నాదొక ఆకాశం-3

0
1

[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]

[నేటి హీరోయిన్స్ వస్త్రధారణ గురించి తలచుకుంటాడు సమీర్. ఈలోపు త్రక్ష, సంజయ్ గదిలోంచి బయటకొస్తారు. ఆమె కన్నీళ్ళతో బయటికొస్తుంటే – కన్నీళ్లు తుడుచుకోమని చెప్పి, ఆమెకి ధైర్యం చెప్పి పంపించేస్తాడు సంజయ్. పుకార్లలకి సంబంధించి హీరోయిన్స్‌తో ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటాడు సంజయ్. హీరోహీరోయిన్‍లకు స్పాట్‍లో గొడుకు ఎందుకు పడతారో చెప్తాడు సమీర్. షూటింగ్ మొదలయ్యాక, సమీర్‍కి ఖాళీ దొరకగానే, తన గతం గుర్తు చేసుకుంటాడు. సంజయ్ తనని సినిమా ఫీల్డుకు ఎలా తీసుకువచ్చిందీ, సంజయ్ వ్యవహారాలను చూడడంతో తను ఎంతగా కుదురుకున్నదీ తలచుకుంటాడు. ఆ ఆలోచనల్లో ఉండగానే నిద్ర పట్టేస్తుంది సమీర్‍కి. సంజయ్ వచ్చి నిద్ర లేపుతాడు. షూటింగ్ అయిపోయిందా అంటే, లేదు ఇంకా కాస్త ఉంది, ఈలోపు అమ్మ పంపిన స్నాక్స్ తిందామని వచ్చానని చెప్పి సమీర్ భుజం మీద చేయి వేసి తీసుకువెళ్తాడు. ఆ రోజు అర్ధరాత్రి వరకూ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ అయి ఇంటికి వెళ్ళాక, సంజయ్ గిటార్ వాయిస్తూ, సమీర్‍తో పాటు రిలాక్స్ అవుతాడు. కాసేపటికి సమీర్ తన ఇంటికి వెళ్లిపోతాడు. మర్నాడు ఉదయం ఓ సెన్సేషనల్ వార్త గుప్పుమంటుంది. సమీర్ సంజయ్ ఇంటికి బయల్దేరుతాడు. టివి చానెళ్ళ వాళ్ళు, పత్రికల వాళ్ళు సంజయ్ ఇంటి ముందు గుమిగూడుతారు. ఛానళ్ళలో చర్చలకు అంతా సిద్ధమవుతూ ఉంటుంది. సమీర్ సంజయ్ ఇంటికి చేరి వెనుక గేటు నుంచి లోపలికి వెళ్తాడు. సంజయ్ తండ్రి సుధాకర్ నాయుడికి ధైర్యం చెప్తాడు. సంజయ్ శ్రీశైలం అడవుల్లో కిడ్నాప్ అయిన వార్త అప్పటి వరకు కేవలం ఇండస్ట్రీ పెద్దలకు, టీవీ ఛానెళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఈ క్లిష్టపరిస్థితిని డీల్ చేయాల్సింది తానే అని అనుకుంటాడు సమీర్. – ఇక చదవండి.]

[dropcap]అం[/dropcap]దుకే, ముందుగా శ్రీశైలంకు సంజయ్‌తో పాటు వెళ్ళిన వాళ్ళమ్మ గారి వెంట ఉన్న అటెండెంట్ వసుధకి ఫోన్ చేసి,

“వసుధా! ఏంటి పరిస్థితి? అసలేం జరిగింది. మీకెలా తెలిసింది? అన్నింటికన్నా ముఖ్యం, అమ్మకెలా ఉంది?” అని ఆతృతగా అడిగాను.

