నాకు నీవు – నీకు నేను

7
2

[శ్రీమతి సుగుణ అల్లాణి రచించిన ‘నాకు నీవు – నీకు నేను’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]“ఇ[/dropcap]గో!! ఉన్నవా!!.. అగో పల్కవూ! శెవుడుగిట్టొచ్చిందా!!!” అనుకుంట బయిటి కెంచి రాములు ఇంట్లకు వొచ్చిండు.

“ఆc ఆ. వొచ్చెవొచ్చె!! ఇన్నేల్ల నుంచి నీ లొల్లి ఇంటున్న గాదా!! శెవుడు రాక శెలవులకు గెంటీలు, మాటీలొస్తయా!! గానీ సెప్పుండ్రి ఏందో?” సీతమ్మ కొంగుకు చేతులు తుడుసుకుంట ఎదురుగొచ్చి నిలవడ్డది.

“అబ్బో! మీ నాయిన ఎకరాల కొద్ది బూమీ లచ్చల కొద్ది నగదు ఇచ్చె.. ఇగ మాటీలొస్తయి గెంటీలొస్తయి మరీ!!”

“అవు మల్ల మీరేమో మైసూరు మారాజైతిరి. నూర్ల ఎకరాల పొలాలు రాసియ్యకపాయె మా నాయిన. సచ్చి ఏ లోకానున్నడో.. ఆయిన మీద ఏడుపెందుగ్గానీ చెప్పుండ్రి ఏందో!!” మూతి మూడుతిప్పులు తిప్పింది సీతమ్మ.

“నీ మన్మడు ఏందో పార్సెల్ పంపుతానన్నడు. వొచ్చెనా?” అని అడిగిండు రాములు.

“ఏమో. ఇంటికి యా పార్సిలు రాలే.” అన్నదామె.

“అప్పుడెప్పుడో పోను జేసినప్పుడు మూడు పీసుల సూటు అడిగిన. పంపుతడేమోనని..”

“ఓయబ్బో..!! ఆశ సల్లగుండ. ఈన ఒగ ఎంటీవోడు. ఈనకు సూటు గావాలె సూటు” చప్పట్లుగొట్టి ముక్కుమీద ఏలేసుకుంది సీతమ్మ.

“మరి గాదా నీవు గాక జమునవు గాకపోతివా మరి నీకు ఎంటోడు నాగేస్పర్రావు వొస్తడు కాకపాయెనా..” రెండుచేతులు మడిచి సంకలు గుద్దుకుంట ఎక్కిరిచ్చవట్టిండు రాములు.

“మరి లగ్గమైన కొత్తల నీకు పన్ను మీద మన్నుంది జమున లెక్క అని చెప్పి మురిపోయెటోడెవరో” మూతిని సున్న లెక్క సుట్టి తిప్పింది సీతమ్మ.

“హాహాహా.. ఇంకా యాదికున్నాయె నా మాటలు? నా సీతామాలచ్చిమీ”, అంటూ చెంప చిదిమి ముద్దాడి “యాభై య్యైదేండ్లు మన లగ్గమై.. నా బతుకు పండించిన దేవతవే నీవు..”, కండ్లల నీళ్లు తిరిగుతుండంగ.. “ఇన్నేల్లయినా నువు నాకు పదకొండేల్ల పిల్ల లెక్కనే గొడ్తవు..” వంటింట్ల ఉన్న ముక్కాలి పీట మీద కూసొని కిటికీల నుంచి బైటకు సూస్తుంట అన్నడు..

అది యిని సీతమ్మ సిగ్గుల మొగ్గైంది..

“మొట్టమొదటి సారి మా మ్యానత్త యింట్ల నిన్ను జూసినపుడు ఎట్లుంటివి ఎర్కనా??” ఆకాసంలకు జూసుకుంట.. అన్నడు రాములు.

“ఎట్లుంటినబ్బా!!”

