Site icon Sanchika

నాన్న లేని కొడుకు-10

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సంచిక పాఠకుల కోసం రచించిన ‘నాన్న లేని కొడుకు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]హ[/dropcap]రితకి మనశ్శాంతిగా ఉంది. ఇదివరకులా నవ్వుతూ, చలాకీగా ఉంటోంది. బాబుతో ఆడుకోడం, తల్లికి వంట పనిలో సాయం చేయడం, చదువుకోడంతో పాటు తనకి ఎంతో ఇష్టమైన తోట పని కూడా ప్రారంభించింది. నర్సరీకి వెళ్ళి రకరకాల క్రోటన్స్, పూల మొక్కలు కొని తెచ్చి ఖాళీ స్థలం మొత్తం మొక్కలతో నింపేసింది.

జ్యోతి కూడా నెమ్మదిగా బాబుని ప్రేమించసాగింది. తండ్రి ఎవరు అయినా కన్నది తన కూతురు. తొమ్మిది నెలల నరకం అనుభవిస్తూ ఈ చిన్నారికి జన్మ ఇచ్చింది. హరిత చేసింది ఒక విధంగా సాహసం. రేపు వీడు పెరిగి పెద్దవాడై ఓ సుభాష్ చంద్ర బోస్ కావచ్చు.. ఒక అబ్దుల్ కలాం కావచ్చు.. ఒక గడ్డి మొక్క మొలవాలన్నా, ఒక పారిజాతం విరియాలన్నా భూమాత అదే ప్రసవ వేదన పడుతుంది.. స్త్రీ కూడా అంతే.. ఒక మహానుభావుడుకి అయినా, ఒక హంతకుడికి అయినా అదే గర్భం .. పవిత్ర క్షేత్రం.

అలా మనసుని సమాధాన పరచుకున్న ఆమె నెమ్మదిగా ఆ పసివాడి పట్ల మమకారం పెంచుకోసాగింది. డాక్టర్ చెప్పినట్టు ఇంట్లో కూడా తల్లి, కూతుళ్ళు బాబుకి స్పీచ్ థెరపీ మొదలుపెట్టారు. వాడు ఏ వస్తువు ముట్టుకున్నా ఒకటికి పదిసార్లు ఆ వస్తువు పేరు ఉచ్చరిస్తూ వాడి చేత పలికించడానికి ప్రయత్నిస్తున్నారు. వాడు అతి కష్టం మీద పెదాలు కడుపుతాడు కానీ ధ్వని బయటకు రావడం లేదు. అది చూసి కూతురు నిరాశ చెందుతుందేమో అని భయపడింది జ్యోతి. కానీ ఊహించని విధంగా హరిత ధైర్యంగా ఉండడం చూసి ఆవిడ నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది.

ఆరోజు హరిత బాబు చేయి పట్టుకుని గార్డెన్‌లో వాక్ చేస్తోంది. గేటు బయట ఇన్నోవా ఆగింది. ఆ శబ్దానికి జ్యోతి గబ,గబా లోపల నుంచి వచ్చింది. ఎస్.ఐ. వివేక్ గేటు తీసుకుని వస్తూ ఆవిడని చూసి నమస్కరించాడు. అప్పుడే టివి 9 కారు వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక యాంకర్, ఒక కెమెరామాన్ దిగి లోపలికి వచ్చారు. ఆవిడ ప్రశ్నార్థకంగా చూసింది వివేక్ వైపు.

“కంగారు పడకండమ్మా. డాక్టర్ గారి పర్మిషన్‌తో, హరిత గారి అంగీకారంతో మీడియాతో వచ్చాను. మీ అమ్మాయిలాంటి ఎందరో అమ్మాయిలు అలర్ట్‌గా ఉండడానికి తనకు కలిగిన అనుభవం వివరంగా చెప్తాను అని తనే మీడియాని ఆహ్వానించారు మీ అమ్మాయి” అన్నాడు ఎస్.ఐ.

అవునా అన్నట్టు హరిత వైపు చూసింది ఆవిడ.

హరిత అవును అన్నట్టు నవ్వి, ఆవిడ దగ్గరగా నడిచి “పదమ్మా లోపలికి వెళదాం” అంటూ ఇంట్లోకి దారి తీసింది. అందరూ ఆమెని అనుసరించారు.

