరేట్ టికెట్ బుకింగ్ అవడంతో ఫ్లైట్ లోనే టిఫిన్ కూడా ఇచ్చారు.

తొమ్మిదింటి కల్లా ఢిల్లీ విమానాశ్రయంలో దిగాము. మా తోడల్లుడు వాళ్ళు కారు పంపించారు. మరో అరగంటలో జనక్ పురి లోని వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. వాళ్ళు బాగా దూరంగా ఉండడంతో బంధువుల రాకపోకలు లేవు. మమ్మల్ని చూడగానే చాలా సంతోషపడ్డారు వాళ్ళు. కాఫీలు అవీ అయ్యాక కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నాం. నేను నైనిటాల్ వెళ్ళడానికి ఇంకా మూడు రోజులు గడువుంది. ఢిల్లీ దాకా వచ్చాం కదా కాశ్మీర్‌కి వెళ్లి వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాం. అనుకున్నదే తడవుగా శ్రీనగర్‌కి ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాం. ఉన్నది రెండే రోజులు. ఎంత వీలయితే అంత కాశ్మీర్‌ని చూస్తే చాలనుకుని ఆన్లైన్‌లో వెతికాం. మేము వెతుకుతున్నామని తెలిసిపోయిందేమో వరసపెట్టి ఒకటే ఫోన్లు… చాలా మంది ట్రావెల్ ఏజెన్సీలు. ఎంత మంది వస్తున్నారు ఏమేం చూడాలనుకుంటున్నారు అని ఒకటే ప్రశ్నలు. డబ్బులు ఉండాలే గాని ఈ లోకంలో ఏదయినా చూసేయొచ్చు ఏమైనా చేసేయొచ్చు అనిపించింది. ఎట్టకేలకు ఒక ట్రావెల్ ఏజెన్సీని ఎంపిక చేశాం. మేము ఎంత మంది వస్తున్నాం ఎన్ని రోజులు ఉండాలను కుంటున్నాం అన్నది అడిగి వాళ్ళే మాకు చిన్న ట్రిప్ ప్లాన్ చేసి ఇచ్చారు. ఇక మేము శ్రీనగర్ బయలుదేరడమే తరువాయి.

