నాన్న లేని కొడుకు-4

1
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సంచిక పాఠకుల కోసం రచించిన ‘నాన్న లేని కొడుకు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]రెం[/dropcap]డు చేతులతో ఆమెని, బాబుని పట్టుకుని ఈడ్చుకుంటూ అక్కడినుంచి మరింత లోపలికి ఒక మూలకి బాత్రూంకి వెళ్ళే నడవాలోకి లాగాడు. ఆమె పెనుగులాడింది. అతని కబంధ హస్తాలు మరింత బిగిసాయి.

ఎండిన ఆకుల శబ్దంతో కలిసిన బూట్ల శబ్దం కొద్దిసేపు వినిపించి దూరం అయింది. ఆమె శక్తులన్నీ ఎవరో లాగేసినట్టు నిస్తేజంగా అయిపొయింది.

అతను బాబుని, ఆమెని అలా ఒక చేత్తో పట్టుకుని, తలుపు దగ్గరకి వెళ్లి సన్నటి పగుళ్ళ లోనుంచి తొంగి చూసి, దగ్గరలో ఎవరూ లేరని నిర్ధారించుకుని బాబుని చంకలో పట్టుకుని, ఆమెని బలవంతంగా లేపి నిలబెట్టి, క్రూరంగా చూస్తూ “అరగంటలో ఈ సామాను సర్దు.. ఇక్కడినుంచి వెళ్లిపోవాలి. నువ్వు ఇంక ఏం చేయలేని చోటికి తీసుకువెళ్తా.. చచ్చిందాకా నా దగ్గరే ఉండాలి.. జాగ్రత్త..” అంటూ మోకాళ్ళ మీద కూర్చుని కింద పడిన ఇటుకలు ఏరి అటకమీద పెట్టసాగాడు.

 “చావనైనా చస్తాను.. కానీ ఇంక ఇక్కడ క్షణం కూడా ఉండను..” తెగించిన స్వరంతో అరిచింది.

“ఉండవూ…” లాగి కొట్టాడు.

కెవ్వుమని అరిచింది.. వేగంగా అటక దగ్గరకు వెళ్లి రెండు పాదాలూ ఎత్తి కంత వైపు వొంగి “ఎవరక్కడా.. దయచేసి నన్ను రక్షించండి..కాపాడండి” గట్టిగా అరిచింది.

“ఎవరే నిన్ను కాపాడేది..” జుట్టు మెలిపెట్టాడు.

ఆమె కుప్పకూలిపోయింది. కర్కశంగా అన్నాడు.. “అర్థమైందా నా సంగతి.. సర్దు.. సామాను సర్దు..” చెప్పి స్టూల్ ఎక్కి అటక మీద పెట్టిన ఇటుకలు అడ్డదిడ్డంగా కంతలో దూర్చసాగాడు. ఆ కంత చూస్తే తనని వెంటాడే వాళ్ళు లోపలికి వచ్చేసే ప్రమాదం ఉందని అతనికి తెలుసు.

బాబు గుక్కపట్టి ఏడవసాగాడు.. ఆమె గుండె కరిగిపోయింది.. పాకుతూ వెళ్లి బాబుని ఎత్తుకోబోతుంటే విరిగిన ఇటుక ముక్క ఆమె మీదకి విసిరాడు. నుదుట తగిలి బాధగా అరిచింది ‘అమ్మా..’

ఆ దెబ్బతో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది.. స్టూల్ దిగి తనవైపు వస్తున్న అతని మీదకి పిచ్చిబలంతో అదే ఇటుక తిరిగి విసిరికొట్టి బాబుని ఎత్తుకుంది. ఆమె కళ్ళు చురుగ్గా సుత్తి కోసం చూసాయి. నాలుగే అడుగులు వేస్తే చేతికి అందుతుంది.

ఆ క్షణం ఆమె అపర కాళి అయింది. కన్నీళ్లు నిప్పురవ్వలయాయి. వెనక్కి, వెనక్కి రెండు అడుగులు వేసింది.

ఆమె ఆలోచన తెలియని వాడు విసురుగా చేయి అందుకోబోయాడు. ఒకే ఒక్క అడుగు…. మెరుపులా వంగి సుత్తి తీసి వాడు గ్రహించేలోగా నెత్తి మీద బలంగా కొట్టింది.

