Site icon Sanchika

నా మొహం నాదే!

[box type=’note’ fontsize=’16’] ఆంగ్లంలో వికాస్ ప్రకాష్ జోషీ రచించిన పిల్లల కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. [/box]

[dropcap]”ఆ[/dropcap]ల్ ది బెస్ట్ సిన్నమన్. నువ్వు రాణిస్తావ్” అన్నాడు నాన్న కొడుకు తల నిమురుతూ. అమ్మ వెన్నుతట్టింది. కారుని పార్కింగ్‌లో ఆపి కొన్ని క్షణాలు అక్కడ నిలుచున్నారు. సిన్నమన్ లేదా రోషన్ పరాంజపే (అసలు పేరు) ముఖం చిట్లించుకొని ఉన్నాడు. చిన్నప్పుడు రోషన్‌కి ‘సిన్నమన్’ (దాల్చిన చెక్క) అనే ఇంగ్లీషు పదం పలకడం సరిగా వచ్చేది కాదు. దాన్ని సిమ్మమామ్ అనో సిమ్మనుమ్ అనే అనేవాడు. అందుకని అమ్మానాన్నలు సరదాగా వాడిని సిన్నమన్ అని పిలిచేవారు, దాంతో ప్రతీ ఒక్కరూ అలానే పిలవసాగారు. చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు సరదానే ఉందేది, కానీ పెద్దయ్యాకా ఆ పిలుపు అతనికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడతనికి 11 ఏళ్ళ వయసు, ఎందరినో ఆకర్షించాలి, అందుకని తన ముద్దుపేరంటే ఇబ్బందిగా ఉంది. తన అసలు పేరు ‘రోషన్’ అనే పిలిపించుకోవాలని ఉంది. రోషన్… రోషన్ రిశీకేశ్ పరాంజపే.

కానీ ఇది పేర్ల కోసం వాదించుకునే రోజు కాదు. పూణె అండర్-13 ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిఫ్ ఫైనల్ జరిగే రోజు. తన జట్టు డైమండ్ ఇంటర్నేషనల్ స్కూల్ (డిఐఎస్)కు సిన్నమన్ గోల్‌కీపర్. నాన్నా, అమ్మా బిడ్డని కౌగిలించుకుని వీడ్కోలు చెప్పారు. సిన్నమన్ వెళ్ళి తోటి ఆటగాళ్ళతో కలిసాడు. అమ్మానాన్నలిద్దరూ – మిగతా తల్లిదండ్రులతో కలిసి – ప్రేక్షకులలో కూర్చున్నారు.

ఈ పోటీ డిఐఎస్ జట్టుకు, రాయల్ నేషనల్ అకాడమీ జట్టుకు మధ్య. రాయల్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్. పూణె లో సెప్టెంబర్ తొలిపొద్దు సూర్యకాంతిలో తడిసిన ఖడ్కీ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో నినాదాలు దద్దరిల్లుతున్నాయి. ‘గో డిఐఎస్’, ‘కమాన్ రాయల్’ అని రెండు జట్ల మద్దతుదారులు గట్టిగా అరుస్తున్నారు. డిఐఎస్ జట్టు గోల్‌కీపర్ అయిన సిన్నమన్ తన గ్లవుజులని, గ్రీన్ ఫుట్‌బాల్ జెర్సీని సరిచేసుకున్నాడు. ఒత్తిడిగా ఉండడంతో వేళ్ళు నొక్కుకుంటున్నాడు. పెనాల్టీ కిక్‌ని అడ్డుకోవడం ముఖ్యమని అతనికి తెలుసు. ‘డిఐఎస్’ అంటే డైమండ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు ఛాలెంజర్ కాగా, ‘రాయల్’ అంటే రాయల్ నేషనల్ అకాడమీ (ఆర్‌ఎన్‌ఎ) జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ కావడంతో పోటీ ఉత్కంఠగా ఉండబోతోంది.