“పచ్చని బంతిపువ్వు రంగు లంగాకు ఆకుపచ్చ అంచు, దాని మీద ఆకుపచ్చ జాకీటేసుకొని రెండు జడలల్ల మల్లెపూల దండవెట్టుకొని గల్లుగ్లల్లున పట్టగొలుసులు సప్పుడు జేయంగ తలుపుదగ్గర నన్ను జూసి టక్కున ఆగిపొయ్యి గుడ్లు మిటకరించుకొని చూస్తా నిలవడి పోయినవు జాడు.. గది జూసిన నాకు నీ బొమ్మ గుండెల్ల చెపాయించుక పోయింది.. మల్ల మా వూరికి పొయినంక గూడ నాకేం తోచక పాయె..” కండ్లు సగం మూసి కిటికీల కెంచి బైటికి జూస్తూ చెప్తనే ఉన్నడు.

“ఇగో.. ఏమయ్యోయ్..” బుజం మీద కొట్టి పిలిచింది సీతమ్మ.

“ఆ ఆ ఏందే.. మన చిన్నతనం యాజ్జేసుకుంటుంటే..”  కోపంగ జూసిండు రాములు.

“బానే ఉంది సంబురం.. ఎన్కటివి యాజ్జేస్కోని ఎక్కెక్కి ఏడ్సిండట నీ అసుంటోడు.. పదుండ్రింక.. నెత్తికి నూనెవెట్టి తానం జేపిస్త..” అని, “అది సరే గానీ గింత పొద్దువోయింది ఎందుకు?” అన్నది.

“కరెంటువోయిందే.. మడికి నీల్లువెట్టాలె గదా! కరెంటొచ్చిందాక చూసిన.. సరెగానీ నువు జరుగు. తానం నేజేస్త వొద్దు పోయే.. నేను చేస్త గద! నీకే మస్తు పన్లున్నయి”

“యాడాదికి ఒక్క రోజు నీ జుట్టు నా చేతికి చిక్కేది.. గట్లంటె ఎట్ల? పదుండి.. పదుండి”

“నా మాట ఎప్పుడిన్నవు గన్క.. పద..”

ఇంటెనక పెరట్ల బాయికాడ ముక్కాలిపీట మీద కూసవెట్టింది. నొసట కుంకుమ వెట్టి నెత్తిమీద నూనేసింది.

“అయ్యో నడినెత్తిన ఎంటికెలన్ని పోయి బట్టనెత్తొచ్చిందయ్యో! హాహాహా..”

సీతమ్మ నవ్వుతాంటే రాములుకి బుసబుస కోపమొచ్చింది.

ఉడుక్కుంట పీటమీది కెల్లి లేచి “నాకేమొద్దు పో!” అన్నడు.

“అయ్యో అయ్యో!! కోపమా సామీ! అలగకు దొరా! ఊర్కె పరాచ్కమాడిన.. బుంగమూతి మీసం ఏం బాగుండదు సామీ.. తీయుండ్రి.. దావయ్యా నా రామయ్యా! నీ బాంచను!”

కండ్లల్ల నీళ్లు రావట్టినయి సీతమ్మకు.

అది చూసిన రాములు.. “నీకే నా పరాచ్కమాడనీకె వస్తది ! మాకు రాదా?” అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ వచ్చి కూచున్నడు…

“నీకు కోపమొచ్చెనేమో నని జడుసుకుంటి గదయ్యా!”

“నీ మీద కొపమొస్తదానె నా రామసిలకా! నా పానం కాదా నీవు!!”

మంచిగ తలకంటి కుంకుడుకాయ పులుసు వోసి తానమాడిచ్చి,సాంబ్రాణి పొగేసి మొకాన నిలువు నామం దిద్దింది. రెండంచల ఖాదీ దోతి కమీజు ఉత్తరీయం ఇచ్చి కట్టుకొమ్మన్నది.

“సందేల కట్టుకంట..” అన్నడు

సీతమ్మ రాములు ఆ నిజంగా సీతారాముల జంటని ఊరంత వాళ్ల ముచ్చటజెప్పుకుంటరు. వాల్లిద్దరికీ నలుగురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. వీల్లుగాక ఒక పిలగాన్ని పెంచుకున్నారు. వాల్ల పొలం పనిజేసే శంకరం కరెంటు మోటరు పని చేస్తుంటే కరెంటు షాకు గొట్టి అక్కడికక్కడ సచ్చిపోయిండు. ఆయన భార్య నిండు సూలాలు. మొగడువోయిండని ఇనంగనె శక్కరొచ్చి పడిపోయింది. దవాఖాన్ల కు దీస్కవోయిన్రు. పిల్లగాన్ని గని ఆమెగూడ పానమొదిలింది.

