నాణానికి ఒక వేపు

0
2

[dropcap]స[/dropcap]త్యమూర్తి నా బాల్య మిత్రుడే కాదు నా కొలీగ్ కూడా. వాడి కూతురు పెళ్లి. వాడయితే మా అమ్మయి పెళ్ళిలో ఏ టూ జెడ్ వరకు అన్ని పనులూ తన మీదే వేసుకుని పెళ్ళిలో ఏ లోటు పాట్లు రాకుండా తానే అన్ని అయి చూసుకున్నాడు. అలాంటప్పుడు వాడి కూతురు పెళ్ళికి వాడు చేసిన దాంట్లో సగమేనా నిర్వహించకపోతే ఏం బాగుంటుంది? అని అనుకున్నాను నేను.

“ఒరే సత్యమూర్తీ! నాకు ఒక్క పనీ పురమాయించకుండా అలా గమ్మున నీవు ఉండటం నాకేం నచ్చలేదు. చాలా గిల్టీగా ఉంది నాకు. మా అమ్మాయి పెళ్ళకి నీవు ఎంతో చేసావు” అన్నాను.

“అయితే బదులు తీర్చుకుంటావా?”నవ్వుతూ అన్నాడు సత్యమూర్తి. తిరిగి “నీవు అలా కూర్చుని పర్యవేక్షిస్తూ ఉండు. అన్ని పనులూ వాటి అంతట అవే చకచకా జరిగిపోతాయి. నీవు అలా కూర్చుని ఉంటేనే నాకు నిబ్బరం. అయితే ఒక్క విషయం. మరో పది, పదిహేను నిమిషాల్లో మా లాయరు వదిన వస్తోంది. ఆవిడ వుంటే పదిమంది పెట్టు. ఆవిడ ఉంటే చాలు మాకు కొండంత బలం. ఆవిడేవరో నీకు చెప్పలేదు కదూ? ఆవిడ మా ఆవిడకి పెత్తండ్రి కూతురు. మా అందరికీ ఆవిడ పెద్దదిక్కు.”

“ఆవిడ గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉంది. టూకీగా చెప్తున్నాను విను. ఆవిడ చాలా నిక్కచ్చి అయిన మనిషి. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. నిబ్బరం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న మనిషి మా వదినగారు. ఆవిడ్ని చూసి అందరూ అహంభావి అని అనుకుంటారు కాని ఆవిడ అహంభావి కాదు. ఆత్మనిబ్బరం పాలెక్కువ ఆవిడలో. ఇదంతా చెప్పడం ఎందుకు ఆవిడ కొద్ది సేపట్లో వస్తోంది. చూద్దువుగాని. ఇంత అతిశయోక్తిగా చెప్తున్నారు ఆవిడ గురించి అని అనుకుంటున్న నీకు తెలుస్తుంది” అన్నాడు సత్యమూర్తి.

నిజమే! సత్యమూర్తి ఆవిడ గురించి అంత అతిశయోక్తిగా చెప్తుంటే ఆవిడ్ని చూడాలనిపించింది నాకు. “అలాగా!” అన్నాను పైకి మాత్రం. అంతటితో ఆగాడా? ఆవిడ గురించి అలా చెప్పుకుపోతూనే ఉన్నాడు.

“ఇంకా విను ఆవిడ గురించి. వాళ్ళ ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టరు. అతను ఊరి జనాలందరికీ కలెక్టరు అవచ్చు కాని ఇంట్లో మాత్రం మా లాయరు వదినే కలెక్టరు. అతను ఊరి జనాలకి పులి అయితే ఇంట్లో మాత్రం పిల్లి. మా లాయరు వదిన ఇంట్లో ఆడపులి.” తిరిగి అన్నాడు. ఆవిడ గురించి విన్నప్పుడు ఆవిడ చాలా విచిత్రమైన మనిషిలా అనిపించింది నాకు. అంతే కాదు ఆవిడ్ని చూడాలన్న కూతూహలం కూడా నాలో కలిగింది.

ఇంక సత్యమూర్తి గురించి, నా గురించి చెప్పుకోవాలంటే ఎంతో ఉంది. మేమిద్దరం బాల్య స్నేహితులం. జీవితంలో అన్నింటికంటే చాలా మధురమైనది బాల్య జీవితం. మా ఇద్దరి హైస్కూలు చదువులు ఒకే చోట ఒకే స్కూల్లో జరిగాయి. ఆ తరువాత వాళ్ళ నాన్నగారికి వేరే ఊరికి బదిలీ అవటం వల్ల విడిపోయాము. అయినా మా ఇద్దరి మధ్యా ఫోన్లు ద్వారా యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతూనే ఉంది. అప్పడప్పుడు కలుసుకునేవాళ్ళం కూడా.