***

స్కోర్ బోర్డు డిఐఎస్‌కు అనుకూలంగా 2:1తో ఉంది. గత పదేళ్ళలో తొలిసారిగా డిఐఎస్‌కు రాయల్ జట్టు (ఆర్‌ఎన్‍ఎ)ని ఓడించి ఛాంపియన్ అయ్యే అవకాశం వచ్చింది. మెరూన్ షర్ట్స్, షార్ట్స్, సాక్సులతో ఉన్న ఆర్‌ఎన్‍ఎ జట్టు మైదానంలో ఎడమవైపు నిలుచుంది. దానికి వ్యతిరేక దిశలో ఆరవ తరగతి డిఐఎస్‌ జట్టు తమ ఆకుపచ్చ రంగు దుస్తులలో ఉంది. సిన్నమన్ తన కుడివైపుకి – తమ మద్దతుదారులు, ఆకుపచ్చ దుస్తులు ధరించిన తల్లిదండ్రులు, మిత్రులు కూర్చున్న దిశగా చూశాడు. వాళ్ళంతా చేతుల్లో మంచినీళ్ళ సీసాలు, అరటిపళ్లు, గాటోరేడ్ సీసాలు, ఎలెక్ట్రాల్ పౌడర్లు పట్టుకుని ఉన్నారు. అవన్నీ యంగ్ అథ్లెట్ల్‌లకి అవసరమైనవే.

నాన్న ఆకుపచ్చని పోలో-టీ షర్ట్, జీన్స్ ధరించి, తన ఐపాడ్‍లో మ్యాచ్‌ని రికార్డు చేస్తూ కనిపించాడు సిన్నమన్‍కి. అమ్మ తెల్లని కమీజ్, ఆకపచ్చని సల్వార్ వేసుకుని నాన్న పక్కనే కూర్చుంది “గో సిన్నమన్, గో” అనీ, “కమాన్ సిన్నమన్” అనీ అరుస్తూ సిన్నమన్‌ని ఉత్సాహపరుస్తోంది. నోట్లో రెండు వేళ్ళూ పెట్టుకుని గట్టిగా ఈల వేసింది. సిన్నమన్ చిన్నారి నేస్తం పల్లవి – సిన్నమన్ తండ్రికి అటువైపు కూర్చుని ఉంది. ‘ఈస్ట్ ఆర్ వెస్ట్, డిఐఎస్ ఈజ్ ద బెస్ట్’ అనే ప్లకార్డు పట్టుకుని ఉంది.

సిన్నమన్ ముందుకు చూశాడు. ఫీల్డులో తన మిత్రులు – కెప్టెన్ హర్‌ప్రీత్, ఛోటా సిద్ధు, ఉత్తమ డిఫెండర్ ఓణమ్ కుట్టీ, ఇంకా జట్టులోని ఇతర సభ్యులు కనబడ్డారు. కోచ్ శెట్టి సార్ కొద్దిగా ఒత్తిడిలో ఉన్నట్టు అనిపించింది. వాళ్ళందరి ముఖాల్లో కూడా ఒత్తిడి కనబడింది సిన్నమాన్‌కి. గట్టిగా ఊపిరి తీసుకుని, చిన్న శ్లోకం చదువుకున్నాడు.

ఆర్‌ఎన్‍ఎ జట్టులోని ఉత్తమ స్ట్రైకర్, రిషబ్ కేశ్వానీ, డిఫెండింగ్ ఛాంపియన్స్ కోసం పెనాల్టీ కిక్‍‌కి సిద్ధంగా ఉన్నాడు. ఈ టోర్నమెంటు అందరికన్నా ఎక్కువ గోల్స్ రిషబ్ చేశాడు. తోటి ఆటగాళ్ళు “గో రిషబ్” అనీ, “కమాన్ రిషబ్” అనీ ఉత్సాహపరుస్తున్నారు. సొగసుగా ఉండే తన జుట్టుని వెనక్కి దువ్విన రిషబ్, తల అంతా చెమటతో తడిసిపోయి ఉండగా, బాల్ వైపు పరిగెత్తాడు.