వసుధ, సంజయ్ వాళ్ళకు దూరపు చుట్టం. ఇరవై ఐదేళ్ళ వయసు ఉంటుంది. నర్స్ ట్రైనింగ్ చేసింది. కరాటే నేర్చుకుంది. ఆన్‌లైన్‌లో మేనేజ్‌మెంట్ కోర్సులు, న్యూట్రిషన్ కోర్సులు చేసింది. ఎప్పటికప్పుడు అప్డేట్‌గా ఉంటుంది. సంజయ్ అమ్మగారిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. చాలా ధైర్యవంతురాలు. ఇద్దరు ముగ్గురు వచ్చినా, శారీరకంగా ఎదుర్కునే ధీశాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా, నేను సంజయ్ దగ్గర చేరిన సంవత్సరం నుండి మేమిద్దరం రహస్యంగా ప్రేమించుకుంటున్నాము.

“సమ్మీ! నిన్న సాయంత్రం నాలుగు గంటలకు చికిత్స జరిగిన తర్వాత రాత్రి భోజనం చేయకపోవడంతో వెళ్ళి చూసిన ఆశ్రమ సిబ్బందికి సార్ కనిపించలేదు. బయటకేమైనా వెళ్ళారేమోననుకుని పది గంటల వరకు చూసాము. అప్పటికీ రాకపోయే సరికి మాకు కంగారు మొదలైంది. సంజయ్ సార్ డ్రైవర్ గోపాల్, బాడీగార్డ్ రమణ్ సింగులను అడిగితే సార్ సాయంత్రం నాలుగ్గంటల నుండి కాటేజీలో నుంచి బయటకే రాలేదని చెప్తున్నారు. మాకు కంగారు మొదలైంది. పెద్ద స్వామి వారికి వెళ్ళి విషయం చెప్పాను. ఆయన కంగారు పడొద్దని ఆ రాత్రే చుట్టు పక్కలా, అడవికి వెళ్ళే మార్గాలన్నింట్లో వెతికించారు. ఇద్దరు ముగ్గురు గూడెపు పెద్దలను కూడా సంప్రదించారు. ఇక లాభం లేదని రాత్రి పన్నెండింటికి పోలీసులకు రిపోర్టు చేసాము. ఇంకా ఈ విషయం సంజయ్ సార్ వాళ్ళ అమ్మగారికి, సంధ్యారాణి ఆంటీకి చెప్పనే లేదు. నాకంతా కంగారుగా ఉంది. నేనెప్పుడూ ఇలా జరుగుతుందని ఊహించ లేదు. సార్ కున్న సెక్యూరిటీ, ఆశ్రమానికున్న సెక్యూరిటీకి కన్నుగప్పి సంజయ్ సార్ ఎలా మాయమయ్యారో తెలియడం లేదు. నాకు భయంగా ఉంది. నువ్విక్కడికి రా సమ్మీ!” అని బేలగా అన్నది.

“వసూ! కంగారు పడకు! ఆ పోలీస్ స్టేషన్ నుండే ఈ వార్త లీకయినట్టుంది. తెల్లవారుఝామున నాల్గింటికే కార్చిచ్చులా, ఇక్కడి వరకు వ్యాపించింది.

నేనంతా ప్లాన్ చేస్తాను. జస్ట్ గివ్ మీ సమ్ టైం! ఇప్పటికే ఇంటి చుట్టూ ప్రెస్ వాళ్ళు గుమికూడారు. తెల్లవారితే ఇండస్ట్రీలోని పెద్దలంతా పరామర్శకు వస్తారు. నేను ఉండకపోతే అంకుల్‌కి ఇబ్బంది అవుతుంది. అంకుల్‌తో డిస్కస్ చేసి, అసలు మీరక్కడే ఉండాలా, ఇక్కడికి వచ్చేయాలా అన్నది కూడా ఆలోచించాలి. కొంచెం టైమివ్వు లవ్ యూ!” అని అంటూ ఫోన్ పెట్టేసాను.

***

ఇంతలో వంట మనిషి ఘుమఘుమలాడే కాఫీ తెచ్చింది.

