నాన్న లేని కొడుకు-2

2
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సంచిక పాఠకుల కోసం రచించిన ‘నాన్న లేని కొడుకు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]రో[/dropcap]జూ లాగే ఆ రోజు కూడా కసితో, ఉద్రేకంతో, ఆవేశంతో ఆమె అతడి కాలర్ పట్టుకుని ఊపేస్తూ తనని బయటకు పంపమని అరుస్తుంటే, అతను తోసిన తోపుకి వెళ్లి ఆ ఇటుకల కుప్ప మీద పడినప్పుడు కనిపించింది.. తగిలిన దెబ్బకి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. అయితే వెతుకుతున్న తీగ కాలికి తగిలినందుకు ఆ మిరుమిట్లు గొలిపే కాంతిలో ఆ చీకటి గది దేదీప్యమానంగా వెలిగింది.

ఆమె గుండెల్లో కొన్ని వేల ఆశా దీపాలు వెలిగాయి.

అంతే.. తలకి తగిలిన దెబ్బ కూడా పట్టించుకోలేదు.

“నువ్వు చచ్చినా ఇక్కడే చావాలి.. నిన్ను నేనే ఆఖరిసారి ముట్టుకోవాలి.. ఇక్కడినుంచి వెళ్ళాలన్న ఆలోచన కూడా నీకు ఇంకోసారి వచ్చిందంటే చంపేస్తా” ఎర్రటి కళ్ళతో క్రూరంగా చూస్తూ బయటికి వెళ్ళిపోయి తాళం వేసిన అతని వైపు విజయ గర్వంతో చూసి ఆ సుత్తి తీసుకుని ముద్దు పెట్టుకుంది. అతను వెళ్ళిపోగానే రెండు చేతులూ చాచి గుండ్రంగా తిరిగింది.. ఎగిరి గంతులేసింది. బాబుని ఎత్తుకుని గాల్లో ఎగరేసి ముద్దుల వర్షం కురిపించింది.

“మనం వెళ్ళిపోతాం.. త్వరలో వెళ్ళిపోతాం.. నిజం నాన్నా” అంటూ ఉరకలేసే ఉత్సాహంతో వాడికి అర్థం కాదని తెలిసినా కుదిపి, కుదిపి చెప్పింది.

తనవైపే కుతూహలంగా చూస్తున్న వాడి వైపు చూస్తూ “ఎలా వెళ్తాం అని కదూ నీ అనుమానం..” నవ్వుతూ తల ఎత్తి చూసింది.

అవును ఎలా వెళ్తాం! ఎక్కడో పైన చాలా చిన్న వెంటిలేటర్ తప్ప ఒక కిటికీ కాని, మరో ద్వారం కానీ లేని ఆ గదిలో నుంచి ఎలా వెళ్ళడం! గోడ విరగ గొట్టాలా.. తలుపు విరగ గొట్టాలా.. అసాధ్యం.. మరి ఎలా..

కళ్ళు చికిలించి గదంతా తిరిగి చూసింది. బాత్రూం వైపు వెళ్లి చూసింది. ఎన్నడూ పరిశీలించని ఆ గది అణువణువూ పరిశీలించింది.. సగం మట్టి, సగం సిమెంటు పైపూతగా పూసి ఇటుకలతో కట్టిన గోడలు, పైన కప్పు పటిష్టంగానే కనిపిస్తోంది. స్లాబ్ కాదు.. అలాగని రేకులూ కాదు.., పెంకులు వేసి, ఒక గొనె పట్టా కప్పినట్టు…. అది కూడా అడ్డ దిడ్డంగా, ఆకారం లేకుండా.