మాకు చాలా కొద్ది సమయం ఉండడంతో ఉదయం ఆరింటి ఫ్లైట్‌కే ఢిల్లీ నుండీ బయలుదేరాం. ప్రయాణం కేవలం గంటన్నర. శ్రీనగర్‌కి ఇంకో అరగంటలో చేరుకుంటాం అని ఫ్లైట్ వాళ్ళు అనౌన్స్ చేస్తుండగా కిటికీ లోనుంచి చూసాం… మా కళ్ళు నోళ్లు ఒకేసారి తెరుచుకున్నాయి. మంచు తెరల మాటున వెండి కొండల్లా హిమాలయాలు… ఉదయ భానుడి లేలేత కిరణాలు తాకుతుండగా మెరిసిపోతున్న పర్వత శ్రేణులు, దిగువన పచ్చటి తివాచీ పరిచినట్లున్న పచ్చిక బయళ్లు… ఇవేనేమో కాశ్మీరీ తివాచీలకి ప్రేరణ అన్నట్లుగా ఉన్నాయి. అక్కడక్కడా పచ్చటి రంగు పెంకులతో కట్టిన ఇళ్లు, భవనాలు చూస్తే చేయి తిరిగిన చిత్రకారుడి కుంచె నుండీ జాలువారిన చిత్రంలా ఉంది కాశ్మీర్ ముఖ చిత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే స్వర్గం పైన కాదు కిందే ఉందన్నట్లుగా ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. సరిగ్గా ఎనిమిదింటికే భూతల స్వర్గంపై కాలు మోపాం. దిగగానే మొబైల్ ఆన్ చేసుకున్నాం. ఒక మిస్డ్ కాల్ ఉంది. బహుశా మేం బుక్ చేసుకున్న హోటల్ వాళ్ళు అయ్యుంటారు అనుకుంటూ కాల్ చేశా. అతను డ్రైవర్ అజాజ్. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చానని ఎయిర్ పోర్ట్ బయట వెయిట్ చేస్తున్నాఅని చెప్పాడు. మా లగేజీ తీసుకుని బయటకు రాగానే వెహికల్ దగ్గర రెడీగా ఉన్నాడు. వెహికల్ లో ఎక్కి కూర్చున్నాం. అతను ఎవరితోనో ఏదో ఉర్దూ కలగలిసిన భాషలో మాట్లాడుతున్నాడు ఫోన్లో. బహుశా అది కాశ్మీరీ భాష అయ్యుండొచ్చని అనుకున్నాం. మాకు హిందీ అంతంత మాత్రమే వచ్చు. అందుకే అతనితో ఎక్కువగా ఏమీ మాట్లాడలేదు. అతను బండి చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. మాకు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు చెప్పినదాని ప్రకారం హోటల్‌లో చెకిన్ అయ్యాక టిఫిన్ చేసి గుల్మార్గ్ బయలుదేరాలి. మేము హోటల్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తుండగా దారి రెండు గా చీలి ఉన్న చోట అతను కుడి వైపుకు బండి తిప్పాడు. అక్కడ గుల్మార్గ్ వైపు అని రాసి ఉంది. అప్పుడు కానీ మాకు అర్థం కాలేదు అతను మమ్మల్ని డైరెక్ట్‌గా గుల్మార్గ్‌కి తీసుకెళ్తున్నాడు అని. వచ్చీ రాని హిందీలో అడిగాం ఎటు వెళ్తున్నావ్ అని. మీరు ఏం చూడాలనుకుంటున్నారు అని అడిగాడు. ముందు హోటల్‌కి తీసుకెళ్లి తర్వాత గుల్మార్గ్ వెళదామని చెప్పాము. అయితే మీరు గుల్మార్గ్ చూసినట్లే అన్నాడు. ఎందుకు అని అడగక ముందే మీరు ఇప్పుడు వెళితేనే గుల్మార్గ్‌ని ఎంజాయ్ చెయ్యగలరు. సాయంత్రం అయ్యేకొద్దీ అక్కడ ఏమీ ఉండదు. ఇక మీ ఇష్టం అన్నట్లు చెప్పాడు. మాకు ఫ్లైట్ లోనే టిఫిన్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆకలితో చచ్చేవాళ్ళమే. చూస్తుండగానే గుల్మార్గ్ దరిదాపులకు చేరుకున్నాం. అక్కడ బండి ఆపి ఒకతన్ని తీసుకువచ్చాడు డ్రైవర్ అజాజ్. తాను యూనస్ బక్షి అని, తాను ఒక గైడ్ అనీ పరిచయం చేసుకున్నాడు. చూస్తే అతను చాలా జెంటిల్‌మాన్‌లా కనిపించాడు. అతను గుల్మార్గ్‌లో ఎలా చూడొచ్చో ఏమేం చూడొచ్చో వివరంగా చెప్పాడు. అక్కడ గండోలా పాస్ అని పూర్తి మంచు ఉన్న ప్రదేశం రోప్ వే ద్వారా చూడొచ్చని అయితే దానికి ఆన్లైన్‌లో మూడు రోజుల ముందే బుక్ చేసుకోవాలని మీరు అలా బుక్ చేసుకోలేదు కనుక మీకు కుదరదని చెప్పాడు. అయితే కేవలం పైనుండీ మంచు చూడడం కంటే మీకున్న కొద్ది సమయంలో మంచి ప్రదేశాలు చూపిస్తానని చెప్పాడు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం గమ్ బూట్లు వింటర్ కోట్లు తప్పని సరిగా వేసుకోవాలని, లేదంటే ఆ చలికి మనం తట్టుకోలేమని చెప్పడంతో అందరం వాటిని అద్దెకు తీసుకున్నాం. ఇక మా వెహికల్‌లో గుల్మార్గ్ సైట్ సీయింగ్ కి బయలుదేరాం.

