పెళ్ళి కోసం తపించిపోయిన ఆ తరం ఆడపిల్లలల జీవితం ‘నాలాగ ఎందరో’

3
1

[dropcap]‘నా[/dropcap]లాగ ఎందరో’ 1978లో ఈరంకి శర్మ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇప్పటివారికి ఈ సినిమా పెద్దగా తెలియదు. అయితే తెలుగు సినిమాలలో ఇది ఒక ప్రత్యేకమైన సినిమా. దీనికి మూడు నంది అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రంగా, ఇందులో హేమసుందర్ గారికి ఉత్తమ నటుడి అవార్డు, అలాగే ఈ సినిమాలో పాడిన పాటకే ఎస్.పీ బాలసుబ్రహ్మణ్యం గారికి మొదటి సారి ఉత్తమ నేపథ్య గాయకునిగా నంది అవార్డు లభించింది. సినిమాలో ప్రధాన తారాగణం రూప, నారాయణరావు, హేమసుందర్. ఆత్రేయ గారి పాటలు కూడా సినిమాకు హైలైట్. అప్పట్లో ప్రధాన తారలెవ్వరూ లేకుండా, కమర్షియల్ ఎలిమెంట్లకు దూరంగా ఉండేవి ఈరంకి శర్మ గారి సినిమాలు. తాను అనుకున్న పద్దతిలోనే సినిమాలు తీసిన వ్యక్తి ఆయన. అవార్డులు వచ్చాయి కాని ఎక్కువ మందికి వీరి గురించి తెలియదు. మన తెలుగు సినిమా రంగంలో పాపులారిటీ ముఖ్యం తప్ప క్వాలిటీ కాదు. అందువలనే తమ మనసుకు నచ్చిన విధంగా మంచి సినిమాలను తీసి కమర్షియాలిటీకి దూరంగా ఉన్న దర్శకులను మనం గుర్తుపెట్టుకోం. అసలు అటువంటి పంథాలో పని చేసుకుంటూ సినీ తళుకులకు దూరంగా ఉండడానికి విశిష్టమైన వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న కళాకారులంటే నాకు చాలా గౌరవం. వారి సినిమాలను పరిచయం చేయడం ఒక అవసరంగా నాకు అనిపిస్తుంది. ఆ భాద్యతతోనే ఈ సినిమాను ఈ రోజు పరిచయం చేస్తునాను. 2018లో 93 సంవత్సరల వయసులో చనిపోయిన ఈరంకి శర్మ గారి గురించి కూడా ప్రస్తుత ఫిలిం మేకర్లకు పెద్దగా తెలీయదు. తెలుగు సినీ ప్రస్థానంలో కూడా వీరిని గుర్తు పెట్టుకున్న వారు తక్కువే అని చెప్పాలి.