ఒకే ఒక గది.. ఆ గదికి ఆనుకుని చిన్న బాత్ రూమ్ లావెటరి.. ఆ గదిలోనే ఒక మూల గట్టు.. ఆ గట్టునానుకుని ఒక చిన్న వాష్ బేసిన్. అక్కడే మొహం కడుక్కున్నా, చేతులు కడుక్కున్నా, గిన్నెలు కడుక్కున్నా.. ఆ గట్టు మీద ఒక సింగల్ బర్నర్ స్టవ్, కొన్ని గిన్నెలు, ఒక ప్లాస్టిక్ బిందె, బాత్ రూమ్లో ఓకే ప్లాస్టిక్ బకెట్, ఒక మగ్.. ఒక మంచం, దాని మీద పరుపు, రెండు తలగడాలు, రెండు దుప్పట్లు. బాత్ రూమ్‌లో నుంచి పారిపోయే అవకాశం కూడా లేదు.. ఒక కిటికీ కాని, వెంటిలేటర్ కానీ లేదు.

గోడకి మరో మూల ఒక చెక్కతో అటక.. ఆ అటక చూస్తే కడుపులో దేవినట్టు అవుతుంది.

బాబు పుట్టాక వాడిని పడుకోబెట్టడం కోసం ఆ నీచుడు తయారు చేసిన అటక. దానికి ఒక పల్చని చెక్క తలుపు. వాడు లోపలికి రాగానే పసివాడిని ఆ అటక మీద పడుకో బెట్టి తలుపు మూస్తాడు. వాడు ఏం చేస్తాడో, ఎక్కడ తిరుగుతాడో తెలియదు.. వాడికి అసలు తల్లి, తండ్రి తోబుట్టువులు ఉన్నారో, గాలికి తిరిగే మనిషో తెలియదు. వాడు చేసే పనులు చూస్తుంటే లేబర్ పని చేసుకుని బతికే వాడేమో అనిపిస్తుంది.

ఆ అటక పెడుతున్న రోజు కన్నీళ్ళతో బతిమాలింది. గాలి, వెలుతురు లేక పసివాడు అల్లాడి పోతాడని వాడిని అలా పడుకోబెట్టద్దని ఎంతో వేడుకుంది.. కాని వాడి పశువాంచ తీర్చుకోడానికి బాబు అడ్డం అయాడు. తల్లి పొత్తిళ్లనుంచి పసివాడిని నిర్దయగా అందులో పడేశాడు. అప్పటి నుంచి వాడి పడక అక్కడే.

అది బాబుకి ప్రత్యక్ష నరకం చూపిస్తుంది. గాలి ఉండదు.. ఊపిరాడదు.. వెలుగు రాదు.. భయంతో బిక్కచచ్చి హృదయవిదారకంగా ఏడుస్తున్నా దయాదాక్షిణ్యాలు చూపించని రాక్షసుడు.

ఆమెకి కన్నీళ్లు ధారలు కట్టాయి. దీనాతిదీనమైన తన జీవితంలో గడిచిపోయిన రోజులన్నీ గజిబిజిగా, ముళ్ళ కంపలతో నిండి, అడుగడుగునా అనేక రకాల క్రూరమృగాలు దారిపొడుగునా తనని కాటేస్తూ, కబళింపబోతుంటే తప్పించుకోడానికి ప్రయత్నిస్తూ ఒళ్ళంతా గాయాలతో చావలేక బతుకుతున్న దుర్భరజీవితం.. దేవుడా! నాకు, నా చిట్టి తండ్రికి ఈ జీవితాన్నుంచి విముక్తి ప్రసాదించవూ!

నీ ప్రయత్నం నువ్వు చేయి, నేను చేయగల సాయం నేను చేస్తాను అని ఎవరో అదృశ్యంగా ఉండి చెబుతున్నట్టు ఆమె చేసిన కంతలో నుంచి ప్రవహించిన ఒక గాలి కెరటం శబ్దం చేసింది. ఆమె మనసు ఆనందంతో నృత్యం చేసింది. ఎస్ … చేస్తాను. నా చేతులు విరిగిపోయినా పర్లేదు.. ఇక్కడినుంచి బయటపడాలి.. ఈ పసివాడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అయినా కష్టపడాలి. ఆత్మ విశ్వాసంతో ఆపాదమస్తకం కంపించింది.

దేవతలు తన మొర విని తన పాదాల దగ్గర విసిరేసిన సుత్తి.. అది ఉపయోగించి కొంచెం సందు చేసుకుంటే చాలు.. కానీ ఎలా? ఎక్కడ చేయాలి? ఎక్కడ చేసినా అది ఒక గంటలో, ఒక రోజులో అయేది కాదు.. కొంచెం, కొంచెంగా చేయాలి.. అలా చేసిన ఆ సందు వాడికి కనిపించకూడదు.

