[dropcap]ఆ[/dropcap]నాడు నీ చూపు నన్ను తాకినంత
చిగురాకు ఎరుపు మెరిసింది నా మదిలో…
నీవు మాట్లాడిన ప్రతి పలుకు
తేనె చినుకై తడిపింది నా మనసును…
మనం కలసి వేసిన అడుగులన్నీ,
సప్త స్వరాలై భూమాతకు గీతమాల పాడాయి…
చూపుల దారాలతో వలపు మాలికలల్లిన మన కనుల కలలు
ఇంద్ర ధనువుల సప్తవర్ణాలతో పులకితమయాయి…
ఒకరిపైన ఒకరికి కలిగిన అనురాగం
ఉప్పొంగే అలల సాగరమై ఆకాశాన్నంటింది…
స్పర్శలలో పంచుకున్న స్పందనలు,
గోదావరీ తరంగాల సలిలాలై ఝల్లుమనిపించాయి…
ఇప్పటికీ నీ తలపు అలా మెదలగానే…
ఎలకోయిల మావిచిగుళ్ళ కమ్మదనాన్నంతా
రంగరించి పాడుతుంది,
అడవి నెమలి నీలిమేఘాన్ని చూసిన
మైమరపుతో నర్తిస్తుంది…
నీ చెలిమిని నెమరు వేసుకోగానే,
అనంతమైన వేణుగానం మదిలో మ్రోగుతూనే ఉంటుంది…
నా గురించిన నీ ఆతురతల ఆరాటం
శీతగాలిలో నిదురించే నన్ను వెచ్చని దుప్పటియై కప్పుతుంది…
నిన్న కాదు, నేడు కాదు, రేపు కాదు… ప్రతి నిత్యమూ…
నీ జ్ఞాపకం, దాహార్తితోనున్న నాకు ఒక చలివేంద్రం…
హృదయాకాశ వీథిలో… చందమామ కాంతులతో
తళుకులీనే ఒక అస్తమించని నక్షత్రం!!
అందుకే ఓ ప్రియా! నీకు తెలుసా మరి?
నీవూ నేను రెండు కాదు,
ఒక్కటే అయిన నిండుదనం!!