Site icon Sanchika

నా రుబాయీలు-15

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]


~
1.
ప్రతిబిందువునూ ఒడిసిపట్టు – నీరు చాలా విలువైనది
చిరువీలు ఓ ఆయువుపట్టు గెలుపు చాలా విలువైనది
పరమేశ్వరనామ స్మరణ ఒక్కటే ముక్తినందించునది
ఒక్కో క్షణాన్ని దొరకబట్టు – బతుకు చాలా విలువైనది

2.
నువు పక్కన ఉంటేనే నాకీ ఇహము బాగుంటుంది
నా ప్రేమ నీకర్థమైతే ఆ సుఖము బాగుంటుంది
నా విన్నపాలన్నీ నీకేవగింపులైన క్షణాన
తెల్లబట్టను కప్పినపుడే నా ముఖము బాగుంటుంది

3.
నా జీవితంలోకి నీవు ప్రవేశించావు ఎందుకు
నా ప్రతిచర్యను అలా నియంత్రిస్తున్నావు ఎందుకు
ఎందరికో ఆధారమైనవాన్ని పాపం అనవా
నువు నెట్టితే నా మనికిని ఆపుతున్నాను ఎందుకు

4.
పెంటకుప్పకు ప్రాణం పోస్తే నా బతుకు
కుళ్ళిన పండు కళ్ళకద్దితే నా బతుకు
పురుగులకు నైవేద్యాలుంటాయా ఏమి
కన్నీరుకు పక్ష్మలొ సమాధే నా బతుకు

5.
పగిలిన అద్దాన్ని మొదటిలా చూపడం కష్టం
నలిగిన గుండెతో మొదటిలా చూడడం కష్టం
కష్టంతో కలసి నడవడం కత్తిమీద సాము
చెదరిన మనసును నిద్రలోకి జార్చడం కష్టం

6.
గెలుపు నీ కోసం వేచి ఉంది దూసుకవెళ్ళు
అడ్డంకులు నిచ్చెనలువుతాయి చీల్చుకువెళ్ళు
నవ్వుతున్నవారికి నువు ఆదర్శమవుతావు
చేయందించి పదుగురి కీర్తిని మోసుకవెళ్ళు

7.
అందరిలో మేటినౌతాననెడి శపథాలు నావి
కాలం సవాళ్లకు ప్రతిగ గెలిచిన పథకాలు నావి
నను వెలివేసి ఒక సూర్యున్ని మూసావు ప్రాణమా
రోజులు భయపెడుతుంటే తప్పని మరణాలు నావి

8.
ఊరికే స్వాగతం పలుక నోరులు ఎన్నో
ఊరించి మైమరపించగ తీరులు ఎన్నో
నీ క్షణాలకు గాలం వేస్తుందీ లోకం
ఊహించి మనసు మళ్ళించ దారులు ఎన్నో

9.
ఆదరించి చెంతచేరితే- తృణీకరించుట తప్పు
మనసెరిగి ఔదల దాల్చితే- తోసిరాజనుట తప్పు
నీ అక్కరకు అణువంతైనా అవకాశముండునా
ముఖానికి ముసుగులేసి వేడితే- మిడిసిపడుట తప్పు
10.
నా ఆకాశహర్మ్యాలు కూలిపోయాయి నేడు
సువిశాల సామ్రాజ్యాలు మూగబోయాయి నేడు
నీ ప్రేమఝరిలో మునిగి తనువు మరిచాను నిన్న
నువు కాదంటె ప్రాణాలు ఆగిపోయాయి నేడు

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version