“థ్యాంక్యూ ధనమ్మా! బుర్ర పగిలిపోతుంది. దేవతలా వచ్చి కాఫీ ఇచ్చావ్!” ఆప్యాయంగా అని, కాఫీ ఒక గుక్క తాగేసరికి నవనాడులూ జివ్వుమని ఉప్పొంగాయి. శరీరంలోని అణువణువుకూ, అడ్రినాలిన్ అందినట్టుగా ఉత్తేజితమయ్యాయి. సంజయ్ వాళ్ళింట్లో ఏ రోజుకారోజు కాఫీ గింజలను రోస్ట్ చేసి పొడి తయారు చేస్తారు. మంచి ఆవుపాలలో ఆ పొడి కలిపితే వచ్చే కాఫీ రుచి ప్రపంచంలో ఎక్కడా దొరకదు, పల్లెటూళ్ళో ఉండే మా అమ్మ దగ్గర తప్ప. మాకివన్ని హంగులు ఉండవు కానీ, అమ్మ రాత్రే వేసిన ఫిల్టరులో ఏం కలుపుతుందో కానీ, మా అమ్మ చేతి కాఫీ రుచే వేరు. అమ్మను తలుచుకునేసరికి అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. మా అమ్మ గుర్తుకు రాగానే సంధ్యారాణి ఆంటీ కూడా గుర్తుకు రావడమే కారణం కాబోలు. పాపం ఆ మహాతల్లికి కొడుకు కిడ్నాప్ అయ్యాడన్న విషయమే తెలియక, సుఖ నిద్రలో ఉండి ఉంటుంది.

***

సంజయ్ కిడ్నాప్ జరిగిందని తెలిసిన క్షణం నుంచి నా మనసు రెండు ముక్కలుగా విడిపోయి, ఒక పక్క సంజయ్ కోసం, మరొక పక్క వసుధ క్షేమసమాచారాల కోసం తహతహలాడింది. ఆ క్షణంలో వసుధను చూసి, ఆమెకు సాంత్వన కలిగించాలని ఎంతో ప్రయత్నించాను. కానీ వీలు కాలేదు.

రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత, బట్టలు మార్చుకుని, అలసి సొలసి సోఫాలో ఒరిగి విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి.

సంజయ్ కిడ్నాప్ నన్ను అనేక సమస్యల్లోకి నెడుతుందేమోనని ఆందోళనగా ఉంది. దినమంతా మీడియా వాళ్ళ ప్రశ్నలు, పోలీస్ కమీషనర్ గారి రాక, అభిమానుల ఆందోళనల హడావుడితో గడిచిపోయినా రాత్రికి రూముకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే నాకు నా పరిస్థితి క్లియర్‌గా గోచరించింది.

‘సంజయ్ లేకుంటే, ఆ ఇంట్లో నా పొజిషన్ ఏమిటి? నా ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? మంచి భవిష్యత్తు ఉన్న ‘ఇన్ఫోసిస్’ ఉద్యోగాన్ని వదులుకోవడం, నేను చేసిన తప్పిదమా? తెలివి తక్కువ నిర్ణయమా? సినిమాలో నటించే అవకాశం అనే ఆశ చూపించి సంజయ్ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడా?

సుధారాణిగారి అనారోగ్యం దృష్ట్యా, పెద్ద వయసు దృష్ట్యా, వారికి వసుధ అవసరం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి వసుధ ఆ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిందే!

సంజయ్ లేని ఇంట్లో వసుధ ఉంటుంది కానీ నేను అక్కడ లేకపోతే, అప్పుడప్పుడే చిగిరిస్తున్న మా ప్రేమ సంగతేమిటి?’

ఆలోచనలతో బుర్ర వేడెక్కి పోతుంటే, ఫ్రిజ్‌లో నుండి, బీరు బాటిల్ తీసుకుని, ఓపెన్ చేసాను. తినడానికి ఏం లేకపోవడంతో ‘జొమాటో’లో పారడైజ్ నుండి ఎగ్ బిర్యానీ, చికెన్ టిక్కా ఆర్డర్ చేసాను. ఫుడ్ వచ్చే లోపు మరొక బీర్ క్యాన్ తెరిచాను. ఆలోచనలతో రగిలిపోయే మనసును చల్లబరిచేది మధువే. తాత్కాలికంగానే అయినా అప్పటికి అదే దివ్యౌషధం! వచ్చిన ఆహారం ప్యాకెట్లు తెరవకుండానే సోఫాలో పడి నిద్రపోయాను.

