నా రుబాయీలు-4

0
2

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]

~
కాలమెన్ని వలలను వేసినా నీకై ఆగి ఉంటా
లోకం క్షోభపెట్టినా మన బాసకై దాగి ఉంటా
తిరిగొచ్చేదెన్నాళ్ళైనా చూసే ఎదురుచూపులో
నీ పేరునే ఊపిరికి అల్లుతూ కొనసాగి ఉంటా

నీవెప్పుడు వస్తావని గూట్లో చిలుకలు అడుగుతున్నవి
ఎంతసేపు ఒక్కదానివని తలగడలు అడుగుతున్నవి
నువు లేకపోతే ఏమీ తోచట్లేదు శ్రీవారూ
ఎప్పుడు కడుగుతారని సింకులో గిన్నెలు అడుగుతున్నవి

మౌనాన్ని మిగిల్చావు గతాన్ని దాచుటకా
ఏకాకి చేసావు నా ఉనికి దాటుటకా
ఎక్కడికని ఎత్తులు వేస్తున్నావు నాపై
వెలివేసిక విరహాన చావును చూపుటకా

విషం వొళ్ళంతా పాకింది – కాటేసిన చోటు ఎందుకు
రాజు కన్నెర్ర చేసాడు – ఆయువుపై మోజు ఎందుకు
ప్రాణమంతా చెలియ కనురెప్పల్లో దాచాను నిన్న
విరహమే హారమవగా గుండెకు మరో పోటు ఎందుకు

మేఘానికి నా మనసు చెప్పాను ఆ వివరం చెప్పిందా?
నీ పేరు తప్ప తోచలేదే ఆ కలవరం చెప్పిందా?
ఇక్కడ నీ మనసు మాయలెన్నని చెప్పగలను చెలీ నేను
అక్కడ నా మనసు మాటేమిటో నీ ముకురం చెప్పిందా?

నాలుగు కాలాలు నిలవాలని శిల ఉలిని అడిగింది
నలుగురి తలన మెరవాలని పైడి కొలిమిని అడిగింది
కోర్కెలెందుకో మరి రోజున వాడే ఈ మల్లియకు
మరింత నాజూకు అవ్వాలని నా చెలిని అడిగింది

పురుగు పొడ గిట్టదని పట్టునొద్దు అన్నావు
తుమ్మెదల ఎంగిలని పూలనొద్దు అన్నావు
నీ మేనితొ స్నానమాడ సాకు వెతుకుతుంటె
వన్నెదోచునే అని పాలనొద్దు అన్నావు

ఓర చూపు పలికిన మాటలు ఎన్నని చెప్పను నేను
తీయగ బాధించే గాయం ఎంతని ఓపను నేను
చూపు చినుకులు పోగు చేసి సముద్రం నిర్మించాను
ఇల్లు ఒళ్లు మరచి ఓలలాడుతున్న చేపను నేను

పిడుగులు పైన పడుతూనే ఉంటే ముందుకు కదలవచ్చా
లంగరులు ఒక లక్షయితే నావ అటువైపుకు కదలవచ్చా
ఓరచూపుకు మందహాసం కలిపి కోమలి నిను చూడగా
నువు కదలటం అటుంచు నీ నాసాపుటములు కదలవచ్చా

చూపు నాలో దింపి నా ప్రాణాలు తోడేసావు
మొత్తం నీవే నిండి నా స్మృతులను తోడేసావు
ఎద కుహరానికో వైపు అమృతము పంచిన నీవు
ఎడబాటుతో మరువైపు నను పూడ్చుతు తోడేసావు

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here