‘నాలాగ ఎందరో’ సినిమా కథలో ముఖ్య విషయం అమ్మాయిల పెళ్ళి. మంచి అమ్మాయిగా సమాజంతో ముద్ర వేయించుకున్న సాంప్రదాయ పద్దతిలో పెరిగిన అమ్మాయిలు వివాహం వద్దకు వచ్చేసరికి ఎలా మనసులేని బొమ్మలుగా ఉండిపోవలసి వస్తుందో చెప్పే సినిమా ఇది. పార్వతీశం అనే ఒక ప్రఖ్యాత సంగీత విద్వాంసుడి పెద్ద కూతురు కళ్యాణి. చదువుకుంది. తండ్రి వద్ద సంగీతం నేర్చుకుంది. పార్వతీశం గారి సంగీత కచేరిలతో గడిచినంత కాలం ఆ కుటుంబం ఆనందంగానే జీవించింది. కాని పార్వతీశంకు పాక్షిక పక్షపాతం వచ్చి వీణ కచేరీలు చేయలేని స్థితి వస్తుంది. పెళ్ళి కావలసిన ఇద్దరు ఆడపిల్లలతో, చితికిపోయిన ఆర్ధిక స్థితిలో ఆ పాత పేరు ప్రఖ్యాతుల నడుమ ఆయన బ్రతుకుతూ ఉంటాడు. కళ్యాణి గుణం ఆమెకు మంచి భవిష్యత్తును తీసుకువస్తుందని ఆయన నమ్మకం. పార్వతీశం చెల్లెలు కొడుకు చలపతి. ఆమెకు అన్న పార్వతీశం అన్నా మేన కోడలు కళ్యాణీ అన్నా ఎంతో ప్రేమ. కళ్యాణిని తన కోడలిగా చేసుకోవాలని ఆమె కోరిక. పార్వతీశం కూడా కళ్యాణి తన చెల్లిలికి కోడలుగా వెళ్ళి సుఖపడుతుందని అనుకుంటుంటాడు. చలపతి ఆధునిక భావాలున్న యువకుడు. అతనే తన భర్త అని నమ్మి అతని పట్ల ఆరాధన పెంచుకుంటుంది కళ్యాణి. ఒక సారి ఆ ఇంటికి వచ్చిన చలపతి వివాహానికి ముందే కళ్యాణి శరీరాన్ని కొరతాడు. సంప్రదాయాన్ని నమ్మిన కళ్యాణి దానికి ఒప్పుకోదు. అహం దెబ్బ తిన్న చలపతి కళ్యాణి తనను తిరస్కరించిందని ఆమెకు బుద్ధి చెప్పాలని మరో అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. అతని తల్లి కూడా ఈ విషయానికి బాధపడుతుంది. విషయం తెలుసుకున్న పార్వతీశం చలపతిని ఆశీర్వదించి, చెల్లెలికి నచ్చ జెప్పి కళ్యాణికి సంబంధాలు చూడడం మొదలెడతాడు.

అప్పటి దాకా బావనే భర్తగా ఊహించుకున్న కళ్యాణి అతన్ని కాదని మరెవరినో భర్తగా ఊహించుకోవలసి రావడం వల్ల ఇబ్బంది పడుతుంది. కాని వివాహం తనకు తప్పదని అర్థం చేసుకుని పెళ్ళి చూపులకు సిద్దపడుతుంది. వచ్చిన వారి ముందు అలంకరించుకుని కూర్చోవడం, అతన్ని భర్తగా అనుకోవడం, ఆ పెళ్ళి కొడుకులు అమ్మాయి బావుందని చెప్పి వెళ్ళి కట్నం విషయంలో చెట్టెక్కి కూర్చోవడం, వారి గొంతెమ్మ కోరికలు తీర్చే స్థితిలో పార్వతీశం లేకపోవడం, ఆ పెళ్ళి సంబంధం తప్పిపోవడం… ఈ పరిస్థితులు ఒక యువతి మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్న విషయాన్ని చాలా సున్నితంగా చూపించారు దర్శకులు, చూసిన ప్రతి వ్యక్తి తనకు భర్త అవుతాడేమో అని ఆశపడడం అతనితో భవిష్యత్తు ఊహించుకోవడం మళ్ళీ అతని ఫోటో మార్చి మరొకరి ఫోటో తన పక్కన చెర్చడం ఒక స్త్రీకి ఎంత నరక ప్రాయంగా ఉంటుందో, ఆ పెళ్ళి చూపుల గాయాలు సున్నిత మనస్కులైన యువతుల మనసును ఎలా క్రుంగతీస్తాయో చూపించిన సినిమా ఇది. ఇప్పటి పరిస్థితులు ఎంత మారాయే కాని ఆ తరంలో పెళ్ళి చూపుల కారణంగా ఇబ్బంది పడి ఎన్నో అవమానకరమైన అనుభవాలు పొందిన స్త్రీలు ఎందరో.