వసుధ, సంధ్యారాణి ఆంటీ, ఆశ్రమానికి వెళ్ళిన పోలీసులకు వాఙ్మూలం ఇచ్చేసి, మరునాడు ఉదయమే, నేను సంజయ్ ఇంటికి వెళ్ళేసరికే, హైదరాబాదుకు వచ్చేసారు.

కానీ, సంజయ్ కిడ్నాప్ అయిన వార్త తెలిసినప్పటి నుంచి ఆంటీని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. ‘తనే గురూజీ దగ్గరకు, శ్రీశైలంకు తీసుకురావడం వల్లనే, ఈ రోజు ఇలా జరిగిందని, కొడుకు కిడ్నాపుకు తనే కారణమని’ కుమిలి కుమిలి ఏడుస్తుంటే గురూజీ, వసుధ ఎంత ఓదార్చినా ఫలితం లేకుండా పోయింది. హైదరాబాదుకు వచ్చిన తర్వాత సుధాకర్ నాయుడు, సంధ్యారాణి గారు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తుంటే, అక్కడున్న మా అందరి కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి.

అప్పటి వరకు అంకుల్ గొంతులోనే బిగపట్టుకుని ఉన్న దుఃఖం, ఆంటీ ఇంట్లోకి అడుగుపెట్టగానే, తన్నుకుని బయటకొచ్చేసింది. ఆంటీని, అంకులును ఓదార్చబోతున్న వసుధను కళ్ళతోనే వారించాను. ఎందుకంటే, ఆ వయసులో గుండెల్లోని భారం ఏడుపు రూపంలో బయటకు పోవడమే మంచిది.

సుధాకర్ నాయుడు గారు ఆగర్భ శ్రీమంతులు. తన తెలివితేటలతో వందల కోట్లు సంపాదించారు. మామూలు మధ్య తరగతి కుటుంబాలలో మాదిరిగా, ఇంట్లో గృహిణి లేకపోతే నిత్యావసరాలు తీరవనేం కాదు. కానీ, ఆ ఇంటి ఇల్లాలు సంధ్యారాణి గారు, మహాలక్ష్మిలా తయారయి హాల్లో కూర్చుంటే ఆయనకొక ఆనందం.

ఆమెకు చెప్పకుండా ఆయన ఏ పని చేయడు. ఎన్ని కోట్ల విలువైన డీల్ అయినా సంధ్యారాణి ఆంటీ ఒప్పుకుంటేనే ముందుకు వెళ్తాడు. ఆమెకు ఒక దివ్యశక్తి ఉందని, జరగబోయే భవిష్యత్తు ఆమెకు తెలుస్తుందని, అందుకే ఆమె జడ్జిమెంటును ఆయన బలంగా నమ్ముతాడు.

అప్పుడప్పుడు పరిస్థితుల దృష్ట్యానో, స్నేహితుల బలవంతం మీదనో సంధ్యారాణి గారు వద్దన్న ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టి ఘోరంగా నష్టపోవడం జరిగింది. దాంతో, ఆయన మరింతగా ఆమెను నమ్మడం మొదలుపెట్టాడు. సంధ్యారాణి గారికి ఆర్థిక, వ్యాపార లావాదేవీల్లో లోతైన అవగాహన లేకపోయినా ఆమెకు లౌక్యం బాగా ఉంది. పెళ్ళైన కొత్తలో వాళ్ళిద్దరూ ఎన్ని కష్టాలు అనుభవించారో, దగ్గరి బంధువుల, మితృల మోసాలకు గురయ్యారో ఆమె మరిచిపోలేదు కాబట్టి ఆమె మనుషుల మనస్తత్వాలను ఇట్టే పసిగట్టగలుగుతుంది. కొంతమంది మనుషులను చూడగానే, ఆమె వారిని స్కాన్ చేసి అతడు మంచివాడేననో, లేదా కాదనో చెప్పగలుగుతుంది.

