[dropcap]ప్ర[/dropcap]సిద్ధ కవి, రచయిత శ్రీ హనీఫ్ కొత్త కవితా సంపుటి ‘నాది దుఃఖం వీడని దేశం’. ఇందులో 51 కవితలున్నాయి. అంతరంగ వేదనకి, ఉద్విగ్నతలకి అద్దం పట్టిన కవితలివి.
***
“ఈ కవితలన్నీ మన సామాజిక అవ్యవస్థకు దర్పణాలు. ఆ అసందర్భ, అస్తవ్యస్త సామాజిక వ్యవస్థ మీద కవి ఆగ్రహ ప్రతిఫలనాలు. సాంద్ర తాత్విక వ్యక్తీకరణలు. తాత్వికతా కవితా కలగలిసిన తాత్వికవితలివి. ప్రతీ కవితా పాఠకులకు ఇప్పటికి తెలియని ఒక సామాజిక దృశ్యాన్నో, లేదా తెలిసిన దృశ్యంలోనే గమనించిన కోణాన్నో పట్టుకుని, కళాత్మక సాధారణీకరణతో ఆలోచలనలు రేపి, తాత్విక దృక్పథం అందించి అవగాహనను ఉన్నతీకరిస్తుంది” అన్నారు శ్రీ ఎన్. వేణుగోపాల్ తమ ముందుమాట ‘జీవన వేదన నుంచి పెల్లుబికిన తాత్వికత’లో.
***
‘చాంద్ కా రాత్’ కవితలో
“జమీన్ దార్లు, జాగీర్ దార్లు
దొరలు, మున్సబులు
పటేల్, పట్వారీ లెవరు
నాడూ, నేడు ప్రగతి సంజీవని దరి చేరని వాళ్ళమే”
అని వాపోతారు కవి.
~
‘నయా ఝఖం’ కవితలో
“మొన్న దేవదాసు కథల్లోనే
పార్వతుల గురించి మాట్లాడుకున్నాం
రేపు ముసలి షేక్ ఎలానూ రాలిపోతాడు
పసి ఫాతిమాల
కథలపై వెలుగు ప్రసరింప చేయాలి”
అని కోరుకుంటారు.
~
‘త్రీ ఛీర్స్’ కవితలో
“తాగేప్పుడు
నా ముఖం
కప్పులో
ఆవిరౌతున్న మహా సముద్రం”
అన్నప్పుడు ఆ కవితలో దృశ్యాలన్నీ పాఠకుల కళ్ళ ముందు కదలాడుతాయి.
~
‘ఆకలి మిన్నంటిన దేహాలు’ కవితలో
“రైతు చెమటింకాలే కాని
కన్నీరింకన ఏ నేల
నవ్వులు, పువ్వులు పూయదు”
అని హెచ్చరిస్తారు.
~
‘కిరాయికిచ్చిన ఇల్లులాంటి దేహం’ కవితలో
“మనిషే
కఠిన శిలాజం
జన్మ భూముల పేరు పెట్టి
ఆర్గనైజ్డ్ గుండాల పైశాచిక ఆనందం
భూమంతా మనిషి జన్మ వృత్తాంతం లేదా”
అని ప్రశ్నిస్తూ
“భూగోళానికి రక్షణ కవచాలౌదాం రండి”
అని ప్రోత్సహిస్తారు.
~
‘మా నాయన’ కవితలో
“నాతో కంటే
పైర్ల ఎదుగుదలలోనే వెన్నంటి వుంటాడు
నన్ను పొట్టిగున్న బట్టల్లో చూసి
ఆశ్చర్యపోతుంటాడు”
అంటూ తండ్రితో ఎక్కువ సమయం గడపలేనందుకు బాధపడతారు.
***
సామాజిక సమస్యలు, అస్తిత్వాలు, అణచివేతా, పీడనలకు వ్యతిరేకంగా రాసిన ఈ కవితలు పాఠకులలో ఆలోచనలను రేకెత్తిస్తాయి. పేదా, దిగువ మధ్యతరగతి జనాల, నిరుపేద ముస్లిం కుటుంబాల సమస్యలను ఆర్ద్రంగా ప్రస్తావించిన కవితలివి.
***
రచన: హనీఫ్
పుటలు: 124
వెల: 120/-
ప్రచురణ:
ఆసిఫ్ ప్రచురణలు, కొత్తగూడెం.
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
రచయిత:
haneefsd777@gmail.com
9247580946