Site icon Sanchika

నాదొక ఆకాశం-8

[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]

[సంజయ్ స్థానంలో తాను నటించి సినిమా పూర్తి చేసేందుకు వచ్చిన అవకాశం గురించి సుధాకర్ నాయుడిగారితో చెప్తాడు సమీర్. ఆయన ఆలోచిద్దాం అని అంటారు. ఈ వార్తను వసుధకి చెప్పాలని, ఆమెని మెసేజ్ చేస్తాడు సమీర్. తాను వెంటనే రాలేనని, వీలు చూసుకుని వస్తానని చెప్తుంది. కాసేకయ్యాక వచ్చిన వసుధకి ఆ శుభవార్త చెప్తాడు సమీర్. ఆమె చాలా సంతోషిస్తుంది, కానీ, సినిమాల మాయలో పడిన వారికి పాత బంధాలు బరువుగా తోస్తాయనీ, తనను మర్చిపోవద్దని అంటుంది. దాంతో కోపం తెచ్చుకున్న సమీర్ ఆమె మీద అరిచి వెళ్ళిపొమ్మంటాడు. కాసేపటికి గానీ తానెంత మూర్ఖంగా ప్రవర్తించినదీ అతనికి అర్థం కాదు. చాలా బాధపడతాడు. మర్నాడు నిర్మాత సత్యం గారు ఫోన్ చేసి – రేపు రావచ్చేమో నాయుడి గారిని కనుక్కుని చెబుతావా బాబూ – అని అడుగుతారు. నాయుడు గారు సరేనంటారు. ఆ రోజంతా సమీర్ ఇంట్లోనే ఉన్నా వసుధ నుంచి ఏ పలకరింపూ ఉండదు. ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తదు. చివరికి ఆంటీ గదికి వెళ్తాడు సమీర్. అతడిని చూడగానే అక్కడ్నించి వెళ్ళిపోతుంది వసుధ. సంజయ్ చెయ్యవలసిన బ్యాలెన్స్ సీన్లు నిన్ను చేయమన్నారట కదా, అంకుల్ చెప్పారు అని ఆవిడ అంటే, లేదాంటీ, నేను చేయడం లేదు. నాకూ బంధాలే ముఖ్యం, సంజయ్ వచ్చాకే ఆ సినిమా పూర్తవుతుంది అని అంటాడు సమీర్. గుమ్మలో నిలబడి ఉన్న సుధాకర్ నాయుడు గారు సమీర్ మాటలు విని లోపలికి వచ్చి సమీర్ భుజం తడతారు. సినిమాల్లో నటించవద్దని నిర్ణయించుకుని సమీర్ మనసు కుదుటపడుతుంది. వెంటనే వెళ్ళి అమ్మని చూడాలనుకుని, బైక్ మీద బయల్దేరుతాడు. ఊరు చేరిన సమీర్ అమ్మ సమక్షంలో ప్రశాంతత పొందుతాడు. అమ్మ చేసిన వంటలు తిని, ఆమె ఒడిలో సేద తీరుతాడు. – ఇక చదవండి.]

[dropcap]రా[/dropcap]త్రి భోజనం చేసిన తర్వాత, నా కోసం బావి పక్కన మంచం వేసి చెద్దరు పరిచింది అమ్మ. మాదేమీ పెద్ద ఇల్లు కాదు. రెండు గదులు, ఒక వంటగది, ఒక పశువుల పాక, కొంత పెరడు. ఇది కూడా మాకు మా పూర్వీకుల నుంచి వచ్చిందేమీ కాదు.

మా నాన్న లారీ డ్రైవరుగా పనిచేసేవాడు. ఆ వృత్తిలో ఉన్న అందరిలాగానే తాగుడు, దారి వెంట లభించే వేశ్యల సాంగత్యం వల్ల ఎయిడ్స్ వ్యాధి బారిన పడి నాకు ఐదేళ్ళున్నప్పుడే మరణించాడు. పల్లెటూళ్ళల్లో అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఎయిడ్స్ రోగమంటే, ఒక విధమైన ఏహ్య భావం ఉంది.

