Site icon Sanchika

నా రుబాయీలు-16

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]


~
1.
తామరాకును నీట ఎంతగ ముంచినా ఏ పొడ గిట్టదు ఎలా
కలువలు బురదలో పూసినా అందానికి మచ్చ అంటదు ఎలా
ప్రకృతినేర్పు వైవిధ్యాలకు మతిభ్రమించి మురిసా ఇన్నాళ్లు
ఎదలో కొలువైన చెలికి నా మనోవేదన కానరాదు ఎలా

2.
ముసురుతున్న చీకటికలతలని ఆపేస్తా
మీరుతున్న లోకంపోకడని ఆపేస్తా
నీరాకకై ఎదురుచూపు రోజూ పోరే
కాలుదువ్వు కాలందూకుడుని ఆపేస్తా

3.
నీ వేడి సూర్యుడితో పోల్చలేను
నీ జోడి దుప్పటితో పోల్చలేను
తనువు తమకం నీకర్పించినాక
నీ దాడి యోధుడితో పోల్చలేను

4.
వాలుచూపులను సంధించుట నా కళత్రము సొంతం
ఆనక నడుమున బంధించుట ఆ లవిత్రము సొంతం
లంకెలన్నీ తెగిపోయాయి మాకీ లోకం నుండి
మదనుడు నోరెళ్లబెట్ట ఈ అహోరాత్రము సొంతం

5.
వేడివెలుగుకి తలవొగ్గక పుడమి చినుకు పొందేనా
శుచికీలకి తనువొగ్గక పైడి వన్నెలు పొందేనా
వేదించెడి నిట్టూర్పులను మించిన ఊపిరులు నావి
ఎడబాటుకు తను ఒగ్గక మనసు తోడును పొందేనా

6.
మల్లియరొద విన ఎదపై తుమ్మెద చేరితే ఇంకేం కావాలి
సత్తురేకు అదేజన్మలో స్వర్ణమైతే ఇంకేం కావాలి
నీ రాకకై ఎదురుచూపుల జడి ఎంతైనా ఓర్చుకుంటాను
ఇల వెలివేయనీగాక నన్ను – నువ్వుంటే ఇంకేం కావాలి

7.
వనంలో మల్లె ఒంటరి – మాధవుడికి తెలుసు
సరస్సున కలువ తుంటరి – హిమాంశువుకి తెలుసు
ఎడబాటు విరహాగ్ని ఎదుటివారికేం తెలుసు
జంటలో మనసు గెంటరి- జతగాడికే తెలుసు

8.
శిశిరమెన్నాళ్లనీ చెట్టు కాచియుండ
అరుణుడేపాటనీ మన్ను కాచియుండ
వత్సరాలుగ వేచితి ప్రాణమే మిగిలె
ఉన్నావా అట – నా వెన్ను కాచియుండ

9.
చల్లిన విత్తు రైతునోట చేరువరకు ఎన్ని చిక్కులు
నేర్చిన అక్షరం అన్నముగ మారువరకు ఎన్ని చిక్కులు
కడతేర్చు నిరీక్షణది రోజుకో వేషమే మదిలోన
వెళ్లిన పెనిమిటి ఇక్కట్లు తీరువరకు ఎన్ని చిక్కులు

10.
సూర్యకిరణం భువిని ముద్దాడుతుంది – ఎలా ఉన్నావు
చినుకును పాదపం ఆస్వాదిస్తుంది – ఎలా ఉన్నావు
పండు వెన్నెల వేడి తనువును దహించివేస్తుందిక్కడ
నువులేక అలిగిన పాన్పు అడుగుతుంది – ఎలా ఉన్నావు

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version