Site icon Sanchika

నాదొక ఆకాశం-11

[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]

[కలలో కనబడిన వసుధ నిజంగానే సమీర్ గదికి వస్తుంది. వాళ్ళిద్దరూ శృంగారలోకంలో విహరిస్తారు. తర్వాత బయటకెళ్ళి ఐస్ క్రీమ్ తిని తమ తమ నివాసాలకి వెళ్ళిపోతారు. రెండు రోజులనుకున్న షూటింగ్ వారం రోజులు పట్టింది. శ్రీవిక్రమ్ అంత గొప్ప దర్శకుడు ఎందుకయ్యాడో, సమీర్‍కి అర్థమవుతుంది. గ్రీన్ మ్యాట్ స్టూడియోలో కాకుండా, పాటలని యాక్చువల్ లొకేషన్స్‌తో చిత్రీకరించదలచామని చెప్తాడాయన. స్క్రిప్ట్ నిత్యనూతన చైతన్యస్రవంతి అని, షూటింగ్ జరుగుతున్న కొద్దీ అనేక మార్పులు చేయవలసి ఉంటుందని తెలిసిన సమీర్ – శ్రీవిక్రమ్ అందుకే గొప్ప దర్శకుడయ్యాడని భావిస్తాడు. వారం రోజులు పని చేసినందుకు నిర్మాతని రెమ్యూనరేషన్ అడగమని శ్రీవిక్రమ్ సూచించినా, సమీర్ విముఖత వ్యక్తం చేస్తాడు. అరకులో షూటింగ్ పూర్తవుతుంది. యూనిట్ వాళ్ళు సంతృప్తి చెందుతారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలవుతుంది. సంజయ్ లేకుండానే సంజయ్ సినిమా రిలీజ్ అవుతున్నందుకు కుటుంబ సభ్యులు, సమీర్ బాధపడతారు. దాదాపుగా ప్రపంచమంతా సంజయ్‍ని మరచిపోతుంది. పోలీసులు కూడా ఏదో పేరుతో అప్పుడప్పుడు ఎంక్వైరీలు చేస్తున్నట్లు ప్రెస్ మీటింగులలో చెబుతూంటారు. సంజయ్ తల్లి బాగా క్రుంగిపోతుంటుంది. తండ్రి నాయుడు గారు బిజినెస్ వ్యవహారాలన్నీ మేనేజర్లకు అప్పగించి, ఇంటికే పరిమితమవుతారు. ఇంతలో ‘త్రిపుల్ యస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ తేదీ ప్రకటిస్తారు. సినిమాకు హైప్ చాలా అవసరమనీ, యువతలో క్రేజు పుట్టించడం లేటెస్టుగా ప్రీ ప్రీ రిలీజ్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్నారని అంటాడు సమీర్. – ఇక చదవండి.]

[dropcap]ప్యా[/dropcap]న్ ఇండియా మూవీలు అని చెప్పుకుంటున్న సినిమాల నిర్మాతలు, దర్శకులు, హీరోహీరోయిన్లు, చీప్ హిందీ స్టాండప్ కామెడీ షోలలో వేలంవెర్రిగా పాల్గొని తమ సినిమాను మార్కెటింగ్ చేసుకుంటున్నారు.

ఇదంతా ఎందుకంటే, సినిమా విడుదలకు ముందే టార్గెటెడ్ ప్రేక్షకులను, అంటే ఇప్పుడు సినిమాలను థియేటర్లలో చూసే యువతీయువకులను మాత్రమే, థియేటర్లలోకి రప్పించడానికి వేసే నక్క జిత్తులు.

ఇంతకు ముందు మాదిరిగా, ఇప్పుడు పాత కాలంనాటి సినిమా థియేటర్లు కావు. ఇప్పుడన్నీ మల్టీప్లెక్సులు. ఒక్కొక్క మల్టీప్లెక్సులో ఐదారు స్క్రీన్లు ఉంటున్నాయి. ఇండివిడ్యువల్ సినిమా థియేటర్లు తక్కువయిపోయి వాటి స్థానంలో, ఇప్పుడు మల్టీప్లెక్సులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు సినిమా ఎన్ని థియేటర్లలో అని కాదు, ఎన్ని స్క్రీన్లలో రిలీజ్ అవుతుందని ప్రకటించాలి. సినిమా మీద ఎంత ఎక్కువ మోజు పెంచితే అన్ని ఎక్కువ స్క్రీన్లలో సినిమా రిలీజవుతుంది.