దాంతో అమ్మ అనేక అవమానాలు భరించింది. ఉన్న ఊళ్ళో ఉన్న కొద్దో గొప్పో పొలం ఇల్లు అమ్మి, ఉన్న ఊరిని, చుట్టాలని వదిలి దూరంగా, ఇప్పుడున్న ఊరికి వచ్చింది.

మా నాన్నకన్నా మా అమ్మ తెలివైంది, ధీర గంభీర. అప్పట్లోనే ఐదో తరగతి వరకు చదువుకుంది. తనకెదురైన అవమానాలను, కష్టాలను తలుచుకుని మా అమ్మ కుమిలిపోలేదు. వయసులో ఉండే ఒంటరి మహిళలకు ఎదురయ్యే అన్ని భౌతిక, లైంగిక దాడులను ధైర్యంగా ఎదుర్కుంది.

అందుకే, అమ్మకు చదువు విలువ తెలుసు. కాబట్టే గతన్నంతా తుడిచేసి ‘క్లీన్ స్లేట్’ అంటే కొత్త జీవితాన్ని ప్రారంభించింది. నన్ను బాగా చదివించడమే ధ్యేయంగా పెట్టుకుంది. తనకున్న చదువుతో, ఆరోగ్య శాఖలో ఏయన్నెమ్‌గా ఉద్యోగం సంపాదించుకుంది. చిన్న ఉద్యోగమే అయినా, ఊరివాళ్ళకు రాత్రింబవళ్ళు సేవ చేసి తన అస్తిత్వాన్ని కాపాడుకుంది.

చిన్నప్పటి నుంచి అమ్మ తనకు ఎదురైన అనుభవాల దృష్ట్యా ఎవరితోను అనుబంధాలను పెంచుకోలేదు. నాకు అమ్మ, అమ్మకు నేను. అంతే. ప్రతి దినం తన దినచర్యలో తనకెదురైన సంఘటనలన్నీ రాత్రి పూట ఇదే మంచం మీద పడుకుని నాకు చెబ్తుండేది. మేమిద్దరమూ ఒక జట్టుగా తయారయి ప్రపంచాన్ని ఎదుర్కున్నాము. నేను చిన్నగా ఉన్నప్పుడు, ప్రతీ రాత్రీ ఒక నరకమే! తాగుబోతులంతా మా ఇంటి చుట్టూ చేరి బూతులు మాట్లాడేవారు. నాకర్థమయ్యీ అర్థం కానట్టు ఉండేది. అమ్మను లైంగికంగా వేధించే వెధవలందరినీ కాల్చి పారేయాలనిపించేది. సినిమాల్లోలాగా ఇటువంటి నీచప్రవృత్తి కలవారికి ఒక్క రోజులోనో, ఒక్క సంఘటనతోనో బుద్ధి చెప్పలేము. అమ్మ ఆలోచించి నాలుగు కుక్కలను పెంచుకోవడానికి తెచ్చింది. నాకైతే రోజంతా వాటితో ఆటే. ఆ నాలుగు కుక్కలు, నాలుగు దిక్కులా కన్న కొడుకులై అమ్మకూ, నాకూ కాపలా కాసేవి. రానురానూ అమ్మ పనిలో చూపే నిబద్ధతను గమనించిన గ్రామప్రజలు, ఆమె పట్ల తమకు గల బాధ్యతను గుర్తించి, గుండెల్లో పెట్టుకున్నారు. పోకిరీలకు బుద్ధి చెప్పారు. అందుకే, అమ్మ ఆ ఊరు వదిలి రానంటుంది.

అమ్మ నేల మీద కూర్చుని నా జుట్టును నిమురుతూ ఏవేవో విషయాలు చెబుతున్నా నేను గతస్మృతుల్లో తిరుగాడుతూనే నిద్రపోయాను.