మరో విచిత్రం ఒకే కాలేజీలో మా ఇద్దరికీ విద్యా బోధన చేసే అవకాశం కూడా వచ్చింది. సత్యమూర్తి తెలుగులో పి.జి చేసి తెలుగు లెక్చరర్‌గా తన వృత్తిని నిర్వర్తిస్తూ ఉంటే నేను జాతీయ భాష అదే హిందీలో పి.జి. చేసి హిందీ లెక్చరర్‌గా భాషా బోధన చేస్తున్నాను. బాల్య స్నేహితులమయిన మా స్నేహలత ఇలా ఇన్ని సంవత్సరాలయినా అలా చిక్కగా, దట్టంగా పొదరిల్లులా అల్లుకుపోయింది.

ఇంతలోనే కలకలం. “ఏవండీ! మా లాయరు అక్కయ్య వచ్చింది రండి… రండి!” అంటూ సత్యమూర్తి భార్య అక్కడికి వచ్చి సత్యమూర్తిని అక్కడ నుండి తీసుకుపోయింది. బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు, ఈగలు ముసిరినట్టు ఆవిడ్ని చుట్టుముట్టారు చుట్టాలు, బంధువులు. దీన్ని బట్టి తెలిసిన విషయం ఏంటంటే బంధువర్గంలో ఆవిడికి ఎంత పలుకుబడి ఉందో అని.

రాజమాతలా ఠీవిగా, దర్జాగా నడుచుకుంటూ ఆవిడ వస్తుంటే వందిమాగదుల్లా ఆమె వెనకాల బుంధువర్గం. ఆమె దర్పం చూసిన నాకు ఆమెలో అహం లేకపోయినా అహంభావిలా అనిపించింది. సత్యమూర్తి చెప్పినట్టు అందగత్తే, వార్ధక్యం మీద పడుతున్నా తల మీద వెంట్రుకలు నెరుస్తున్నా ఆమె ఇప్పుడు కూడా అందంగానే ఉంది. ఆమె ఆమెలో ఆత్మవిశ్వాసంతో పాటు అందం ఉందనిపించింది నాకు.

ఆలా వెళ్తున్న ఆవిడ ఒక్కసారి ఆగి నా వంక చూసింది సూటిగా. నేను ఆమె చర్యకి మొదట్లో తడబడినా తమాయించుకుని ఆమె వేపు సూటిగా చూశాను. ఆవిడ్ని ఎక్కడో చూసినట్లు నాకు అనిపించింది. మా నాలుగు కళ్లూ కలిసాయి. నాలో సందిగ్ధత. కుతూహలం ఉంటే, ఆవిడ చూపుల్లో ఏదో తెలియని రహస్యం తెలుసుకున్నంత ఫీలింగు. వెనువెంటనే దుఖంతో గంభీరత. తల పంకించి ముందుకు ఆవిడ అడుగులు వేస్తుంటే ఆమెను అనుసరిస్తున్నారు ఆమె వెంట వచ్చిన వాళ్ళు.

ఆవిడ వెళ్లిన తరువాత ఆవిడ గురించి తెగ ఆలోచిస్తూ ఆవిడ్ని గుర్తు చేసేకోడానికి ప్రయత్నిస్తున్నాను నేను. ఎందుకంటే మనిషి ఎప్పుడూ ఏ ఆలోచనా లేకుండా ఉండలేడు. అందుకే నా చుట్టూ తెగ ఆలోచనలు.

వర్తమానం నుండి గతం వేపు నా మనస్సు పరుగులు తీస్తోంది. ఆవిడ్ని గుర్తించడానికి తెగ ఆరాట పడ్తున్నాను. ఆఁ!!! గుర్తుకు వచ్చింది. ఆవిడే కాంచన. వెనువెంటనే చలపతి గుర్తుకు వచ్చాడు. వాడు పూర్ ఫెలో అనుకంటున్న నా మనస్సు బాధగా మూల్గింది.