అందరూ కూర్చున్నాక అడిగాడు వివేక్. “ఆరోజు ఏం జరిగింది? ఆ రాక్షసుడి చేతులకి మీరు ఎలా చిక్కారో వివరంగా చెప్తారా?”

కెమెరా యాంగిల్ చూసుకున్నాడు.. యాంకర్ మైక్ హరిత మొహం దగ్గర పెట్టింది.

“చెప్పండి మేడమ్! మీ కథ అందరికీ ఒక గుణపాఠం కావాలి” అంది యాంకర్.

జ్యోతి అయిష్టంగా చూసింది. కూతురు పక్కనే సోఫాలో కూర్చుని నెమ్మదిగా అంది “హరీ! నువ్వు ఇలా మామూలు హరితలా అవుతావని అనుకోలేదు.. ఆ అమ్మవారి దయవల్ల నా బిడ్డ హరిత పునర్జన్మ పొందింది. నువ్వు గతం తలచుకుని బాద పడేట్టు అయితే చెప్పద్దు..”

హరిత కంపిస్తున్న చేత్తో తల్లి చేతిని పట్టుకుంది.

“భయపడకుండా చెప్పేట్టు అయితే చెప్పు.. లేదంటే మర్చిపో.. కాకపోతే నాకు ఒక్కటే అనుమానం నేను పూజించే ఆ అమ్మవారు నీకు ఇలాంటి దుస్థితి ఎలా కలిగించింది అన్నదే నా వేదన తల్లి.” ఆవిడ స్వరంలో స్పష్టంగా వినిపిస్తున్న వేదన హరిత గుండెలని కోసినట్టు అనిపించింది.

వణుకుతున్న స్వరంతో అంది “చెప్తానమ్మా.. చెప్పి తీరాలి.. భయపడి జరిగింది దాచిపెట్టినా, పరువు పోతుందని మీరు మనసు చంపుకుని మౌనంగా ఉన్నా మనము నేరస్థులము అవుతాము. మీడియా ద్వారా ప్రతి ఆడపిల్లకు చేరేలాగా గొంతెత్తి చెప్తా..”

హరిత దుఖం ఆపుకుంటూ నెమ్మదిగా చెప్పసాగింది.

“నేను ఇంటర్‌లో చేరిన కొత్తల్లో ఒకరోజు మా నాన్నగారికి ఎమర్జెన్సీ కేసు వచ్చింది. నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసే టైమ్ లేక పోవడంతో ఆటోలో వెళ్లమన్నారు. కానీ ఆరోజు ఆటో వాళ్ళు స్ట్రైక్ చేయడం వల్ల నేను, నా క్లాస్‌మేట్ మీనాతో కలిసి బస్‌లో వెళ్ళాను. మీనా మా ఇంటి దగ్గరే ఉండేది. తను రోజూ బస్ లోనే వెళ్తుండేది. ఆరోజు ఇద్దరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళడం నాకు బాగుంది. అందుకే అమ్మా, నాన్నలను ఒప్పించి అప్పటి నుంచి తనతో కలిసి బస్‌లో కాలేజీకి వెళ్ళడం మొదలుపెట్టాను. మరి వాడు నన్ను ఎప్పుడు చూశాడో తెలియదు.. ఒకరోజు మేము బస్ దిగి కాలేజ్ వైపు వెళ్తూ ఉంటే మా వెనకాల వచ్చాడు. మీనా అది గమనించి భయపడింది. ‘వాడేవడో మనలను ఫాలో అవుతున్నాడు’ అని చెప్పింది. నేను వెనక్కి తిరిగి చూశాను. నల్లగా, లావుగా మొరటుగా ఉన్న వాడిని చూడగానే భయంతో ఒళ్ళు జలదరించింది. నేను తన వైపు చూడగానే వెకిలిగా నవ్వి గబగబా మా వైపు రాసాగాడు. మేమిద్దరం ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పరిగెత్తుకుంటూ కాలేజ్‌కి వెళ్ళాము. గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్‌కి చెప్పాము. వాడు గేటు దాకా వచ్చాడు. సెక్యూరిటీ వాడిని బెదిరించి పంపించేశాడు.