కళ్యాణి ఇంటి పక్కనే ప్రభాకరం అనే అతను తన అన్నా వదినలతో అద్దెకు దిగుతాడు. ప్రభాకరానికి కళ్ళు కనిపించవు. అతను పార్వతీశం గారి వద్ద వీణ నేర్చుకోవడానికి వస్తాడు. కళ్యాణితో స్నేహం చేస్తాడు. కళ్యాణి పెళ్ళికి జరుగుతున్న తంతు అంతా గమనిస్తూ ఉంటాడు. ఆమె మంచితనం తెలుసు కాబట్టి కళ్యాణికి మంచి జీవితం లభించాలని కోరుకుంటూ ఉంటాడు. కళ్యాణి చెల్లెలు వీణ ఒక గొప్పింటి వ్యక్తిని ప్రేమిస్తుంది. పెళ్ళికి ముందే గర్భవతి అవుతుంది. వీణ ప్రేమించిన వ్యక్తి తండ్రి చాలా మంచివాడు. కొడుకు ప్రేమను మన్నించి పేద పిల్ల అయినా వీణను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. కాని కళ్యాణి పెళ్ళి కాకుండా వీణ పెళ్ళి చేయనని పార్వతీశం చెబుతాడు. కళ్యాణి పెళ్ళి ప్రయత్నాలు ముమ్మరం చేస్తాడు. పార్వతీశం చెల్లెలు అన్న పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. తన కొడుకు కారణంగా కళ్యాణి వివాహం ఆలస్యం అవడం భరించలేకపోతుంది. తన ఆస్తి అంతా కళ్యాణి పేర పెట్టి చనిపోతుంది.

చలపతి భార్య మరణిస్తుంది. అతనికి సరైన ఉద్యోగం కూడా ఉండదు. తల్లి ఆస్థి కళ్యాణికి రాసిందని తెలుసుకుని మళ్ళీ మేనమామ ఇంటికి వస్తాడు. కళ్యాణి కి వచ్చిన సంబంధాలు అన్నీ తప్పిస్తూ తానే ఆమెను వివాహం చేసుకుని ఆస్తిని సొంతం చేసుకోవాలన్నది అతని ఉద్దేశం. అతని నటనను నిజమని నమ్ముతాడు పార్వతీశం. ఈ లోపల వీణ గర్భవతి అని తెలుసుకున్న ఆమె కాబోయే మామగారు పార్వతీశం ఈ విషయం విని తట్టుకోలేరని కారణం చెప్పకుండా పెళ్ళికి తొందర పెడుతూ ఉంటాడు. చలపతితో కళ్యాణి పెళ్ళి చేయాలని అనుకుంటున్న తండ్రికి విషయం చెప్పి చలపతి ఆస్తిని అతనికి తిరిగి ఇచ్చి అతని నిజస్వరూపం బైటపెడుతుంది కళ్యాణి. వీణ పెళ్ళి తొందరగా జరిపించడానికి, కళ్యాణికి రెండో పెళ్ళి సంబంధం చూస్తాడు ఆమె తండ్రి. కాని అతనికి కూడా విడాకులు తీసుకున్న కళ్యాణి స్నేహితురాలితో పెళ్ళి జరిగిందని తెలుసుకుని కృంగిపోతాడు.

తన పెళ్ళి పేరుతో వచ్చే పెళ్ళి కోడుకులను, చలపతిని గమనిస్తూ కళ్యాణి మనుష్యులను అర్థం చేసుకుంటుంది. ప్రభాకరంలోని మంచి మనసు ఆమెను ఆకర్షిస్తుంది. అతని లాంటి వ్యక్తి తోనే తాను సుఖపడగలనని అనుకుంటుంది. తనని వివాహం చేసుకొమ్మని ప్రభాకరాన్ని కోరుతుంది. తండ్రికి చెప్పలేక పెద్దలను ఒప్పించి వివాహ ప్రసక్తి తన తండ్రి వద్ద తీసుకురమ్మని ప్రభాకరాన్ని కోరుతుంది. ప్రభాకరం అన్న వదినలతో పార్వతీశం దగ్గరకి వెళ్ళి తాను కళ్యాణికి వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెబుతాడు. కాని కూతురి ఇష్టం విషయం తెలియని పార్వతీశం ఒక గుడ్డివాడికి బిడ్డను ఇవ్వడం అవమానంగా అనుకుంటాడు. తన అశక్తతను కోపంగా మార్చుకుని ప్రభాకరాన్ని అవమానిస్తాడు. అది తట్టుకోలేక ప్రభాకరం రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ పరిణామాలన్నిచూసిన కళ్యాణ్ణి పిచ్చిదయి వీధిన పడుతుంది.