ఇప్పుడు తెలుగు సినిమాలకు అమెరికాలో కూడా వసూళ్ళు బాగానే ఉన్నాయి. ఓ మంచి సినిమా ఒక మిలియన్ డాలర్ల వరకు వసూలు చేస్తుంది. అందుకే ఒక పెద్ద సినిమా – ఎక్స్‌టెండెడ్ వీకెండ్ {Extended weekend} కోసం ఎదురు చూస్తూ, అంతకు ముందు రోజే అంటే గురువారమో లేదా శుక్రవారమో సుమారు వెయ్యి నుండి రెండు వేల స్క్రీన్లలో ప్రపంచమంతా రిలీజ్ అవుతుంది. సినిమా బాగుందా లేదా అని సామాన్య ప్రేక్షకుడికి ఒక అవగాహన వచ్చే లోగా అంటే ఓ మూడు నాలుగు రోజుల్లోనే వసూళ్ళు కొల్లగొట్టడమే ధ్యేయంగా సినిమా రిలీజ్ ప్రణాళిక ఉంటుంది. సినిమా బాగోలేకపోయినా నిర్మాత డబ్బులు నిర్మాతకు వచ్చి సేఫ్ జోనులో ఉంటాడు. సినిమా బాగుంటే, ఇక లాభాల పంటే.

ఒక విధంగా చెప్పాలంటే, ఇది సామాన్య ప్రేక్షకుల మీద మెరుపుదాడి {Blitzkrieg} వంటి యుద్ధ వ్యూహం.

సినిమా నిర్మాణం ఒక జూదం వంటిది. అందులో, పారితోషికాలు ముట్టడంతో  ప్రతీ ఒక్కరూ లాభపడతారు.  కానీ, నష్టపోతే మాత్రం ఒక్క నిర్మాత నెత్తినే తుండు గుడ్డ మిగులుతుంది.

అందుకే, మా నిర్మాత సత్యం గారు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా ఏర్పాటు చేసారు.

***

సంజయ్ ఇంట్లో మాత్రం సందిగ్ధత నెలకొని ఉంది. ఆ ఫంక్షన్‌లో సంజయ్ ఉండడు కాబట్టి తప్పకుండా అతని కిడ్నాప్ గురించిన విషయం చర్చకు వస్తుంది. మీడియా మళ్ళీ ఆ విషయమై రచ్చరచ్చ చేస్తుంది. బలవంతంగా తమను ఆ వివాదంలోకి లాగి తమ అభిప్రాయాలు చెప్పమని ప్రశ్నిస్తారు.

సినిమారంగం పైకి అంతా ప్రశాంతంగా, పవిత్రంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ, లోపలికి పోయిన కొద్దీ మురుగు, కంపు వాసన కొడ్తుంటుంది. ఈ మధ్య ‘మా’ {MAA: Movie Artists Association} సంస్థ ఎన్నికలలో ఎంత న్యూసెన్స్ జరిగిందో మనమంతా చూసాము. ఒకళ్ళ గురించి ఒకళ్ళు బండబూతులు తిట్టుకుంటూ అందరి రహస్యాలు బయట పెట్టుకున్నారు. సినిమా మనుషులంటే, దైవాంశసంభూతులని వాళ్ళను దేవుళ్ళలా ఆరాధించే, అభిమానులు సైతం చీదరించుకున్నారు. సుమారు 900 మంది మాత్రమే సభ్యులున్న ఈ సంఘానికి జరిగిన ఎన్నికలు, ఒక రణరంగాన్నే తలపించాయి. మీడియా జోక్యం గనుక లేకపోతే అవి సాఫీగా జరిగిపోయేవి. అసలు గతంలో ఈ సంఘానికి ఎన్నికలే లేకుండా ఎవరో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. అసలు ‘మా’ అన్న పేరు గల సంస్థ ఒకటుందని కూడా సామాన్య ప్రజానీకానికి తెలియనే తెలియదు.