ఆమె మీది అభిమానంతో పాటూ, ఆమె జడ్జిమెంటు నిజమే అవుతుండడంతో ఆమె మాటే, ఆ ఇంట్లో శాసనం. ఆమె ఆ ఇంటి మహారాఙ్ఞి. చూడ్డానికి కూడా దేవతలా ఉంటుంది. ఆమెకొక హెయిర్ డ్రస్సర్ కమ్ మేకప్ ఉమెన్‌గా కూడా వసుధ సహాయం చేస్తుంది. ఇద్దరూ షాపింగుకు వెళ్ళి మంచి లేటెస్ట్ చీరెలు, మ్యాచింగ్ నగలు, గాజులు, హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కుని వస్తుంటారు.

అందుకే, ఆంటీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా పూజ కాగానే తక్కువ, తేలికపాటి నగలు, పట్టు చీరె ధరించి ఉదయమే హాల్లోకి వచ్చి కూర్చుంటుంది. అలా, ఆ ఇంట్లో ప్రతీ పనీ, విషయమూ ఆమె కనుసన్నల్లోనే జరుగుతుంది.

అంతటి ధీరగంభీర, స్థితప్రఙ్ఞత కలిగిన భార్యను చూడగానే, నిన్న ఉదయం కొడుకు కిడ్నాప్ వార్త తెలిసినప్పటి నుంచి నిస్తేజంగా, మాటే రాని మౌన మునిలా కూర్చున్న నాయుడు గారు, సంధ్యారాణి గారు కనపడగానే, అతనిలో మౌనం బద్దలై, దుఃఖం వరదలై పొంగింది. ఒక పావుగంట తరువాత ఇద్దరూ ఉపశమించారు.

ప్రయాణం చేసి అలసిన భార్యను, భుజం మీద చేయివేసి తీసుకుని వెళ్తున్న దృశ్యం చూడ్డానికి నాకే హృదయవిదారకంగా ఉంది. ఇన్ని కోట్ల ఆస్తి, ఇంత పలుకుబడి, ఇన్ని వ్యాపారాలు ఉన్నా వాళ్ళిద్దరూ అన్నీ కోల్పోయిన అనాథల్లా, అలా ఒకరినొకరు ఆసరా చేసుకుని నడుస్తుంటే, కొడుకు కిడ్నాప్ అయిన వార్త వారినెంత కృంగదీసిందో నాకు అవగతమవుతుంది. అందుకే వయసులో ఉన్నప్పటికన్నా, ముదిమి వయసులోనే భార్యాభర్తలకు ఒకరి అవసరం మరొకరికి ఎక్కువగా ఉంటుంది.

సినిమా రంగానికి చెందిన వాణ్ణి కాబట్టి, ఇదే సంఘటన సినిమాలో జరిగి ఉంటే, ఈ దృశ్యాన్ని చిత్రీకరించడానికి, తెలివైన డైరెక్టరయితే ఒక మంచి విషాద గీతాన్ని రాయించి షూట్ చేసేవాడు.

లిఫ్టులో ఎక్కి వాళ్ళిద్దరూ నాలుగో అంతస్తులోని తమ రూముకు బయల్దేరారు. వసుధ కూడా వారితో పాటూ పైకి వెళ్తూ నన్ను వేచి ఉండమని చెప్పి వేడుకున్నట్టుగా చూసింది.

ఆ చూపుకు నేను – నిట్టనిలువున ఉన్న మంచు శిల్పం, సుప్రభాత కిరణం సోకగానే కరగడం ప్రారంభమైనట్టుగా – కరిగిపోయాను. ఇప్పుడు వసుధ తన కళ్ళ ముందు కనిపిస్తున్నా మాట్లాడే వీలు లేదు. సామానులు లిఫ్టులో పెట్టే నెపంతో, వసుధకు చేయి తగిలించాను. అదొక చిన్న తృప్తి. తనకు నేనున్నాననే ఆశ్వాసన. కానీ, లిఫ్టు తలుపులు మూసుకుంటుండగా తను చూసిన చూపు నా గుండెలను కోసేసాయి.