ఆ ఒక్క రాత్రి నిద్ర అపారమైన ప్రశాంతతను, అంతులేని శక్తిని ఇచ్చింది. యుద్ధరంగంలోకి దూకడానికి సమాయత్తమవుతుండగానే, ఫోన్ ఆన్ చేయగానే వసుధ ఫోన్ చేసింది.

“అంకుల్ మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. నిన్నటి నుండి ప్రయత్నిస్తున్నాను. ఎక్కడున్నారు?” అని ప్రశ్నించింది. వసుధ గొంతులోని భావాన్ని పసిగట్టలేక పోయాను. నేను కూడా డిప్లొమాటిక్‌గా మాటలాడగలననిపించి,

“నాకెవరున్నారు? అమ్మ తప్ప. మా అమ్మ దగ్గరికి.. మా ఊరికి వచ్చాను.” అన్నాను.

వసుధ ఫోన్ కట్ చేసింది.

ఐదు నిముషాల్లో నాయుడు గారు ఫోన్ చేసి,

“సమీర్ వెంటనే రా! సత్యంగారు వాళ్ళు పదింటికి వస్తానన్నారు కదా?” అన్నారు.

నేను ట్రిపుల్ యస్ సినిమాలో చేయనని ఆంటీతో చెప్పినప్పుడు విని కూడా నన్ను రమ్మంటున్నారంటే.. నాయుడి గారి మనసులో ఏముందో అర్థం కాక, “అదీ.. సార్..!” అని నసిగాను.

“వాళ్ళకు సాయంత్రం రమ్మని ఫోన్ చేస్తాను. నువ్వు బయల్దేరు. అమ్మ ఆరోగ్యం అదీ అంతా కుశలమే కదా? ఒకసారి ఫోనివ్వు.” అన్నారు.

అమ్మకు ఫోను ఇచ్చాను.

అమ్మ చాలా సేపు వింటూనే ఉంది. మధ్యమధ్యలో “సార్!”; “అలాగే సార్!”; “అలాగేం లేదు సార్!” అంటూ ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుని,

“అవును సార్! బిడ్డ చాలా నలిగిపోయి ఉన్నాడు. సంజయ్ బాబు అంటే వాడికి ఆరో ప్రాణం. మీరన్నా, మేడమ్ గారన్నా చాలా గౌరవం సార్!.. చెప్తాను సార్! కానీ వాడి అభీష్టానికి వ్యతిరేకంగా చేయమని కూడా నేను చెప్పలేను సార్! ఉంటా సార్! నమస్కారం!” అంటూ ఫోన్ కట్ చేసి, నా వైపు తిరిగి,

“ఏమైంది నాన్నా?” అని, తన గొంతులోని అమృత భాండాగారాన్నంతా, మాటల్లోకి వంపుతూ, అడిగింది.

నేను అప్పటికే, మా అమ్మ సుధాకర్ నాయుడిగారికి, ‘వాడి అభీష్టానికి వ్యతిరేకంగా..’ అని చెప్పిన మాటలకు, నా నిర్ణయం పట్ల ఉన్న నమ్మకానికి, ముగ్ధుణ్ణై పోయి నిలబడ్డాను.

అమ్మకు జరిగిన విషయం చెప్పాను, ఒక్క వసుధ విషయం తప్ప. అమ్మ అంతా విని,

“నీకు మంచిదనిపించింది నిర్భయంగా చెయ్యి నాన్నా! అలాగే వాళ్ళ మనసు నొప్పించకుండా. ఈ లోకంలో మనను ప్రేమించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. వాళ్ళను మాత్రము కోల్పోవద్దు.” అని చెప్పింది. విచిత్రంగా, నిన్ననే సుధారాణి ఆంటీ కూడా ఇవే మాటలు చెప్పింది.

