నాదొక ఆకాశం-7

1
1

[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]

[సందీప్ కిడ్నాప్ అయిన వారం రోజులకు, ‘త్రిబుల్ యస్’ బ్యానర్ నిర్మాత సమీర్‍ని తమ ఆఫీసుకు పిలిపిస్తాడు. అక్కడున్న సమీర్ పోస్టర్ చూసి విచలితులవుతాడు సమీర్. అక్కడ నిర్మాత సత్యం గారితో పాటు, డైరెక్టర్ శ్రీవిక్రం గారు, సన్నీ అనే ఎడిటర్  ఉంటారు. రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయిందనీ, ఆ రెండు పాటలను గ్రీన్ మ్యాట్‌లో, బాడీ డబుల్‌ని పెట్టి పూర్తి చేద్దామని ఎడిటర్ సలహా ఇచ్చాడని శ్రీవిక్రం గారి చెప్పి, భవిష్యత్తుతో లీగల్ సమస్యలు రాకూడదని, సమీర్ అభిప్రాయం అడుగుతారు. ఈ విషయం తనకెందుకు చెప్తున్నారో సమీర్‍కి అర్థం కాదు. అదే మాట శ్రీవిక్రం గారిని అడుతుండగా, నిర్మాత సత్యం కోపగించుకుని సంజయ్‍ని తిట్టబోతూ, శ్రీవిక్రంగారు ఆపడంతో ఆగిపోతారు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా, సినిమా పూర్తికాకపోతే తానెంతో నష్టపోతానని చెప్తారాయన. ఏ టెక్నిక్ ఉపయోగించైనా సినిమా పూర్తి చేయమని, సంజయ్ తరఫు నుంచి ఏ ఇబ్బందులు రాకుండా తాను చూసుకుంటానని చెప్తాడు సమీర్. ఇంతలో శ్రీవిక్రం గారు మరో ప్రతిపాదన చేస్తారు. సమీర్ కూడా సంజయ్ ఒడ్డుపొడుగు తోనే ఉండడంతో ఆ పాటల్లో సమీర్‍ని నటించమని, చాలారోజులుగా సంజయ్‍ని చూస్తున్నాడు కాబట్టి సంజయ్‍ని అనుకరించడం కష్టం కాదని అంటారు. గతంలో అలా జరిగిన కొన్ని ఉదాహరణలను చెప్తారు. సంజయ్ తల్లిదండ్రులని అడగమని, వారొప్పుకుంటే తనకి అభ్యంతరం లేదని సమీర్ చెప్తాడు. గొప్ప ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీవిక్రం గారి సినిమాలో రెండు పాటల్లోనే అయినా, సంజయికి డూప్ గానే అయినా, హీరోయిన్‌తో ప్రణయ సన్నివేశాల్లో పాల్గొనే అవకాశం వచ్చినందుకు మురిసిపోతాడు సమీర్. – ఇక చదవండి.]

[dropcap]నే[/dropcap]ను నా బుల్లెట్ సంజయ్ ఇంట్లో పార్క్ చేసి, సుధాకర్ నాయుడి గారిని కలిసి జరిగిన విషయం చెప్పాను. ఆయన గంభీరంగా, “ఆలోచిద్దాం!” అన్నాడు. నేను కొంచెం కలవరపడ్డాను. ఆయన వెంటనే ఆ ప్రతిపాదనను సంతోషంగా ఆమోదిస్తాడనుకున్నాను. కానీ, పెద్దవాళ్ళ ఆలోచనా విధానం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా అనుకుని, నా గదిలోకి వెళ్తూ, వసుధకి,

“ఒక శుభవార్త చెప్పాలి. వెంటనే రావా ప్లీజ్!” అని మెసేజ్ చేసాను. ఐదు నిముషాల తర్వాత వీడియో మెసేజ్ వచ్చింది. వాట్సప్ తెరవగానే, చంద్రబింబం లాంటి వసుధ ముఖం ప్రత్యక్షమైంది. తను నవ్వుతూ,