అప్పటి నుంచీ రోజూ మేము బస్ దిగే టైమ్‌కి బస్ స్టాండ్‌లో నిలబడి ఉండడం, మమ్మల్ని చూడగానే మా వెనకాల రావడం చేస్తుండేవాడు. సెక్యూరిటీ గార్డ్ అన్వర్ ఎంత బెదిరించినా వినకుండా కాలేజ్ లోపలికి రావడానికి ప్రయత్నించాడు. అన్వర్ వాడిని కొట్టాడు. వాడు ఆ దెబ్బతో రెచ్చిపోయి అన్వర్‌ని బాగా కొట్టాడు. మేము భయపడి ప్రిన్సిపాల్‌కి చెప్పడానికి వెళ్ళాము కానీ ఆరోజు ఆయన రాలేదు. అప్పుడే వాడు కాలేజ్ లొపలికి దౌర్జన్యంగా వచ్చి నా చేయి పట్టుకుని ‘నిన్ను ప్రేమిస్తున్నా, నన్ను పెళ్లి చేసుకోవాలి నాతో రా’ అంటూ బలవంతంగా లాక్కెళ్తుంటే నేను గట్టి,గట్టిగా అరిచాను. ఆ అరుపులకి కొంతమంది అమ్మాయిలు పరిగెత్తుకుని వచ్చి వాడిని చెప్పులతో కొట్టి బయటకు తోశారు. నేను బాగా ఏడ్చి ‘నాన్నకి చెప్తాను’ అన్నాను. మా ఫ్రెండ్స్ ‘అలా చెప్పకూడదు.. మీ నాన్నగారు పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. వాడు పగబడతాడు.. మేమందరం చెప్పు దెబ్బలు కొట్టాము కదా ఇంక నీ జోలికి రాడులే’ అన్నారు.

నిజమే అనుకున్నాను. కానీ అప్పటి నుంచి ఇంకా వాడి వేధింపులు ఎక్కువ అయాయి. ‘నన్ను ప్రేమిస్తావా లేదా’ అంటూ ఎక్కడ బడితే అక్కడకి వస్తూ నన్ను టార్చర్ పెట్టేవాడు. ‘సినిమాకి రా’ అంటూ సతాయిస్తుండేవాడు. నేను చాలాసార్లు తిట్టాను.. నా జోలికి రావద్దని పోలీస్ కంప్లయింట్ ఇస్తానని హెచ్చరించాను. కానీ వాడు వినలేదు. ‘నువ్వు నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతా’ అని ఒకసారి… ‘నీ మీద యాసిడ్ పోసి నిన్ను చంపేస్తా’ అని ఒకసారి అలా బెదిరిస్తూ ఉండేవాడు. ఎలా తెలుసుకున్నాడో మా ఇల్లు తెలుసుకున్నాడు. ఇంటి ఎదురుగా ఉన్న పార్క్‌లో రాత్రంతా ఉండిపోయేవాడు. నేను ఇంట్లో నుంచి బయటకు రాగానే నా వెనకాలే వచ్చేవాడు.

అమ్మా, నాన్నలకు చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను. ఒకరోజు అమ్మకి చెప్పాను. కానీ అమ్మ ఈజీగా తీసుకుని ‘నువ్వు పట్టించుకోకు జాగ్రత్తగా వెళ్ళు’ అంది.”

“అందుకే.. తల్లి,తండ్రులు మన మాటలు సీరియస్‌గా తీసుకోరు కాబట్టే ఇలాంటివి జరుగుతాయి” అంది యాంకర్ ఆవేశంగా.