వికృతంగా అరిచాడు..

మరో దెబ్బ.. మరో దెబ్బ.. తల మీద, భుజాల మీద, చేతిమీద … రక్తం కారుతోంది.. అతను పశుబలంతో ఆమె గొంతు పట్టుకున్నాడు. ఆమె చంకలోంచి బాబు జారిపోయాడు.

ఆ దృశ్యం చూస్తున్న ఆ పసివాడి మనసులో ఎలా వచ్చిందో ఆలోచన.. అమ్మ చాలా ప్రమాదంలో ఉందని వాడి చిన్ని మనసుకి తెలుస్తున్నట్టుంది.. అమ్మని ఎవరో ఏదో చేస్తున్నారు.. అమ్మ ఏడుస్తోంది.. ఆమె హాహాకారాలు వాడి లేత మనసుని కదిలించాయి. అమ్మ మాత్రమే తెలుసు వాడికి. ఇంకో వ్యక్తి ఎవరో తెలియదు. బహుశా ఇదేనేమో తల్లి, పిల్లల ప్రేమ పాశం…

ఏనాడూ ప్రేమగా దగ్గరకు తీయని ఆ వ్యక్తి రాక్షసుడిలా కనిపించినట్టున్నాడు. తనని ప్రేమించే అమ్మ, లాలించే అమ్మ, అన్నం పెట్టే అమ్మ, నిద్రపుచ్చే అమ్మ. అమ్మ ప్రేమ కిరణాలు వాడి మెదడు మీద ప్రసరించి వెలుగు ప్రసాదించినట్టు ఒక ఆలోచన.. నోట్లో వేలు తీసేసాడు. వాడి కళ్ళల్లో ఒక ఇది అని చెప్పలేని భావం… బహుశా అది కసి అయి ఉండచ్చు. తనని బుజ్జగించి, ప్రేమగా గుండెలకి హత్తుకుని మురిసిపోయే అమ్మని ఎవరో హింసిస్తున్నారు.. ఆవిడ ఏడుస్తోంది.. కళ్ళల్లో మహానదులు పొంగుతున్నాయి.. బాబు వేగంగా కదిలాడు. చటుక్కున వెళ్లి ఒక మూల ఉన్న కారు బొమ్మలు తీసుకుని కీ ఇచ్చి అతని కాళ్ళ మధ్యకి వదిలాడు. అలా రెండు, మూడు బొమ్మలు అతని రెండు పాదాలు ఒకదగ్గర పెట్టనీకుండా గందరగోళం చేసాయి. అటూ, ఇటూ కాసేపు గంతులేసాడు. అతని చేతులు పట్టు సడలాయి.

ఆమె కళ్ళల్లో మెరుపు.. కారు బొమ్మలతో ఎలా ఆడుకోవాలో, కారు రోడ్ల మీద ఎలా తిరుగుతుందో.. అప్పుడప్పుడు తను ఇచ్చిన శిక్షణ వృథా కాలేదు.. బాబుకి ఈ మాత్రం ఆలోచన వచ్చింది చాలు.. అమ్మ ఆపదలో ఉంటే ఆదుకోవాలన్న ఆలోచన ఆ పసిమనసులో కలగడం తన అదృష్టం..

అతను తన కాళ్ళకి తగులుతూ చికాకు పెడుతున్న ఆ కార్లను కాలితో తోయసాగాడు. ఆమెకి ఆ ఒక్క క్షణం చాలు. గబ, గబా సుత్తితో ఇష్టం వచ్చినట్టు కొట్టసాగింది. మొదలు నరికిన చెట్టులా వెల్లకిలా పడిపోయాడు. రక్తం చేతుల మీద నుంచీ, తల మీద నుంచీ, మొహం మీదా ధారలుగా కారుతోంది. అయినా ఆమెని పట్టుకోడానికి పాకుతూ ప్రయత్నిస్తున్నాడు. కదలకుండా కాళ్ళ మీద దెబ్బలేసి కసిగా నాలుగు చెల్లాచెదురుగా పడి ఉన్న ఇటుకలు వాడి మీద పడేయసాగింది. తల్లి చేస్తున్న పని చూసిన పసి హృదయానికి ఏమర్థం అయిందో తన చిట్టి చేత్తో విరిగి ముక్కలైన కొన్ని ఇటుకలు తీసుకొచ్చి వాడిమీద వేసాడు. వాటి నుంచి వచ్చిన ధూళి కళ్ళల్లో పడిందేమో, బోర్లా పడి, బూతులు తిడుతూ కళ్ళు అతను మూసుకున్నాడు. గబుక్కున అతని చొక్కా జేబులో నుంచి కింద పడింది తాళం చెవి.. ఆమె కళ్ళు మెరిశాయి.

