నా రుబాయీలు-1

0
2

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]


~
అందరిలో ఒంటరిగా మిలిగిపోతు ఉన్నాను!
ఒంటరిగా నన్ను నేను వెక్కిరిస్తు ఉన్నాను!
మరోమారు మోకరిల్లి మనసుకు సర్దిచెబుతూ
అబద్ధాన్ని మోయలేక అలసిపోతు ఉన్నాను!!

మబ్బును మింగిన విత్తు పండనంటే తప్పు కద!
చమురును తాగిన వత్తి మండనంటే తప్పు కద!
నా ఎద సింహాసనం పై కొలువు తీరిన నీవు
నను నీ గుమ్మం బయట ఎండమంటే తప్పు కద!!

బాధ ఓపలేనపుడు కనురెప్ప కాస్తుంది!
మనసు వెర్రితలలను ఆలోచన కాస్తుంది!
కాంతా, కాలం ఇంక వెనుతిరగనన్నపుడు
ఎద బద్దలవకుండా కంటి ఇర కాస్తుంది!!

రెండేళ్ళ శిక్షని ఒక నెలకు తగ్గించండి దయతో!
రెండిటికి బదులుగ ఒక చేయిని నరకండి దయతో!
తప్పేదైనా కరుణిచండిక పెద్ద మనసుతో
విరహం నుండి నను నరకానికి పంపండి దయతో!!

శిశిరములేల భీతి తరువాత వసంతముందిగా!
అమవాసేల వెరపు ఇరువైపుల పున్నముందిగా!
విత్తుకు ఏరూ, భూమి కాదన్న అంబుదుందిగా!
నరుడికి సుఖమెక్కడుంది ఎలనాగ కాదందిగా!

నా యావ పోల్చుకుంటూ ప్రతి కథలో వెదికాను!
మన ప్రేమ దాహం తీరగ నిన్నలో వెదికాను!
ప్రయత్నించి నలుదిక్కుల పలు వారధులను కట్టి
ఎదలో ఉన్నావని ప్రతి అశ్రువులో వెదికాను!!

మంట ఊరుకుంటుంది ఇనుము బూడిదయ్యాక!
చలి తెప్పరిల్లుతుంది నీళ్ళు గడ్డ కట్టాక!
విరహానికి ప్రతీకారముల కాంక్ష ఎందులకు
చావును బ్రతికిస్తుంది మనసు మూగపోయక!!

కదులుతున్న కాలంలో శిశిరం మిగిలింది!
చేరువైన తీరంలో అగాధం మిగిలింది!
ముస్తాబవుతుంటే మామిడాకుల పందిళ్ళు
మబ్బు వీడిన నింగిలా మౌనం మిగిలింది!!

నీటినిచ్చిన నేలకు విత్తు నీడను ఇచ్చింది!
వెట్టకాచిన నేలకు మబ్బు నీరును ఇచ్చింది!
ప్రకృతి నేర్పు ఉపకారం కానరాద అతివకు?
ఎద పూబాట వేస్తే ముళ్ళపా్న్సును ఇచ్చింది!!

నీ తనువు చాపానికి బాణాలు ఎన్నో!
చూసేసిన పాపానికి వ్రణాలు ఎన్నో!
లిప్తకాలంలో గమ్యం గల్లంతవగ
ముక్కలవుతున్న నా ఎద కణాలు ఎన్నో!!

(మళ్ళీ కలుద్దాం)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here