జ్యోతి ఉలిక్కిపడింది. ఒక్కసారి ఆ రోజు హరిత మాటలు గుర్తు చేసుకుంటున్నట్టు పెదాలు కోరుక్కుంటూ ఉండిపోయింది.. ఆవిడకి గుర్తొచ్చింది. ఒకరోజు హరిత “అమ్మా ఎవరో ఒకడు నా వెంట పడుతున్నాడు నాకు భయంగా ఉంది” అంది. ఆరోజు తను ఆ విషయం తేలిగ్గా తీసుకుని “ఈవ్ టీజింగ్ మామూలే.. జాగ్రత్తగా వెళ్ళు” అని అన్నది. ఎంత పొరపాటు అయింది.. ఈవ్ టీజింగ్ అంటే ఇదా! ఆడపిల్లలు రోడ్డు మీద నడుస్తుంటే ఏడిపించే రోమియోలు గురించి మాత్రమే తెలుసు.. తను చదువుకునే రోజుల్లో కూడా అలాంటివి సర్వ సాధారణం.. కొన్ని సార్లు అలాంటి వాళ్ళు చెప్పుదెబ్బలు తినేవాళ్ళు.. కొందరు సారీ చెప్పి ఫ్రెండ్స్ అయిపోయే వాళ్ళు. కానీ, ఇలా ఇంత రాక్షసంగా.. ఆవిడ పెదవులు దుఖంతో అదురుతుంటే “ఎంత పని జరగింది!” అని మాత్రం అనగలిగింది.

హరిత తిరిగి చెప్పసాగింది. “రోజు, రోజుకి వాడి ఆగడాలు ఎక్కువ అయినాయి. మేము సరదాగా చాట్ భండార్‌కి వెళ్ళినా, కాఫీ తాగడానికి వెళ్ళినా నీడలా నా వెంటే రావడం .. ఛాన్స్ దొరికితే ‘ఐ లవ్ యు.. మనం పెళ్లి చేసుకుందాం వస్తావా! లేదా’ అని బెదిరంచడం ఎక్కువ అయింది. నేను ఏడుస్తుంటే ఒకరోజు షీలా, మీనా ఇంకా కొందరు ఫ్రెండ్స్ కలిసి వెళ్లి ప్రిన్సిపాల్‌కి చెప్దామంటూ తీసుకుని వెళ్లారు.

“ఎవరతను.. మన కాలేజేనా” అని అడిగారు ఆయన.

నాకు తెలియదు.. నేను ఎప్పుడు కాలేజ్‌లో చూసిన గుర్తు కూడా లేదు అందుకే “తెలియదు సర్” అన్నాను.

“అయితే నాకెందుకు చెప్తున్నావు.. మీ ఫాదర్‌కి చెప్పు. అయినా ఇంతమంది అమ్మాయిలు ఉండగా నీ వెంటే ఎందుకు పడుతున్నాడు నీ నుంచి ఎంకరేజ్‌మెంట్ లేకపోతే! తప్పంతా మీ అమ్మాయిలదే.. ఆ డ్రెస్‌లు ఏంటి ఒళ్ళు కనిపిస్తూ.. ఇలాంటి డ్రెస్‌లు వేసుకుంటే ఎందుకు వెంట పడరు!” అన్నారు కోపంగా.

నాకు చాలా బాధ వేసింది.. ఏడుపు కూడా వచ్చింది. “నేను అతని వైపు కూడా చూడలేదు సర్” అన్నాను.

“చూడకపోతే వాడు ఎవరో నిన్నే ఎందుకు ఫాలో అవుతున్నాడో నీకెలా తెలుస్తుంది. ముందు బట్టలు సరిగా వేసుకోడం నేర్చుకో” అన్నారు ఆయన.

నాకు ఏడుపు వచ్చింది. నేను నాకు ఇష్టమైన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా.. అమ్మ, నాన్న ఎప్పుడూ నా డ్రెస్‌ల విషయంలో నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు.. ఈయన ఎవరు నన్ను విమర్శించడానికి? అయినా లాంగ్ స్కర్ట్, జీన్స్ ప్యాంటు వేసుకోడం తప్పా! పాతకాలం అమ్మాయిల్లా పరికిణి, ఓణి వేసుకుని కాలేజ్‌కి వెళ్లాలా.. కోపం, నిస్సహాయత.. వెక్కి వెక్కి ఏడుస్తున్ననన్ను ఓదారుస్తూ “ఏడవకే మనమే బుద్ధి చెబుదాం ఆ వెధవకి.. ఇవాళ నేను, నీలు, అపర్ణ నీతో వస్తాం చూస్తా ఏం చేస్తాడో” అంది షీలా.