ఆమె గుండెనిండా గాలి పీల్చుకుని తృప్తిగా చూసింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తాళం చెవి తీసుకుని సుత్తి విసిరేసింది దూరంగా..

కింద పడిన బాగ్ తీసుకుని బాబుని ఎత్తుకుని మెరుపులా తాళం తీసి, బయటకు కాలు పెట్టబోతూ తలతిప్పి అతడిని చూసింది.

అతను మొదలు నరికిన చెట్టులా పడి ఉన్నాడు. నుదురు, చెంపలు ముక్కు, రక్తం ధారలు.. నోట్లోకి పోతోంది. క్రోధంగా చూస్తూ నెమ్మదిగా కదలడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమెకి కడుపులో తిప్పేసింది.. వాంతి వచ్చేలా ఉంది. గబుక్కున మొహం తిప్పేసుకుంది.

అంతే! తిరిగి తలుపు మూసేసి, బయట నుంచి గడియ వేసి, పరుగు పెట్టింది.. ఎక్కడ చూసినా ముళ్ళ తీగలు కాళ్ళకి, చేతులకి అడ్డం పడుతుంటే కాలితో తోస్తూ, చేతుల మీద గీరుకుంటున్నా లక్ష్య పెట్టకుండా పరుగు ప్రారంభించింది.

వెనకనుంచి కర్కశంగా, లీలగా వినిపిస్తోన్న ఆ భయంకరమైన గొంతు ఆమెని ఇప్పుడు భయపెట్టలేదు.. తెగింపు, తెగింపు… పరుగు.. పరుగు ఆగకుండా ఒకటే పరుగు. ఆయాసపడుతూ, దగ్గుతూ ఏదో శక్తి ఆవహించి, గాలిలో ఎగురుతున్నట్టే పరిగెత్తసాగింది.

బాబు ఏడుస్తూనే ఉన్నాడు.. ఒక చేత్తో వాడిని సముదాయిస్తూ అలా పరిగెత్తుతూనే ఉంది..

ఆ చిక్కటి పొదల్లోంచి పరుగులు పెడుతూ కాళ్ళకి, చేతులకి రాళ్ళు, ముళ్ళు తగిలి గాయాలు చేస్తున్నా ఏ మాత్రం సడలని మొండి పట్టుదలతో పరిగెత్తి, పరిగెత్తి రోడ్ మీదకి వచ్చేసరికి ఎదురుగా హెడ్ లైట్స్ కనిపించాయి.. రక్తం ఓడుతున్న కుడి చేయి ఎత్తి కారుకు అడ్డంగా పరిగెత్తింది..

సడన్ బ్రేక్‌తో కారు ఆగడం, తెరిచిన డోర్ మీద బాబుతో సహా ఆమె పడిపోడం, ఎవరో రెండు చేతులతో ఎత్తుకుని కారులో కూర్చోబెట్టడం వరకూ తెలుస్తోంది.

ఎవరిదో స్వరం వినిపించింది “పాపం ఎవరో హాస్పిటల్‌కి తీసుకువెడదాం.. దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళు.” ఆమెకి స్పృహ తప్పింది.

***

అది ఒక ప్రముఖ ఆసుపత్రి.

అంబులెన్సు గేటులోపలికి దూసుకెళ్లింది. వెనకే పోలీస్ కార్ వెళ్ళింది.

