Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-120: నాకీ స్వతంత్రం వద్దు..

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]బెం[/dropcap]గుళూరు నుంచి నా ఫ్రెండ్ రమ్య ఫోన్ చేసి ఒకటే బాధపడడం మొదలెట్టింది. సంగతేవిటని విచారిస్తే వాళ్ళమ్మాయి కీర్తికి ఎంట్రెన్స్‌లో మంచి రాంక్ వచ్చినా కూడా ప్రొఫెషనల్ కోర్సులో జేరనూ, ఆర్ట్స్ గ్రూప్ తీసుకుని, ఆడుతూ పాడుతూ బి.ఎ. అవగానే పెళ్ళి చేసుకుంటానూ.. అంటోందిట.

“ఇదెక్కడి గ్రహచారమే.. మన రోజుల్లో మనం చదువు కోసం, ఉద్యోగాల కోసం ఇంట్లోవాళ్ళు చదివించనంటే దెబ్బలాడి మరీ చదువుకుని, ఉద్యోగాలు చేసుకుంటున్నాం.. దీన్ని ఎంత డబ్బైనా పెట్టి చదివిస్తావంటే ఇలా అమ్మమ్మలా మాట్లాడుతోందేవిటే..” అంటూ ఏడుపు ఒకటే తక్కువగా గోల గోల పెట్టేసింది.

వింటున్న నాకూ చాలా ఆశ్చర్యం వేసింది. “అలా ఎందుకంటోందో కనుక్కున్నావా” అనడిగితే, “ఏవోనే.. నేను బి.ఎ.నే చదువుతాను అన్న ఒక్క ముక్క తప్పితే దాని నోట ఇంకో మాట లేదు. బి.ఎ. తక్కువని నేననను. దాంట్లో ఎం.ఎ., పి.హెచ్.డి. దాకా వెడితే అది కూడా మంచిదే కదా! కానీ ఇది బి.ఎ. అవగానే పెళ్ళి చేసుకుంటానూ.. అంటోంది. ఏవిటో నాకేవీ తెలీట్లేదు. అందుకే నీకు ఫోన్ చేసేను.” అంది.

“నేనేం చేస్తానే!”

“అహా.. అదికాదు. అది శెలవుల్లో టూరంటూ అన్ని ఊళ్ళూ తిరుగుతోంది. అలాగే మీ ఊరిక్కూడా వస్తోంది. నీ అడ్రసు ఇచ్చి, మీ ఇంట్లోనే ఉండమన్నాను. చిన్నప్పుడు ‘ఆంటీ ఆంటీ’ అంటూ నీ వెనకాలే తిరిగేది కదా!.. నువ్వు బాగానే గుర్తున్నావు. అది వచ్చినప్పుడు అసలు అదలా ఎందుకంటోందో కనుక్కో.. ఒకవేళ ఎవరినైనా ప్రేమిస్తోందేమో…మాకు చెప్పలేకపోతోందేమో.. నువ్వు అవన్నీ కనుక్కో..” అంటూ తన బాధంతా నామీద పడేసి ఫోన్ పెట్టేసింది రమ్య.

రమ్య మాటలు విన్న నాకు కూడా కీర్తి ధోరణి అర్థం కాలేదు. సరే ఎలాగూ వస్తుందికదా.. తననే అడుగుదాం అనుకున్నాను.

మరో పదిరోజులకి అనుకున్నట్టుగానే కీర్తి హైద్రాబాదు వచ్చింది. రెండురోజులు ఊరంతా చుట్టడం అయ్యాక మూడోరోజు భోజనం చేసేక నాకేమీ తెలీనట్టే తీరుబడిగా రమ్య చెప్పిన విషయం ప్రస్తావించేను కీర్తితో.

మా సంభాషణ ఇలా జరిగింది..

నేను – నీకు మంచి రేంకు వచ్చిందని మీ అమ్మ చెప్పింది. ఏ కాలేజీలో చేరుతున్నావూ.. ఏ సబ్జెక్ట్ తీసుకుంటున్నావూ!

కీర్తి – లేదాంటీ.. నేను ప్రొఫెషనల్ కోర్స్ చెయ్యదల్చుకోలేదు. హాయిగా ఆర్ట్స్ గ్రూప్ తీసుకుని, డిగ్రీ అవగానే లైఫ్‌లో సెటిల్ అయిపోతాను.

స్పష్టంగా చెప్పింది.

నేను (ఆశ్చర్యంగా)- అదేంటీ.. అంత మంచి రేంకు వచ్చింది కదా.. నీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే అందులో సీట్ వస్తుంది. ఎందుకు చేరవూ!