నేను ఫలహారం చేసి, అమ్మ చేసిన సర్వపిండిని పార్సిల్ చేయించుకుని, నగరానికి పయనమయ్యాను.

నిజానికి మా అమ్మ లాంటి వాళ్ళు చాలా అరుదు. లేదా అందరు అమ్మలూ అంతేనేమో! తను బలవంతంగా ఏ నిర్ణయమూ నా మీద రుద్దదు. తను మానసికంగా చాలా స్ట్రాంగ్. నేను కూడా అలాగే ఉండాలని ప్రయత్నిస్తుంటాను.

***

నా ఫ్లాటుకు వెళ్ళి ఫ్రెష్ అయి, భోంచేసి కాసేపు పడుకుని లేచి తయారవుతుండగానే, ఫోన్ మోగింది.

వసుధ. వాట్సప్ వీడియో కాల్! కళ్ళు సజలమయి ఉన్నాయి.

నా గుండె లిప్తపాటు కొట్టుకోవడం ఆగిపోయింది.

నేను కూడా వీడియో ఆన్ చేసాను.

“సఖా!
కనులతో కోవెల కట్టా
కొలువై ఉండి పోరాదూ
నీ మీది ధ్యాసతో ప్రాణదీపం పెట్టా
దేదీప్యమానమైన వెలుగవ్వ రాదూ
ప్రియమారా అర్చన చేసా
ప్రేమగా మాట్లాడ రాదూ
నా మనసునే నీ హృదయపు హుండీలో అర్పణ చేసా
మనోహరుడవై నన్నేలుకోరాదూ!”

అంటూ నమస్కరించింది.

అంత దీనంగా, అంత రసరమ్యాత్మకంగా ప్రేయసి వేడుకుంటే, ఎవ్వరైనా కాదనగలరా? నేను మాత్రం కరిగిపోయాను.

“వసూ! నీలా కవితాత్మకంగా మాట్లాడలేను. కానీ, నా మనసు నిండా నువ్వే ఉన్నావు. నువ్వు కఠినంగా చూస్తేనే నేను భస్మమై పోతాను. నాకీ లోకంలో అన్నింటి కన్నా నువ్వే ముఖ్యం. నువ్వేం చేయమంటేనే ఏదైనా చేస్తాను. నిన్ను ఆందోళనలోకి నెట్టే సినిమా ఛాన్స్ కూడా నాకు వద్దు. కానీ, నీ కంట కన్నీరూ, నీ మనసులో నా మీద అనుమానం కలిగితే మాత్రం తట్టుకోలేను.” అన్నాను.

“నాకు తెలుసు సఖా! వెంటనే వచ్చేయ్!” అని ఫోన్ పెట్టేసింది.

***

సాయంత్రం, శ్రీవిక్రమ్, సత్యం గారు వచ్చేవరకు మేమంతా ఆందోళనగా ఉన్నాము. సుధాకర్ నాయుడు గారు, నేను సినిమాలో నటించబోవడం లేదన్న మాట విన్నారు కానీ, ఎటువంటి స్పందన చూపలేదు. నాయుడు గారు మొదటి నుంచీ అంతే! ఎక్కువగా మాట్లాడరు. ఆయన పనంతా చేతల్లోనే చూపిస్తారు. ఇప్పడైనా నన్ను రమ్మన్నారు గానీ, వాళ్ళు వచ్చే వరకు, నాతో ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు రాగానే అందరం హాల్లో సమావేశమయ్యాము.

సత్యంగారూ, శ్రీవిక్రమ్ కూర్చుని, నా వైపు, సుధాకర్ నాయుడి గారి వైపు ఆత్రుతగా చూస్తున్నారు. నన్ను చూసి, సుధాకర్ నాయుడు గారు,

“ఊఁ! నీ అభిప్రాయం చెప్పు.” అన్నారు.