చలపతి తలంపుకు రాగానే జరిగిన సంఘటనలు నా కళ్ళెదుట నిలిచాయి. అవి నన్ను భావోద్వేగానికి గురి చేసాయి. అది నేను కాలేజీలో చేరిన మొదటి సంవత్సరం పూర్తయి రెండో సంవత్సరంలో అడుగు పెట్టిన రోజులు. అప్పుడే చలపతి నాకు పరిచయం అయ్యాడు. అదీ మా పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది. అతను ఎప్పుడూ దిగులుగా ఉండటం, అదీ క్లాసులో అలా ఉండటం నేను గమనించాను. కారణం అడగాలనుకున్నాను కాని మా ఇద్దరి మధ్య అంతలా పరిచయం లేకపోవడం వల్ల అడగలేకపోయాను.

అయినా రోజూ అతడ్ని గమనిస్తూనే ఉన్నాను. ఓ రోజు “చలపతీ!” అని పిలిచాను. కాలేజీ ఆవరణలో పూల మొక్కల దగ్గర దిగులుగా కూర్చున్న చలపతి దగ్గరకి వెళ్లి. చివ్వున తల పెకెత్తి నా వేపు చూశాడు. అతని కళ్ళలో మూగ వేదన నేను గమనించాను. కారణం అడగాలనుకున్నాను కాని మా ఇద్దరి మధ్యా అంతగా పరిచయం లేదు. రోజూ అతడ్ని అతని ప్రవర్తన గమనిస్తున్నాను కనకనే అతను దేని గురించో బాధపడ్తున్నాడు. తెలుసుకోవాలి. సాంత్వన చేకూర్చాలి అని అనుకున్నాను. నాలో మానవత్వం ఊరుకొనివ్వలేదు. అతనితో మాట్లాడి స్నేహం పెంపొందించుకోవాలనిపించింది.

“మీరు దేని గురించీ బాధ పడ్తున్నట్లు నాకనిపిస్తోంది. ఒక్క విషయం నీటితో తడిసిన వస్త్రం చాలా బరువుగా ఉంటుంది. ఆ నీటిని పిండేస్తే తేలిక అవుతంది. మన మనస్సు కూడా ఆ వస్త్రం లాంటిదే. మనస్సులో తిష్టవేసుకున్న దిగులు, ఆవేదన తొలగించుకుంటేనే మనస్సు తేలిక పడుతుంది. ఆ వేదన తొలగిపోతుంది. అయితే ఒక్క విషయం. మనం మన సుఖాన్ని అందరితో పంచుకున్నట్టు కష్టాన్ని కూడా పంచుకోవాలి. అలా చేస్తేనే మన ఆవేదన కొంత మట్టుకైనా తగ్గుతుంది. మనస్సు తేలిక పడుతుంది. సుఖంలో మనకి ఎవరి సహకారం లేకపోయినా బతికేయవచ్చు. కాని కష్టకాలంలో మాత్రం ఎదుటి వాళ్ళ సహకారం మనకి ఎంతో అవసరం” అన్నాను.

నా మాటలకి ఏం జవాబియ్యకుండా మౌనంగా ఉండిపోయాడు చలపతి. “మీ గురించి నాకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పవద్దు. మీరు పడుతున్న మనోవేదన చూడలేక ఇలా అన్నాను. క్షమించండి.” అంటూ అక్కడ నుండి కదలబోయాను. చప్పున నా చెయ్యి పట్టుకుని ఆపాడు చలపతి.

“కూర్చోండి. మనిద్దరం ఒకే కాలేజీలో ఒకే క్లాసులో చదువుతూ ఉన్నా మీ పేరు నాకు తెలియదు.”

“మీరు నాకు తెలుసు. మీ పేరు తెలుసు. నా పేరు కృష్ణమూర్తి” అన్నాను.

“నా పేరు మీకు ఎలా తెలుసు?” అడిగాడు చలపతి.

“అటెండన్సు వేస్తున్న సమయంలో ఎవరి పేరు ఏంటని గమనించడం నా అలవాటు” అన్నాను.

“అలాగా!” అన్నాడు చలపతి.

“కృష్ణమూర్తిగారూ! నా వంటి దురదృష్టవంతుడు మన క్లాసులో ఎవ్వరూ ఉండబోరేమో! అని అనుకుంటున్నాను.” అంటూ తన గురించి అంతా చెప్పుకున్న చలపతి ఆ తరువాత “మీరన్నట్టు నా బాధనంతా మీతో చెప్పుకున్న తరువాత నా మనస్సు తేలికపడింది” అన్నాడు.