“అనుకోకుండా కలిసావు..
స్నేహ హస్తాన్ని అందించావు..
రోజులు క్షణాలుగా గడిపేస్తుంటే..
మధ్య మధ్య మేమూ మీతోనే అంటూ..
చిరు అలకలు, చిలిపి తగాదాలు..
కలగలిపి ఆస్వాదిస్తున్నా..
కొన్ని సలహాలు, మరి కొన్ని సందేహాలు..
లాలనలు, పొగడ్తలూ..
పొగడ దండలుగా స్వీకరిస్తున్నా..
మాటలలో మధువును గ్రోలి..
వీడలేని వ్యసనాన్ని కూడా..
అలవాటు చేసుకున్నా..
భావ ఝరీ ప్రవాహంలో ..
కొట్టుకుపోతున్న నేను..
ఏ మధుర తీరాలలో..
సేద తీరుతానో తెలియదు గానీ..
భవిత బంగారుమయం అని భావిస్తున్నా..
నీ మైత్రీ బంధం సాక్షిగా..!!
సకల శుభాలు ప్రియబాంధవా నీకు..
నీకు శుభమంటే మనకనే కదా సఖా?”

అని నవ్వుతూ అని,

“ఇప్పుడు రాలేను. వీలైన వెంటనే రావాలని నాకుంటుందని నీకు తెలుసు కదా?” అని ఫోన్ కట్ చేసింది.

ఆ మాటలతో నా మనసును నెమలి ఈకలతో స్పృశిస్తున్న భావన కలిగింది నాకు.

వసుధ కూడా నేను చెప్పిన వార్త విని ముందు మ్రాన్పడిపోయింది. తన ముఖ కవళికలను నేను వెంటనే అర్థం చేసుకోలేకపోయాను. మరుక్షణంలోనే, వసుధ నన్ను కౌగలించుకుని,

“సమ్మీ! ఎంత మంచి వార్త చెప్పావు రా! నా హృదయం చెపుతుంది, ఇక నీ జీవితంలో శుభగడియలు వచ్చేసినట్టే ప్రియా! కానీ,

నను విడువకు,
బేలనని వదలకు,
నీకై అభిసారికనై,
కనదోయిని మనసు గవాక్షానికి అతికించి,
నీ రాకకై అనుక్షణమూ ఎదురుచూస్తుంటానని గుర్తెరిగి,
ఏ క్షణమూ నీ తలపులలో
నను మరువకు.”

అంటూ భావోద్వేగంతో ఏడ్చేసింది. నేను తననూరడించడానికి ప్రయత్నిస్తూ,

“పిచ్చా నీకేమైనా? మరిచిపోవడమేమిటి? విడిచిపోవడమేమిటి? ఇంత శుభవార్త చెపితే, ఏడుస్తున్నావా?” అని అడిగాను.

“అది కాదు. సినిమా మాయలో పడితే ఎంతవారికైనా గతం మసకబారి పోతుంది. సరికొత్త కొత్త అందాలు, ఆశలూ, ఆహ్వానాలూ అందుతుండడంతో అభిరుచులు మారుతుంటాయి. పాత బంధాలు బరువుగా, గుదిబండగా తోస్తాయి. ను..” అని నిండా నీరు నిండిన కంటితో వసుధ ఇంకా ఏదో అనబోతుంటే, నేనామెను దూరంగా తోసేసి,

“ఓహో! అయితే నేను కూడా నిన్ను మరిచిపోయి పరాయి అమ్మాయిల మోజులో పడిపోతానని కన్ఫర్మ్‌గా ఇప్పుడే చెప్పేస్తున్నావన్న మాట. నీ ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ప్రతీ క్షణమూ నీ గురించే ఆలోచించే నన్ను బాగానే అర్థం చేసుకున్నావ్! వెళ్ళు తల్లీ! వెళ్ళు! ఎప్పుడో నేను మరిచిపోవడం, నువ్వు బాధపడడం ఎందుకు? ఈ క్షణం నుంచే నిన్ను మరిచిపోతాను. మరిచిపోయాననే అనుకో! శుభవార్త చెప్పినందుకు ఏడుపు ముఖంతో మంచి శుభాకాంక్షలే చెప్పావు? చాలు. వెళ్ళు!” అని గట్టిగా అరిచాను.

