Site icon Sanchika

నాన్న లేని కొడుకు-5

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సంచిక పాఠకుల కోసం రచించిన ‘నాన్న లేని కొడుకు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]“మీ[/dropcap] పేరు?”

“హరిత”

“బాబు?”

కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని నెమ్మదిగా చెప్పింది “నా కొడుకు.”

“ఓ… మీ వారు?”

హరిత చూపులు తిప్పుకుంది.. ఆమె మొహంలో ఒక విధమైన అసహ్యం కదిలింది.

“చెప్పండి.. మీ వారెక్కడ?”

“నాకు భర్త లేడు”

డాక్టర్ వైపు ప్రశ్నార్ధకంగా చూసాడు ఇన్‌స్పెక్టర్.

డాక్టర్ భుజలేగరేసాడు ..

ఇన్‌స్పెక్టర్ మళ్ళీ ఆమెని అడిగాడు “అంటే! అర్థం కాలేదు వివరంగా చెప్పగలరా.”

“చెప్తాను.. చెప్పాలి.. మీకు చెప్పడానికే నేను ప్రాణాలకు తెగించి ఆ నీచుడి చెరనుంచి బయటపడ్డాను” అంది.

డాక్టర్, ఇన్‌స్పెక్టర్ ఆమె చెప్పబోయేది వినడానికి సిద్ధంగా కూర్చున్నారు.

“నేను, నేను…” ఆమె చెప్పడం ప్రారంభించగానే ఉప్పెనలా దుఃఖం వచ్చింది. వెక్కి, వెక్కి ఏడవసాగింది. అందరూ కంగారుగా డాక్టర్ వైపు చూసారు.

డాక్టర్ ఆమె చేయి పట్టుకుని ఓదార్పుగా అన్నాడు.”రిలాక్స్ … రిలాక్స్ .. ఏడవకమ్మా.. తరవాత చెప్పచ్చు.. రెస్ట్ తీసుకో…”

హరిత కళ్ళు మూసుకుంది.

“ఆమెని విశ్రాంతి తీసుకోనివ్వండి.. మేము మళ్ళీ వస్తాము” అన్నాడు ఇనస్పెక్టర్.

“ఓకే.. మీ ఇష్టం” అన్నాడు డాక్టర్.

“మేము కూడా ఒక గంటలో వస్తాము.. కొంచెం పని ఉంది చూసుకుని వస్తాము. వెళ్ళచ్చా ఇన్‌స్పెక్టర్” అడిగాడు శశాంక్..

“మీ స్టేట్‌మెంట్ తీసుకోవాలి.. తప్పకుండా వస్తారుగా” కొంచెం అనుమానంగా చూస్తున్న ఇన్‌స్పెక్టర్ వైపు చూసి “మా కారు ఇక్కడే వదిలి వెళ్ళమంటారా” చిరునవ్వుతో అడిగాడు విశ్వనాథ్.

అతను కూడా నవ్వి, కానిస్టేబుల్ అనుసరించగా ఇన్నోవా ఎక్కాడు.

శశాంక్, విశ్వనాధం డాక్టర్‌కి కరచాలనం చేసి “మళ్ళీ వస్తాం”అని చెప్పి వెళ్ళిపోయారు.

డాక్టర్ వాళ్ళు వెళ్తున్న వైపు చూసి దీర్ఘంగా నిశ్వసించి తన గదిలోకి వెళ్ళిపోయాడు.

అన్నట్టే సరిగ్గా గంటలో వచ్చాడు ఇన్‌స్పెక్టర్..

అతని వృత్తి పట్ల అతనికి ఉన్న అంకితభావానికి, కేసు పట్ల ఉన్న శ్రద్దకీ మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు డాక్టర్ “వెరీ పంక్చువల్.” అన్నాడు.

“ఎలా ఉంది పేషంట్”.

“రండి చూద్దురుగాని”

ఇద్దరూ హరిత రూమ్‌కి వెళుతుండగా కారు ఆగడం, కారులోంచి డాక్టర్ సూర్యనారాయణ దిగడం జరిగింది.

ఆయనని చూడగానే డాక్టర్ ఆయనకీ కరచాలనం చేసి ఆహ్వానించాడు. “మీ గురించి వినడమే కాని కలుసుకునే అవకాశం రాలేదు. ఇప్పుడిలా కలుసుకోడం దురదృష్టం” అన్నాడు.

“ఎలా ఉంది డాక్టర్ నా కూతురు? ఎక్కడ ఉంది?” ఉద్వేగంగా అడిగాడు ఆయన.