ఆ సాయంత్రం అన్నట్టుగానే నీలు, అపర్ణలతో సహా నాతో వచ్చింది షీలా.

నలుగురం బస్ స్టాప్ వైపు నడుస్తున్నాం.

కొన్ని అడుగులు కాలేజ్ సందు దాటి రోడ్ మీదకి వచ్చాం. మా కాలేజ్ కి సమీపంగా రెండు, మూడు చాట్ బండ్లు ఉంటాయి.. ఒక బండి దగ్గర నిలబడి పానీ పూరి తింటున్నాడు వాడు. మమ్మల్ని చూడగానే బౌల్ ట్రాష్ లో పడేసి వేగంగా మా వెనకాల రాసాగాడు.

అది గమనించి నేను భయంగా అన్నాను “అడుగో వాడే.”

షీలా వాడిని చూసి “ఎవరు? ఆ దున్నపోతా! ఇప్పుడు మన వెనక వస్తాడా…రానీ” అంది నిర్లక్ష్యంగా.

“పదండే త్వరగా నడుద్దాం” అన్నాను.

“ఎందుకే ఆ చెత్త వెధవకి భయపడతావు.. మనం అలా భయపడితే ఈ వెధవలు ఇంకా భయపెడతారు” అంది నీలు.

“అవును భయపడకు మేమున్నాం.. అంతగా అయితే షి టీం కి కాల్ చేద్దాం” అంది అపర్ణ.

వాళ్ళు ముగ్గురూ ధైర్యం చెప్తుంటే నాకు కూడా నెమ్మదిగా ధైర్యం వచ్చింది. నలుగురం కబుర్లు చెప్పుకుంటూ నడవసాగాం.

మధ్యలో అపర్ణ “నాక్కూడా పానీపూరి తినాలని ఉందే” అంది.

“ఇప్పుడా వొద్దొద్దు” అన్నాను కంగారుగా.

“అబ్బా.. ఇదొక వేస్ట్ కాండిడేట్.. వాడికెవడికో భయపడుతుందేంటి పదండి మనం కూడా తిందాం” అంటూ చాట్ బండి వైపు నడిచింది నీలు.

నేను భయం, భయంగానే వెళ్ళాను. వాడు మమ్మల్ని చూసి పళ్ళికిలించాడు. నేను మొహం మాడ్చుకున్నాను. షీలా పానీ పూరి చెప్పింది బండి వాడికి. మా నలుగురికి అతను డిప్పలు ఇచ్చి పూరి ఇస్తుంటే వాడు నా పక్కకి వచ్చి నన్ను ఆనుకుని నిలబడి “హాయ్, ఐ లవ్ యూ” అన్నాడు.

నేను అసహ్యించుకుంటూ దూరం జరిగాను. నీలు అది చూసి గభాల్న చెప్పు తీసి వాడిని ఆ చెంపా, ఈ చెంపా వాయించి “నీ మొహానికి ప్రేమ కావాలా.. మళ్ళీ ఈ చుట్టూ పక్కల కనిపిస్తే చంపేస్తాను” అంటూ వార్నింగ్ ఇచ్చింది.

వాడు నిప్పులు కక్కే కళ్ళతో నా వైపు చూసి “ఏయ్ నీ ఫ్రెండ్స్‌తో కొట్టిస్తావా. ఇప్పుడే చెప్తున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా.. నువ్వు నాకు రేపు ఇక్కడే ఇదే టైం కి ఐ లవ్ యు చెప్పక పొతే నీ మొహం మీద యాసిడ్ పోస్తా.. ఎవరు అడ్డం వస్తారో చూస్తా” అంటూ పెద్ద, పెద్ద అంగలు వేస్తూ వెళ్ళిపోయాడు.

అక్కడ ఉన్న వాళ్ళంతా మమ్మల్ని “ఎందుకమ్మా ఆడపిల్లలు మీరు వాడితో గొడవ పడ్డారు.. అసలు వాడి మాటలు పట్టించుకోకూడదు..మీ దారిని మీరు వెళ్ళిపోతే పోయేది కదా” అన్నారు.

