Site icon Sanchika

నా రుబాయీలు-10

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]


~
1.
నా చూపును కనురెప్పతో లాలించావు కద
నా మాటకు పలుమాటలు జోడించావు కద
ఊహల్లో నా మేను ఉరకలు వేస్తుంటే
నా అడుగును కొన చూపుతో బంధించావు కద

2.
కళ్ళతో మాటాడ కలలోకొచ్చావు ఎందుకు
మనసుతో పిలువగ గుండెలో నిండావు ఎందుకు
నీ చేతి ముగ్గులన్నీ నా వాకిట కోరగా
ఆశతో అందిస్తే చేయి వదిలావు ఎందుకు

3.
మల్లె అలిగింది నీ సరదాలు చూసి
తేనె అడిగింది నీ అధరాలు చూసి
దేవకన్య త్రోవలు మరిచిందేమో
ప్రేమ వెలిగింది నీ నయనాలు చూసి

4.
అణుబాంబు మచ్చను జపాను కాలంతో దాటింది
శిశిర గాయాలను తరువు వసంతంతో దాటింది
ప్రేమామృతమునకు నా జీవితమే చషకమవగా
కడకు జీవితేచ్చ నీ వెక్కిరింతతో దాటింది

5.
ఔషధమే కాదు హాయినీ గొల్పేది మధువు
చీకటి స్మృతులు రేపగ జోల పాడేది మధువు
క్షణానికి రెట్టింపయ్యే గాయాలే ఎదకు
లోకం ఏవగించినా గోడు వినేది మధువు

6.
నీ ఊహలు లేకుంటే మనసున ఎడారే నాకు
క్షణకాలం కనబడవో గొంతున తడారే నాకు
నడి సముద్రాన నా నావకు తెరచాపవే నీవు
నవ్వులాటకైన పొమ్మంటే ఏ దారే నాకు

7.
ప్రేమను కుమ్మరించి క్షణాలు భారం చేసావు
అంతలో నన్ను విడిచి బతుకు దూరం చేసావు
కాదని వెళ్లినా ఇంకా నాలోనె ఉన్నావు
ప్రేమను పరిహసిస్తూ పెద్ద నేరం చేసావు

8.
ఏ దేవుడూ రాడు అడుగు వేయాలి నీవే
ఏ మిత్రుడూ లేడు పడితే లేవాలి నీవే
ఆశీస్సులు అండదండలే కాదు జీవితం
లక్ష్యమే జలదరించగా సాగాలి నీవే

9.
ఒక అశ్రువు చాలదా తనవారు కాలడానికి
గుండెకోత తక్కువా మనవారు పోల్చడానికి
నిన్నటి ప్రేమ యాత్రలో ఇరు చక్రాలు నేనే
దయ చూపి చితిపై రా ఒక మారు పలకడానికి

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version