ఏ అటక బాబుకి నరకం చూపిస్తోందో దాని పైన చాలా చిన్న వెంటిలేటర్ ఉంది. నిజానికి అది వెంటిలేటర్ కాదు.. నిర్మాణం సరిగా లేక సగం విరిగిన ఇటుక నుంచి కనిపిస్తున్న చిన్న రంధ్రం. ఆ రంద్రాన్నే మరింత పెద్దగా చేస్తే అందులోనుంచి పారిపోవచ్చు. పెద్ద ఎత్తు లేదు.. స్టూల్ ఎక్కి అటక మీద కూర్చుని రోజూ కొంత విరగగొట్టచ్చు. రోజూ వాడు వెళ్ళిపోగానే మొదలు పెడితే వాడు తిరిగి వచ్చేలోగా కొంతన్నా అవుతుంది. అలా నాలుగు రోజులు చేస్తే తప్పకుండా కొంత భాగం గోడ విరగ గొట్టచ్చు. కానీ ఆ నాలుగు రోజులు వాడు ఆ కన్నం చూడకుండా ఉండాలి. ఎలా? ఏం చేయాలి?

చేస్తా… చేస్తా… చెల్లాచెదురుగా పడి ఉన్న ఇటుకల మీద ఆమె దృష్టి పడింది. వాటిని ఒక దగ్గరగా సర్దింది. ఇవే తనని, తన కొడుకుని రక్షించే ఆయుధాలు. ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం ఆ సుత్తిని ఆ ఇటుకల కింద అపురూపంగా దాచి పెట్టింది.. అప్పటి నుంచీ ఆ సుత్తి ఉపయోగించే సమయం కోసం దిన,దినగండంలా ఎదురుచూసింది.

సరిగ్గా నాలుగురోజుల తరవాత వాడు, ఆ పశువు వెళ్ళిపోతూ అన్న మాట ఆమె మీద అమృతపు జల్లు కురిసినంత హాయినిచ్చింది. “రేపు నేను రాను.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలుకో.. ఏదన్నా పిచ్చి ప్లాన్ వేసావని తెలిసిందంటే నిన్ను, నీ కొడుకునీ కూడా చంపేస్తా…” తర్జని చూపించి బెదిరించాడు.

ఆమె మాట్లాడలేదు.. ప్రతి రోజూ రాత్రి చీకటి పడ్డాక వచ్చి, తాగి, నానా భీభత్సం చేసి, పశువులా మీదపడి అనుభవించి, గుర్రు పెడుతూ పడుకుని, తెల్లవారి పదిన్నరకి తర్జనితో బెదిరిస్తూ “పారిపోడానికి ప్రయత్నించావా ప్రాణాలతో ఉండవు” అని చెప్పి వెళ్ళిపోడం వాడి నిత్య కృత్యం. ఆ రోజూ అలాగే చెప్పి వెళ్ళిపోయాడు. వీడి పీడా శాశ్వతంగా తొలగించు తండ్రీ.. మరోసారి దేవుడిని తలచుకుని శూన్యంలో దణ్ణం పెట్టింది.

నిజానికి ఏ ఆడపిల్లకు రాకూడని కష్టం వచ్చి జీవితం క్షణ,క్షణం నరకప్రాయంగా ఉన్న ఈ పరిస్థితిలో దేవుడు అనేవాడు ఉన్నాడా.. ఉంటే ఇలా ఎందుకు చేసాడు అని ఆమె విలపించవలసిన తరుణం.. కానీ ప్రతి క్షణం, నన్ను రక్షించు, రక్షించు అని ఈ ఐదేళ్ళ నుంచీ అవిరామంగా వేడుకుంటూనే ఉంది. అదేనేమో మనిషి బలహీనత.. ఆమె తండ్రి నాస్తికుడు కాదు.. తల్లి అంతకన్నా కాదు.. రక్తంలో లేని భావజాలం ఆమెకి ఎలా వస్తుంది! ఎంత కష్టం వచ్చినా ఆ కష్టం నుంచి కాపాడవలసిన వాడు దేవుడే అనే విశ్వాసం.. అదే విశ్వాసం ఆమెని కర్తవ్యోన్ముఖురాలిని చేసింది.