“ఏంటండి ఆడపిల్లలు, ఆడపిల్లలు అంటూ మమ్మల్ని తక్కువ చేస్తారు. ఆడపిల్లలం అయితే మమ్మల్ని ఎవరేమేన్నా భరించాలా..చూపిస్తాం మా తడాకా” అని తీవ్ర స్థాయిలో అరిచింది అపర్ణ.

మమ్మల్ని అందరూ వింతగా చూడసాగారు. నాకు చాలా అవమానకరంగా అనిపించింది.

మేము అక్కడినుంచి తిరిగి మెయిన్ రోడ్ వైపు నడుస్తుంటే షీలా కసిగా అంది.

“వాడి బొంద.. దరిద్రపు మొహంగాడు.. వాడి బతుక్కి ప్రేమా! పైగా నిన్ను.. ఎంత ధైర్యం! ప్రేమించకుంటే యాసిడ్ పోస్తాడా. ఇప్పుడు పోయమను”..

“ఇంక నీ జోలికి రాడే … పౌరుషం వచ్చి ఏదో వాగాడు కానీ ఇంక ఇటువైపు వచ్చే ధైర్యం ఉందా వాడికి” అంది అపర్ణ.

“నువ్వేం భయపడకు హరీ! నీ దగ్గర షీ టీం నెంబర్ ఉందా” అడిగింది నీలు.

“లేదు” అన్నాను. తన మొబైల్ లో ఉన్న నెంబర్ నాకు ఇచ్చి “నీకు ఏ మాత్రం భయం వేసినా వీళ్ళకు కాల్ చేయి క్షణాల్లో వస్తారు.. ఇంక వాడికి ఫ్యూచర్ ఉండదు” అంది.

నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఇంత ధైర్య,సాహసాలు ఉన్న ఫ్రెండ్స్ నాకు ఉన్నారన్న నిశ్చింత…ఇంక నాకెలాంటి ఆపద రాదన్న నమ్మకంతో నిట్టూర్చాను.

నెల రోజుల నుంచి శనిలాగా పట్టుకున్నాడు.. శని వెధవ వదిలాడు ప్రేమిస్తున్నా, ప్రేమిస్తున్నా అంటూ వంద తప్పులతో ప్రేమలేఖ ఒకటి వాడి మొహానికి.. వాడి బొంద ఒక మొబైల్ కూడా చేతిలో లేదు… అనుకున్నాను.

వాడి పిరికితనం తల్చుకుని అందరం పగలబడి నవ్వుకున్నాం. ఈలోగా బస్ స్టాప్ రావడంతో ఎవరి బస్ వాళ్ళు ఎక్కి వెళ్ళిపోయారు. నేను కూడా ఇంటికి వచ్చేశాను.

ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను.. కానీ అదే నా జీవితంలో ఆఖరి రాత్రి అవుతుందని అనుకోలేదు.

సరిగ్గా నాలుగు రోజుల తరవాత ఒక రోజు కాలేజ్ అయాక అందరం రోడ్డు మీదకి వచ్చాము. ఆరోజు మీనా కాలేజ్ కి రాలేదు. నేను ఆటో పిలిచాను. ఆటో ఎక్కుతుండగా సడన్ గా నా పక్కన ఒక డొక్కు బండి పెద్దగా శబ్దం చేస్తూ ఆగింది. నేను రెప్ప వాల్చేలోగా వాడు నా చేయి పట్టి లాగి బండి మీద కూర్చోబెట్టడం, నేను కేకలు పెట్టేలోగా ఆ బండి వేగంగా రోడ్ మీదకి రావడం జరిగింది. నేను ఎంత అరిచినా ఎవరూ పట్టించుకోలేదు.. వాడు బండి ఆపలేదు.

ఎక్కడెక్కడో తిప్పి, తిప్పి సిటీకి దూరంగా పిచ్చి, పిచ్చి చెట్లు, పొదలు వెనక మొత్తం పడిపోయి కేవలం నాలుగు మొండి గోడలు మాత్రం మిగిలిన ప్రదేశంలో బండి ఆపాడు. మా బండి వెనకే ఆగిన మరో బండి మీద ఉన్న మరో ఇద్దరి సాయంతో నన్ను ఆ మొండి గోడల మధ్యకు తీసుకువెళ్ళాడు. అది ఒక పాత కాలం ఆంజనేయస్వామి గుడి.. ఎవరూ లేరు.. అక్కడ పసుపు తాడో, పలుపు తాడో కూడా తెలియకుండా నా మెడలో మూడు ముళ్ళు వేసి ‘ఇప్పుడు నీ బతుకు నా చేతిలో ఉంది’ అంటూ నా కళ్ళకు గంతలు కట్టాడు.