వాళ్ళు ముగ్గురు పైకి వెళ్ళేసరికి, నా మనోభిరామ్ బయటికొచ్చాడు.

***

‘నా వసుధ మూడు రోజుల్లోనే శ్రీశైలం వెళ్ళడం, అక్కడ సంజయ్ కిడ్నాప్ కావడం, పోలీసుల ఎంక్వైరీ, మళ్ళీ హైదరాబాదు రావడం వంటి హెక్టిక్ కార్యక్రమాలతో కొంత అలసినట్టు, కొంత నలిగినట్టు, తన ముఖం చూస్తే’ అనిపించింది నాకు.

ఆంటీతో వెళ్ళిన ఐదు నిముషాలకు, వసుధ నుండి వాట్సప్ వీడియో కాల్ వస్తున్నట్టుగా నా ఫోనులో మృదుమధురమైన వసుధ గొంతుతో రికార్డ్ చేసిన రింగ్ టోన్ మోగింది. ‘ప్రియే! ఫోనెత్తి నా మొర ఆలకించవా?’ అని వసుధ అన్న మాటలు, ఆ రింగు టోనులో ఉంటాయి. ఎంత టెన్షనులో ఉన్న ఆ మాటలు వినగానే నా మనసు ఉల్లాసభరితమౌతుంది.

ఇప్పుడు కూడా ఫోన్ ఎత్తగానే, నాల్గవ అంతస్తు బాల్కనీలో తన ఫేవరేట్ స్పాట్ ముందు నిలబడి,

“రెప్పలు వాల్చగానే..
రెక్కలు కట్టుకొని వచ్చేస్తావు..!
కళ్ళు తెరిచి చూడాలంటే..
ఏదో తెలియని భయం..!
కళ్ళ ముందు నీవు లేవన్న..
నిజం కలవర పెడుతుంది..!
కలలోనైనా కలిసుంటావని..
నిద్దుర దుప్పటి కప్పుకుంటాను
ఆశల విహంగాన్నై..
ఆకాశ వీధుల్లో ఎగురుతూ..
వెదికి వేసారుతున్నా ఒంటరినై..
స్వామీ ఇప్పటికి కరుణించావు.
కాయము భారమై అడుగు ముందుకు పడనంటున్నది
ప్రాయమేమో ముందుకే అడుగు వేయమంటున్నది”

అని ఒక ప్రేమ కవిత చదివింది. చదువుతుండగానే, వసుధ కళ్ళు చెమ్మగిల్లాయి. కంటి గవాక్షం ముందు, ఆల్చిప్పల్లాంటి కంటి రెప్పలకు అలంకరించిన ముత్యపు సరంలా, ఒక కంటి బిందువు అలా నిలబడిపోయింది.

నేను కలవరపడి,

“వసూ! ఎందుకురా బంగారం! కన్నీరూ? ఏమైనా సమస్యా?” అన్నాను. నేను అది వీడియో అని మరిచిపోయి, నా వేలితో వసుధ కన్నీటిని తుడిచే ప్రయత్నం చేస్తూ.

వసుధ ఫక్కున నవ్వింది.

“నువ్వక్కడే ఉండి నా కంటి నీటిని తుడిచేస్తావా ఏంటి?” అంది.

“పోనీ, నేను పైకి రానా? నీ కంట్లో నీరు చూస్తే ఏం చేస్తున్నానో కూడా మరిచేపోయాను.” అన్నాను కొంచెం సిగ్గు పడుతూ.

“వద్దు! ఆంటీ అలసిపోయి ఉన్నారు కదా! ఏమైనా అవసరముంటుందో ఏమో? నేనే వీలు చూసుకుని, చేసుకుని కిందికి వస్తాను.” అంది.