వసుధ ఒక్క క్షణం నన్ను ఎగాదిగా చూసి, విసావిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నన్ను అలా చూసినప్పుడు తన ముఖం నిండా కన్నీటి చారికలు ప్రస్ఫుటంగా కనిపించాయి. వెంటనే నా హృదయం తల్లడిల్లిపోయింది. నా వసుధనేనా నేను ఇన్ని మాటలన్నది? అనుకుంటూ పరిగెత్తి తనను పిలిచి క్షమాపణ కోరుదామనుకుని, తలుపు తెరిచేసరికి, వసుధ ఎక్కిన లిఫ్ట్ తలుపు మూసుకుంటున్నది. ఒక్క లిప్తపాటు మా ఇద్దరి చూపులు కలిసాయి. నా కళ్ళల్లోని వేదన, వసుధ గుర్తిస్తే బాగుండునని అనుకున్నాను.

నేనింత మూర్ఖంగా ఎలా ప్రవర్తించానో నాకే అర్థం కాలేదు. నేను తనను మరిచిపోతానని వసుధ ఆరోపించడంతో నా మనసు వికలమయి అలా మాట్లాడానేమోనని నన్ను నేను సమర్థించుకునే ప్రయత్నం చేసాను. కానీ, ఇతరులనైతే మాటలతో బురిడీ కొట్టించవచ్చును కానీ మనను మనం, మన మనసులో నిలిచి ఉన్న ప్రియతములను నమ్మించలేము. అందుకు అపారమైన ప్రేమ తప్ప మాటలు అవసరం లేదు. ఆ నా ప్రేమను వసుధ గుర్తిస్తుందన్న ఆశ నాకుంది.

గంట క్రితం కలిగిన ఆనందం కంటే, నిముషం క్రిందటి బాధే నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. ‘సినిమా ఛాన్స్ కన్న నేను వసుధ సాన్నిహిత్యాన్నే ఎక్కువగా కోరుకుంటున్నాను కాబట్టి..’ ఆలోచనల్లో ఉండగానే కన్ను మూతపడింది.

కలత నిద్రలో ఎన్నో భయంకరమైన కలలు వచ్చాయి. ఉలిక్కిపడుతూనే, నిద్రపోయానో ఏమో, లేచే సరికి తలనెప్పిగా అనిపించింది.

***

“రేపు రావచ్చా? నాయుడిగారిని కనుక్కుని చెబుతావా బాబూ?” అని నిర్మాత సత్యంగారు ఫోన్ చేసారు. అప్పుడే నన్ను ‘బాబూ’ అని పిలవడం విని నాకు నవ్వొచ్చింది.

నాయుడు గారు సరేనన్నారు. మరునాడు పదింటికి దర్శకుడు శ్రీవిక్రం, తనూ కలిసి వస్తామని చెప్పారు.

***

నేను ఆ రోజంతా ఇంట్లోనే ఉన్నా మధ్యాహ్నం నుండి వసుధ దగ్గర నుండి ఏ పలకరింపు లేదు. నేను కనీసం వంద సార్లైనా ఫోన్ చేసాను. కానీ, ఒక్కసారి కూడా బదులు ఇవ్వలేదంటే తన గుండె ఎంత గాయపడి ఉంటుందోనని నేననుకున్నాను. నేను పలకరించడం ఆలస్యం పూలబుట్టై, నా ముందు ప్రత్యక్షమై పూసేది, విరబూసేది, పరిమళాలు పంచేది. నేను అందుకే తనను చులకనగా భావించానా? అని నన్ను నేనే తిట్టుకున్నాను.

వసుధ ఎక్కడ ఉంటుందో తెలుసు కాబట్టి, నాలుగో ఫ్లోరులో ఆంటీ గదిలోకి నడిచాను. ఆంటీకి వసుధ భగవద్గీతలోని శ్లోకాలను చదివి వినిపిస్తుంది. నన్ను చూడగానే వసుధ లేచి బయటకు వెళ్ళిపోయింది. ఆంటీ నన్ను చూసి,

“సమీర్! అంకుల్ చెప్పారు. సంజయ్ చేయవలసిన బ్యాలెన్స్ సీన్లు నిన్ను చేయమని అడిగారట కదా?” అని అడిగింది. నేను ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా

“ఆంటీ! మీ ఆరోగ్యం ఎలా ఉంది?” అని ప్రశ్నించాను. ఆంటీ కళ్ళు చెమర్చాయి.