అప్పుడు పుట్టిన పిలగాన్ని చేతులకు దీస్కోని సీతమ్మ “ఇయాలటి నుంచి ఈడు నా సిన్న కొడుకు” అని గుండెకదుముకోని సాకింది.

పిల్లలందరినీ ఒక్కతీర్గ సూసేటోల్లు. ఊర్ల పదోతరగతి దాక సదివించి, పట్నం దగ్గరనే గన్క ఇల్లు దీసుకోని ఐదుగురు పిల్లల్ని సీతమ్మని ఇద్దరు పనోల్లను వెట్టి సదివించిన్రు. రాములు ఊర్ల ఉండి యౌసం జేసుకుంటా ఊరికి పట్నానికి తిరిగెటోడు. పిల్లలు గూడ బాగ సదువుకున్నరు. అందరికీ నౌకరీలు వచ్చినయి. అందరికి పెండ్లిండ్లు జేసిన్రు, ప్యారంటాలు జేసిన్రు పురుళ్లాయె పుణ్యాలాయె.. సందెపొద్దు పిట్టలు గూటికిజేరినట్టు ఇద్దరు ముసలోల్లు ఊరు జేరింన్రు..

ఆయాల వాల్ల లగ్గమైన రోజు. పెండ్లైనపుడు సీతమ్మకు పదకొండెల్లి పన్నెండు. రాములు పదహారేళ్ల పిల్లగాడు. ఐదో తర్గతి వరకు సదివిండు యౌసం జేసుడు మొదలువెట్టిండు.

సొంత పొలంల పండిన పంట తినుడు అలవాటు తోని డెబ్బైయ్యైళ్లు దాటుతున్నా ఏ సుస్తు లేక ఆరోగ్యంగా ఉంటరు. కాయ కష్టం జేసి యాలకు మంచి తిండిదిని బాగ నిద్రవోతే మరి ఆరోగ్యానికేమైతది..

***

సీతమ్మ వంటంత జేసి పీటేసి ఎండికంచం బెట్టి రాముల్ని పిలిచింది.. “నువ్వుగూడ తినరాదా” పీటమీద కూసుంటూ అన్నడు రాములు.

“తింట తింట ముందు మీరు కూసోండి, మీదయినంక దింట..” అన్నది సీతమ్మ. అన్నీ ఆయనకిష్టమైన వొంటలు జేసింది.. పెరట్ల గాసిన వొంకాయలు దెచ్చి సోగి వెట్టింది, ఇంటిముంగల కాసిన మామిడికాయదెచ్చి పప్పు జేసింది, పొలం నుంచి దెచ్చిన పుంటికూర తొక్కుజేసింది. వొడియాలు గోలిచ్చింది. పెల్లిరోజని బచ్చాల్జేసింది. బచ్చలికూర బజ్జీలు జేసింది.

రాములుకు కొసరికొసరి వొడ్డిస్తుంది కానీ ద్యాస ఇక్కడ లేదు.

రాములు ఎందుకో నెత్తెత్తి జూసిండు.

“ఏమైందే? ఏంది నీ కండ్లల్ల నీల్లు?”

“ఏం లేదయ్యా .. ఏదో నల్క వడ్డట్టున్నది..” అన్నది కొంగుతోని కండ్లు దుడుచుకుంట..

“చెప్పే ఏమైంది? సూడూ నువ్వు చెప్పకపోతె నేను తినను..” పీటమీదినుంచి లేవనీకెవోయిండు.