ఆమె బుర్ర చురుగ్గా పనిచేయసాగింది.. రాను అని చెప్పి వెళ్ళినా బుద్ధి మారి వాడు తిరిగి వస్తాడేమో అని రెండు గంటల సేపు మౌనంగా ఎదురుచూసింది. వాడు రాలేదు. రేపు రాడు, ఇవాళ పని ప్రారంభిస్తే ఎల్లుండి ఉదయానికల్లా అయిపోవచ్చు.

చక,చకా ఆ ఇటుకలన్నీ అటక మీద చేర్చింది. తను కంత చేసేటప్పుడు వాడు వస్తే ఈ ఇటుకలు అడ్డుగా పెట్టి మేనేజ్ చేయచ్చు. నెమ్మదిగా సుత్తి చేతిలోకి తీసుకుంది.

దృఢమైన సంకల్పం, ఎలాగైనా సాధించాలన్న కసి, పట్టుదలతో గట్టిగా దెబ్బేసింది. చేయి మంట పుట్టింది. పట్టించుకోలేదు. మళ్ళీ రెండు దెబ్బలు వేసింది. ఆ ధ్వనికి ఎవరన్నా వస్తున్నారా! అని తలుపు సందులో నుంచి తొంగి చూసింది. ఎవరూ కనిపించలేదు… అలికిడి కూడా వినిపించలేదు.

అంతే.. ఆమెలో ఉత్సాహం ఉరకలేసింది. ఆ ఉత్సాహం ముందు, చేతులకి తగులుతున్న దెబ్బలు, అవుతున్న గాయాలు బాధపెట్టలేదు. అలా దెబ్బ మీద దెబ్బ వేస్తూనే ఉంది. వాడు వచ్చేలోగా మనిషి దూరగల కంత ఏర్పడితే చాలు… తను విజయం సాధించినట్టే. తనకి విముక్తి లభించినట్టే.

దాని ఫలితమే ఓ మొగ్గగా అంకురించిన ఆశ లాంటి ఆ కంత. ఆమెలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ రెండు మట్టితో పాటు రెండు ఇటుకలు కూడా విరిగి పడ్డాయి. వాడే కట్టినట్టున్నాడు ఈ గది. మట్టి, ఇటుకలు కలిపి.. కొంచెం కష్టపడితే చాలు.. సులభంగానే విరిగిపోతుంది. ఇంత కాలం ఈ ఆలోచన ఎందుకు రాలేదు నాకు అనుకుంది. ఆ రోజుకి చాలు.. ఇంకా ఒక రోజు ఉంది…వాడు రేపు కూడా రాడు. ఎట్టి పరిస్థితుల్లో రేపు పూర్తి చేయాలి.

ఈ రోజు ఇంక శక్తి లేదు. ఆ కంత కనిపించకుండా విరిగిపడిన ఇటుకలనే నిలువుగా అడ్డు పెట్టి వెళ్లి చేతులు కడుక్కుంది. మంట.. మంట… చేతులకి కొబ్బరి నూనె రాసుకుంది. మానసికంగా, శారీరకంగా కూడా అలసిపోయింది. కళ్ళు తిరుగుతున్నాయి. అటక మీద గొంతుకు కూర్చుని, కూర్చుని కాళ్ళు నెప్పి పుడుతున్నాయి. ఓపిక చేసుకుని బాబుకి అన్నం పెట్టి, తనూ తిన్నాననిపించి, వాడిని పక్కలో వేసుకుని పడుకుంది. ఇంక తనకి త్వరలో ఆ నరకం నుంచి విముక్తి లభిస్తుందన్న నిశ్చింతతో కాబోలు పడుకోగానే నిద్ర పట్టేసింది.