ఇప్పటి తరానికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. వింతగా కనిపించవచ్చు. కాని ఆ రోజుల్లో మధ్య తరగతి అమ్మాయిల జీవితాలు చాలా వరకు ఇలాగే ఉండేవి. పెళ్ళి కాలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకున్న వారు, మతి చలించిన వారు, సినికల్‌గా మారిన స్త్రీలను చాలా మందిని చూసాను నేను. నా స్కూలు రోజుల్లో ఒక న్యూస్ నన్ను బాగా కదిలించింది. 80లలో హైదరాబాద్‌లో ఒక సంఘటన జరిగింది. అప్పట్లో చార్మినార్ పైకి వెళ్ళడానికి పబ్లిక్‌కి అనుమతి ఉండేది. ఒక కుటుంబంలో ఐదుగురు వ్యక్తులు చార్మినార్ నుండి దూకి చనిపోయారు. ఒక అన్న నలుగురు చెల్లెళ్ళు. తల్లి తండ్రులు చనిపోవడంతో అంత మంది అమ్మాయిల పెళ్ళి తాను చేయలేనని ఉత్తరం రాసి, కుటుంబం అంతా చార్మినార్‌పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో అదో పెద్ద వార్త. దాని తరువాతే చార్మినార్ పైకి ఎవరూ ఎక్కకుండా ప్రభుత్వం కట్టడి చేసింది. పెళ్ళి స్త్రీకి, ఆమె కుటుంబానికి ఎంత పెద్ద అవసరమో చెప్పే సంఘటన ఇది. పెళ్ళి జరగకపోతే అదో పెద్ద నేరంగా స్త్రీని మానసికంగా శిక్షించేవారు. ఈ రోజుల్లో హాపీ సింగిల్ విమెన్ కనపడుతున్నారు కాని అప్పట్లో పెళ్ళి కాకపోతే స్త్రీ అనుభవించే వేదన భయంకరంగా ఉండేది. ఎంత మంది స్త్రీలు ఈ వివాహం కోసం అల్లాడిపోయేవారో, తమను తాము వివాహం కోసం మార్చుకునేవారో. ఎంతగా కాంప్రమైజ్ అయ్యేవారో, ఆ సంగతులన్నిటికి రికార్డు ఈ సినిమా. సమాజాన్ని అర్థం చేసుకోవడానికి స్త్రీల జీవితం ఎన్ని దశలను దాటుకుని ముందుకు వచ్చిందో మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వెనుక ఎన్నిజీవితాల కృంగుబాటు ఉందో తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇది తెలియకుండా మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛకున్న నిజమైన విలువ అర్థం కాదు. అందుకోసం చూడవలసిన సినిమా ఇది. కళ్యాణిగా రూపాదేవి, పార్వతీశంగా హేమసుందర్, ప్రభాకరంగా నారాయణరావు గార్లు నటించారు. ఈ సినిమాలో పాటలన్నీ సాహిత్యపరంగా బావుంటాయి. ‘కళ్యాణినీ…. కనులున్న మనసుకు కనిపించు రూపాన్నీ’, ‘అనుభవాలకు ఆది కావ్యం ఆడదాని జీవితం’, ఈ రెండు పాటలు చాలా గొప్పగా ఉంటాయి. అలాగే ఎస్.పీ. గారికీ కూడా మొదటి నంది అవార్డు ఈ సినిమాలో పాటకే వచ్చింది.

అనుభవాలకు ఆది కావ్యం ఆడదాని జీవితం,
అందులోని ప్రతి మలుపు ఆశనిరాశల నిట్టూర్పు
వావి వరుసలు మనసుకు కావమ్మా
మనుషులు అల్లిన మాటల వలలమ్మా
వేటగాడికి వలపుండదమ్మా లోబడితే నీ బ్రతుకుండదమ్మా
నీ కథలో ఇది ఒక తొలిమలుపు
నిను కన్నవారికి మేలుకొలుపు…….

అంటూ సాగే ఈ పాటతో మొదలు పెట్టిన ఎస్.పీ. ప్రభ తరువాత రెండు డజన్ల నంది అవార్డులతో ఎవరూ అందుకోలేని స్థాయిని చేరగలిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here