[dropcap]శ్వే[/dropcap]త నీలికాంతి ధారల్లో
ఎంత తడిచినా చిరగని కాగితం పై
చెరగని అక్షరాలకు నా కవిత్వమంటే
సముద్రానికున్నంత సహనం ఉంది
అలల వరుసల పై కలల అక్షరాలని రాసి
నురగ నవ్వుల తీరానికి నా కవిత్వమంటే
సముద్రానికి ఉన్నంత అలసట ఉంది.
విడిసొచ్చిన పొలిమేర బక్కచిక్కిన పంటకాలువ
ఊడలూగిన మర్రిచెట్టు బరిగీసి గిరికీలు కొట్టిన
పల్లెతల్లి ఒడికి నా కవిత్వమంటే
సముద్రానికి ఉన్నంత పసితనముంది.
ధూళిపొరలను నోరార చవిచూస్తూ
ఏడ్చి ఏడ్చి మేఘాలతో మొఖం కడుకుంటున్న
ఆకాశానికి నా కవిత్వమంటే
స్తన్యం మీదగా తుళ్ళిపడ్డ అమ్మ అశృవుకున్నంత
తీయ్యందనముంది.
చెట్లవెనుక చిరుచీకటి కిటికీలొంచి తొంగిచూస్తూ
సంద్య వారలో జారుతున్న అస్తమయానికి
వదిలెళ్ళిన గూడును చేరుకునే
గువ్వల జంటకున్నంత గుబులు ఉంది.
శిశిరాన్ని తరుముతూ వసంతాన్ని తడుముకుంటూ
సొనలుకారుతూ వగరుల చిగురులు తింటున్న కోయిలకి
నా కవిత్వమంటే….. పొదుగును గుద్దుతూ కడుపారా తాగి
గంతులేసే లేగ గిట్టలకున్నంత పొగరుంది.
పునాదులు కూలిన రాజసౌధం మీద నుండి
ఎగిరిపోయిన పావురాళ్ళకు నా కవిత్వమంటే
రాలినాకుల గలగలలకు రెపరెపలాడిన
ఆ రెక్కలకున్నంత బెదురుతనముంది.
తడిసిన ఆ నీలికాంతి ధారకి రాలినాకుల
గలగలలకు నా కవిత్వమంటే
అక్షరానికి ఉన్నంత ఆనందం ఉంది.