అంబులెన్సులో నుంచి ముగ్గురు హాస్పిటల్ సిబ్బంది దిగి, లోపల నుంచి స్త్రేచేర్ బయటకి లాగారు. దాని మీద ఒక పాతికేళ్ళ యువతి, ఆమె పక్కనే మూడేళ్ళ బాబు అపస్మారక స్థితిలో ఉన్నారు.

పోలీస్ కారు కూడా ఆగింది. అందులో నుంచి ఇనస్పెక్టర్ మురళీ, కానిస్టేబుల్ సత్యం దిగారు. వాళ్ళ సూచనల మేరకు స్ట్రెచర్ ఎమర్జెన్సీ వార్డు వైపు తీసుకు వెళ్ళారు సిబ్బంది.

పోలీస్‌తో వచ్చిన ఆ కేసు కాదనే ధైర్యం లేని డాక్టర్ అయిష్టంగా “ఇదేదో రేప్ కేసులా ఉంది ఇనస్పెక్టర్.. నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తాను.. మీరు గాంధీకి తీసుకు వెళ్ళండి” అన్నాడు.

“సికింద్రాబాద్ వెళ్ళాలి టైం పడుతుంది.. కండిషన్ బాగున్నట్టు లేదు.. పైగా చిన్న బాబు కూడా ఉన్నాడు.. నేనున్నా కదా డోంట్ వర్రీ” అన్నాడు ఇన్‌స్పెక్టర్.

చేసేది లేక డాక్టర్ లోపలికి వెళ్ళాడు.

ఇన్‌స్పెక్టర్ తన ముందు నిలబడిన వ్యక్తీ వైపు చూసాడు. “మీ పేరేంటి?”

“విశ్వనాధం … నేను కంట్రాక్టర్‌ని..” అంటూ తన విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాడు.

“వికారాబాద్ నుంచి వస్తున్నాను.. ఈమె అడవి ప్రాంతంలో రోడ్డుకి అడ్డంగా వచ్చి కారు ఆపింది. డోర్ తీసేసరికి డోర్ మీద పడిపోయింది. కారులో ఎక్కించగానే స్పృహ తప్పింది. నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి కారులో ఎక్కించి హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాలి అనుకున్నాం .. దగ్గరలో హాస్పిటల్స్ కనిపించలేదు.. నా ఫ్రెండ్ కొంచెం భయపడి ముందు పోలీస్ రిపోర్ట్ ఇద్దాం .. ఆమె ఎవరో ఎందుకలా వచ్చిందో మనకి తెలియదు కదా అన్నాడు అందుకే మీ దగ్గరకి వచ్చాం” అన్నాడు.

“వికారాబాద్ ఎందుకు వెళ్ళారు?” అడిగాడు ఇన్సెపెక్టర్.

“జస్ట్ సరదాగా తిరగడానికి… అనంతగిరి హిల్స్, వాటర్ ఫాల్స్ చూసి, రెవెన్యు డిపార్ట్మెంట్‌లో పని ఉంటే చూసుకుని, రిసార్ట్స్‌లో నైట్ స్టే చేసి వస్తున్నాం”.

ఇన్‌స్పెక్టర్ సాలోచనగా తలాడిస్తూ “మీ ఫ్రెండ్ ఎక్కడ” అన్నాడు.

“వస్తాడు… కారులో ఆమె హ్యాండ్ బాగ్ ఉంది తీసుకు వస్తున్నాడు.. వెంట మీ కానిస్టేబుల్ ఉన్నాడు” అన్నాడు గ్లాస్ డోర్‌లో నుంచి బయటకి చూస్తూ..

అప్పుడే మరో వ్యక్తీ అతనితో పాటు కానిస్టేబుల్ వచ్చారు. అతను ఇనస్పెక్టర్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ “నా పేరు శశాంక్ .. ఫిలిం డిస్ట్రిబ్యూటర్” అన్నాడు.

ఇనస్పెక్టర్ చిరునవ్వుతో అన్నాడు “అయాం మురళీ కృష్ణ”.

“ఆమెకి ఎట్లా ఉంది?” అడిగాడు శశాంక్.

“తెలియదు సీరియస్ కాకపోవచ్చు” అన్నాడు ఇనస్పెక్టర్.

కానిస్టేబుల్ సత్యం హ్యాండ్ బాగ్ ఇన్‌స్పెక్టర్‌కి ఇచ్చాడు.