“అయ్యో అయ్యో గదేంది గట్లజేస్తరూ! కంచం మీదికెల్లి లేస్తరా ఎవరైనా,.. చెప్త కూసోండి.. ఇయ్యాల పిల్లలు ఉండివుంటే ఎంత సంబురం జేసెటోలయ్యా! చెట్టుకోరు పుట్టకోరమయినం. మనం బతికున్నపుడు వాల్లు మన తోని కలిసుండే రోజొస్తదా! నిన్నటినుంచి మనసంత బుగులుగున్నది! మీకుజెప్తే మీరు పరేషాన్ అవుతరని ఏం జెప్పలే!” అన్నది

“నాకు లేదా! బుగులు.. పోనొస్తే నీతోనే గంటలు గంటలు మాట్లాడ్తరు పిల్లలందరు. నాతోని ఒకటిరొండు మాటలే కదా! నీవు కాలీగ ఇల్లంత దిరుగుతుంటే నేను గుర్తువట్టనా పిల్లలు పోను చేయలేదని! నువ్వేం పికరు జేయకు అంత బాగుంటది. మన పిల్లలకేంగాదు. పిల్లలంత ఎక్కడోల్లు అక్కడ మంచిగుంటరు.. నువు గూడ కంచంబెట్టుకో. తిను ఇయ్యాల నాతోని.. నా సీతవు గద!” అని ఆమె బతిమిలాడిండు. “అయినా సీతా.. రెక్కలొచ్చినంక పచ్చులు ఒక్కదెగ్దరుంటయానే! దేశాలువట్టి ఎగురుత పోతనే ఉంటయి. ఇదిగూడ గంతే! మనం రైలు టేసనసుంటోల్లం. బండ్ల వొస్తుంటయి పోతుంటయి మనమిక్కడనే ఒకరికొకరం.. అవునా కాదా!” అన్నడు.

సీతమ్మ నెత్తూపి తాను గూడ దిని ఇద్దరు బంకుల్లకొచ్చి కూచున్నరు. మంచి ఎండ ఏల ..ఏపసెట్టు గాలి గూడ ఉడుకు వట్టింది. తెల్లంజామునుంచి పొలం కాడ పనిజేసొచ్చి నెత్తంటుకోని తానం జేసి కడుపునిండ కమ్మని బువ్వదిన్న రాములు మంచిగ కునుకుదీసిండు.

అద్దగంట తర్వాత లేచి లోపలికివోయి నీల్లుదాగి పెరటిదిక్కు జూసిండు.. సీతమ్మ చాట్ల చనగపప్పు పోసుకోని ఏరుతుంది. రాములొచ్చి పక్కకు కూసోని “పండుగపూటగూడ పనేనా.. లే! లేచి తయ్యారు గాపో గుడికి పోదం..” అన్నడు.

“ఆ.. ఏం గుడి లెండ్రి.. పిల్లలుంటే ఎంత బాగుంటది” అన్నది.

రాములు గూడ ఆమె పక్కన్నే కూసోని, “సూడే సీతా! పిల్లలు వొస్తే బాగుంటది నాగ్గూడ.. వాల్ల పనిజెడగొట్టుకోని మనకోసం రమ్మంటే కాదనరే! కానీ లచ్చలకులచ్చలు కర్సు వెట్టి వారం పది రోజులకోసం వొస్తరు.. ఒక్కరోజో రెండ్రోజులో నీ కాడుంటరు… మూడోరోజు నుంచి పట్నంల దిరగనీకె వోతరు.. వాల్లనేమనలేము.. నువ్వు తీరొక్క వొంటజేసి ఇగొస్తరు అగొస్తరని ఎదరుసూస్తా కూసుంటవ్..” అన్నడు.

“అదేంది.. గట్లనవడ్తిరి మన పిల్లల్ని మనం చిన్నజేస్తమా! ఏండ్లకోసారొస్తరు. ఇంట్లనే కూకోమంటరా!”

“గదే నేననేది వాల్లకు ఏం తక్వ జేయకుంట పెంచినం, ఎంత సదువుకుంట మంటె అంత సదివిచ్చినం, అన్ని ఇదాల వెట్టి అన్ని సంబురాల్జేసినం, మన కాడికి వచ్చుడు రాకపోవుడు వాల్లిష్టం. వాల్లొస్తే సంతోసంగ ఉన్నన్ని రోజులు చేసిపెడదం, ఎక్కడున్నా వాల్లు సేమంగుండాలని దేవున్ని అడుగుడు తప్ప మనమేం జేయలేం.. ఫికర్ జేస్తే వాల్లు వొస్తరు మనని జూస్తరూ అంటే నేన్గూడ జేస్త.. చెప్పు నువ్వనుకుంటే వొస్తరా? ఇయ్యాల మన లగ్గమైన రోజు.. వాల్లకు దెల్వదా? పోను జేయనీకె గూడ టైం లేకపాయెనా? దీనిగ్గూడ మనం పిల్వాల్నా? ఇగ చాల్తియ్యి.. వాల్లకెప్పుడు రావాలనిపిస్తే కప్పుడే రానీ!! కండ్లు తుడ్చుకో! పండుగ పూట! గట్ల గుడికి పొయ్యొత్తం పా! రా!!” అంట రెక్కవట్టుకోని పైకి లేపి పట్టెమంచమున్న అర్రలకు దీస్కవొయ్యిండు.