కానీ, ఈ మధ్య సీనియర్ నటుల అమెరికా యాత్రలో వసూలయిన కాంట్రిబ్యూషన్స్, అప్పుడొచ్చిన డబ్బుల విషయంలో ఏదో గోల్‌మాల్ జరిగిందన్న వార్తలు బయటపడినప్పుటి నుంచే, ‘మా’ సంఘంలో అంతా ఐక్యంగా లేరనీ లుకలుకలున్నాయని బయటి ప్రపంచానికి బహిర్గతమయింది. ఎన్నికల రోజున ఒక నటి, ఒక హీరోను కొరకడం వంటి చేష్టలను పదేపదే టీవీల్లో చూపించడం కూడా మనం చూసి ఏవగించుకున్నాము.

అందమైన ముఖాల వెనుక ఇంత కపటం దాగి ఉంటుందా అని సామాన్య ప్రజలు విస్తుపోయారు.

అందుకే, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షనుకు వెళితే, ఎటు తిరిగి ఏం జరుగుతుందో, ఎవరే అభాండాలు వేస్తారేమోనని, నాయుడు గారు ఆలోచిస్తున్నారు.

అది కూడా నిజమే! సంజయ్ అంతర్ధానం వెనుక ఏదో కుట్ర ఉందని, డ్రగ్స్ కేసు నుండి తప్పించుకోవడానికే విదేశాలకు పారిపోయాడని;  శ్రీశైలంలో ఏదో హత్యా నేరంలో ఇరుక్కున్నాడని; ఒక హీరోయిన్‌ని మోసగిస్తే, ఆమె తన దగ్గర ఉన్న వీడియోలను బయటపెడతానని బెదిరించిందనీ, అందుకే పారిపోయాడనీ రకరకాల పుకార్లు చెలరేగుతున్నాయి. ఈ పుకార్లు సంజయ్ అదృశ్యమయిన మూడో నాటి నుండే మొదలయ్యాయి. అందుకే, నిర్మాత సత్యం గారు కూడా, సంజయ్ కిడ్నాప్ తరువాత నేను వాళ్ళు ఆఫీసుకు వెళ్ళినప్పుడే అన్నారు.

ఇంతటి కర్కశమైన పరిశ్రమ – టాలీవుడ్. ఇటువంటి చోట నెగ్గుకు రావడమంటే కత్తి మీద సాము వంటి విద్య తెలిసి ఉండాలి.

ఈ విషయాలన్నీ తెలుస్తుంటే – నాకు ఈ సినిమా రంగంలో నా కెరీర్ మొదలు కాకముందే – నాకు సినిమా అంటే విరక్తి పుట్టసాగింది.

అందుకే, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నేను, వసుధా వెళ్ళాలని ఆంటీ, నాయుడుగారు నిర్ణయించారు.

***

ఫంక్షన్ టైం వరకు మా డ్రెస్సులు తయారు చేయమని సంజయ్ పర్సనల్ కాస్ట్యూమర్‌ను పిలిచి నాయుడు గారు ఆదేశించారు. ట్రయల్ రూములో నా కొలతలు తీసుకుని మగ టైలర్ వెళ్ళి పోయిన తర్వాత లేడీ టైలర్ వచ్చి వసుధ కొలతలు తీసుకుంటూ,

“మేడమ్! క్లీవేజ్ ఎంత వరకు పెట్టమంటారు?” అని అడిగింది.

వసుధకి ఆ ప్రశ్న అర్థం కాక,

“అంటే ఏమిటి?” అని అడిగింది. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తూ, వసుధ ఎద వైపు చూపిస్తూ,

“ఎంత ఎక్స్‌పోజ్ చేయమంటారు?” అని అడిగింది. దాంతో, ఆ అమ్మాయి నా ముందరే అటువంటి ప్రశ్న అడిగినందుకు వసుధ బుగ్గల్లో కెంపులు పూచాయి. వెంటనే కన్నులు ఎర్రబడ్డాయి. వెంటనే తేరుకుని,

“ఛీ ఛీ! ఎక్స్‌పోజ్ చేయడమేమిటి. నా శరీరంలో ఒక్క అంగుళం మేర కూడా అసభ్యంగా కనపడకూడదు.” అని ఉరిమినట్టుగా అన్నది. ఆ అమ్మాయి కొంత ఆశ్చర్యపోయి,