చలపతి చెప్పిన దాన్ని బట్టి అతని తల్లిదండ్రులు అతని బాల్యంలోనే అతడ్ని ఏకాకిగా మిగిల్చిపోయారు. అప్పటి నుండి పిల్లలు లేని అతని మేనమామ అతని భార్యా, చలపతిని చేరదీసి పిల్లలు లేని లోటు తీర్చుకుంటున్నారు. వాళ్లు అంత ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటున్నా తల్లిదండ్రులున్న వాళ్ళ ఆప్యాయతానురాగాల్ని చలపతి మేనమామ, అతన భార్య దగ్గర పొందుతున్నాడు. చలపతి అయినా తల్లిదండ్రుల అనురాగం, ఆప్యాయతలు పొందుతున్న వాళ్ళతో తనని సరిపోల్చుకుంటూ ఎంతో బాధపడి పోతాడు చలపతి. అది అతని బలహీనత.

చలపతిలో ఆ బలహీనతను పోగొట్టి అతనికి నేను ఓ మంచి మిత్రుడ్ని అయ్యాను. చలపతి సత్యమూర్తి అంత ఆప్తమిత్రుడు కాకపోయినా మా ఇద్దరి మధ్యా మంచి స్నేహమే ఉంది. స్నేహం వల్ల చలపతిలో ఉదాసీనత పోయి చురుకుదనం, ఉత్సాహం చోటు చేసుకున్నాయి.

అయితే అన్ని రోజూలూ ఒక్కలాగే ఉండవు. దానికి నిదర్శనం చలపతి ప్రవర్తన. అది నాకు ఒకింత బాధ కలిగించింది. వయస్సు ప్రభావమో! లేక ఆకర్షణో తెలియదు కాని చలపతి ప్రేమలో పడ్డాడు. అదీ కాంచనను ప్రేమించడం. ఆమె నిజంగా కాంచనయే. బంగారు మేని ఛాయతో అందంగా ఆకర్షణీయంగా ఉండేది. మొత్తానికి ఆమె గొప్ప అందగత్తె. అయితే చలపతిది ఒన్ సైడ్ లవ్వు అని నేను గమనించాను. ఆమెను చలపతి ప్రేమిస్తున్నాడు. ఆరాదిస్తున్నాడు. కాని కాంచనకి చలపతి మీద అటువంటి భావం లేదని గమనించాను. కాంచన ఆకర్షణలో పడ్డ చలపతి దాన్నే ప్రేమ అని అనుకుంటున్నాడు.

నేను చలపతిని హెచ్చరించాను. “చలపతీ! నీవు నీ జీవితాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నావు. కాంచన మీద నీకున్న భావోద్వేగం ప్రేమ కాదు, ఆకర్షణ మాత్రమే. దీపం వెలుతురుకి ఆకర్షించబడిన దీపం పురుగు ఆ దీపం చుట్టూ తిరుగుతూ అసువులు బాస్తుంది. అలాగే నీ ఈ ఆకర్షణ కూడా. ఆకర్షణ నీటి బుడగ లాంటిది. నీటి బుడగ క్షణకాలంలొ విచ్ఛిన్నమయినట్టే ఈ ఆకర్షణ కూడా క్షణికమే.”

“నీవు కాంచనను ప్రేమిస్తున్నావు అని అనుకుంటున్నావు. అది ప్రేమ కాదు. ఆకర్షణ అని తెలుసుకో. ప్రేమ గుడ్డిది. ప్రేమా పిచ్చీ ఒక్కటే. తెలుసా? నా మాట విని ప్రేమా, దోమ అని అనకుండా నీ దృష్టిని చదువు వేపు మళ్ళించు. లేకపోతే నీ కెరియర్ పాడవుతుంది. కాంచన కూడా నిన్ను ప్రేమిస్తోందన్న గ్యారంటీ లేదు. నీ మేనమామ దంపతులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ముఖం చూసేనా నీ ప్రవర్తన మార్చుకో!” ఇలా ఎన్నో విధాల నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. అయితే వింటే కదా చలపతి.