“సమీర్! మా ఆరోగ్యానికి ఏమయిందిరా? వాడి ఆరోగ్యం ఎలా ఉందోనన్న ఆలోచనే నన్ను కోసేస్తుంది. ఎండ కన్నెరుగని సుకుమార బాలుడు వాడు. వాణ్ణి ఎవరు ఎందుకు ఎత్తుకు పోయారో, ఎన్ని కష్టాల పాల్జేస్తున్నారోననే విషయమే, రంపపు కత్తై నా హృదయాన్ని తూట్లు పొడుస్తుంది. పోనీ, ఎన్ని కోట్లైనా ఇస్తామని పాదాలు పట్టుకుని వేడుకున్నాను కదా? అంత కర్కశంగా ఉంటారా మనుషులు?” అని ఏడ్చింది.

ఆమె ఏడుపు విని, తలుపు పక్కనే బయట నిలబడి వసుధ లోపలికొచ్చి

“మీరు ఇక్కడి నుండి వెళ్ళండి. ఆంటీని ఏడిపించడానికే ఇక్కడకు వచ్చారా?” అని కోపంగా అన్నది. నేను ‘సారీ’ అంటూ లేవబోతుంటే

“వసూ! అదేమిటే అట్లా కసురుకుంటున్నావు. వాడు రాకపోతే మాత్రం నా గుండెల్లో దుఃఖం లేదా? వాడొచ్చాడు కాబట్టి, అది బయటకొచ్చింది. మంచిదే కదా? కొంచెం తేలికగా ఉంది. అయినా మీరిద్దరేమిటి ఒకరి ముఖం ఒకరు చూసుకోవడం లేదు. గొడవ పడ్డారా? ప్రణయ కలహమా?” అని నా చెంపలు రాస్తూ లాలనగా అడిగింది.

“అదేం లేదాంటీ!” అన్నాను.

“లేదా? ఏం లేకపోతే, గంటకోసారైనా, ఏదో వంకతో నన్ను వదిలేసి, తలుపు పక్కన నిలబడి నీకు ఫోన్ చేసేదీ, పరుగులు పెడ్తూ నీ రూము నుండి వచ్చేది, అవన్నీ ఇవ్వాళ లేవే? ఇవ్వాళ మధ్యాహ్నం నుండి అది నన్ను ఒక్క క్షణం వదలలేదు. ముఖమంతా చిన్నబోయింది కూడా? నాకు తెలియదారా? అమాయకురాలిననుకుంటున్నారా? అది నువ్వంటే ప్రాణం పెడుతుంది రా? దాన్ని బాధపెట్టకు.” అని ఆంటీ అంది.

వసుధ తల పక్కకు తిప్పుకుంది.

“మేము మీ ఇద్దరినీ ఎప్పుడూ ఉద్యోగులుగా చూడలేదురా? నా తల్లి వసుధ నాకెంత సేవ చేస్తుందో? కేవలం జీతపు రాళ్ళ కోసం ఎవరైనా అంత సేవ చేస్తారా? ఈ సంకట సమయంలో, అది నా వెంటే ఉండి ఒక కూతురిలా చూసుకుంటుంది. అందరికీ ఇష్టమైతే, నేనే దాన్ని, ఈ ఇంటి కోడలిని చేసుకుందామనుకున్నాను. కానీ, అది నిన్ను ఇష్టపడింది. అది నాకు మరింత సంతోషం కలిగించింది. ఎందుకంటే, నువ్వు వాడికి ప్రాణస్నేహితుడివి. ఇప్పుడు కూడా ఇది నా ఇంటి కోడలే అయిందని భావిస్తున్నాము. అందుకే, మీరిద్దరూ ఎడమొహం, పెడమొహం పెట్టుకుంటే నాకు బాధ కలుగుతుంది. ప్రణయకలహమైతే, ప్రభువై దానిని లాలించు, ఓదార్చు, మన్నించు. నిజం పోట్లాటైతే మాత్రం దాన్ని పెద్దది కానివ్వకండి. మంచి మనుషులు దొరికే కాలం కాదురా ఇది. కాబట్టే, మనకు లభించిన ఆణిముత్యాల వంటి మనుషులను చేజారనీయవద్దు, వదులుకోవద్దు. అందుకే, మీ ఇద్దరూ ఎప్పుడూ మా కళ్ళ ముందే కలకాలం కళకళలాడుతూ ఉండాలి. సంజయ్ రాగానే గ్రాండ్‌గా మీ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ ఫంక్షను ఏర్పాటు చేద్దా..” అంటుండగానే ఆమె గొంతు గద్గదమయింది. కానీ, సర్దుకుని, మరుక్షణంలోనే,

