Site icon Sanchika

నా రుబాయీలు-8

[‘నా రుబాయీలు’ అనే శీర్షికతో రుబాయీలను అందిస్తున్నారు శ్రీ రెడ్డిశెట్టి పవన్‍ కుమార్.]


~
1.
గాలి సంతకం ఆకు తెలిపింది
నేల సంతనం చిగురు తెలిపింది
ప్రకృతి పరితపిస్తుంది నాకై
వాన సంబురం వణుకు తెలిపింది

2.
కొండంత నా ప్రేమ తెలుప ఆర్థికపు సంకెల
దినమంత నీతో గడప ఉద్యోగపు సంకెల
సంకెళ్లను ఛేదించి సంబరాలు జరగాలి
చరిత్రంత నాతో నిండ ఆయువుకు సంకెల

3.
నీ బదులుకై నా మనసంతా అలుముకుంది మౌనం
నీ ఒప్పుకోలుతో సంబరం చేరనుంది మౌనం
బ్రతుకంతా అర్పించా సర్వస్వము నీవే చెలీ
నువు కాదంటే నాతోనే కాలిపోతుంది మౌనం

4.
కొండంత ప్రేమ నాది పరికించుము ఇసుమంత
మిన్నేటి జోరు నాది ఔరా అను జగమంత
ప్రేమలేని జీవితానికి సార్థకత ఎక్కడ
మాటకు ఏ ముసుగులెరగను మాటాడు సమంత

5.
పూవులెన్నో చేరె త్రావిగొన నీ కేశములు ఏవి
మధుమాసం వచ్చే ఆస్వాదించ నీ చూపులు ఏవి
మనసు నీ ఊసులతో మురిసి రేయి అంతా మెరిసెను
ఎదనిండె ముచ్చటలు ఆలకించ నీ వీనులు ఏవి

6.
ఒంటి చినుకును జంటగా ఆస్వాదిద్దాం మనం
వొంటి తపనను సగంగా పంచేసేద్దాం మనం
నాల్గు గోడల నడుమ ఇలకందని విశాలముంది
శ్వాసలు కలిపి ఆయువును పెంచేసేద్దాం మనం

7.
హృదయం ఇంతగ తనకై పరితపిస్తుందెకు
నా ప్రపంచమంతా తనలోన తోస్తుందెందుకు
ప్రపంచం ఆలోచనకన్నా విశాలమైనది
మానమంటే మనసు నా మాట వినకుందెందుకు

8.
చలి పంచు గిలిగింతలు దుప్పటితో కప్పేద్దాం
ఎండకాలపు చెమటలు పొదమాటున దాసేద్దాం
ప్రకృతితో పరిహాసమా ఎవడూ బ్రతకలేడు
కన్నుకుట్టకముందే గది తలపులు మూసేద్దాం

9.
గడిచిన దినము నాది
చితికిన బతుకు నాది
చెలియ చేయిని వీడ
పుట్టని మెతుకు నాది

10.
గది తలుపుకు మరొక గడియని వేయి
అటు లోకానికి ఫరదాని వేయి
ఏమో ఏ దొంగేం చేస్తాడో
ప్రతి గడియకి ఒక గాలాన్ని వేయి

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version