Site icon Sanchika

నా వెన్నెల

[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘నా వెన్నెల’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఉ[/dropcap]షోదయ సమయాల
ఉల్లాస భరిత వాతావరణంలో..
సన్న సన్నగా కురుస్తున్న
మంచు బిందువుల
నులివెచ్చని స్పర్శని అనుభవిస్తూ..
ఆనంద క్షణాల శుభసందర్శనాల
కేరింతల నడుమ కదులుతున్నాను!

కోయిలమ్మల కమ్మని గాన కచేరీలు..
గులాబీలను సుతారంగా తాకుతూ
సడిచేయక వీస్తున్న
చల్లని హాయైన పిల్లగాలుల పలకరింపులు..
తొలి వేకువ కిరణాలు
పసిడి వర్ణంలో ప్రకృతి అంతటా
వెలుగులు నింపుతున్న వసంతకాలంలో..
నా నిన్ను తలచుకుంటూ కదులుతున్నాను!

ఎక్కడి నుండో ఓ స్వరం తీయగా వినిపిస్తుంది..
నువ్వు నా పేరు పలవరిస్తున్నట్లుగా
మధుర భావనలు మదిలో..!

ఉదయాలు..
సాయంత్రాలు..
రాత్రిళ్ళు..
అనే తేడాలు లేకుండా
కాలం అవిశ్రాంతంగా సాగుతుంటుంది ..
నన్ను నిన్ను ఒకటి
చేయాలనుకుంటూ అభిలషిస్తుంది!
కలల తీరం వెంట నేను..
సదా నిన్నే తలచుకుంటూ!
ప్రకృతిలో లీనమై అద్భుతమైన
అందమైన చిత్రంలా నువ్వు..
కలాన్ని కుంచెగా మలచుకుని
అక్షరాల సాంగత్యంలో నేను!
నా కవిత్వం వెన్నెలై మెరుస్తూ
కాగితంపై అల్లుకుంటుంది..
జాబిలిలా నవ్వుతూ నువ్వు!

Exit mobile version