దార్లో అసలు విషయం చెప్పాడు యూనస్. మీరు అక్కడికి వెళ్ళాక తప్పని సరిగా గుర్రం ఎక్కాల్సి ఉంటుందని లేకపోతే, ఆ కొండల్లో ఎక్కడం సాధ్యం కాదని. మా శ్రీమతికి అలాగే మా చిన్నమ్మాయి కి గుర్రం ఎక్కడం అంటే భయం. అక్కడ గుర్రం నడిపించే వాళ్ళ సంఘాలు ఉంటాయి. వాళ్ళు ఎంత చెపితే అంత తప్పనిసరిగా వెళ్లాల్సిందే. కాదంటే వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం. ఒక వేళ కాదన్నా మనకున్న ఇంకో దారి మోటార్ బండి. అయితే దాని మీద వెళితే కొంత దూరం వరకే చూడగలం. ఇక చివరిది జీపులో వెళ్లడం. ఇలా అయితే చాలా లోపలికి వెళ్ళగలం. కొన్ని అరుదైన ప్రదేశాలు చూడగలం. దేని ప్రత్యేకత దానిదే. ఇక మీ ఇష్టం అన్నాడు గైడ్ యూనస్. ఎట్టకేలకు గుర్రం సంఘాల వాళ్ళు మా చుట్టూ మూగారు. మా గుర్రం ఎక్కండంటే మా గుర్రం అని వెంట పడ్డారు. మాకు కొంచెం నడుం నొప్పిగా ఉందని ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాం. బాగా చర్చించుకుని ఉన్న కొద్ది సమయంలో మంచి ప్రదేశాలు చూడాలని జీపులో వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మనం వఛ్చిన వెహికల్స్‌కి అక్కడ అనుమతి ఉండదు. అక్కడి వాళ్ళ జీపుల్లోనే వెళ్ళాలి. ముందుగా ఆర్మీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. మన ఆధార్ కార్డు లను ఆర్మీ వాళ్లకు ఇచ్ఛేయ్యాలి. వాళ్ళు ఒక చిన్న కాగితం ముక్క మీద ఎంతమంది వెళుతున్నాం ఎప్పటిలోగా తిరిగి రావాలి అన్నది రాసి ఇస్తారు. అంత లోగా తప్పక వచ్ఛేయాలి. ఆ ప్రాంతం మొత్తం ఆర్మీ వాళ్ళ అధీనం లోనే ఉంటుంది.

అనుమతులన్నీ అయ్యాక చూడ్డానికి బయలుదేరాం. అప్పటికే చలి బాగా వణికిస్తోంది. కానీ చుట్టూ ఎటు చూసినా పచ్చిక బయళ్లు, వరుసగా బారులు తీరిన పైన్ చెట్లు. దూరంగా మంచుతో నిండిన కొండలు. అక్కడక్కడా మంచు కరిగి పారే సెలయేళ్ళు. కళ్ళు మూసుకుని కెమెరా క్లిక్ మనిపించినా ఒక అందమైన దృశ్యం పట్టేయొచ్చు. అక్కడి పచ్చిక బయళ్లలో చిన్న పూలు పూసి రంగు రంగుల తివాచీలా పరిచి ఉన్నాయి. గైడ్ యూనుస్ అయితే మా మొబైల్‌తో ఎంతో అందమైన ఫోటోలు, వీడియో లు తీసి ఇచ్చాడు. అక్కడ తీసిన ఎన్నో హిందీ సినిమాల గురించి చెప్తుంటే మైమరచి పోయి చూస్తుండి పోయాం. కాసేపటికి ఒక పెద్ద మంచు వాగు దగ్గర ఆపి కాస్త సేద తీరమన్నాడు. నీళ్లు చాలా చల్లగా స్వచ్ఛంగా ఉన్నాయి. అక్కడ ఎక్కడా కరెంటు సరఫరాయే ఉండదట. చీకటి పడితే అక్కడ ఎవ్వరు ఉండరు. అందుకేనేమో అక్కడి నేల, గాలి, నీరు అంత స్వచ్ఛంగా ఉంటుందనిపించింది.