దుమ్ము కొట్టుకుపోయి ఉన్నా మంచి లెదర్ బాగ్.. చాలా ఖరీదైనదిగా తెలుస్తోంది.

ఇనస్పెక్టర్ జిప్ తెరిచి అందులో నుంచి ఒక అడ్రస్ బుక్, రెండు పెన్నులు, ఒక నోట్ బుక్, ఐబ్రో పెన్సిల్, లిప్ స్టిక్ బయటకి తీసాడు.

అంతకు మించి అందులో ఏమి లేవు. లిప్ స్టిక్ వాడి చాలా కాలం అయిందేమో ఎండిపోయింది. పడేయబోయి ఆగి బాగ్‌లో వేసాడు.

అడ్రస్ బుక్ తెరిచి చూసాడు. మొదటి పేజిలో హరిత, డాటర్ ఆఫ్ డాక్టర్ సూర్యనారాయణ, కార్డియాలజిస్ట్ అని రాసి ఉంది. కింద ఫోన్ నెంబర్ ఉంది.

ఇన్‌స్పెక్టర్‌ భృకుటి ముడిచి తన మొబైల్ తీసి ఆ నెంబర్‌కి డయల్ చేసాడు.

రెండు, మూడు సార్లు చేయగా అవతల వైపు నుంచి రెస్పాన్స్ వచ్చింది.

“హలో డాక్టర్ సూర్యనారాయణ గారా” అడిగాడు.

“ఎస్ … మీరెవరు?” గంభీరంగా వచ్చింది సమాధానం.

“నేను ఎస్ ఐ మురళీకృష్ణ మాట్లాడుతున్నా… హరిత మీకేమవుతుంది..”

“హరిత…” ఒక్కసారి ఆయన స్వరంలో ఆత్రుత.. “హరిత నా కూతురు.. ఎస్ హరిత ఈజ్ మై డాటర్.. ఎక్కడుంది.. నా తల్లి ఎక్కడుంది?” ఆత్రంగా అడిగాడు.

ఇన్‌స్పెక్టర్‌కి ఆశ్చర్యం వేసింది. అంటే ఈ అమ్మాయి ఎక్కడ ఉందో, ఎక్కడికి వెళ్లిందో తల్లి,తండ్రులకి తెలియదా…

“హాస్పిటల్‌లో ఉంది.. ఆమెతో మూడేళ్ళ బాబు ఉన్నాడు.”

“బాబా!” సూర్యనారాయణ స్వరం షాకింగ్‌గా పలికింది.

“అవును మీరు అర్జెంటుగా రండి ఇక్కడికి..” హాస్పిటల్ పేరు చెప్పాడు.

“ఇప్పుడే బయలు దేరుతాను.. నేను జూబిలీ హిల్స్ నుంచి రావాలి… టైం పడుతుంది రావడానికి.. మా అమ్మాయి ఎలా ఉంది? చెప్పండి ప్లీజ్” ఆందోళనగా అడిగాడు.

“మీరు రండి ప్లీజ్. వచ్చాక మాట్లాడదాము.”

ఇన్‌స్పెక్టర్ ఫోన్ డిస్కనెక్ట్ చేసాడు.

ఎమర్జెన్సీ వార్డ్ లోనుంచి డాక్టర్ బయటకి వచ్చాడు.

ఇన్‌స్పెక్టర్ ఆయనకీ ఎదురు వెళ్లి అడిగాడు “ఎలా ఉంది డాక్టర్.”

“ప్రాణ భయం లేదు. ఇద్దరూ బాగా వీక్‌గా ఉన్నారు. మనం అనుకున్నట్టు రేప్ కేసు కాకపోవచ్చు అనుకుంటున్నా…. ఇంకా కొన్ని టెస్ట్‌లు జరుగుతున్నాయి. కాసేపట్లో స్పెషల్ రూమ్‌కి షిఫ్ట్ చేస్తాము. చేశాక యూ కెన్ టేక్ హర్ స్టేట్మెంట్.. రండి నా రూమ్‌లో కూర్చుందాం” అంటూ తన రూమ్ వైపు నడుస్తున్న డాక్టర్‌ని అనుసరించారు అందరూ.

