Site icon Sanchika

నా రుబాయీలు-13

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]


~
1.
నీ పాదధూళికి గుడి కట్టాను
నీ గాలి సోకితె రుణ పడ్డాను
ఇలను పులకించు అంబుదము నేను
నీ స్పర్శ తాకగ తడబడ్డాను

2.
దేశ ప్రగతిని చీల్చేసే అన్యాయం మాకొద్దు
మానవతను మంటకలిపే అమానుషం మాకొద్దు
వరుసగ వడ్డిస్తుంటే నా విస్తరికి వంతేది
మనవాడే గెలవాలనే ఏ సూత్రం మాకొద్దు

3.
స్వర్గం నరకం విలాసం భూమికి తరలింది నేడు
పద్నాలుగు లోకాలు పోయి భూమి మిగిలింది నేడు
కొన చూపుతొ గుండెను చిలికిన వాసుకివి నీవే మరి
నీ లేలేత అదరాలలొ అమృతం వెలిసింది నేడు

4.
క్రమశిక్షణ అలవర్చుకోయి ముందర
ప్రణాళిక నిర్మించవోయి ముందర
గ్రహాలు విజయానికి దారి చూపవు
నడుం బిగిస్తే గెలుపు నీ ముందర

5.
కొన చూపుతో కోటి ఆశలను రగిల్చావు
చిరునవ్వుతో వంద ప్రశ్నలను రగిల్చావు
వేయి మొదలయ్యేదీ మరి ఒకటి నుండె కద
ప్రేమవిత్తు ఎదన చల్లి ఉషను రగిల్చావు

6.
తిమిరాన్ని తొలిగింప రవి వెలుగు
నడిరేయి చిగురించ చలివెలుగు
వదనానికి ముదమందిచుతూ
రిపువునకు చేయందించి వెలుగు

7.
కత్తి గాయానికి అసలు తీవ్రత ఇంతని తెలుసా
మందంటే మళ్ళీ అదే కత్తి గాటని తెలుసా
కోమలి ఒంటినిండా కత్తుల కర్మాగారమే
ఓరచూపున వేలకత్తుల పదనుందని తెలుసా

8.
స్వార్థం రాజకీయాన ఆయువైతే అడుగు
కులాలు మనుషులనింక విడదీసేస్తే అడుగు
ధర్మాన్ని అధర్మము ధిక్కరించి పాలిస్తే
వేసేయి ఒక్క దిక్కులు పెక్కటిల్లే అడుగు

9.
ఆత్మీయమైన పలుకు అనుబంధానికి ద్వారం
అభినందించే మాట అనురాగానికి ద్వారం
శిశిరం వసంతాలు ఈ ప్రకృతి సమాహారమే
చేయందించి వేయు అడుగులే గెలుపుకి ద్వారం

10.
నెత్తావి వలలో తేటి బందీ
అబ్ది అలలో ఆత్మాశి బందీ
రెక్కలకి సెలవిచ్చి ఘృతము గ్రోల
కొమ్మ పరుపులపై కాకి బందీ

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version