కీర్తి – (స్తిమితంగా) ఎందుకు చేరాలాంటీ.. చదివినన్నాళ్ళూ రోజుకి పధ్ధెనిమిది గంటలు చదువుకుని, మంచి ప్లేస్‌మెంట్ కోసం ప్రిపేర్ అయి, అది వచ్చేక, అందులో పైకెళ్ళడానికి మనని మనం అప్డేట్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ అలా కష్టపడుతూనే ఉండాలా.. అమ్మలాగా..! పాపం అమ్మని చూడండి.. ఎంతసేపూ కెరియర్లో పైకెదగడానికి ప్రయత్నాలూ, పక్కవాళ్ళతో కాంపిటీషనూ, రోజు రోజూ మారిపోయే ఈ టెక్నాలజీతో అప్డేట్ అవుతుండడం.. వీటితో సతమతమవడం కాకుండా, ఒక అమ్మగా నా గురించీ, తమ్ముడి గురించీ, ఇల్లాలిగా ఇంటిని గురించీ చూసుకోవడంతోనే సరిపోతోంది తప్పితే పాపం అమ్మకింక తన గురించి కనీసం ఆలోచించుకునే టైమైనా ఉందా!

మీకు తెల్సుకదా ఆంటీ.. అమ్మ చాలా బాగా పాడుతుంది. నా చిన్నప్పుడు చల్లని సాయంత్రం వేళ డాబా మీద కూర్చుని అమ్మ పాడే పాటల్లో ఎంత మాధుర్యం ఉండేదీ! పాడుతూ అమ్మ ఎంత పరవశించిపోయేదీ..

తర్వాత్తర్వాత ఈ ఉద్యోగం ధ్యాసలో పడి అవన్నీ పక్కకి పెట్టేసింది. ఒక యంత్రంలా మారిపోయింది. అమ్మ మొహంలో అప్పటి ప్రశాంతత నాకు ఇప్పుడు కనిపించటం లేదు. అస్తమానం నా కోసమో, తమ్ముడి కోసమో, ఉద్యోగం కోసమో, ఇంటి పనుల కోసమో అలా పరిగెడుతుండడమే.. అందులోనూ అమ్మ అన్ని పనులూ చాలా తెలివిగా సాధించుకొస్తుంది. అందుకని నాన్న కూడా చాలా పనులు అమ్మకే వదిలేస్తారు. ఇలా అమ్మ తెలివిగా, చురుకుగా అన్ని పనులూ చేసుకుంటుండడం మాకందరికీ బాగుంది.. కానీ అమ్మకీ!. ఆమెకి అసలు విశ్రాంతి అంటూ ఉందా.. అమ్మ కష్టంతో మా జీవితాలు సెటిల్ చేసుకుని మేం వెళ్ళిపోతాం. అప్పటికి అమ్మకి వయసు మీదపడి పోతుంది. వయసులో ఉన్నప్పుడు నలుగురు మనుషుల పనిచేసిన అమ్మ మీద అప్పుడు శరీరం తన ప్రతాపం చూపెడుతుంది. కూర్చోలేక, నుంచోలేక, పని చేసుకోలేక, మమ్మల్ని పిలవలేక అమ్మ పడే బాధ తల్చుకుంటుంటే ఇప్పుడే నాకు కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తున్నాయి.

వింటున్న నాకు కాసేపు నోట మాట రాలేదు.

నేను – ఏదైనా మీ భవిష్యత్తుకోసమే కదమ్మా.. కన్న పిల్లల్ని పట్టించుకోకుండా ఎలా వదిలేస్తాం!

కీర్తి – పట్టించుకోవద్దని నేను చెప్పటంలేదు ఆంటీ.. ఆర్థిక స్వాతంత్రం, నా కాళ్ళ మీద నేను నిలబడాలీ అనుకుంటూ మీలాంటివాళ్ళు జీవితంలో చాలా పోగొట్టుకున్నారు ఆంటీ.. అదే ముందు తరం వాళ్లని చూడండి.. మా అమ్మమ్మ విషయం ఇప్పటికీ నాకు గుర్తు.. ఇంట్లోంచి బైటకి కదిలేది కాదు.. అన్ని పనులూ అందరిచేతా చెప్పి చేయించుకునేది. అలాగని అమ్మమ్మని సంప్రదించకుండా ఇంట్లో తాతయ్య ఒక్క నిర్ణయం కూడా తీసుకునేవాడు కాదు. ఒక మహారాణీలా ఇంటిని నడిపించింది అమ్మమ్మ. మరి మీరు అలా కాదే..! చిన్నపని నుంచి పెద్దపని వరకూ అన్నీ మీరే చేసుకోవడం.. ఒక్క మనిషి నలుగురు మనుషుల పని చేసినట్లు చేసి మీకంటూ జీవితమే లేకుండా చేసుకున్నారు కదా ఆంటీ..