“నాకిష్టం లేదు. నా ఉద్దేశంలో.. “ అని అంటుండానే, సత్యం గారు, ఒక్క ఉదుటున లేచి, నా వైపు కోపంగా చూస్తూ,

“నీ బోడి ఉద్దేశం ఎవడిక్కావాలి? పందిని తీసుకొచ్చి పన్నీటి స్నానం చేయిస్తామంటే ఒప్పుకుంటుందా? బురదలోనే దొర్లడానికి ఇష్టపడుతుంది.. నువ్వు కూడా అంతే! పద!” అని రొప్పుతూ శ్రీవిక్రమ్ వైపు చూసారు.

దాంతో సుధాకర్ నాయుడు గారు కూడా ఆగ్రహోదగ్రుడై, సత్యంగారి చెంపలు వాయించబోయాడు. నేనే అతన్ని ఆపి కూర్చోబెట్టాను. ఆయన కూర్చున్న రెండు నిముషాల తర్వాత,

“గెటౌట్ ఆఫ్ మై హౌజ్!” అని సుధాకర్ నాయుడు గారు తర్జని చూపించారు.

***

సత్యం గారు విసావిసా నడిచి వెళ్ళబోతుంటే, శ్రీవిక్రమ్ గారు అతన్ని ఆపి కూర్చోబెట్టారు.

సత్యంగారి లాగా ఆవేశం తెచ్చుకుంటే అది అందరి అనర్థానికే దారి తీస్తుంది. ప్రస్తుత సినీ రంగంలో దర్శకుల మధ్య విపరీతమైన పోటీ ఉంది. అది ఫ్రెండ్లీ పోటీయే అయినా, ఎంత గొప్ప దర్శకుడైనా ప్రతీ సినిమాతో సక్సెస్ ఇవ్వకపోతే, అది అతని తరువాతి సినిమా మీద నీలినీడలు కమ్ముకునేలా చేస్తుంది. ఒక దర్శకుడు పది సినిమాల బ్లాక్ బస్టర్ సక్సెసులు ఇచ్చినా, నిర్మాతకు కాసుల వర్షం కురిపించినా, అతని లేటెస్ట్ సినిమా ఫ్లాప్ అయితే, ఆ సదరు నిర్మాతే అతనికి అవకాశం ఇవ్వడు.

శ్రీవిక్రమ్ సార్ సంజయ్‌తో సినిమా చేస్తున్నాడని, టాలీవుడులోని అందరికీ తెలుసు. సంజయ్ కిడ్నాప్ అయ్యాడనీ తెలుసు. అయినా సరే, ‘త్రిపుల్ యస్’ సినిమా విడుదలై విజయం సాధిస్తేనే, శ్రీవిక్రంకు పెద్ద హీరోతో తరువాత సినిమా చేసే అవకాశం వస్తుంది. లేకపోతే, చిన్న చిన్న స్టార్లతో కాలం గడపాల్సి ఉంటుంది.

ఇప్పుడు పాత కాలం లాగా కాదు. ఒక సినిమా ప్రారంభం కావాలంటే, తనకు నచ్చిన హీరోతో సినిమా తీయాలంటే, రెండు మూడేళ్ళ ప్లానింగ్ అవసరం. ఒక కథ హీరోకు చెప్పి ఒప్పించిన తర్వాత అతనికి వీలైనప్పుడు అంటే, రెండో మూడో సంవత్సరాల తర్వాతైనా సరే, ఎప్పుడు కాల్షీట్లు ఇస్తే అప్పుడు సినిమా ప్రారంభించాల్సి ఉంటుంది. అట్లా శ్రీవిక్రమ్ చేతిలో, ఒక పెద్ద హీరోతో చేయాల్సిన సినిమా ఉంది. కానీ, ఆ సినిమా ఫేట్, ఇప్పుడు చేస్తున్న ‘త్రిపుల్ యస్’ సినిమా ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా హిట్టైతే, ఆ సినిమా సాఫీగా సాగుతుంది.