పక్షుల కిలకిలారావాలు, గాలి తాకిడికి చెట్లు చేసే సవ్వడులు ఇవి తప్పితే అక్కడ రణగొణ ధ్వనులు ఏవీ వినిపించవు. అలా అలా వెళ్తూ ఆకలి, అలసట మరిచిపోయాం. చివరికి ఒక కొండ క్రింద కు తీసుకు వెళ్ళాడు. అక్కడ తెల్లగా పేరుకుపోయిన మంచు ని ముద్దలుగా చేసి బాగా ఆడుకున్నాం. చూస్తుండగానే సమయం ఇట్టే గడిచిపోయింది. మాకు ఆర్మీ వాళ్ళు ఇచ్చిన గడువు దగ్గర పడడంతో ఇక తిరుగు ప్రయాణం పట్టాం. మాకయితే అక్కడి నుండీ రావాలని అనిపించనే లేదు. వస్తూ వస్తూ దారిలో ఒక వెజ్ దాబాలో కాశ్మీరీ దంఆలూ, రోటి, బిర్యానీ తిన్నాం. అక్కడికి దగ్గర్లోని కాశ్మీరీ బట్టల దుకాణంలో శాలువా, కుర్తా పైజామా, డ్రెస్ మెటీరియల్, ఒక శారీ కొన్నాం. అప్పటికే సాయంత్రం అయిపోవచ్చింది. వెళ్తూ గైడ్ యూనుస్ ను దింపేసి థాంక్స్ చెప్పి మేము వచ్చిన వెహికల్ లో శ్రీనగర్ కి బయలు దేరాం. శ్రీనగర్ చేరేటప్పటికి సాయంత్రం ఆరు. బాగా అలసి పోయాం. కానీ చెమట మాత్రం పట్టనే లేదు. డ్రైవర్ అజాజ్ తానూ చాలా దూరం వెళ్లాలని, మరుసటి రోజు ఉదయాన్నే వస్తానని సెలవు తీసుకున్నాడు. ఆ రోజుకి హోటల్ లోనే విశ్రాంతి తీసుకున్నాం. ఆ చలికి మాకు మొహాలు కూడా కడుక్కోవాలనిపించలేదు.

రూమ్‌లో ఏ.సి. ఆఫ్ చేసి డిన్నర్ సమయం అయ్యే దాకా ముసుగు తన్ని పడుకున్నాం.

సమయం ఏడున్నర కాగానే హోటల్ వాళ్ళు ఇఛ్చిన కాంప్లిమెంటరీ డిన్నర్ తినడానికి హోటల్ క్రింది ఫ్లోర్‌లో ఉన్న డైనింగ్ హాల్‌కి వెళ్ళాం. వేడి వేడి రోటీలు ఆలూ కర్రీ , జీరా రైస్ తీసుకున్నాం. ఇంకా ఏవేవో నాన్ వెజ్ వంటలు ఉన్నాయి. వాటి వైపు చూడను కూడా చూడలేదు. గబా గబా తినేసి రూమ్ కి వఛ్చి పడుకున్నాం. రాత్రంతా ఒకటే వణుకు. తిరిగి తిరిగి అలసి పోయాం కాబట్టి నిద్ర పట్టింది గానీ లేకపోతే ఆ చలికి నిద్ర పట్టడం కష్టమే.