సరిగ్గా అప్పుడే కోచ్ శెట్టి సార్ చెప్పిన మాటలు సిన్నమన్‍కి గుర్తొచ్చాయి – “చూడూ, రిషబ్ ఎక్కువ గోల్స్ టాప్ లేదా బాటమ్ లెఫ్ట్ హ్యాండ్-కార్నర్ నుంచీ కొడుతున్నాడు. అంటే ఆ సైడు నీకు కుడి అవుతుంది.”

సిన్నమన్ గట్టిగా ఊపిరి తీసుకుని, కిందకి వంగాడు. గోళ్ళు అతని తొడలకి గుచ్చుకుంటున్నాయి. ప్రేక్షకులంతా ఆదుర్దాగా లేచి నిలుచున్నారు.

ధడ్!

సిన్నమన్ కుడివైపుకు దైర్యంగా దూకాడు. నేలకి వాలుతూ, గోల్ పోస్ట్‌కి సమీపంగా వచ్చాడు. కాలం నిలిచిపోయినట్లయింది.

సిన్నమన్ పైకి లేచేసరికి, పాలిపోయిన రిషబ్ మోహం చూస్తే అర్థమయిపోయింది ఏం జరిగిందో.

Image illustrator Niloufer Wadia.

రిషబ్ కిక్ కొట్టిన వేగానికి సిన్నమన్ చేతులు, శరీరం అదిరాయి, కానీ తట్టుకున్నాడు. కింద పడినా, పట్టించుకోలేదు. తన జట్టు కెప్టెన్ హర్‌ప్రీత్ సిన్నమన్ వైపు పరుగెత్తుకొచ్చాడు. “కంగ్రాట్స్ లంబూ” అంటూ అరిచి, కౌగిలించుకున్నాడు.

“కంగ్రాట్స్ సిన్నమన్”

“గోల్ కీపర్ ఎలా ఉండాలి? సిన్నమన్‌లా ఉండాలి”

ఈ నినాదాలు అతని చెవులకి సంగీతంలా ఉన్నాయి. పదేళ్ళ తరువాత డిఐఎస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలిచింది. కోచ్ శెట్టి సార్ సిన్నమన్‌ని తన భుజాల మీద ఎత్తుకున్నాడు. జట్టంతా కలిసి మైదానం చుట్టూ ప్రేక్షకులకు అభివాదం చేస్తూ పరిగెత్తారు.

రెండు జట్లూ, ఫోటోల కోసం చేరాయి. ఇరు జట్ల సభ్యులు నడుం దాకా వచ్చే మెడల్స్ ధరించారు. విజేతలకిచ్చే పెద్ద ట్రోఫీ మధ్యన ఉంది. రిషబ్‌కి ‘హైయస్ట్ గోల్ స్కోరర్’ అవార్డు, సిన్నమన్‌కి ‘బెస్ట్ గోల్ కీపర్’ అవార్డు లభించాయి. తల్లిదండ్రులు అందరూ వచ్చి పిల్లలతో ఫోటోలు దిగారు.

పిల్లలందరూ ఇంటికి వెళ్ళేడప్పుడు స్కూల్ బస్ ఎక్కారు. ఇక్బాల్ సినిమాలోని ‘ఆశాయేఁ’ పాటని ఉత్సాహంగా పాడారు. ఇది తన జీవితంలో అత్యుత్తమమైన రోజుగా భావించాడు సిన్నమన్.

చెమట పట్టిన ముఖం మీద నుంచి వీస్తున్న గాలి తాజాగా ఉంది.

బస్ అతన్ని ఇంటివద్ద దింపింది. సొసైటీ పార్కింగ్ లాట్‌లో ఎర్రటి స్కోడా ఆక్టేవియా కారును చూడగానే ఉత్సాహం కలిగింది. సాధారణంగా అమ్మ సాయంత్రం ఏడు గంటలు దాటితే గాని ఇంటికి రాలేదు.

అమ్మా, నాన్న ఇద్దరూ నాన్న హోమ్ ఆఫీస్‍లో కూర్చున్నారు. అమ్మ తాను చదువుతున్న ఎర్రటి పెద్ద న్యాయశాస్త్ర పుస్తకాన్ని పక్కనబెట్టి సిన్నమన్‍ని గట్టిగా హత్తుకుంది.

