Site icon Sanchika

నాదైన అస్తిత్వంతోనే…

[dropcap]నే[/dropcap]ను
కొందరిలా
అందని ఆకాశానికి నిచ్చెనలు వేసి
ఆశల సౌధాలను నిర్మించాలనుకోను
అర్హత లేశమాత్రం లేకున్నా
అందలాలు ఎక్కాలనే తాపత్రయంతో
పేరు కోసం ప్రాకులాడుతూ
విలువలకు వలువల్ని విప్పుకుని
మేధావిననే మేలిముసుగు కప్పుకుని
నడిబజార్లో నిస్సిగ్గుగా నాట్యం చేయలేను
అవసరం లేకున్నా ఆవురావురుమంటూ
ఎవడి కాళ్ళా వేళ్ళానో పడి
వాడు విసరివేసే
కాసిన్ని ఎంగిలి మెతుకులతో కడుపు నింపుకుని
బ్రేవ్ మంటూ తృప్తిగా త్రేంచలేను
నా వరకు భేషజాలకు పోక
బండగానో, చిన్న కొండగానో మిగిలిపోతాను తప్ప
మేరువునని
లేని గొప్పలు చెప్పుకోవడానికో
ధీరువునని
సొంత డప్పు కొట్టుకోవడానికో
నావి కాని వేరొకరి పదాల్ని
నా పెదాలతో పలకలేను
నలుగురూ చీ కొడుతున్నా
నన్ను కాదనుకుంటూ
ఆత్మాభిమానం పేరుతో
అందరినీ మోసం చేస్తూ బ్రతకలేను
కొందరిలా
తెచ్చిపెట్టుకున్న తెంపరితనం నటిస్తూ
నాకు చేతకాని వీరాధిపత్యాన్ని ప్రదర్శిస్తూనో
చేవలేని శూరత్వాన్ని ప్రకటిస్తూనో
నడక నేర్చిన శవాన్నై శ్వాసిస్తూ
గమ్యం లేని గమనంతో సాగలేను
ఎండ పొడకు మెరిసినంత మాత్రాన
పగిలిన గాజు ముక్కగానే వుంటాను తప్ప
వజ్రాన్నని అందరినీ భ్రమింపజేసి
అపహాస్యం పాలు కాలేను
రంగు హంగు వున్నా రాయిగానే వుంటానే తప్ప
రత్నాన్నని బుకాయిస్తూ
నలుగురిలో నవ్వులపాలు కాలేను
చిత్తాన్ని కోల్పోయి చిత్తు కాగితాన్నయి
ఊరించే భ్రమల్లో వూరేగుతూ
ఎవడి చేతుల్లోనో
కీలుబొమ్మగానో తోలుబొమ్మగాగో తైతక్కలాడక
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ
నాదైన అస్తిత్వంతోనే వుంటాను.

Exit mobile version