[dropcap]ప్ర[/dropcap]స్తుత సమాజపు తీరుతెన్నులపై స్పందించి తన అభిప్రాయాలను తెలియజేస్తూ, వివిధ సమస్యల పరిష్కారానికి సలహాలు, సూచనలు అందిస్తూ శ్రీ ఉప్పల గోపాలరావు రచించిన పుస్తకం ‘నా మాటల మూట’.
‘ప్రజా ఆలోచనా వేదిక’ అనే సంస్థ ద్వారా ప్రజలలో సామాజిక చైతన్యానికై కృషి చేస్తూ – పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. సీనియర్స్ సిటిజన్స్ సంఘం ద్వారా వయోధికులకు ఉత్సాహం కలిగిస్తున్నారు. సమాచర హక్కు చట్టం ద్వారా పౌర సమాజాన్ని బలోపేతం చేస్తున్నారు రచయిత.
“తెలుగు సాహిత్య రూపాలలో పండితుడి కాని, ఒక సామాన్యుడి ఆలోచనలతో, అభిప్రాయాలతో పలికే మాటలే ‘నా మాటల మూట’ రూపం” అని తెలిపారు రచయిత.
సామాన్య ప్రజలలు ఏ విషయమైనా తేటతెల్లంగా తెలియజేయటమే సాహిత్య ప్రయోజనం, భాషా ప్రయోజనం అని అంటారు ‘ఉ గో రా’గా ప్రసిద్ధులైన రచయిత.
ఈ పుస్తకంలో రచయిత భావాల గురించి పలువురు ప్రముఖుల ముందుమాటలు, అభిప్రాయాలు ఉన్నాయి.
***
ప్రజాస్వామ్య వ్యవస్థపై తన భావాలను వెల్లడించి, వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలపై ఆవేదన వ్యక్తం చేస్తారు రచయిత. దారితప్పిన ప్రజాస్వామ్యాన్ని చైతన్యవంతులైన ప్రజలు మేధావులు గాడిలో పెట్టాలని సూచిస్తారు.
ప్రజాబలంతో పాటు ధర్మబలం, న్యాయబలం, నిజం బలం, చట్టబలం తోడైతే ప్రజాస్వామ్యానికి మరింత బలమని వ్యాఖ్యానిస్తారు.
పాలనలో ప్రజల ప్రమేయం ఉండాలని, బాధ్యతగల పౌరసమాజం ఏర్పడాలని భావించారు.
అనుభవం గల మేధస్సు మూగపోకూడని అంటూ భయాలను తొలగించే పాలన కావాలని ఆశిస్తారు. ఏది సుపరిపాలనో తెలుపుతారు.
అసంతృప్తి పాలనకు కారణాలేమిటే వెల్లడించి, వాటిపై చర్చలు జరగాలని, అప్పుడే సుపరిపాలనకు మార్గం ఏర్పడుతుందని అన్నారు.
చీకటి లేని పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, ఇందుకు నాయకులు, ప్రజలు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని అన్నారు.
పాలకుల తప్పులను అద్దంలో చూపించేలా ప్రజా సాహిత్యం రావాలని ఆశించారు.
ప్రజలలో పోరాటపటిమ లేకపోతే, సమాజం తుప్పు వదలడం కల్ల అని వ్యాఖ్యానించారు రచయిత.
అవినీతి గురించి చెప్తూ – చట్టవ్యతిరేకంగా సంపాదించేవారు సమాజానికి హానికారకులని అంటారు. అక్రమార్జన సంస్కృతిని అదుపుచేయాలని అంటారు.
అక్రమార్జన, మతపిచ్చి రెండూ సమాజానికి హానికారమని అంటారు. అవసరాలు, వనరులకు మధ్య ఉండాల్సిన సత్సంబంధాలే విలువలని పేర్కొన్నారు రచయిత.
కాలచక్రం గిర్రున తిరిగి రాచరికం నుంచి ప్రజాస్వామ్యానికి వచ్చామని; అయితే ఇప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్య రాచరికం వైపు మళ్ళుతున్నామని, మోడరన్ బానిసలమవుతున్నామని భావించారు రచయిత.
ప్రజల భయాలను రూపుమాపేందుకు పోలీసు వ్యవస్థని సంస్కరించాలని సూచిస్తారు. నేటి బలాల పోటీలో నిజం మీద అబద్ధం గెలిచించిందని, ఇది సమాజాని ప్రమాదకరమని వ్యాఖ్యానిస్తారు.
‘నే ఎదిగితే నా వంక చూస్తుంది ఈ సమాజం/నే తరిగితే నన్నే మరిచిపోతుంది ఈ సమాజం’ అంటూ చెణుకు విసురుతారు.
కలలు కన్న జీవితాన్ని కాలుష్యం ఎలా భగ్నం చేసిందో చెప్తారు. తనని ఆవరించవద్దని దిగులు దేవతని కోరుకుంటారు. స్వర్గం-నరకం అంటే ఏమిటో తెలిపారు.
కరోనా లాక్‌డౌన్ సందర్భంగా జనాలు పడిన కష్టాలను ప్రస్తావించారు. పేదవారిని కరోనాతో పాటు బతుకు భయం కూడా లొంగదీసిందని వ్యాఖ్యానించారు.
దేవుడు, శాస్త్రవేత్తలు ఎంతో గొప్పవారని అంటారు. తనకు సంగీతం నేర్పిన పూజారి గారిని, ఈత నేర్పిన గౌస్ మామని తలచుకుని వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు.
సమాజ శ్రేయస్సు కోసం వీరు చేసిన సూచనలను పాటించగల్గితే చైతన్యవంతమైన నవసమాజం ఆవిర్భవిస్తుంది.
***
నా మాటల మూట
రచన: ఉప్పల గోపాలరావు
పేజీలు : 62
వెల: అమూల్యం
ప్రతులకు : ఉప్పల గోపాలరావు,
బ్లాక్ -15, ప్లాట్ – 107,
రెయిన్ ట్రీ పార్క్,
మలేషియా టౌన్ షిప్, కె.పి.హెచ్.బి.
హైదరాబాద్ – 500085,
ఫోన్ : 9440053099
vuppalagopalarao@gmail.com