“వసూ! నీకు చెప్పడం మర్చిపోయాను. నేను కూడా సెకండ్ ఫ్లోరులోని గెస్ట్ బెడ్రూములోనే ఉంటున్నాను. ఈ ఫ్యాన్స్, గొడవలు, పోలీసులు, మీడియా ఇవన్నీ ఆయన ఒక్కరే హ్యాండిల్ చేయలేక, ‘నన్ను ఇక్కడే ఉండమని’ మీరొచ్చే ముందే అంకుల్ చెప్పారు. కాబట్టి, త్వరగా దేవీ దర్శన భాగ్యం కలిగిస్తే సంతోషిస్తాను.” అన్నాను.

వసుధ కూడా రెండో అంతస్తులో నాకు ఎదురుగా ఉన్న గెస్ట్ రూములోనే ఉంటుంది. ఇంత టెన్షనులోనూ అదొక చిరు సంతోషం.

***

ఒక గంట తర్వాత, వసుధ నుండి మరొక సందేశం మోసుకొచ్చింది ఫోన్.

“కలల్లోనే ఉన్నావని కల్ల కానీయను
ఉల్లమంతా నీవే ఉన్నప్పుడు
ఊహనే ఊపిరిగా బ్రతికేస్తా
కానీ, ఇప్పుడు కొన్ని క్షణాల వ్యవధిలో
నీ ముందుంటా!”

అంటూ వాట్సపులో వీడియో కాల్ చేస్తూ, ఒంటిని సింగారించుకుంటూ, నాకెంతో ఇష్టమైన నలుపు రంగు స్లీవ్ లెస్ జాకెట్ తొడుక్కుంటూ, శృంగార సందేశం పంపింది. తన పసిడి ఛాయ దేహం, నల్లటి చీరెలో ‘బ్లాక్ గోల్డ్’ లా ఉంటుంది.

వసుధ చూడ్డానికి, ఉద్యోగరీత్యా గంభీరంగా, కఠినంగా కనిపించినా నా దగ్గర మాత్రం మైనపు బొమ్మే అవుతుంది. ముగ్గురు నలుగురిని మట్టి కరిపించే బలమైన బాహువులు, నా మెడను మాత్రం తామర తూండ్లవలే బహు సున్నితంగా పెనవేసుకుంటాయి. అణువణువునూ నాకర్పించే మోహావేశంలో తను తహతహలాడుతుంటుంది. రెండు మూడు రోజుల విరహ వేదన వల్ల మా శరీరాలు వ్యతిరేక విద్యుత్తరంగాలై, బలమైన ఆకర్షణకు లోనవుతాయి.

వసుధకి ఫ్రీ టైం, అంటూ ఉండదు. దాదాపు ఇరవై నాలుగ్గంటలూ ఆంటీ పక్కనే ఉండాల్సి వస్తుంది. ఆమె పడుకున్న తర్వాతనే కొన్ని గంటలు నిద్రపోవడానికి విశ్రాంతి లభిస్తుంది. ఒక్కోసారి అది కూడా వీలు కాదు. ఆంటీ రూములో, పక్కనే మరో మంచం వేస్తే దాని మీదనే పడుకుంటుంది. అందుకే, రోజంతా ఎదురెదురుగా ఉన్నా, చూపులు కలుస్తూనే ఉన్నా, మనసులు విప్పి మాట్లాడుకోలేము. శరీరసంగమానికి నోచుకోము. అసలు పెళ్ళే చేసుకుందామనుకున్నాము గానీ ఇద్దరి భవిష్యత్తు అగమ్యగోచరంగానే ఉండడంతో, ఎవరైనా ఒకరు సెటిల్ కాగానే పెళ్ళి చేసుకుందామనుకుంటుండగానే, ఈ ఉపద్రవం, సంభవించింది.