నేను – ఆ తరం వాళ్ళు వేరమ్మా.. ఆ ఇళ్ళూ, ఆ పనులూ, అప్పటి పధ్ధతులూ వేరు. మా తరంవాళ్లం కాస్త స్వాతంత్రం కోసం చదువూ, ఉద్యోగం కావాలనుకున్నాం. కష్టపడ్డాం.. సాధించాం.

ఒకింత గర్వంగానే అన్నాను.

కీర్తి – ఏం సాధించారాంటీ.. మిమ్మల్ని మీరు శ్రమ పెట్టుకోవడం తప్ప.. తెచ్చిన జీతమంతా మొగుడి చేతిలో పోసి బస్ పాస్‌కి కూడా డబ్బులు అడుక్కునే ఇల్లాళ్ళని ఎంతమందినో చూసేను నేను. వాళ్ళేం సాధించినట్టు.. పోనీ.. అలా సంపాదించి తెస్తున్నందుకు ఇంట్లో అయినా వాళ్ళ మాటకి ఏమైనా విలువుంటోందా ఈ పురుషాధిక్య సమాజంలో..!

ఇప్పటికి కూడా అమ్మ నాన్న పర్మిషన్ లేకుండా ఒక్క పనైనా చేస్తుందా! ఇంట్లో ఏ నిర్ణయమైనా నాన్నే తీసుకుంటారు.. దాన్ని ఆచరణలో పెట్టడం మాత్రమే అమ్మ పని. ఇంతోటిదానికి అంత ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడాలా!

నేను – అదేంటి కీర్తీ అలా అంటావు.. అభిమానమున్న మనుషుల మయినప్పుడు ఖర్చుల కోసం ఓ పావలా కూడా మొగుడిని అడగకూడదని, ఎవరిచేతా మాట పడకూడదని మేమే కష్టపడుతున్నాం. అది తప్పేం కాదే..!

కీర్తి – ఎందుకొచ్చిన అభిమానాలు ఆంటీ.. మొన్నీమధ్య మా మామయ్య ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్యని చూసేక నాకు అనిపించింది. మా అత్తయ్య కూడా మీ తరం మనిషే కదా! సిటీలో కాకపోయినా కాస్త పెద్ద టౌన్ లోనే ఉంటున్నాడు మావయ్య. మరి అత్తయ్య ఏ జాబ్ చెయ్యకపోయినా కూడా మావయ్య అత్తయ్య మాట మీరడు. ఏదో డిగ్రీ చదివి పెళ్ళి చేసుకుందంతే అత్తయ్య. ఆడదానికి చదువూ, ఉద్యోగాలూ ఎందుకూ, పెళ్ళి చేసి పంపేస్తే చాలూ అనే ఇంటినుంచి అలాంటి లక్షణాలతోనే మెట్టినింటికి వచ్చింది అత్తయ్య. అందుకే అన్నింటికీ మావయ్యనే బాధ్యుడిని చేసేస్తుంది. ఇంట్లో ప్రతి పనికీ ఒక్కో మనిషిని పెట్టేడు మావయ్య. అలా పెట్టకపోతే నలుగురిలోనూ చిన్నతనంగా ఉంటుందని చెప్పిందిట అత్తయ్య. ఇంక అత్తయ్య పని వాళ్లందరిమీదా అజమాయిషీ చెయ్యడమే. ఇంకేం లేదు.. తెల్లారిలేచి చక్కగా తయారై టీవీ ముందు కూర్చుని, వాళ్లందరి చేతా పనులు చేయించుకుంటూ కాలు కదపకుండా అన్ని ప్రోగ్రాములూ చూస్తుంది. ఇంట్లో డబ్బెంతుందీ. మనం ఇది కొనగలమా లేదా.. అసలు మనకి అది అవసరమా.. కాదా.. అనేమీ ఆలోచించకుండా మార్కెట్లోకి వచ్చిన కొత్త వస్తువులన్నీ మావయ్యచేత కొనిపించుకుంటుంది. చాలా తెలివైంది కనక ఆఖర్న ఒఖ్ఖమాట మటుకు అంటుంది.. ‘మా ఆయన బంగారం..’ అంటూ. అంతే ఆ మాటకే మావయ్య అత్తయ్యని కాలు కింద పెట్టనీకుండా చూసుకుంటాడు.