“ఆమె చేతులు బాగా నలిగిపోయి ఉన్నాయి. ఏదో జరిగింది. ఆమె మీద ఎవరో దారుణంగా దాడి చేసారు.” అన్నాడు డాక్టర్.

ఇన్‌స్పెక్టర్ తలాడించాడు. “బాబుకి కూడా కొంచెం ముళ్ళ కంపలు గీరుకున్నాయి. కానీ పాపం ఆవిడ బాబుని చాలా బాగా ప్రొటెక్ట్ చేసింది. చేతులు, కాళ్ళు, ఆఖరికి వీపు మీద కూడా చాలా గాయాలున్నాయి. బాబుని కాపాడడంలో తను గాయపడింది. బాగా అడ్వెంచర్ చేసినట్టు అనిపిస్తున్నది. బహుశా ఆమె మీద ఎవరో అత్యాచారం జరపబోతే బాగా ప్రతిఘటించి పారిపోయి వచ్చినట్టుంది.”

“అయ్యో! పాపం…” సానుభూతిగా అన్నాడు విశ్వనాధం.

 “ఈ అమ్మాయి డాక్టర్ సూర్యనారాయణ, కూతురు… ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో” అన్నాడు ఇన్స్పెక్టర్.

“డాక్టర్ సూర్యనారాయణ పేరు విన్నాను. జూబిలీహిల్స్ కేర్‌లో కార్డియాలజిస్ట్ కదా!” అన్నాడు డాక్టర్.

“ఎక్కడ చేస్తారో నాకు తెలియదు.. ఆమె బాగ్‌లో కార్డ్ చూసి తెలుసుకున్నాను” అన్నాడు ఇనస్పెక్టర్.

“మీరు రీసెంట్‌గా వచ్చినట్టున్నారు… ఇదివరకు ఇన్‌స్పెక్టర్ నా మిత్రుడే, అతను వరంగల్ వెళ్ళాడు కదా!” అడిగాడు శశాంక్ ఇన్‌స్పెక్టర్‌ని.

“అవునండి… గ్రూప్ టూ అప్పాయింట్మెంట్” చెప్పాడు.

“మేము ఎక్కువగా అనంతగిరి హిల్స్, వికారాబాద్ ఫారెస్ట్, రిసార్ట్స్‌లో షూటింగ్‌లు చేస్తుంటాం. అలా నాకు ఇదివరకటి ఇన్‌స్పెక్టర్ బాగా తెలుసు” చెప్పాడు శశాంక.

మరి కొంచెం సేపు వికారాబాద్ ఫారెస్ట్ గురించి, ప్రక్రుతి అందాల గురించి మాట్లాడుకున్నాక తిరిగి హరితని షిఫ్ట్ చేసిన రూమ్ కి వెళ్ళారు అందరూ.

కంఠం వరకూ కప్పిన తెల్లటి బ్లాంకెట్‌లో తల్లి, కొడుకు కళ్ళు మూసుకుని నిస్త్రాణగా పడుకున్నారు.

అడుగుల శబ్దానికి ఆమె కళ్ళు తెరిచింది. ఎదురుగా కనిపించిన ఇన్‌స్పెక్టర్‌ని చూడగానే ఆమె కళ్ళు భయంగా డాక్టర్ వైపు తిరిగాయి.

డాక్టర్ మృదువుగా అన్నాడు.. “ఇన్‌స్పెక్టర్ మిమ్మల్ని ఏదో అడగాలట, మీకేం భయం లేదు.. ఏం జరిగిందో, మీరు ఎక్కడ నుంచి, ఎందుకు అలా పరిగెత్తుకుని వచ్చారో, మీకు జరగబోయిన ప్రమాదం ఏంటో చెప్పండి..”

ఇన్సెపెక్టర్ బెడ్‌కి దగ్గరగా వెళ్లి స్టూల్ జరుపుకుని కూర్చున్నాడు.

“ఎలా ఉంది? ఆర్ యు ఆల్ రైట్” అడిగాడు.

ఆమె కళ్ళతోటే సమాధానం చెప్పింది బాగానే ఉన్నాను అన్నట్టుగా.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here