Site icon Sanchika

నాకర్థం కాలేదు!

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘నాకర్థం కాలేదు!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]డిగావు ఆక్రోశించావు
తర్జనితో బెదిరిస్తూ ప్రశ్నించావు
ఆధారాలతో సహా ఎత్తిచూపావు

అన్యాయమైపోయిన నీ బతుకు పట్ల
నాది కాని నా బాధ్యతను చూపించి
నా తలను దించుకునేలా చేశావు

ఒప్పుకున్నాను
ఎక్కడో ఎప్పుడో ఏవేవో
తప్పులు ఎన్నెన్నో జరిగిపోయాయి
నిప్పులా నీ బతుకును కాల్చివేసాయి

అర్థం అయిన కొద్ది ఆ దోషాలన్నీ..
చెప్పుకున్నాను క్షమాపణలు ఒక్కొక్కటిగా
నీ ఎదుట నిలబడి మనస్ఫూర్తిగా

నా వంతు బాధ్యతగా..

నిలబడిన నేలపై నిన్ను నన్ను
విడదీస్తోన్న అంతరాల గోడను
పడగొడుతూ పోతుంటే నేనొకపక్క..

నన్నయోమయానికి గురిచేస్తూ..

పటిష్టంగా కడుతున్నావు కష్టపడి
పడిపోతున్న ఆ గోడనే నీవు మరోపక్క

“ఏమిటి..?”

నీ వ్యథ చెప్పుకోవటానికి
నన్ను మరింత దెప్పిపొడవటానికి
ఒక సాక్ష్యం ఉండాలని అంటున్నావా..!
ఒక అడ్డుగా ఈ గోడ అలాగే
నిలిచుండాలని అనుకుంటున్నావా..!!

నీకేం కావాలో నాకర్థం కాలేదు!
నీకైనా, అసలేమైనా అర్థం అవుతోందా..?

Exit mobile version