హరిత చెప్పడం ఆపింది. నీరసంగా తల పక్కకి తిప్పి కన్నీళ్ళు తుడుచుకుంది.

“ఆ తరవాత ఏం జరిగింది మేడమ్?” ఆత్రంగా అడిగింది యాంకర్.

వెక్కిళ్లు ఆపుకుంటూ ఉద్వేగంతో జ్యోతి ఆమె చేయి పట్టుకుని “విశ్రాంతి తీసుకో తల్లీ తరవాత చెప్పచ్చు” అంది.

హరిత నీరసంగా అంది “లేదమ్మా చెప్పాలి. ఇది చెప్పడానికి నాలుగేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాను..”

ఎస్.ఐ.కి రక్తం మరుగుతోంది. తన ఐదేళ్ళ సర్వీసులో ఇలాంటి కేసు ఎప్పుడూ వినలేదు, కనలేదు.. చాలా చిత్రమైన కేసు. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎవరికీ తెలియకుండా, నరమానవుడు కనిపించని చోట నాలుగేళ్ళుగా దాచి కాపురం చేస్తూ, ఆమెని తల్లిని చేసి షిట్.. తల విదిలించాడు. ఇంతవరకూ ఒక నీచుడు ఇలా చేసాడన్న సంగతి ఎవరికీ తెలియదు.. ఎవరి కంటా పడకుండా దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న క్రిమినల్.. అతన్ని తలచుకుంటేనే ఆవేశంతో అతని దవడలు అదురుతున్నాయి.

వృత్తినే దైవంగా నమ్ముతూ ప్రతి కేసుని సవాల్‌గా తీసుకునే తత్త్వం అతనిది. యువకుడు, ఉత్సాహవంతుడు.. అంతో, ఇంతో ఆదర్శభావాలు ఉన్నవాడు. తన దగ్గరకు వచ్చిన ప్రతి కేసులోనూ అతి తక్కువ సమయంలో దోషులను పట్టుకుని శిక్ష వేయించిన సాహసి. అలాంటిది ఇంత పెద్ద క్రిమినల్ గురించి తెలిసాక ఎప్పుడెప్పుడు వాడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలా అని ఆరాటంగా ఉంది. ఆమె చెప్పబోయే మిగతా కధ వినడానికి ఉద్విగ్నంగా చూస్తూ కూర్చున్నాడు.

హరిత నెమ్మదిగా కళ్ళు తెరిచి శూన్యంలోకి చూస్తూ, జరిగిన సంఘటనలు కళ్ళ ముందు నిల్పుకోడానికి ప్రయత్నించసాగింది.

ఆ రోజు తన జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు.. రాబోయే దౌర్భాగ్యపు పరిస్థితికి ద్వారాలు తెరిచిన రోజు..

ఆమె రెప్పల మీద నీడల్లా కొన్ని అస్పష్టమైన దృశ్యాలు కదలసాగాయి.

ఎంత దురదృష్టకరమైన రోజు.. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి శత్రువులకు కూడా రావద్దు..