“అర్థమయింది మేడమ్! కానీ, వీపులో కొంత కట్ చేసి ఒక మంచి ఈవినింగ్ పార్టీ గౌన్ ప్లాన్ చేస్తాను. పీచ్ కలర్ వెల్వెట్ క్లాత్ మీద గోల్డెన్ ఎంబ్రాయిడరీ మెడ నుంచి ఛెస్ట్‌ను కవర్ చేస్తూ నడుము వరకు ప్లాన్ చేద్దాము. ఆ డ్రెస్సులో మీరు చాలా గ్రేషియస్‌గా అందంగా ఉంటారు మేడమ్!” అని,

“కానీ, ఈ మధ్య చిన్నపాటి జూనియర్ ఆర్టిస్టుల నుండి హీరోయిన్ల వరకు అందరూ ఎంత ఎక్కువ క్లీవేజ్ పెడితే అంత బాగుంటుందని, బ్రా కూడా వేసుకోకుండా అంగాంగ ప్రదర్శన చేస్తున్నారు మేడమ్! మీరు ఇంత పెద్ద ఇంటి అమ్మాయి అయి ఉండి, ఇంత గుంభనంగా ఉండాలనుకోవడం, ఐ రియల్లీ లైక్ యూ మేడమ్! నా పేరు హారిక. NIFT {National Institute of Fashion Technology}, Hyderabad నుండి గోల్డ్ మెడలిస్టును మేడమ్! రెండు రోజుల్లో ట్రయల్ చూద్దాం మేడమ్!” అని వెళ్ళిపోయింది.

నేను వసుధ వైపు తిరిగి,

“అంతా బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి అన్న ఒక్క మాటే నాకు నచ్చలేదు.” అన్నాను.

“నచ్చలేదా? ఏం మాట అది?” అని వసుధ ఆశ్చర్యపోయింది.

“యూ లుక్ గ్రేషియస్ ఇన్ దట్ డ్రస్ అన్నమాట.”

“అంటే నేను ఆ డ్రస్సులో అందంగా ఉండననా నీ ఉద్దేశం?” అని బుంగమూతి పెట్టింది. నేను గుండ్రంగా సున్నా చుట్టినట్టున్న బుంగమూతి మీద ముద్దు పెడుతూ,

“నా ఉద్దేశం, నువ్వు డ్రెస్సు లేకుంటే ఇంకా అందంగా ఉంటావు కదా? మరి ఆ అమ్మాయి ఎందుకలా నువ్వు బట్టల్లోనే అందంగా ఉంటావని అన్నది?” అని అన్నాను అమాయకంగా. వసుధకి ముందు అర్థం కాలేదు. కానీ, అర్థమయిన మరుక్షణంలోనే తేరుకుని,

“పాపాత్ముడా!” అని పక్క సోఫాలో ఉన్న దిండును నా మీదకు విసిరేసింది.

నేను పకపక నవ్వుతూ బయటకు నడిచాను.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముందు నిర్మాత, దర్శకుడు, నాయుడి గారిని ఆహ్వానించి, ఆశీస్సులు కోరడానికి వచ్చారు. నేను కూడా వాళ్ళతో పాటే హాల్లో కూర్చున్నాను. ఇంతలో, ఆ రోజు పనిమనుషులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతోనో ఏమో, వసుధనే మంచినీళ్ళు, కాఫీ కప్పులు తీసుకుని వచ్చింది. సాధారణంగా తను అలా గెస్టుల ముందుకు రాదు. ఆమె పని, ఆంటీని చూసుకోవడం మాత్రమే.

సోఫాలో కూర్చున్న శ్రీవిక్రమ్ వసుధ లోపలికి రాగానే కన్నార్పకుండా, నిర్నిమేషుడై, చూస్తుండిపోయాడు. వసుధ అక్కడ ఉన్నంత సేపూ ఆమెనే శల్య పరీక్ష చేస్తున్నట్టుగా చూడడం మా అందరికీ ఇబ్బందిగానే అనిపించింది. వసుధ అయితే చిరాకుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

వెంటనే తేరుకున్న డైరెక్టర్, నాయుడి గారిని చూస్తూ,

“సార్! మీ ఆశీస్సులతో సినిమా అన్ని విధాలుగా, అనుకున్న సమయానికి, మనం బ్లాక్ చేసిన తేదీలలోనే విడుదలకు  సిద్ధమైంది. అందుకే, కొంత గ్రాండ్‌గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసాము. మీరొచ్చి ఆశీర్వదిస్తే మాకు ఆనందం. మనల్ని విమర్శించే వాళ్ళ నోళ్ళు మూతపడతాయి.” అని చటుక్కున నాయుడి గారి పాదాలకు నమస్కరించాడు.