“అవునూ! షూటింగ్ ఎక్కడ, ఎప్పటి నుండి!” అని ఆంటీ మాట మార్చేసింది.

“లేదాంటీ! నేను సినిమా చేయడం లేదు.” అన్నాను.

వసుధ చివుక్కున నా వైపు చూసింది. ఆంటీ కూడా ఆశ్చర్యంగా,

“అదేంట్రా?” అని అడిగింది.

“ఔనాంటీ! నాక్కూడా బంధాలే ముఖ్యం.” వసుధ వైపు చూస్తూ అని, ఆంటీ వైపు తిరిగి,

“ఆంటీ! ఈ సమయంలో సినిమా పూర్తి కావడం కన్నా, మీ దగ్గర ఉండి సేవ చేసుకోవడమే నాకు ముఖ్యం కదా? సంజయ్ వచ్చాకనే, సంజయితోనే ఆ సినిమా పూర్తి కావాలి. అలాగే పూర్తవుతుంది. నేను సినిమా అంటూ చేస్తే, సంజయ్ నిర్మించే సినిమాలో వాడొచ్చి క్లాప్ కొడితేనే నేను నటిస్తాను. పొద్దున్న వాళ్ళడగగానే, ఒక్క క్షణం నన్ను నేను మరిచిపోయి సంబరపడి పోయాను. కానీ, తర్వాత ఆలోచిస్తే, అది న్యాయం కాదనిపించింది. నేను వాడిని వెతికి తీసుకొచ్చి, మీ బిడ్డను మీకు అప్పగించాల్సింది పోయి, వాడి స్థానంలో నేను నటించడమేమిటి ఆంటీ? అది మిత్ర ద్రోహం కాదా? వాళ్ళలా అడగగానే, చేయనని చెప్పి రావాల్సింది కాదా? స్వార్థంతో నా కళ్ళు కమ్మేసాయా? అసలు నా బుద్ధి ఏమైంది?” అని ఆవేశంగా అన్నాను. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

జీవితంలో ఎన్నడూ చూడని, కార్చనన్ని కన్నీళ్ళు ఈ వారం రోజుల్లోనే నా అనుభవంలోకి వచ్చాయి.

ఆంటీ, వసుధ ఇద్దరూ విస్తుపోయారు. నేను చూడలేదు కానీ, గుమ్మంలో నిలబడి ఉన్న నాయుడు అంకుల్ కూడా నా మాటలు విన్నట్టుంది. ఆయన లోపలికి వచ్చి నా భుజం తట్టారు.

నేను వెంటనే నా గదిలోకి వచ్చేసాను.

***

సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్న తర్వాత, నా మనసెంతో ప్రశాంతంగా ఉంది. వసుధ అనుమానం నిజమేనేమో? ఒకవేళ నేను చపలచిత్తంతో ఏ పడుచు వ్యామోహంలో పడ్డా, లేక పడ్డట్టు పుకార్లు వచ్చినా, దాంతో వసుధతో నా ప్రణయ జీవితానికి ఫుల్‌స్టాప్ పడ్డట్టే.

అందుకే, ఎవరెన్ని విధాల చెప్పి నన్ను కన్విన్స్ చేయాలని చూసినా వినగూడదనే ఆంటీ రూములో నుండి బయటకు వచ్చిన నేను సరాసరి నా ఫ్లాటుకు వచ్చేసాను. ఫోన్ ఫ్లైట్ మోడులో ఉంచాను. ఒక బీరు పట్టుకుని కూర్చున్నాను.