అనుకోకుండా ఓ రోజు ఉదయం చలపతి సూసైడ్ చేసుకున్నాడన్న వార్త నన్ను బాగా కృంగదీసింది. గుండెల్లో నలవికానంత బాధ. నేనే ఇంతగా బాధపడ్తూ ఉంటే కన్న కొడుకులా చూసుకుంటున్న చలపతి మేనమామ వాళ్ళు ఇంకెంత బాధ పడ్తున్నారో అని అనుకున్న నేను వాళ్ళ దగ్గరికి బయలుదేరాను.

నన్ను చూసిన వాళ్ళు బోరుమని విలపిస్తున్నారు. వారిని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావటం లేదు. “కృష్ణమూర్తి! చలపతిని మేము కనకపోయినా కన్న కొడుకు కన్నా ఎక్కువవుగా చూసుకున్నాం. మేము వాడికి ఏ లోటు చేశాం? మరి ఎందుకో అర్ధాంతరంగా తన జీవితాన్ని ఇంత దారుణంగా ముగించాడు.” చలపతి మేనమామ నా చేతులు పట్టుకుని చాలా బాధ పడ్డాడు. అతనికి అసలు విషయం తెలియదు. అదే కాంచన చలపతి ప్రేమను తిరస్కరించి ఉంటుంది. అది తట్టుకోలేక చలపతి తన ప్రాణాలు తీసుకున్నాడు. తెలిస్తే ఆ దంపతులకి ఎంత క్షోభ? అని అనుకున్నాను. నాకు కాంచన మీద విపరీతమైన కోపం వచ్చింది.

“కాంచనగారూ! చలపతి సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం మీకు తెలుసా?” గట్టిగా తీవ్రమైన స్వరంతో అన్నాను.

“తెలుసు!” ఆమె కంఠంలో నిబ్బరం, ఆమె ఆ జవాబుకి నాకు కంపరంగా ఉంది. ఆమె మీద నాకు పట్టరాని కోపం వచ్చింది. “చలపతి జీవితం ఇలా అవడానికి కారకురాలు మీరు. మీరు హంతకురాలు” తీవ్రంగా గట్టిగా అరిచినట్టు అన్నాను.

“షటప్!” గట్టిగా అరిచింది కాంచన. ఆమె కంఠంలో ఆ తీవ్రతకి ఒక్కసారి చలించాను. కలవరపాటు కూడా కలిగింది. ఆమె ముఖం కందగడ్డలా కోపంతో ఎర్రబడింది. ఆమె తీరు తెన్నులు నన్ను కలవరబాటుకి గురి చేసాయి. కొద్దిక్షణాల్లో ఆడనాగులా బుసలు కొడ్తున్న ఆమెలో కోపం చల్లబడింది. ఆమె వదనంలో క్రమంగా సౌమ్యత చోటు చేసుకుంది. తేలిగ్గా ఉపిరి పీల్చికున్నాను నేను.

“కృష్ణమూర్తి గారూ! మీరు నాణానికి ఒక వేపే చూశారు. రెండో వేపు చూడలేదు. అలా చూస్తే నేనంటే ఏంటో మీకు తెలిసి ఉండేది. చలపతి నా దగ్గర తన ప్రేమ ప్రస్తావన తెచ్చాడు. ‘నేను చదువు మానేస్తాను. ఏదో చిన్న ఉద్యోగం చేసి మిమల్ని పోషిస్తాను. మనిద్దరం పెళ్ళి చేసుకుందాం’ అన్నాడు. ‘నాకు అలాంటి ఉద్దేశం లేదు’ అని నచ్చజెప్పడానికి ప్రయత్నించాను. అతనికి నా మీదున్నది ప్రేమ కాదు ఆకర్షణ వల్లనే అలా అంటున్నాడు అని నేను గ్రహించాను. ఆ ఆకర్షణ క్షణికం అందువల్లనే అతనికి నచ్చజెప్పాను. వినకపోతే హెచ్చరించాను. అంతకీ వినకపోతే పరుషంగా మాట్లాడవల్సి వచ్చింది. దానికి ఫలితమే చలపతి సూసైడ్. ఇప్పుడు చెప్పండి. నేను ఆ చలపతిలా వయస్సు ప్రభావం వల్ల ఆకర్షణకి లోనయితే నా బతుకు వీధిన పడేది. నా కెరియర్ దెబ్బతినేది. నా తల్లిదండ్రులు నాకు మంచి నడతనే నేర్పించారు. మంచి వ్యక్తిత్వాన్నే నేర్పించారు. మంచి వ్యక్తిత్వాన్నే నేర్పించారు. బలహీనమైన వ్యక్తిత్వం నాది కాదు” అంది కాంచన.