శ్రీవిక్రమ్ సంభాషణా చాతుర్యం ఇప్పుడు బయటపడింది. సినిమా డైలాగులు అద్భుతంగా రాయడమే కాదు, అవసరమైనప్పుడు వాటిని ఎదుటి వారి ముందు ఉపయోగించగలడని కూడా నాకర్థమైంది. నాయుడు గారు, శ్రీవిక్రమ్ భుజాలు పట్టుకుని లేపి,

“శ్రీవిక్రమ్! సినిమా పూర్తయినందుకు నాక్కూడా సంతోషంగానే ఉంది. ఇది సంజయ్ నటించిన..” అని, ‘చివరి సినిమా’ అనే మాట పూర్తి చేయలేక ఆగిపోయాడు. వెంటనే తేరుకుని,

“నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. కానీ, ఈ ఫంక్షన్‌కు వచ్చి అక్కడ ప్రశ్నించే గొంతుకలకు నేను సంజాయిషీ ఇచ్చుకోలేను. సంతోషంగా జరిగే సభలో విషాద ఘట్టాన్ని సృష్టించదలుచుకోలేదు. మా సంజయే ఉంటే, నేను గర్వంతో వచ్చేవాడిని. ఇప్పుడు, అపరాధ భావంతో రాలేను. మరో విధంగా అనుకోకండి. నన్ను మన్నించండి. మా కుటుంబం తరఫున సమీర్, వసుధ వస్తారు. వీలైతే సమీర్ కొత్త సినిమా గురించి చెప్పి పరిచయం చేయండి.” అన్నాడు.

ఆ తర్వాత, శ్రీవిక్రమ్ చెప్పిన ప్రపోజల్‌ను విని మేమంతా విస్తుపోయాము. శ్రీవిక్రమ్ లోని దర్శకత్వ ప్రతిభకు అచ్చెరువొందాను. నాయుడు గారు తల పంకించి,

“ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం. ముందు ఫంక్షన్ సంగతి చూడండి.” అన్నాడు.

“సరే సార్! నమస్కారం సార్! వస్తాం సార్!” అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు.

నేను లేచి వస్తుంటే, నాయుడు గారు,

“సమీర్! శ్రీవిక్రమ్ చెప్పిన విషయం ఇప్పుడే ఎవ్వరికీ.. అంటే ఎవ్వరికీ లీక్ కానీయకు.” అని హెచ్చరించారు. ఆయన మాటల్లోని నిగూఢ సందేశం నాకర్థమయి, ‘సరే’నంటూ తలూపాను.

నేను కలలో నడుస్తున్నట్టుగా నడిచి నా రూముకు చేరుకున్నాను. శ్రీవిక్రమ్ చెప్పిన విషయం విని నా ‘హోష్ ఉడ్ గయా!’ అంటే నా బుర్ర పని చేయడం మానేసింది.

***

ఆ రోజు సాయంత్రం సన్నని చిరుజల్లులు పడి ఆగిపోయాయి. లేత ఎండ ఆకాశం నిండా పరుచుకుని ఉంది. వాతావరణం పడుచు గుండెల్లో తథిగిణతోం మోగిస్తుంది. ఇంతలో, నన్ను ఐదవ అంతస్తులోని పెంట్ హౌజుకు రమ్మని వసుధ పిలిచింది. ఆ తరుణంలో, ఆ ఆహ్వానంకు మనసు మురిసిపోయింది.

నేను లోపలికి వెళ్ళేసరికి, వసుధ మంచం పైన రెండు చేతులు తల క్రిందకు పెట్టుకుని పడుకుని ఉంది. తెల్లటి చీరెలో, నా కోసం దివి నుండి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉంది. నన్ను చూడగానే రెండు చేతులు చాచి,

“పరుపులో పరుచుకున్న వెన్నెలలా

అరవిరిసిన మల్లియలా

మురిపాల ప్రణయబంధంలా

అధరాలతో దరువులు వేస్తూ

ఆకాంక్షతో ఎదురు చూస్తున్నా ప్రియా!”