ఒక వారం పదిరోజుల్లో, సంజయ్ కిడ్నాప్‌తో నా జీవితం అల్లకల్లోలమయింది. పోలీసులు ఒకసారి నన్నే అనుమానించి చిత్రహింసల పాల్జేసారు.

ఈ రోజు సత్యం గారు సినిమా అవకాశమిచ్చి ఆశల పల్లకీని ఎక్కించారు. కానీ, నన్నెంతో ప్రోత్సహిస్తుందనుకున్న వసుధకు నా మీద నమ్మకం లేదన్నట్లుగా ప్రవర్తించడంతో నేను గిల్టీగా ఫీలయి, సినిమా చేయనని చెప్పి వచ్చేసాను.

ఒకే రోజు సంతోష శిఖరాలను అధిరోహించాను. కొన్ని గంటల్లోనే బాధల లోయల్లోకి కూరుకుపోయాను. ఆ ఆలోచనలన్నింటితో, మనసంతా గందరగోళంగా తయారయింది.

అసలు సంజయ్ శ్రీశైలం వెళ్ళగానే నేను మా అమ్మ దగ్గరకు వెళ్ళాలని అనుకున్నాను. అమ్మకు కూడా సంజయ్ కిడ్నాపైన విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. పోలీసులు నన్ను కమీషనర్ ఆఫీసుకు పిలిచిన రోజునైతే, ఛానెళ్ళు చేసిన హడావుడి మామూలుగా లేదు. నేను ఇక జీవితాంతం జైల్లోనే చిప్పకూడు తింటానేమోనన్నంతగా, ఒక టెన్స్ వాతావరణాన్ని సృష్టించారు. అవన్నీ చూసి, ఎంతో ధైర్యవంతురాలైన మా అమ్మ కూడా బాగా కంగారు పడింది. నేను కమీషనర్ ఆఫీసు నుండి బయటకొచ్చి, ఫోన్ చేసి సముదాయించిన తర్వాత గానీ, అమ్మ మనసు శాంతించ లేదు. కానీ, కంటి నిండా నన్ను చూసుకుంటేనే గానీ, తనకు తనివి తీరదు.

***

అందుకే, నాకు వెంటనే మా అమ్మను చూడాలనిపించింది. అమ్మ ఒళ్ళో సేదదీరితే గానీ, ఈ తలనెప్పులన్నీ కాసేపైనా మరిచిపోయి, నేను మామూలు మనిషిని కాలేననిపించింది. వెంటనే బ్యాగు సర్దుకుని, అమ్మకు కావలసిన కొన్ని మందులు, పళ్ళూ, అమ్మకూ, మా ఊళ్ళోని బంధువులకు చాలా ఇష్టమైన ఐదారు ప్యాకెట్ల ‘కరాచీ’ బేకరీలో లభించే ఫ్రూట్ బిస్కెట్స్ తీసుకుని, బండిని రయ్యిమని మా ఊరు వైపుకు తిప్పాను.

అమ్మ దగ్గరకు వెళ్తున్నాను కాబట్టి ఆఘమేఘాల మీద ప్రయాణం సాగి రెండు గంటల్లోనే మా ఊరికి చేరుకున్నాను. నన్ను చూసిన అమ్మ ఆనందానికి అంతే లేదు.

“మా నాయనే! నీకేం కాకూడదని ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నానో తండ్రీ! మన ఊరి చెన్నకేశవ స్వామి నా మొర ఆలకించాడు. నువ్వు బయటపడ్డావు. ఆ రోజు నేను స్వయంగా వండి, గుడిలో చక్కర పొంగలి ప్రసాదం పంచిపెట్టాను. అవునూ వస్తున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదేంట్రా?” అని అన్నది.