***

ఒక ఘోర విపత్తు జరిగిన తర్వాత, బాధితులతో పాటు బాధితుల దగ్గరి వాళ్ళ చిత్త ప్రవృత్తులు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ కిడ్నాప్ వార్త తెలిసినప్పటి నుండి మేమందరమూ అదో రకమైన ట్రాన్సులో ఉన్నాము. పనులన్నీ జరుగుతున్నాయి కానీ ఏదో మిస్సయ్యామన్న భావన అంతరాంతరాలను తొలిచి వేస్తుంది. అటువంటప్పుడు, మన ఆత్మీయుల సన్నిధి కొంత ప్రశాంతతనిస్తుంది. నాయుడు గారు, ఆంటీ రావడంతో, ఏడ్చి తన మనసు భారం తీర్చుకుని కొంత ఊరట పొందారు.

నేను నా ప్రియ భామిని కొరకు ఎదురు చూస్తున్నాను. వసుధ నుండి సందేశం రాగానే, నేను రెండో ఫ్లోరులోని నా గదిలోకి పరిగెత్తాను. వసుధ వచ్చే ముందుగానే, తను అల్లంత దూరంలో ఉండగానే, తన నుండి వీచే శరీర సుగంధం నా ముక్కు పుటాలకు సోకుతుంది. అదొక గమ్మత్తైన మైకం కలిగిస్తుంది.

రసాయన ప్రయోగశాలలో రెండు మూడు మూలకాలను గానీ మిశ్రమాలను గానీ కలిపి కొత్త సమ్మేళనం, మిశ్రమం తయారు చేసే రసాయన ప్రక్రియను వేగవంతంగా చేయడానికి శాస్త్రఙ్ఞులు, ‘ఉత్ప్రేరకం’ (Catalyst) అనే మరో రసాయనాన్ని కలుపుతారు. దాని వల్ల రసాయనిక చర్య వేగవంతమై రసాయన సంయోగం పూర్తయి, కొత్త మిశ్రమం (compound) ఆవిష్కృతమవుతుంది.

అట్లాగే, వసుధ వెదజల్లే కమ్మని పరిమళం నా శరీరంలోని అణువణువునూ ఉత్తేజితం చేసే ఉత్ప్రేరకంగా పని చేస్తుంది. అది కృత్రిమమైన పరిమళమో, తన ఒంటి సుగంధమో నాకు తెలియదు గానీ నాకు బాగా ప్రియమైన వసుధ వస్తుందన్న, దగ్గరలోనే ఉందన్న శుభ సమాచారాన్ని మాత్రం అందచేస్తుంది. తరువాత, ప్రతీసారి, సరికొత్త సమ్మేళనానికి నాంది పలుకుతుంది.

వసుధ రాగానే తలుపులు మూసింది. నన్ను బిగి కౌగిలిలో బంధించి ముద్దులతో ముంచెత్తింది. అదేమి విరహమో, అదేమి మోహమో కానీ మేమిద్దరమూ ఒకరి కౌగిలిలో ఒకరముండగా, ఒక భయానకమైన సంఘటననానంతరం కలిగిన షాక్ వల్ల ఉధృతంగా కన్నీళ్ళు కారడంతో, అవి పెదవుల పైకి ప్రవహించడంతో, అధరామృతంతో మిక్స్ చేసి, మేమిద్దరమూ తాగేసాము.

ఒక హఠాత్పరిణామానికి గురయిన మేమిద్దరమూ, ఆత్మీయులమూ, ప్రేమికులమూ కలిసినప్పుడు, చెలరేగే ఉద్వేగాల ఉధృతి ఏ విధంగా బయటపడుతుందో ఎవరూహించగలరు? మా విషయంలో, బిగి కౌగిలిలో ఉన్నా, గుండె కింది కండ కదిలి మా మనసులు దుఃఖించాయి. కళ్ళు వర్షించాయి. మేఘావృతమైన ఆకాశంలా ఉన్న మా మనసులు, దుఃఖపు మబ్బులు వర్షించడంతో, తేట తెల్లమయ్యాయి.

అప్పుడు, మనసు భారం తగ్గిన తర్వాత, వయసు భారం పెరగసాగింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here