“మానవమృగం లాంటి నీచుడు, పట్టపగలు నడి రోడ్డు మీద ఆనందంగా నడిచి వెళ్తున్న నన్ను లాగి బలవంతంగా బండి మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్తుంటే ఒక్కరు కూడా అడ్డు పడలేదు.. నన్ను రక్షించలేదు. నేను విల,విలా తన్నుకుంటున్నా జాలి, దయ చూపించని రెండు కాళ్ళ జంతువు అత్యంత వేగంగా బండి నడిపిస్తూ ఎటో తీసుకుని వెళ్లి..నా మెడలో ఉరితాడు వేసి, బలిపశువులా కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్ళి..అక్కడ..అక్కడ..” అకస్మాత్తుగా వెక్కి, వెక్కి ఏడుస్తూ అంది “ఈ సమాజంలో ఆడపిల్లనే అన్నిటికీ నేరస్థురాలిని చేస్తారు. భర్త హింసించినా భరించాలి అని ఆడపిల్లకే చెబుతారు. గూండాలు, రౌడీలు దాడి చేసినా నువ్వే జాగ్రత్తగా ఉండాలి, నీ వేషధారణ, నీ ప్రవర్తనా సరిగా ఉండాలి ఆడపిల్లనే హెచ్చరిస్తారు.. ఆఖరికి అత్యాచారం జరిగినా, హత్య జరిగినా నీ నిర్లక్ష్యం వల్లనే జరిగింది అంటారు. ఇలాంటి సమాజంలో ఆడపిల్లలకి రక్షణ ఎలా ఉంటుంది ఎస్ ఐ గారూ!” అంటూ ఒక్కసారిగా బరస్ట్ అయిన హరితని గబుక్కున పట్టుకుని కెమెరాకి రెండు చేతులు జోడించి అంది జ్యోతి.. “చాలు ఇంక మా అమ్మాయి చెప్పింది, మీరు తెలుసుకున్నది చాలు.. దయచేసి ఆపండి”.

హరిత కళ్ళు తుడుచుకుని అంది “క్షణం,క్షణం నీడల్లా వెంటాడుతున్న భయంకరమైన దృశ్యాలు భూతాల్లా వికృతంగా నాట్యం చేస్తూ నన్ను వెంటాడుతున్నాయి. నాలుగేళ్ళుగా అనుభవించిన పరమ నికృష్టమైన జీవితం లోని ప్రతి సంఘటనా ఒక పీడకలే. అతను దగ్గర ఉన్నంత సేపు..భయం, అసహ్యం, అతను వెళ్ళిపోగానే ఎక్కడినుంచి అయినా, ఎలా అయినా పారిపోవాలని దారులు వెతకడం.. కానీ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా నన్ను అష్టదిగ్భంధనం చేసాడు. గాలి, వెలుతురు చొరని ఆ గదిలో కాదు, కాదు ఆ చెరసాలలో బంధించి పాశవికంగా అనుభవించాడు.. ఆ రాక్షసత్వానికి ప్రేమ అని పేరు పెట్టుకున్నాడు. ప్రేమంటే తెలుసా! రాక్షసులు కూడా ప్రేమిస్తారా! రావణాసురుడు సీతని ప్రేమించాడా! కీచకుడు ద్రౌపదిని ప్రేమించాడా! అసలు ప్రేమంటే ఏంటి?”

ఆవేశంగా అడుగుతున్న హరితని ఊరడిస్తూ అన్నాడు ఎస్ ఐ. “చాలమ్మా.. ఇంక చాలు ఈ ఇన్ఫర్మేషన్.. వాడి సంగతి నేను చూసుకుంటా.. కచ్చితంగా ఇంకొకడు ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడడానికి కూడా వణికిపోయే శిక్ష వేయిస్తా..” అని యాంకర్‌కి సైగ చేశాడు ఆపమన్నట్టు.

అప్పుడే సూర్యనారాయణ కారు వచ్చి ఆగింది. ఆయన లొపలికి వచ్చి అక్కడి వాతావరణం చూసి అంతా గ్రహించిన వాడిలా అన్నాడు. “జ్యోతీ! వాళ్ళకి కాఫీలు ఇవ్వు.”

జ్యోతి కళ్ళు చెంగుతో తుడుచుకుంటూ లేచి వంట గది వైపు నడిచింది.

“బాబుని స్పెషలిస్ట్‌కి చూపించారా డాక్టర్” అడిగాడు వివేక్.

“ఎస్. స్పీచ్ థెరపీ మొదలుపెడతా అన్నారు.. తప్పకుండా మాటలు వస్తాయి.. త్వరలో వాడిని స్కూల్‌కి పంపిస్తాను” అన్నాడు ఆయన.

ఆ మాటలతో హరిత కళ్ళల్లో మెరిసిన మెరుపు అందరి దృష్టినీ ఆకట్టుకుంది.

(సశేషం)

Exit mobile version