నేను అమ్మను కౌగిట్లోకి తీసుకున్నాను. నా చిన్నప్పుడు అమ్మ కొంగు కూడా నా చేతికి అందకపోయేది. నానా ఆరాటాలు పడి, అమ్మ వెంటబడి పోయేవాణ్ణి. అటువంటిది ఇప్పుడు అమ్మనే చిన్నపిల్లలా నా కౌగిట్లో ఒదిగిపోయింది. అమ్మ చాలా చిక్కి పోయి ఉంది. నా కౌగిలిలో ఉన్న అమ్మ ఒంటి ఎముకలు నాకు తగులుతున్నాయి.

‘ఊళ్ళో ఉండొద్దమ్మా! నా దగ్గరకు వచ్చి ఉండమని’ ఎన్నిసార్లు చెప్పినా అమ్మ నా మాట వినదు. మా ఊళ్ళోనే ఏయన్నెమ్ (ANM) గా పని చేస్తుంది. ఊళ్ళో వాళ్ళకు నోట్లో నాలుక లాగా ప్రతీ పనికీ అందుబాటులో ఉంటుంది. మా నాన్న చనిపోయినప్పటి నుండి స్వంతంగా ఏయన్నెమ్ ఉద్యోగం సంపాదించుకుని, ఆ చిన్నపాటి జీతంతోనే నన్ను చదివించింది. నేను ఇన్ఫోసిస్‌లో లక్ష రూపాయల జీతం, తర్వాత సంజయ్ దగ్గర నెలకు రెండు లక్షలు సంపాదించినప్పుడు కూడా నా దగ్గర ఒక్క రూపాయి తీసుకోవడానికి ఇష్టపడలేదు. నేనే అమ్మ పేరు మీద ఐదెకరాల పొలం కొని, మా బంధువులకే కౌలుకిచ్చి, ఆ డబ్బులు అమ్మ బ్యాంకు అకౌంటులో వేసేటట్టుగా అమర్చి వెళ్ళాను.

మా అమ్మ స్వాభిమానానికి ప్రతీక. “ఎవరైనా సరే కాళ్ళూ చేతులు పని చేస్తున్నంత వరకూ పని చేయాల్సిందేరా! నా వల్ల ఎంత మంది ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారో నాకే తెలుసు. నేను చేసేది దైవకార్యం రా! నన్ను పట్నం తీసుకెళ్ళి సోమరిని చేయకు.” అంటుంది.

మా అమ్మకు స్వాభిమానం ఎక్కువే కానీ నా మీద ప్రేమ కూడా ఎక్కువే. ఒక్కడినే సంతానం కాబట్టి నన్ను గారాబంగా చూసుకునేది.

అమ్మ ఒళ్ళో పడుకుని అమ్మను చూస్తుంటే ఎంత హాయిగా ఉందో? అమ్మ తెల్లజుట్టు, వడలిన ముఖంతో ఉన్నా నా కంటికెంతో అందంగా కనిపిస్తుంది. అసలు అమ్మ బాహ్యరూపం ఎవడికి కావాలి. అమ్మ అన్న భావనే అపురూపమైనది, అందమైనది. ఆ లెక్కన అమ్మలందరూ అందగత్తెలే!

ఆ రోజు అమ్మ నా కోసం ‘సర్వపిండి’ వంటకం చేసి పెట్టింది. వెన్న, పెరుగు, చింతకాయ పచ్చడితో, మా అమ్మ చేసిన ‘సర్వపిండి’ తింటే, స్వర్గానికి కూతవేటు దూరంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది.

అల్లసాని పెద్దన గారు, ‘మను సంభవం’లో వరూధినిని చూసి ప్రవరాఖ్యుడి మనఃస్థితిని వర్ణిస్తూ ‘జిహ్వ త్రుప్పుడిల్ల’ అని అంటారు. పంచభక్ష్య పరమాన్నాలను తనకు వడ్డించినప్పుడు క్షుద్బాధితుడు, ఎన్నో ఏళ్ళుగా నాలుకకు పట్టిన తుప్పు వదిలేట్లు వంటకాలున్నాయని అనుకున్నట్టుగా, సిటీలో చప్పిడి కూడా తినీతినీ చచ్చుబడ్డట్టున్న నా నాలుక, సర్వపిండి అనే దివ్య వంటకం తినడంతో త్రుప్పు వదిలి రసాస్వాదనలో పడుతుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here