తనబ్బిల నుంచి ఒక సంచి దీసిండు. అందుల నుండి ఆకుపచ్చరంగు ఎర్రంచు గద్వాల పట్టు చీర దీసిండు. “ఇది కట్టుకో” అన్నడు..

“అగో ఎప్పుడు దెస్తివి చీర?” చెంపలమీద చెయ్యేసి అడిగింది.

“వారమైంది.. రైక గూడ కుట్టింపించుకొచ్చిన” అన్నడు గర్వంతోని కండ్లబొమ్మలు ఎగిరేసుకుంట నవుకుంట.

“ఇగో వొయిసుల ఉన్నపుడు మనం మనకోసరం ఏం జేసుకోకపోతిమి.. గిప్పుడన్న జర సంతోసంగ జేసుకుందం..”

“నాకు నీవు నీకు నేను.. సాలదా?”

“పొద్దునిచ్చిన బట్టలు మీరూ కట్టుకోండ్రి..” అనుకుంట సీతమ్మ లోపలికి పోయింది.

సీతమ్మ ఆకుపచ్చ చీరకట్టు కోని ఎర్రని రైక తొడుక్కోని ముద్దుగ ఎర్రని ముద్దమందారం చెట్టు లెక్క తయారై వొచ్చింది. రాములుగూడ జరంచు పంచ కట్టుకోనొచ్చిండు. సీతమ్మను చూడంగనె అట్లనే నిలవడిండు.

నడుముదాక ఉన్న ఎంటికెలను సుట్టసుట్టి కొప్పుగట్టింది. కొప్పునిండ మల్లెలు కనకాంబరాలు మరువంతో కట్టిన దండను సుట్టింది. రూపాయిబిల్లంత కుంకుమబొట్టువెట్టింది. మెడల ఐదొరసల చంద్రహారమేసింది మీదికి నానువెట్టింది. కాల్లకు ఇరవైతులాల పట్టగొలుసులు పెద్ద మెట్టెలున్నయి.. రాములు దబదబ వొంటింట్లకువోయి బొగ్గు ఏలుకు రాసుకొచ్చి సీతమ్మ కణతకువెట్టిండు.

సీతమ్మ కొంగు ముడిప్పి పులిగోరు గొలుసుదీసింది నవ్వుకుంట..

“అమ్మదొంగా.. ఇదెక్కడిదే” అన్నడు రాములు

“పోయినేడు పెద్దోడొచ్చినప్పుడు పైసలిచ్చిండు. అయివెట్టి మన చారి తోని చేపిచ్చిన” అన్నది.

“ఆ చారిగాడేం నాకేం చెప్పలే జూసినావ్..” అనుకుంట జేబుల నుంచి ఏదో దీసిండు. తెల్లరాల్ల గాజులు.. సీతమ్మ ముసిముసిగ నవ్వవట్టింది.

“ఎప్పుడు చేపిచ్చినవయ్య గివి..” అన్నది..

“మొన్న కొబ్బరికాయల లారితోని వోయిన గద… పట్నంల దెచ్చిన..” అన్నడు.

“పద గుడికివొయ్యొద్దం” అన్నడు. బైటికొచ్చి బులెట్ బండి దీయవోయిండు.

“వామ్మో నేన్రానయ్యో గా బండి మీద” అన్నది సీతమ్మ.

“ఏందీ రావా? ఎందుకే! శాన రోజులయ్యింది గదయ్యా! ఏం గాదు నన్ను నమ్ము.. నువ్వు కదలకుంట దీస్కవోత..”

ఇద్దరు బులెట్ బండెక్కి ఆకాశంల పిట్టల్లెక్క పయనమైనారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here