ఆమె చెప్పింది మోనంగా వింటున్నాను. “ఒక్క విషయం కృష్ణమూర్తి గారూ! మన జీవన ప్రయాణంలో ఎన్నో సవాళ్ళు, సమస్యలూ ఎదురయినా నేడు కంటే రేపు బాగుండాలని, అనుకున్నవన్నీ జరగాలని అందరూ కోరుకుంటారు. చలపతి అలాగే అనుకున్నాడు. అటువంటి ఆశావహ దృక్పథం మనల్ని ముందుకు నడిపిస్తుంది. చలపతిలో ఆశావహ దృక్పథం కంటే అతనిలోని బలహీనత దూరదృష్టి లేమి కొట్టోచ్చినట్టు అగుపడ్తోంది.”

“నా విషయానికి వస్తే మన ఆశయాలను, గమ్యాలను ఎవ్వరూ ఆపలేరు. మన ఆశయాల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, స్పీడ్ బేకర్లు వస్తాయి. వాటిని అధిగమిస్తూ ప్రయాణం చేయవల్సిందే. మనల్ని నిరుత్సాహ పరిచిన ఆశ్చర్యపోయేలా మనం ప్రయత్నం చేయాలి.

ఇంకో విషయం నేటి యువతలో కలలుకనే వాళ్ళు ఎక్కువయారు. ఆ కలలను సార్థకం చేసుకున్నదిశగా కృషిచేసే వారు మాత్ర్రం తక్కువే. దానికి కారణం లక్ష్యంపై చూపించే శ్రద్ధాసక్తులు లక్ష్య సాధనపై చూపించకపోవడమే. ఇదే చలపతిలో ఉన్న బలహీనత.

బలాలు బలహీనతలు లేని మనిషి లేడు. మనం మన బలాల్ని చెప్పుకున్నంతలా బలహీనతల్ని చెప్పుకోలేము. ఒప్పుకోలేము. బలహీనతల్ని గురించి చెప్పుకుంటే అందరూ మనల్ని చిన్న చూపు చూస్తారన్న భయం. అందరిలోనూ చులకన అవుతామన్న భావన. అందుకే బలహీనతల్ని కప్పిపుచ్చుకోడానికి తాపత్రయపడ్తారు. మనలోని బలహీనతల్ని అంగీకరించినప్పుడు దానిని పరిష్కారించడానికి మార్గాన్వేషణ చేయడం సులువువవుతుంది.

మరో ముఖ్య విషయం మనిషికి, అసలు, సిసలైన ఆస్తి అతని వ్యక్తిత్వం. అది ఉన్న మనిషిని సమాజం గౌరవిస్తుంది. అటువంటి వ్యక్తి ఆత్మ విశ్వాసం ఆత్మగౌరవం గలవాడై ఉంటాడు. మనిషి పరిపక్వతకి రావాలంటే అతనికి తన నిజాయితీ ఎంతో ముఖ్యమైన విషయం అవుతుంది. ఆ పరిపక్వతే చలపతిలో లేదు. పరిపక్వత లోపించిన విధంగా ప్రవర్తించిన వారు తమని తాము చూసుకుని కలవరపడతారు. పిరికిగా ఇలా ఆత్మహత్యలకి పాల్పడతారు. చలపతి చేసింది అదే.”

“మరో విషయం అన్ని అనర్థాలకి మూలం అవేశం, తొందరబాటు. దూరదృష్టి లేని ఆలోచనలు. ఆవేశం వల్ల దూరదృష్టి లేకపోతే మనిషి విచక్షణాజ్ఞానం కోల్పోతారు. తను ఏం చేస్తున్నాడో తెలుసుకునేలోపునే జరగవల్సిన అనర్థం జరిగిపోతుంది. ఇప్పుడు చలపతి విషయంలో ఇదే జరిగింది” కాంచన తన ఉపన్యాస ధోరణికి బ్రేక్ వేసింది. నా వంక చూసింది, నా రెస్పాన్సు ఎలా ఉందని.