మీచేత కూడా ఇలాగే మంచిమాటలాడి మగవాళ్ళు పనులు చేయించుకుంటున్నారన్న సంగతి మీకు తెలీక ఇలా కష్టపడుతున్నారు. నేను అత్తయ్యని ఫాలో అవడానికి నిర్ణయించేసుకున్నాను. చక్కగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ, సినిమాలు చూస్తూ, షికార్లు తిరుగుతూ, కాలు మీద కాలు వేసుక్కూర్చుంటాను.

కీర్తి మాటలకి నేను ఆశ్చర్యపోయేను.

నేను – అయితే నీకంటూ ఒక క్వాలిఫికేషన్ అఖ్ఖర్లేదా!

కీర్తి (నవ్వేస్తూ..) – మొగుణ్ణి కొంగుకి కట్టేసుకునే క్వాలిఫికేషన్ ఉంటే చాలాంటీ.. ‘మీరజాలగలడా నా యానతి..’ అంటూ హాయిగా జీవితం గడిపెయ్యొచ్చు.

నాకేం మాట్లాడాలో తోచలేదు. చదువూ, ఉద్యోగం, స్వతంత్రం, అభిమానం, పౌరుషంలాంటి పదాలు చెప్పుకుంటూ పెరిగిన మేము ఇప్పుడు మొగుణ్ణి కొంగుకి కట్టేసుకుంటే చాలనే కీర్తి స్టేట్‌మెంట్‌ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలీలేదు.

అన్నీ బాగుండి కీర్తికి వాళ్ల మావయ్యలాంటి భర్త వస్తే అంతా ఆమె అనుకున్నట్టే అవుతుంది. కానీ ఎలాంటివాడొస్తాడో ఎవరు చెప్పగలరూ! ఒకవేళ ఆ వచ్చిన భర్త కొంతమంది మగవాళ్ళ లాగ కీర్తిని తన మీద ఆధారపడి బతుకుతోందని చులకనగా చూస్తే.. అప్పుడు పరిస్థితి ఏవిటీ!

అలాగని తనన్న మాటని కాదంటే ఇంక నా మాట అస్సలు వినిపించుకోదు.

ఇంత గట్టి నిర్ణయం తీసుకున్న కీర్తితో ఏవని వాదించి తన ఆలోచనను మార్చగలనూ అనుకుంటుంటే ఒక మధ్యేమార్గం తోచింది. వెంటనే కీర్తి చెయ్యి నా చేతిలోకి తీసుకున్నాను.

నేను – చూడమ్మా కీర్తీ, నువ్వన్న మాటని నేనూ అంగీకరిస్తాను. మా తరం వాళ్ళం కొన్నికావాలనుకుని కొన్ని కోల్పోయాం.. ఒప్పుకుంటాను. కానీ నువ్వు మరోలా కూడా ఆలోచించొచ్చు కదా! ఇప్పుడు నీ వయసు చదువుకునే వయసు. పెళ్ళయేదాకా ఏదోకటి చదువుకోవాలనుకున్నదానివి ఆ చదువేదో ప్రొఫెషనల్ కోర్సే చదవొచ్చు కదా!

మంచి క్వాలిఫికేషన్ కనక నీ చేతిలో ఉంటే ఉద్యోగం చెయ్యడం.. మానెయ్యడం అనేది నీ ఛాయిస్ అవుతుంది. వచ్చిన అవకాశాన్ని ఒదులుకోవడం మంచిది కాదు. నీకు కావాలనుకున్న సబ్జెక్ట్‌లో నీకు సీటు వస్తుంది. చదివించడానికి పేరెంట్స్ రెడీగా ఉన్నారు. వేరేది చదివే బదులు అదే చదువుకో.. తర్వాత నీ ఇష్టం.. ఉద్యోగం కావాలంటే చేసుకోవచ్చు.. లేకపోతే మానెయ్యొచ్చు.

నా మాటలకి కీర్తి ఆలోచిస్తున్నట్టు చూసింది.. అది చాలు.. ఆలోచిస్తుంది.. ఇప్పటికాలం పిల్లలు ఊహల్లో బతకడం లేదు. చాలా బేలన్సడ్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడే ఇంకాస్త చెప్పాలి..

నేను – ఒకవేళ మీ మావయ్యలాంటి మొగుడే వచ్చేడనుకో.. హాయిగా కొంగుకు కట్టేసుకో..

నవ్వుతూ అన్న నా మాటలకి ఫక్కున నవ్వింది కీర్తి. హమ్మయ్య.. రమ్య బాధ తగ్గించేను అనిపించింది.

Exit mobile version