లేకపోతే, రకరకాల కుంటి సాకులతో హీరో, తరువాత నిర్మాత – ఆ ప్రాజెక్టు నుండి తప్పుకుంటారు. అది దర్శకుని కెరీరుకు మరణ శాసనం వంటిది.

కానీ, అసలు ‘త్రిపుల్ యస్’ సినిమా రిలీజే కాకుండా ఉంటే, దాని రిజల్ట్ త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టే. ఈ రంగంలో ప్రతీ ఒక్కరూ తమ సినిమా అద్భుతంగా ఉందనే చెప్తారు. ఖచ్ఛితంగా హిట్టుబొమ్మ అనే చెబుతారు. కానీ, అల్టిమేట్‌గా అది నిర్ణయించవలసింది ప్రేక్షకులు. కాబట్టి, శ్రీవిక్రమ్ ఎంతో గొప్ప డైరెక్టరే అయినా, ఈ టాలీవుడ్‌లో ఏ సినిమాకు ఆ సినిమానే కొలమానం.

***

ఇవన్నీ ఆలోచించే, శ్రీవిక్రమ్ గారు సత్యం గారిని ఆపి, కూర్చోబెట్టి, సుధాకర్ నాయుడి గారి వైపు చూసి

“సార్! మీరు పెద్దవారు. ఇండస్ట్రీలో తలపండిన అనుభవజ్ఞులు. మీరు తొందర పడకూడదు. దయచేసి, అందరం ప్రశాంతంగా కూర్చుని, ఈ సమస్య నుండి ఎలా గట్టెక్కాలో ఆలోచిద్దాం సార్! మీకు టాలీవుడ్ ప్రస్తుత పరిస్థితి తెలియనిదేముంది? ఈ సినిమా మీద నిర్మాత గారి పెట్టుబడి, నా భవిష్యత్తు, సంజయ్ బాబు క్యారెక్టరు అన్నీ ఆధారపడి ఉన్నాయి. ఈ సినిమా అనుకున్న టైముకు రిలీజ్ కాకపోతే ఎన్ని పుకార్లు చెలరేగుతాయో మీరూహించగలరు. మనం రెండు నెలల తర్వాత రిలీజుకు థియేటర్లు బ్లాక్ చేసి పెట్టాము. ఇతర హీరోల సినిమాల విడుదల చేసే సినిమాలతో క్లాష్ కాకూడదని అందరితో కలిసి మాట్లాడాము. మన అగ్ర హీరో దగ్గరకు సంజయ్ బాబే వచ్చి ఆయనను ఒప్పించి, ఆయన సినిమాకు మన సినిమాకు పది రోజుల వ్యవధి ఉండేలా మన రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. ఇప్పుడు ఆ డేట్‌కు మనం సినిమా రిలీజ్ చేయలేకపోతే మళ్ళీ అంత మంచి ముహుర్తం దొరకదు. అమెరికా, యూరోప్ వంటి దేశాల్లో ఐదురోజుల పాటు ఉండే ఎక్స్‌టెండెట్ వీకెండ్ {Extended weekend} ఉంది. మనకు ఓవర్సీస్ బయ్యర్స్ కూడా అడ్వాన్సులు చెల్లించి థియేటర్లు బుక్ చేసుకున్నారు. ఇంత మందిని నిరాశ పరచడం, ఇన్ని కోట్ల నష్టాన్ని భరించమనడం భావ్యమేనా సార్?

ఒక వేళ సంజయ్ ఉండి, షూటింగులో పాల్గొనలేని పరిస్థితుల్లో ఉన్నా, ఈ అగ్రిమెంటుకు మనస్ఫూర్తిగా ఒప్పుకునే వాడే! సంజయికి సినిమాల పట్ల ముఖ్యంగా ఈ సినిమా పట్ల ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

కాబట్టి, మీరే పెద్ద మనసు చేసుకుని ఒప్పుకోండి సార్!” అని సుధాకర్ నాయుడు గారి ముందు చేతులు జోడించి నిలబడ్డాడు, శ్రీవిక్రమ్ సార్.