***

మరుసటి రోజు ఉదయాన్నే లేచి నేనైతే వేడి నీటి స్నానం చేసి రెడీ అయిపోయాను. శ్రీమతిని, అమ్మాయిని లేపే తప్పటికే నీళ్లు గోరు వెచ్చగా వస్తున్నాయి. ఏదో స్నానాలు అయ్యాయనిపించి రెడీ అయ్యాం. ఇంతలోనే డ్రైవర్ అజాజ్ ఫోన్ చేసాడు. నువ్వు ఎంత సేపట్లో వస్తావని అడిగాను. నేను వఛ్చి అరగంటయ్యింది అని మళ్ళీ ఝలక్ ఇచ్చాడు. ఇలా ట్రిప్ అంటా ఝలక్ లిస్తూనే ఉన్నాడు. సరే.. ఉన్న అరపూట శ్రీనగర్ లో ముఖ్యమైన ప్రదేశాలు చూడాలి అని గబా గబా టిఫిన్ తిని బయలు దేరాం. అజాజ్ మాకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో డాల్ లేక్ చూడకుండా ఉండలేం కాబట్టి ముందు అక్కడికి వెళదామని నిర్ణయించు కున్నాం. మా ప్యాకేజీలో డాల్ లేక్‌లో షికారా రైడ్ కలిపి ఉంది. అందుకే నేరుగా డాల్ లేక్ కి వెళ్ళాం. అక్కడ ఒక పడవ లో ఎక్కి కూర్చున్నాం. లేక్ లో నీరు ఎంతో స్వచంగా ఉంది. మేము పడవ ఎక్కింది మరుక్షణం మరో పడవ లో ఒకతను వేడి వేడి కాఫీ కావాలా, చాయ్ కావాలా అంటూ వచ్చాడు. అప్పుడే టిఫిన్ కాఫీ తీసుకుని ఉండడంతో వద్దని చెప్పాం. అంతలోనే ఇంకో పడవ మాకు దగ్గరగా వచ్చింది. అందులో ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. కాశ్మీరీ దుస్తులు వేసి ఫోటో తీస్తానని వెంట పడ్డాడు. సరే మా అమ్మాయికి ఫోటో తీయిద్దామని అనుకున్నాం. ఆతను తన పడవలోకి వస్తే డ్రెస్ చేసి ఫోటో తీస్తానని చెప్పాడు. అమ్మాయి భయపడుతూ అయిష్టం గానే ఆ పడవ లోకి వెళ్ళింది. కాశ్మీరీ డ్రెస్ వేసి ఓ పది ఫోటోలు తీసాడు. మీరు అలా తిరిగి వచ్చేలోపు ఫోటోలు ఇస్తానని వెళ్లి పోయాడు.

ఇంతలోనే మరో పడవలో కాశ్మీరీ నగలు, గాజులు చూడమని వచ్చాడింకో ఆతను.

అవీ ఇవీ చూపించి ఒక వెయ్యి రూపాయల వస్తువులు కొనిపించాడు. అక్కడ డాల్ లేక్ మధ్యలోనే కొయ్య ప్లాట్‌ఫారం లాగ చేసి వాటి మీదనే షాప్‌లు పెట్టుకుని ఉంటారు. షాపింగ్ సంగతటుంచితే అక్కడి నీటి సవ్వడులు, వాటి మీద తిరుగాడే బాతులు, పక్షులు చూస్తూ ఉంటె సమయమే తెలియదు.

ఇంతలోనే ఇంకో పడవలో కాశ్మీరీ కుంకుమ పువ్వు తీసుకుని వచ్చాడింకో అతను. తాము స్థానికంగా ఉండే గిరిజన జాతి వాళ్లమని, మా జీవనాధారం ఇదేనని కుంకుమ పువ్వుని కొనమని ఒకటే బలవంత పెట్టాడు. కాశ్మీర్ వెళ్లి కుంకుమ పువ్వు తీసుకు రాకుండా ఉండడం బాగోధనిపించి ఓ యాభై గ్రాముల కుంకుమ పువ్వు కొన్నాం. నిజానికి అది చాలా నాణ్యమైనదీ అలాగే రేటు కూడా తక్కువ. అదే మన హైదరాబాద్‌లో అయితే రెట్టింపు రేటు పెడితే గానీ కొనలేం. ఇంకా షాపింగ్ చెయ్యమని కాసేపు ఆగుతానని చెప్పాడు పడవ నడిపే ఆతను. వద్దులే అని చెప్పినా కాసేపటికి పడవను మెల్లిగా ఓ నీటిమీద తేలియాడే షాప్ ముందు ఆపాడు. మేము వద్దని చెప్పేంత లోనే అతను చెప్పిందేంటంటే పడవలో నీరు చేరిందని అదంతా తోడేటందుకు కొంత సమయం ఆగాలని… అంత లోపున అలా షాపులు చూసి వచ్చేయండని.