ఆమెకి మెలకువ వచ్చేసరికి తెల్లవారుతోంది. వెంటిలేటర్ నుంచి ఒక గీతలా వెలుగు పడింది. ఆమె గబుక్కున లేచింది. బ్రష్ చేసుకుని, చక,చకా పనులు చేసుకుని కొంచెం అన్నం మాత్రం వండింది. పెరుగు ఉంది.. ఎలాగా బాబు పెరుగన్నం తప్ప తినడు.. ఇప్పుడు వంట చేసుకుంటూ టైం వృథా చేసేంత సమయం లేదు. నెమ్మదిగా అటక ఎక్కింది. సుత్తి దెబ్బలు టంగ్ మని శబ్దం చేస్తున్నాయి. అలా కొడుతూనే ఉంది. కొంతసేపటికి బాబు లేచి, ఏడుపు మొదలు పెట్టడంతో పని ఆపి కిందకి దిగి వచ్చి, బాబుకి మొహం కడిగించి పాల పౌడర్ కలిపి పాలు తాగించింది. తను కూడా అదే పౌడర్‌తో కొంచెం బ్రూ కలుపుకుని తాగింది. తిండికి లోటు లేకుండా అన్నీ తెచ్చి పడేస్తాడు. గట్టు నిండా బిస్కెట్ పాకెట్స్ … అరటి పండ్లు.. బాబుకి ఒక అరటి పండు తినిపించింది. వాడు సాయంకాలం కానీ రాడు… ఈ లోగా ఇంకా కాస్త కష్ట పడితే, రేపటికి పూర్తి అవచ్చు. మళ్ళీ అటక ఎక్కింది. అలా కొడుతూనే ఉంది. చుట్టూ పక్కల ఎవరూ లేరేమో.. సుత్తి దెబ్బలకి ఎవరూ రాలేదు.

తిరిగి కాసేపు పని ఆపి బాబుకి అన్నం పెట్టి తనూ తినేసింది. ఇంకా నాలుగైదు గంటలు గడిస్తే చీకటి పడిపోతుంది. ఈ లోగానే పని కావాలి.. మళ్ళీ తెల్లవారితే వాడు వస్తాడు.. రాగానే ముందు తిండి కావాలి.. చికెన్ తెస్తాడు.. మసాలా తెస్తాడు.. వెంటనే వండమంటాడు, మందు బాటిల్స్ ముందు పెట్టుకుంటాడు.

బాబు కనిపిస్తే “వీడు ఇంకా పడుకోలేదా.. కొంచెం మందు పోస్తే సరే మత్తుగా పడి ఉంటాడు” అని వాడిని మొరటుగా దగ్గరకు లాక్కుంటాడు. ఆ మొరటుదనానికి పసివాడు కెవ్వుమంటాడు.

“ఏడిస్తే గొంతు నోక్కేస్తా.. ” కఠినంగా అంటాడు.

బాబుని దగ్గరకు తీసుకుని “ రాక్షసుడా.. వీడు నీ కొడుకురా, వీడి మీద కూడా నీకు దయ, జాలి ఉండవా.. నువ్వసలు మనిషివేనా” కసిగా తిడుతుంది.

నిర్లక్షంగా నవ్వుతాడు. “నా కోసం కాదు.. నీ కోసం… వీడి కోసం నువ్వు ఇక్కడ కుక్కిన పేనులా పడుంటావని వీడికి జన్మనిచ్చాను. నువ్వు పారిపోయే ప్రయత్నం చేసావంటే ఇదిగో ఇలా వీడి గొంతు నులిమేస్తా..” గబుక్కున బాబుని లాగి వాడి గొంతు పట్టుకుంటాడు.

ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

విహ్వలంగా బాబు వైపు చూసింది. నోట్లో వేలేసుకుని తనవైపే చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. వీడికి మూడేళ్ళు.. ఇంతవరకు మాటలు రాలేదు.. ఆకలేసినా, దాహం వేసినా చెప్పడం తెలియదు.. ఏడుపు వస్తే కళ్ళు వర్షిస్తాయి తప్ప గొంతు పెగిలి శబ్దం చేయలేడు.. భయం.. భయం.. అమ్మ ఒడి తప్ప మరో స్పర్శ తెలియదు.. పేరుకు తండ్రి.. ఆ పశువుకి కామం తప్ప ప్రేమ తెలియదు.. అందుకే ఏనాడు పసివాడిని ప్రేమగా చేరదీయడు.. వాడికి బట్టలు కావాలంటే తెస్తాడు.. బొమ్మలు కావాలంటే తెస్తాడు.. పండు, పాలు తను చెప్పినవి తెచ్చి పడేస్తాడు.. కానీ వాడిని, తననీ కూడా ఆ గదిలోనుంచి బయటకు వెళ్ళనీయడు. తాళం తీసుకుని రావడం, తాళం వేసుకుని వెళ్ళడం.. ఆ తాళం ఎలా ఉంటుందో తెలియదు..

బాబుని దగ్గరకు లాక్కుంది. “భగవంతుడా నా ప్రయత్నం విజయవంతం కావాలి.. ఈ పసివాడికి ఏ ప్రమాదం జరక్కుండానే మేము ఇద్దరం ఇక్కడినుంచి వెళ్లిపోవాలి.. ప్లీజ్ సాయం చేయి తండ్రి.”

మరోసారి, మరోసారి అలా భగవంతుడిని రెండు చేతులెత్తి జాలిగా వేడుకుంటూనే ఉంది. బాబుని భుజం మీద వేసుకుని నిద్రపుచ్చి మంచం మీద పడుకోబెట్టి తిరిగి అటక ఎక్కింది. ఆమె కృషి ఫలించింది. పెద్ద కంత ఏర్పడింది. ఇంకా కొంచెం పగలకొడితే తను, బాబు కూడా హాయిగా వెళ్లిపోవచ్చు.

అటక మీద సిద్ధంగా పెట్టిన ఇటుకలతో తాత్కాలికంగా ఆ కంత మూసేసింది. తనవి నాలుగు చీరలు మడతలు పెట్టి ఆ ఇటుకలు కనిపించకుండా అడ్డం పెట్టింది. బాబుని ఎత్తుకుని అక్కడ పడుకోబెట్టింది. మట్టంతా ఎత్తేసి శుభ్రం చేసింది. ఎలాగా ఆ పశువుకి శుచీ, శుభ్రత లేవు. ఈ మట్టి ఎక్కడ నుంచి వచ్చింది అని గమనించే స్పృహ కూడా ఉండదు. తాగుబోతు వెధవ .. తిట్టుకుంటూ చేతులకి కొబ్బరి నూనె రాసుకుంది. రేపోక్కరోజు వాడు రాకపోతే చాలు.. వెళ్లిపోవచ్చు.. అమ్మ, నాన్న.. ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. ఒక్కతే కూతురు అని అపురూపంగా పెంచారు.. తను కనిపించక ఎంత మనోవేదన అనుభవిస్తున్నారో! తను చచ్చిపోయింది అని నిర్ణయించుకుని ఉంటారు. అసలు అదే ఇంట్లో ఉన్నారా.. ఎక్కడికన్నా వెళ్ళారా! తను ఇక్కడ నుంచి నేరుగా తన ఇంటికే వెళ్తే అక్కడ స్వాగతం చెప్పడానికి అమ్మ, నాన్న ఉన్నారా! ముందు నాన్నకి ఫోన్ చేయాలి. వీడిని అరెస్ట్ చేయించమని చెప్పాలి. నాన్న… ఆమె మనసు తండ్రిని తలచుకోగానే పరవశించింది… నాన్న… అమ్మ… ఎంత ప్రేమ తనంటే! ఒక్క ఫోన్ చేస్తే రెక్కలు కట్టుకుని వాలతారు.. విమానంలో తీసుకుని వెళ్తారు తనని. కానీ, ఫోన్! అసలు ఆ వస్తువుని చూసి ఐదేళ్ళు… అసలు తన ఫోన్ ఏం చేశాడో తెలియదు.. అడిగినా చెప్పలేదు. నీకు నేను తప్ప ఇంక ఎవరూ లేరు.. ఫోన్ ఎందుకు అన్నాడు.. నీచుడు.. నికృష్టుడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here