“అభినందనలు” అన్నాడు నాన్న సిన్నమన్‌కి హై-ఫైవ్ ఇస్తూ. నడుం మీద తట్టాడు. భోజనంలోకి పూరి, ఆమ్రా, బటా చి భాజీ చేసింది అమ్మ.

సిన్నమన్ ఆట గురించి చెప్తున్నాడు, అతడి కళ్ళు మెరుస్తున్నాయి. “రిషబ్‌ని కంట్రోల్‍లో ఉంచాలని మాకందరికీ తెలుసు. అందుకని మా జట్టంతా అతనితో జాగ్రత్తగా ఉన్నారు. హర్‍ప్రీత్ రెండు గోల్స్ చేశాడు. తర్వాత రిషబ్ ఒక గోల్ చేశాడు. నేను చివరిదాకా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. ఆ పెనాల్టీ కిక్ ఎంతో ఉత్సాహాన్నిచ్చింది.”

“హర్‌ప్రీత్ రెండు గోల్స్ చేశాడు, కానీ నువ్వేన్నో ఆపావు. సర్దార్, అసర్‌దార్ – గెలుపు జోడీ” అన్నాడు నాన్న.

“నేను చిన్నప్పుడు బడిలో ఆటల్లో రాణించాను, వీడు ఎంతైనా నా కొడుకు” అంది అమ్మ. ఆ మాటలు అంటూ పిల్లాడి తల తట్టింది.

“ఓయ్, వసుంధరా ఘోషల్ పరాంజపే…. నువ్వు స్కూల్లో అన్ని సబ్జెక్టులలో ఫస్ట్ వచ్చావు. పైగా స్పోర్ట్స్ ఛాంపియన్‌వి కూడా! ఇంతకీ నువ్వే స్కూల్‍లో చదివావు చెప్పు” అన్నాడు నాన్న.

ఆ మాటల్ని పట్టించుకోలేదు అమ్మ. వడ్డనలో లీనమైపోయింది. అయితే అమ్మ కాలికి నాన్న పాదం తగిలిన భావన నాన్న ముఖంలో కదలాడింది.

సిన్నమన్ అమ్మా,నాన్నల ముఖాల కేసి చూశాడు. హఠాత్తుగా అతనికేదో తట్టింది.

“అమ్మా, నాది ఎవరి ముఖం? నీదా, నాన్నదా?”

అమ్మ జాగ్రత్తగా జుట్టు సవరించుకుంది. ఆమెది లేటెస్ట్ హెయిర్ స్టయిల్. తను కాస్త చామనచాయ, జిడ్డు కారే చర్మం. పొట్టిగా ఉంటుంది.

నాన్న నవ్వాడు. తన పొడుగాటి కాళ్ళని సాగదీశాడు. ఆయన కళ్ళలో సన్నని మెరుపు. “అయినా నువ్వు మాలాగా ఎందుకు కనబడాలనుకుంటున్నావు? నీ అందం నీది” అన్నాడు.

***

నిద్రపోయే ముందు సిన్నమాన్ అద్దంలో చూసుకున్నాడు. అద్దంలో అబ్బాయి కూడా అలాగే చేశాడు. పిల్లాడు కలవరపడలేదు. ప్రతీ రోజూ ఉదయాన్నే చూసే మొహమే అయినా, ఈ మధ్య కాలంలో తరచూ చూసుకుంటున్నాడు.

పదునైన దవడలు, నల్లటి చర్మం, ముడతలుగల జుట్టు! చాకొలెట్-రంగు కళ్ళు – వాటి గుండా ఉత్సాహ పూరితమైన, అల్లరి చూపులు – తనకేసి తిరిగి చూశాయి. అవును, అతనే సిన్నమన్, అసలు పేరు రోషన్ రిశీకేశ్ పరాంజపే, తన అమ్మానాన్నల కంటే భిన్నంగా ఉన్నాడు – ముఖ్యంగా తండ్రి రూపు రాలేదతనికి. ఆ మాట ఎన్నోసార్లు విన్నాడు. ఒక్కోసారి ఉత్సాహ పూరితమైన స్వరంలో, ఒక్కోసారి అనుమానస్పద స్వరంలో, మరోసారి ద్వేషపూరిత స్వరంలో, మరొకొన్నిసార్లు సాధారణ వ్యాఖ్యగా విన్నాడు.