అక్కడ నా పరిస్థితి మరోలా ఉంది. ఆమె పరిపక్వతతో అన్న మాటలు విని చకితుడ్ని అయ్యాను. నానోటి వెంబడి మాటలు రావటం లేదు. కాంచనది ఇంచుమించు నా వయస్సే. అయినా నాకు తెలియని ఎన్నో విషయాలు కాంచన ద్వారా తెలుసుకున్నాను. నిజమే. మగవాడికన్నా వయస్సులో చిన్నదయినా ఆడదానిలో ఎంత పరిపప్వత ఉంటుంది. దాని ప్రభావమే కాంచన నాతో అన్న మాటలు. చలపతిలో ఆ పరిపక్వత లేని కారణం చేతనే కాంచన చెప్పినట్టు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంలో కాంచన ఒకర్తే దోషి కాదు. చలపతి కూడా దోషే. అనిపించింది. అందుకే మరేం మాట్లాడకుండా వెనుతిరిగాను.

అయితే ఆ రోజు నుండి నేను కాంచనను ద్వేషించలేదు. అలా అని సద్భావంగా ఉండటం లేదు. కాంచన చెప్పినట్టు నేను నాణానికి యొకవేపే చూశాను. ఆమె మాటలు విన్న తరువాత రెండో వేపు చూడ్డానికి ప్రయత్నిస్తున్నాను. ఆమె కనిపించినా ముఖం పక్కకి తిప్పుకునేవాడిని. ఇలా మా చదువు ముగింపు దశకి వచ్చింది.

ఇక అందరం విడిపోయే సమయం రానే వచ్చింది. మా కాలేజీ యాజమాన్యం సెండాఫ్ పార్టీ ఏర్పాటు చేశారు. అందరి ముఖాల్లో ఆనందంతో పాటు కాలేజీని విడిచి పోతున్నామన్న విషాదభావాలు కూడా అగుపిస్తున్నాయి. నాకు చలపతి గుర్తుకు వచ్చాడు. అతను బ్రతికి ఉంటే ఈ పార్టీకి ఎంతో నిండుతనం వచ్చి ఉండేది. అతను లేని లోటు నన్ను క్షణక్షణానికి అగుపడుతోంది. ఒక దగ్గర ఒంటరిగా కూర్చుని చలపతిని తలచుకుంటూ గంభీరంగా ఆలోచిస్తున్నాను.

“కృష్ణమూర్తి గారూ!” ఆ పిలుపు విని తల పైకెత్తి చూశాను. ఎదురుగా కాంచన. ఇన్ని రోజుల తరువాత ఆమె నా ఎదుట నిలబడి ఇలా మాట్లాడుతూ ఉంటే తడబడ్డాను. లేచి నిలబడ్డాను. “కూర్చోండి” అంటూ ఆమె నాకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. నేనూ ఆమెకి ఎదురుగా కూర్చున్నాను.

“మన చదువులు పూర్తయ్యాయి. ఇక అందరం విడిపోతున్నాం. ఇక ఎవరి దారులు వాళ్ళవి. ఇక జీవితంలో తిరిగి కలసుకుంటామో లేదో చెప్పలేని పరిస్థితి. ఇంకా నా మీద మీకు కోపం పోలేదా?” అంది కాంచన. మొదట ఆమె మీద కోపం ఉండటం నిజమే. అయితే నాణానికి రెండో వైపు కూడా చూడ్డం ఆరంభించాను. ఆతరువాత నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. జరిగినదాంట్లో కాంచన ఒక్కర్తే దోషి కాదు. చలపతి కూడా దోషే. అందుకే మౌనంగా ఉండిపోయాను.

“నన్ను అపార్థం చేసుకోకుండా నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతేషంగా ఉంది. ఇప్పుడు నా మనస్సు ఎంతో తేలిక పడింది. ఇప్పటి వరకూ నేను ఎంతో ఆత్మక్షోభకి గురయ్యానో చెప్పలేను.” అంది కాంచన. ఆ తరువాత అందరం విడిపోయాము. ఎవరి దారి వాళ్ళది. ఇన్నాళ్ళకి కాంచన నాకు ఇలా ఆగుపించింది. నా ఆలోచన్లు ఇలా సాగుతున్నాయి.

“నా గురించే కదూ ఆలోచిస్తున్నారు కృష్ణమూర్తిగారూ!” అప్పుడే అక్కడికి వచ్చిన కాంచన నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అంది. తడబడ్డాను నేను. “మిమ్మల్ని నేను ఇట్టే గుర్తుపట్టాను. ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ మీలో ఏ మార్పు లేదు. ఆడవాళ్ళలోనే అనేక మార్పులు వస్తాయి. కాబట్టి చప్పున మీరు నన్ను గుర్తించలేకపోయారు.” చిన్నగా నవ్వుతూ అంది కాంచన. నేను కూడా చిన్నగా నవ్వాను.