అప్పటికి గానీ మాకు బోధపడలేదు మేము పడవలో తిరిగిన దానికి ఇచ్చే డబ్బుకంటే ఎన్నో రెట్లు మనతో కొనిపిస్తారు వీళ్ళు అని. ఏదేమైనా అలా కొనడం కంటే అక్కడ షాపింగ్ చెయ్యడమే ఓ మధురానుభూతి అని వేరే చెప్పాలా. అతను పడవలో నీళ్లు తోడెంతలోపే మా చేత డ్రై ఫ్రూట్ షాపులో ఓ వెయ్యి రూపాయల షాపింగ్ చేయించాడు. సమయం లేదు గానీ ఇంకా మా చేత ఏవేవో కొనిపించే వాడే. ఇక చాల్లెమ్మని వాపసు బయలుదేరాం. గంట అనుకున్నది రెండు గంటలు తిరిగాం డాల్ సరస్సులో. అప్పటికే సమయం పదకొండు కావస్తోంది.

మొఘల్ గార్డెన్స్ కి వెళతారా, శంకరాచార్య టెంపుల్‌కి వెళతారా చెప్పండని అడిగాడు డ్రైవర్ అజాజ్. రెండు రోజుల నుండి ఏదో ముస్లిం దేశంలో ఉన్న అనుభూతి మాకు. ముందు రోజు మేము చూసిన గుల్మార్గ్ ముందు ఎన్ని తోటలు అయినా దిగదుడుపే అనిపించింది మాకు. మళ్ళీ అవే చెట్లు పూల మొక్కలు ఏం చూస్తాం లెద్దూ అని శంకరాచార్య గుడికి వెళదామని చెప్పాం. సరే అని అటువైపు తీసుకెళ్లాడు. శంకరాచార్య గుడి నిజానికి ఒక శివాలయం. అక్కడి శివుణ్ణి జ్యేష్ఠేశ్వరుడని అంటారు. ఆ గుడిని క్రీ.పూ.200లో జబర్వాన్ పర్వత శ్రేణులపైన 1100 అడుగుల ఎత్తులో నిర్మించారు. దీన్ని అశోకుడి కొడుకు జాలుకుడు నిర్మించాడట. ఇక్కడికి వెళ్లాలంటే బాగా ఎత్తుగా ఉన్న సుమారు 250 రాతి మెట్లు ఎక్కి వెళ్ళాలి. మా జీపు ఒక పాయింటు వరకే వెళుతుంది. అక్కడి నుండి మెట్ల వరకు ఆటోలో వెళ్ళాం. అక్కడి నుండి ఎక్కుతున్న కొద్దీ మెట్లు వస్తూనే ఉన్నాయి. సగం దూరం వెళ్ళాక కానీ తెలీలేదు అవి 250 ఉన్నాయని. ఏమైతేనేం చాలా రోజుల తర్వాత వినబడుతున్న దక్షిణాది యాసలో సంస్కృత శ్లోకాలు, ఆంగ్లంలో అక్కడి చరిత్ర చెపుతూ స్వాగతం చెపుతున్న మాటలు వింటూ ఆయాసం అనిపించినా సరే పైకి చేరుకున్నాం. ఆ ప్రాంతం అభివృద్ధి చెందడంలో ఆర్మీ వాళ్ళ పాత్ర కూడా ఉందని తెలియ చెప్పే బోర్డులు అక్కడక్కడా తారస పడ్డాయి మాకు. ఆది శంకరాచార్యుల వారు అక్కడికి వచ్చారని అందుకు గుర్తుగా ఆయన విగ్రహం కూడా ప్రతిష్ఠించారని తెలుసుకున్నాం. అక్కడికి వెళ్ళాక కానీ మాకు హిందూ దేశంలో ఉన్నామని గుర్తుకు రాలేదు. అంతలా ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రదేశం కాశ్మీర్ అంటే అతిశయోక్తి కాదు.