‘నువ్వు తేడాగా కనిపిస్తున్నావ్’ అని.

పక్కమీద పడుకుని దొర్లుతూ ఆలోచిస్తున్నాడు – ‘అవును నిజమే నాకు మా నాన్న ముఖం రాలేదు, అమ్మ ముఖం రాలేదు. నా మోహం నాదే‘. అదే ముఖ్యం.

అతనికి నిద్ర వచ్చేసింది. దేశంలోనే ఉత్తమ గోల్‍కీపర్ అయినట్టు కల కన్నాడు. బ్రెజిల్‍కి వ్యతిరేకంగా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ఫైనల్లో ఇండియా ఆడుతున్నట్లు, తాను గోల్ కీపర్ అయినట్లు కలగన్నాడు. ఆ మ్యాచ్ ముంబయిలో జరుగుతోంది. ప్రధానమంత్రి, ఇతర ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు, సినీనటులు – అమ్మా, నాన్న – ఎందరెందరో ఆ మ్యాచ్ చూస్తున్నారు. పల్లవి కూడా ఉంది. భారత జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. జనాలు వువుజెలా బూరలు తెగ ఊదుతున్నారు. సిన్నమన్‌ని దాటుకుని ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో బ్రెజిల్ జట్టు ఓడిపోయింది.

ఆటగాళ్లందరికీ గోల్డ్ మెడల్స్, ట్రోఫీలు, పెద్ద పెద్ద చెక్‍లు లభించాయి. కానీ ఒక ప్రత్యేక  బహుమతి సిన్నమన్ కోసం ఉంచారు. ప్రధాని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఆవార్డుని సిన్నమన్‌కి అందించారు. సిన్నమన్‌ని తులాభారం తూచి, అతని బరువుకి సరిపోయే సిల్కీ చాకొలెట్ బార్ అందించారు. దాన్ని ఇంటికి తీసుకురావడానికి ఓ కారుని పంపారు. ఎంత రుచికరమైన కలో!

~

మూల కథ తొలుత రొమేనియాకి చెందిన Egophobia Literary Magazine లో ప్రచురితమయింది. మూలకథని http://egophobia.ro/?p=13843 అనే లింక్‍లో చదవచ్చు.

మూల రచయిత గురించి:

వికాస్ ప్రకాష్ జోషీ (Vikas Prakash Joshi) పూణేకి చెందిన రచయిత, సంపాదకుడు, అనువాదకుడు, పబ్లిక్ స్పీకర్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వికాస్ ప్రధానంగా ఆంగ్లంలో రచనలు చేస్తారు. ఆయన కథలు 11 భాషలలోకి (భారతీయ, విదేశీ) అనువాదమయ్యాయి. ఆయన మొదటి పుస్తకం ‘My Name is Cinnamon’ వచ్చే ఏడాది సుప్రసిద్ధ ప్రచురణ సంస్థ ‘Hay House India’ వారి ద్వారా వెలువడనుంది. ఈ పుస్తకం ప్రచురణకు మునుపే 35 దేశాలలోని చదువరులు, రచయితల అభిమానాన్ని చూరగొంది. వీరి రచనలు ప్రముఖ ఆంగ్ల ప్రచురణలలో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం తన రెండవ పుస్తకంపై పని చేస్తున్నారు. వికాస్ – టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ముంబయి, ఇంకా, ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం, చెన్నయి సంస్థల మాజీ విద్యార్థి. పబ్లిక్ స్పీకింగ్, కుకింగ్, ట్రావెలింగ్ వికాస్ అభిరుచులు. తెలుగులో తన రచనలు అనువాదం కావడం గౌరవంగా భావిస్తున్నారు.

Exit mobile version