అని అన్నది.

పడుకున్నప్పటి ఆ శృంగార భంగిమ, ఆ ఒంటి సుగంధం, ఆ మరులుగొల్పే మాటలు నన్ను తన్మయత్వంలో ముంచేసాయి. వెంటనే వసుధను కౌగిట్లో బంధించాను. వెంటనే, పూవింటి విలుకాడు మల్లెల బాణాలు సంధించడం ప్రారంభించాడు.

ఆ వాతావరణం, ఆ ఒంటి సుగంధం, నా చెలి పరిష్వంగం నాకు అమృతతుల్యమైన ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చాయి.

***

ప్రీ రిలీజ్ ఫంక్షనుకు వెళ్ళే రోజు మధ్యాహ్నం నాలుగింటికే కాస్ట్యూమర్, హెయిర్ డ్రెస్సర్, మేకప్ వాళ్ళు వచ్చారు. అంకుల్ ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు.

రహస్యంగా వెళ్ళి నిశ్శబ్దంగా వచ్చేద్దామని నా ప్లాన్. కానీ, ఇంత ఆడంబరంగా, ఖరీదైన డిజైనర్ దుస్తుల్లో వెడితే అందరి దృష్టి మా మీదనే పడుతుందేమోనని నాలో చిన్న వణుకు మొదలైంది.

ఇంతలో వసుధను తయారు చేసి బయటకు తీసుకొచ్చారు. నేను ఒక్క క్షణం నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. మానవ జాతి సౌందర్య దాహం తీర్చడానికి వచ్చిన అప్సరసలా ఉంది వసుధ. నేను రోజూ చూసే వసుధే అయినా ఇంత అందగత్తె అని ఈ కోణంలో నేనెప్పుడూ ఊహించలేదు. హారిక అనే కాస్ట్యూమర్ అమ్మాయి,

“హియర్ ఈజ్ ‘ది వసుధ మేడమ్’!” అని సౌందర్య పోటీల్లో గెలిచిన విజేతను పరిచయం చేస్తున్నట్టుగా రెండు మోకాళ్ళు కొంచెం వంచి, తల దించి, కుడి చేతితో ప్రెజెంట్ చేస్తున్నట్టుగా, వసుధను మా ముందు నిలిపింది.

‘అతిలోక సుందరికి పరిచయాలేల’ అని నేను మనసులో అనుకున్నాను.

ఆంటీ వసుధను దగ్గరకు తీసుకుని,

“చక్కదనాల చుక్కలా ఉన్నావు. ఆ మగరాయుళ్ళ డ్రెస్సులో రోజూ నిన్ను చూసీ చూసీ విసుగెత్తిన కళ్ళకు విందు భోజనంలా కనిపిస్తున్నావే!” అని సుతారంగా నుదుటి మీద ముద్దు పెట్టుకుని, మరొక పనిమనిషితో ‘దిష్టి’ తీయమని చెప్పింది.

నేను అలక నటిస్తూ,

“ఆంటీ! మరి నా సంగతి చెప్పవేంటి?” అని బుంగమూతి పెట్టి ప్రశ్నించాను.

“నీకేమిట్రా? నువ్వు నా బంగారు కొండవు. నిన్ను చూస్తే సంజయ్ బాబుని చూసినట్టే ఉంది. ఎక్కువ సేపు చూస్తే నా దిష్టే తగిలేటట్టుందని నిన్ను చూడడం లేదు. మీ ఇద్దరి జంట చాలా బావుందిరా! ఎవ్వరి పాపిష్టి కళ్ళు మీ జంట మీద పడక ముందే మీ ఇద్దరికి కనీసం ఎంగేజిమెంట్ అయినా చేయాలి. కానీ, సంజయ్ తొందరగా వస్తేనే కదా..?” అని ఆగిపోయింది.

మేమిద్దరమూ ఆంటీకీ, అంకుల్‌కీ పాదాభివందనం చేసి బయల్దేరాము.

(సశేషం)

Exit mobile version