జ్యేష్ఠేశ్వరున్ని దర్శించుకుని కాస్త సేద తీరుదామని అక్కడే ప్రకృతిని ఆస్వాదిస్తూ కూర్చున్నాం కాసేపు. పైనుండి చూస్తే దాదాపు శ్రీనగర్ మొత్తం కనబడుతుంది. పైనుండి డాల్ లేక్ మొత్తం ఎంతో అందంగా అందులో రంగు రంగుల పడవలు, హౌస్ బోట్‌లు ఒద్దికగా ప్రకృతి గీసిన అద్భుతమైన పెయింటింగ్‍లా కనిపిస్తుంది శ్రీనగర్ ముఖ చిత్రం. భోజన సమయం దగ్గర పడుతుండడంతో ఇక గబా గబా మెట్లు దిగి వచ్చేశాం. మళ్ళీ ఆటో ఎక్కి మా జీపు దగ్గరికి వచ్చే టప్పటికి ఒంటి గంట అవుతోంది. బాగా ఆకలి అవుతోంది. వస్తూ ఒక చిన్న పూదోట వద్ద ఆగి ఫోటోలు దిగాం. మాకు సాయంత్రం అయిదింటికి ఢిల్లీకి ఫ్లైట్. అక్కడ ఆర్మీ చెకింగ్ అవడానికి బాగానే టైం పడుతుంది. కాబట్టి మూడింటి కల్లా ఎయిర్ పోర్ట్ చేరుకోవాలి. కాస్త తీరిగ్గా కూర్చుని లంచ్ చేద్దామని మంచి రెస్టారెంట్‌కి తీసుకెళ్లమని చెప్పాము. శ్రీనగర్ మెయిన్ రోడ్డు లో ఉన్న ఒక రెస్టారంట్ కి తీసుకెళ్లాడు డ్రైవర్ అజాజ్. వెళ్లి కూర్చోగానే వెయిటర్ వచ్చి మెనూ కార్డు ఇచ్చాడు. మీరెక్కడి నుండీ వస్తున్నారని అడిగాడు. హైద్రాబాదు అని చెప్పగానే ఓ బాలయ్య బాబు కా షహర్ హై నా ..? అని అనగానే బాలకృష్ణ గారికి కాశ్మీర్లో కూడా గుర్తింపు ఉందా అని ఆశ్చర్యపోయాం. బట్టర్ రోటి, మష్రూమ్ కర్రీ తీసుకున్నాం. ఇంకా ఏమైనా తీసుకుందామనుకున్నాం గానీ కడుపు నిండి పోయింది. ఏదైనా డిజర్ట్ ట్రై చెయ్యొచ్చుకదా అని అడిగాడు వెయిటర్. ఏదైనా మీరే ఇవ్వండని చెప్పాము. వాల్నట్ ఐస్ క్రీం విత్ కాశ్మీరీ హనీ అని ఇచ్చాడు. నిజంగా చాలా చాలా బాగుంది. అది ఎంత తియ్యగా, మధురంగా ఉందో అంతకంటే మధురానుభూతుల్ని మది నిండా నింపుకుని భారమైన హృదయాలతో శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ చేరుకున్నాం.

ఉన్నది రెండు రోజులే అయినా ఓ ఇరవయ్యేళ్లు గుర్తుండి పోయేలా చేసిన మా కాశ్మీర్ యాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. కాదని చెప్పాలని ఉంటే ఓ సారి కాశ్మీర్ వెళ్లి రండి… అప్పుడు మీరే చెపుతారు మేమన్నది నూటికి నూరు పాళ్ళు నిజమని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here