సుధాకర్ నాయుడు గారు కూడా తల పంకించి,

“విక్రమ్! నీ గురించి నాకు తెలుసు. మొదటగా బాబును నీ చేతుల్లోనే పెట్టాను. నువ్వు మంచి హిట్టిచ్చావు. ఆ కృతజ్ఞత నాకు ఎప్పుడూ ఉంది. ఈ సినిమా సమీర్ అస్సలు చేయనని చెప్పి వాళ్ళ ఊరెళ్ళి పోయాడు. నేనే పిలిపించాను. మీ సమక్షంలోనే, నువ్వు చెప్పిన విషయాలే, నేనూ చెప్పి ఒప్పిద్దామని అనుకున్నాను. కానీ, ఇంతలోనే మీ వాడు మాట తూలాడు. అదీ చాలా అభ్యంతరకరమైన మాట.” అని ఆగాడు.

శ్రీవిక్రమ్ గారు, సత్యంగారి వైపు చూసి, లేచి నిలబడమని సైగ చేసి,

“సార్! సత్యంగారు ఏదో ఆవేశం పట్టలేక మాట తూలారు. నిజమే! తప్పయిపోయింది సార్! క్షమించండి. సత్యంగారు.. ఊఁ.. “ అన్నాడు

“అవును సార్! తప్పయింది. క్షమించండి. కానీ, నేనెంత ఆవేదనలో ఉన్నానో.. మీరూ ప్రొడ్యూసరే కదా? మీకు తెలియదా సార్? ఇప్పటికి యాభై కోట్లు అయింది. రోజురోజుకు వడ్డీలు పెరుగుతున్నాయి. ఈ డేటుకు రిలీజ్ లేదని తెలిస్తే, నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే! ఇంట్లో ఉన్న నగా నట్రా, పొలం పుట్రా అన్నీ అమ్మి ఈ సినిమాలో పెట్టుబడి పెట్టాను. సంజయ్ బాబు కిడ్నాప్ అయినప్పటి నుండి మా ఇంటిల్లిపాదికీ రాత్రుళ్ళు నిద్రలు ఉండడం లేదు సార్! అటువంటి సమయంలో ఒక మార్గం దొరికింది. మీరే నన్ను ఈ గండం నుంచి బయటపడేయాలి సార్!” అన్నాడు.

తర్వాత మరుక్షణంలోనే నాయుడి గారి కాళ్ళ మీద పడ్డాడు. నాయుడు గారు అతన్ని లేవనెత్తి,

“ఏం మనిషివయ్యా! అప్పుడే నోరు జారుతావు. అప్పుడే కాళ్ళ మీద పడతావు. మొన్న బాబు గురించి కూడా ఏదో అన్నావు. నిర్మాత అంటే డిగ్నిఫైడ్‌గా ఉండాలి. తప్పు మాట్లాడిన వారిని సరిదిద్దాలి. అంతేగానీ నీలా చిల్లరగా ప్రవర్తించకూడదు. నాకు శ్రీవిక్రమ్ చెప్పిన లాజిక్ నచ్చింది.” అని నిర్మాత, డైరెక్టరుతో అని, నా వైపు తిరిగి,

“సమీర్ బేటా! నువ్వు ఈ సినిమా చేయడం వల్ల సంజయికి ద్రోహం చేయడం లేదు. వాడు వదిలేసి పోయిన..” నాయుడి గారి గొంతు గద్గదమైంది. వెంటనే తేరుకుని,

“ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మన వంతు సహాయం చేయడం మన కర్తవ్యం. వాడికి ఈ విషయం తెలిస్తే వాడు సంతోషిస్తాడే గానీ చిన్నబుచ్చుకోడు. కాబట్టి, శ్రీవిక్రమ్ చెప్పిన విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నీ నిర్ణయం త్వరలోనే చెప్పు. నా ఉద్దేశంలోనయితే, నువ్వు నీ చేతనైనంత సహాయం చేయడం వల్లనే నువ్వు, మీ ఇద్దరి మధ్యనున్న స్నేహ ధర్మానికి విలువ ఇచ్చినట్టవుతుంది.” అని అన్నారు.