“కృష్ణమూర్తి గారూ! పేరున్న లాయరుగా నేను ఎన్నో నేర్చుకున్నాను. ఎన్ని సంఘటనలు చూశాను. మన తరానికి ఇప్పటికి తరానికి ఎంతో తేడా ఉంది. ఆ రోజుల్లో యువతలో ఎక్కువ మందికి మానసిక పరిపక్వత ఉండేది. ఈ కాలం యువతలో అది లేదు. నేడు ఎంత మంది ఆడపిల్లల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. వాళ్ళ తొందరబాటు చర్య వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయి. మానభంగాలు జరుగుతున్నాయి. అబార్షన్‌లు జరుగుతున్నాయి. భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. అక్రమ సంతానాన్ని కాలువల్లో, చెత్తకాగితాల్ని విసిరివేసినట్లు ముళ్ళ పొదల్లో పడేస్తున్నారు.”

“దానికి కారణం నేటి యువతలో పరిపక్వతలేమి, తొందరపాటు నిర్ణయాలు, స్థిరత్వం లేకపోవడం, నిబ్బరం లేకపోవడం నేటి ఆధునిక నాగరికత ప్రభావం ముఖ్యంగా యువత మీద పడుతోంది.” కాంచన చెప్పుకు పోతోంది. అక్కడ శ్రోత నేను అయ్యాను.

“కృష్ణమూర్తిగారూ! నా గురించి వినండి. ఇప్పుడు నా జీవితం సాఫీగా సాగుతోంది. కొడుకూ, కోడలూ, కూతురూ, అల్లడూ స్టేట్స్‌లో పెద్ద హోదాల్లో ఉన్నారు. వాళ్ళు తమ పిల్లల్తో హ్యేపీ. ఇక మా ఇద్దరి విషయానికి వస్తే కలెక్టరుగా సమాజంలో పలకుబడితో పాటు పరపతితో పాటు, ఆర్థికంగా మా ఆయన బాగా సంపాదించారు. నేను కూడా పేరు గాంచిన మంచి లాయరుగా పేరు ప్రఖ్యాతలు గడించాను.”

“ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఏవో శారీరిక రుగ్మతలు, చిన్న చిన్న మానసిక రుగ్మతలు తప్ప మాకు సమస్యలు లేవు. ఉన్నా స్వల్పమే. నేటి కాలంలో ఇది ప్రతీ ఒక్కరికీ సహజమే. ఇక నా విషయానికి వస్తే నేను ఆనాడు మానసిక పరిపక్వతతో ఆలోచించికుండా ఆ చలపతి ప్రపోజల్‌కి అంగీకరించి ఉంటే, వయస్సు తాలూకా ఆకర్షణకి లొంగి, దానికి ప్రేమ అని పేరు పెట్టి తొందరపబాటు పని చేసి ఉన్నట్టయితే నా జీవితం మరోలా ఉండేది. అలాంటి జీవితాన్ని ఊహించుకుంటేనే శరీరం జలదరిస్తోంది. దూరదృష్టి లేకపోతే అలాంటి హేయమైన జీవితం గడిపి ఉండేదాన్ని. అందుకే మిమ్మల్ని నాణానికి రెండో వేపు చూడండి అని అన్నాను.” అంది కాంచన. ఆవిడ మాట్లలో నిజం ఉందనిపించింది నాకు. ఆవిడ దూరదృష్టి నాకు నచ్చింది.

“కృష్ణమూర్తి! నీకు మా లాయరు వదినగారు తెలుసా?” అప్పుడే అక్కడికి వచ్చిన సత్యమూర్తి అన్నాడు. నేను జవాబు చెప్పాలనుకుంటున్న సమయంలోనే “మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం” అంది కాంచన నవ్వుతూ.

“అలాగా!” మన ఇద్దరం బాల్య స్నేహితులమయితే మీరిద్దరూ కాలేజీమేట్సు అన్నమాట.” సత్యమూర్తి నవ్వుతూ అన్నాడు. నాణానికి రెండో వేపు చూసి పరిస్థితుల్ని అర్థం చేసుకున్న నేను కూడా తేలిగ్గా నవ్వాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here