Site icon Sanchika

నా రుబాయీలు-7

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]

~

1.
తనువంతా తరుముతు ఉన్నది చినుకు
కుదురుగా నిలబడనీకుంది చినుకు
వయసులో వరదలు ఉబికొస్తుంటే
కొత్త పాయను చూపిస్తుంది చినుకు

2.
నా ఆచారాలను మంట కలుపుతుంది నీ అందం
నా తనువుకు నాతో గొడవలు పెడుతుంది నీ అందం
నేర్చిన సంస్కారమే నాగరికతకు గీటురాయి
రొదెంతైనా నమస్కరించమంటుంది నీ అందం

3.
సంద్రానికి మెరుపు పంచే ముత్యాలు భళా
ప్రకృతికి మురువు పెంచే గులాబీలు భళా
సొగసులీనేడి కోమలి చిరుమందహాసాన
గులాబి రేకుల్లో విచ్చు ముత్యాలు భళా

4.
స్నేహంకై అపరిచితున్ని వెంటాడి చూడు
మకరందాలు పూయించగ మాటాడి చూడు
తరచిచూడగ జీవితం అనురాగాల గని
పలురెట్లు తిరిగిస్తుంది ముద్దాడి చూడు

5.
నడవగ సేద తీర్చింది కొమ్మ
బడలగ చేయి ఇచ్చింది కొమ్మ
బాటసారికి భానుడు కలవగ
అమ్మలా ఊయలయింది కొమ్మ

6.
ప్రతి ఫలాన్ని అందిస్తుంది స్నేహం
ప్రతిఫలాన్ని ఆశిస్తుంది స్నేహం
బ్రతుకు జీవితాల భేదం స్నేహం
ఉనికిని సఫలం చేస్తుంది స్నేహం

7.
అనుబంధం ఆగిపోతే పుట్టింది గోడ
సంబంధం ఆవిరైతే నిలిచింది గోడ
ఇల్లు ముక్కలై సోదరులు వేరైపోతే
శాంతికపోతాలను కోరుకుంటుంది గోడ

8.
నా కొరకు నాలో ఉంటావని పంచాను సగం
స్వార్థపరున్ని ప్రేమ పిపాసిని మిగిలాను సగం
పూర్ణం వినా మోక్షం మిథ్యా సర్వం విదితం
మధురం మామిడిలో దాగుంది కొరికాను సగం

9.
కిచకిచ కిచకిచ కిచకిచ కిచకిచమని అంటున్నది పక్షి
కొలువు లేదు ఏ కూలి లేదు ఖాళీ నేనన్నది పక్షి
నాది కావాలి నీదీ కావాలను మనిషికేం తెలుసు
ఎల్లలెరుగని ఆ నింగి కౌగిట్లో మహారాణి పక్షి

10.
ఏమివ్వగలను నన్నే మార్చిన తనకు
ఏమి కావాలి తననే మరచిన తనకు
నింగి చినుకుల నైవేద్యాలను తేనా
కల పండించి నా నిద్ర దోచిన తనకు

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version