నాయుడు గారు ఒక విధంగా వాళ్ళందరి ముందు నన్ను ఇరికించినట్టయింది. నేను కాదనలేని పరిస్థితి. శ్రీవిక్రమ్ గారు సమస్యను కూలంకుషంగా వివరించిన తర్వాత, వారి కోరికలోనూ, న్యాయం ఉందని నాకనిపించింది.

నేను మరో ఆలోచన లేకుండా ‘సరే’ అని అన్నాను.

వాళ్ళిద్దరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. నాయుడు గారు గుంభనంగానే ఉన్నారు. అందుకే,

“ఒక్క మాట. సమీర్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు సరే! మరి, ఈ సినిమా చేయడం వలన వాడికేం లాభం?” అని మెలిక పెట్టారు.

సత్యం గారూ, శ్రీవిక్రం ఇబ్బందిగా ముఖం పెట్టారు. శ్రీవిక్రమే తేరుకుని,

“రెమ్యూనరేషన్ విషయమా..?” అని లోగొంతుకలో అడిగాడు.

“ఛ! నేనంత మూర్ఖుణ్ణి కాను. నా కొడుక్కి మీరు రెమ్యూనరేషన్ చెల్లించారు. అది చాలు. కానీ, సమీర్ ఈ సినిమా చేస్తాడు. అంతేనా? వాడి భవిష్యత్తు అంతటితో ముగిసి పోకూడదు కదా?” అని అన్నారు.

నేను కూడా డబ్బుల విషయం ఎత్తుతారేమోనని భయపడ్డాను. కానీ, ఆయన మనసులో నా పట్ల ఉన్న కన్సర్న్‌కు నా కళ్ళు చెమరించాయి. అందుకే, ఆయన ఎక్కువ మాట్లాడడు గానీ అనేక కోణాల్లో ఆలోచిస్తాడని ఆ రోజు మరో మారు అర్థమయింది.

“మరి..?” అని అంటూ శ్రీవిక్రమ్ సంశయించాడు.

“మా అబ్బాయి, సంవత్సరం తర్వాత సమీర్‌ను హీరో చేస్తానని ప్రామిస్ చేసాడు. కానీ, ఇంతలోనే.. ఇలా జరిగింది. కాబట్టి వాడి వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. మా బ్యానర్లో మీరు సమీర్‌ను పెట్టి వెంటనే సినిమా తీసి పెట్టాలి. సంజయికి ఎలాగైతే మొదటి సినిమాతో హిట్టిచ్చారో, సమీర్‌కు కూడా మీరే బంపర్ హిట్టు ఇవ్వాలి. ఏమంటారు?” అని శ్రీవిక్రమ్‌ను అడిగారు.

డైరెక్టర్ గారు, “అదీ..?” అంటూ రెండు క్షణాలు ఆలోచించి,

“సరే సార్! ‘త్రిపుల్ యస్’ రిలీజయిన పదిరోజుల్లో మొదలుపెడతాను. యస్! సమీర్‌తో సినిమా పక్కా! కంగ్రాట్స్ సమీర్ బాబూ!” అని అంటూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.

నేను అవాక్కయ్యాను. నాయుడి గారిని చూస్తూ,

“అంకుల్! ఇదేమిటి? సంజయ్‌ని రానివ్వండి!” అన్నాను, నాకు మరేం మాట్లాడాలో తోచక.

(సశేషం)

Exit mobile version