“డోంట్ వర్రీ… రండి” అంటూ డాక్టర్ ముందు దారి తీయగా ఇన్‌స్పెక్టర్, డాక్టర్ సూర్యనారాయణ ఆయనని అనుసరించారు. అప్పుడే మరో కారు ఆగడం, విశ్వనాథం, శశాంక్ దిగి లోపలికి రావడం జరిగింది.

అప్పుడు సరిగ్గా ఏడు ముప్పావు అవుతోంది. మూడు గంటల చికిత్స తరువాత హరిత కొంచెం సేదతీరినట్టు మొహంలో ఆందోళన, భయం పోయి, కొంత ప్రశాంతత కనిపిస్తోంది. సెలైన్ బాటిల్ తల కిందులుగా వేళ్లాడుతోంది. అపస్మారకంగా పడి ఉన్న కూతురుని ముందు గుర్తుపట్టలేదు ఆయన. సన్నజాజి పూవులాంటి హరిత నల్లబడి, శుష్కించి ఉంది. ఇరవై రెండేళ్ళ ఆ అమ్మాయి, పూచిన పూవులా ఉండాల్సిన అమ్మాయి బాగా వయసు మీద పడినట్టు ఉంది. ఆయన గుండె తరుక్కుపోయింది. అడుగుల శబ్దానికి కళ్ళు తెరిచిన హరిత తండ్రిని చూడగానే గబుక్కున లేవడానికి ప్రయత్నించి వెనక్కి పడిపోతూ గట్టిగా “నాన్నా” అంటూ భోరుమంది.

“అమ్మా హరితా!” ఆయన వడి, వడిగా వచ్చి కూతురిని ఒడిలోకి తీసుకున్నాడు.

“నాన్నా.. నాన్నా..” వెక్కి, వెక్కి ఏడవసాగింది హరిత.

“తల్లీ! ఇంతకాలం ఏమైపోయావు తల్లీ.. ఎక్కడున్నావు? ఏంటి ఈ గాయాలు.. ఏమైంది నీకు…” హరిత జుట్టు నిమురుతూ కన్నీళ్ళతో అడిగాడు.

హరిత సమాధానం చెప్పలేదు.. వెక్కి, వెక్కి ఏడుస్తూ అడిగింది “అమ్మేది నాన్నా! అమ్మ కావాలి నాన్నా..”

“ఉంది అమ్మ నీకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. ఆ రోజు నుంచి నీకోసం వెతికి, వెతికి అలసిపోయాను తల్లి.. అమ్మ నీకోసం బెంగతో క్రుంగిపోయింది.. వెళ్ళిపోదాం … అమ్మ దగ్గరకు వెళదాం..”

హరిత నిస్త్రాణగా కళ్ళు మూసుకుంది.

“అయ్యో ఏమైందమ్మా.. డాక్టర్ ఏమైంది నా కూతురికి.. ఇన్‌స్పెక్టర్ ఏమైంది నా కూతురుకి? చెప్పండి..” ఉద్వేగంగా, ఆవేశంగా అడగసాగాడు.

“కంగారు పడకండి.. మీ అమ్మాయి నోటినుంచే వినడానికి నేను ఎదురు చూస్తున్నాను. ఇదిగో వీళ్ళిద్దరూ వికారాబాద్ అటవీ ప్రాంతంలో వాళ్ళ కారుకి అడ్డంగా పడిపోయిన ఈ అమ్మాయిని, బాబుని ఐదున్నర, ఆరు ప్రాంతంలో మా పోలీస్ స్టేషన్‌కి తీసుకువచ్చారు.”

సూర్యనారాయణ కళ్ళ నీళ్ళతో విశ్వనాధంకి నమస్కరిస్తూ “మీ ఋణం ఎలా తీర్చుకోను! మిమ్మల్ని ఎలా కలిసింది..?” అడిగాడు.

విశ్వనాధం వివరంగా హరిత తాము వస్తున్న కారు మీద పడిన విధానం, ముందు హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఎందుకైనా మంచిది అని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేయడం, ఆ తరవాత ఇన్‌స్పెక్టర్‌తో పాటు హాస్పిటల్‌కి రావడం మొత్తం చెప్పాడు.

ఆయన రెండు చేతులూ జోడించాడు.

హరిత నీరసంగా పిలిచింది. “నాన్నా! వాళ్ళకి ఏం తెలియదు.. నేను చెప్తాను” అంది నీరసంగా.

సూర్యనారాయణ చిన్నపిల్లాడిలా ఏడుస్తూ కూతురి చెంపలు నిమురుతూ “చెప్పు తల్లి.. ఏం జరిగింది..” అని అడిగాడు.

హరిత నెమ్మదిగా లేచి తలగడని ఆనుకుని కూర్చుంది. సూర్యనారాయణ ఆమె రెండు చేతులూ పట్టుకుని ఓదార్పుగా నిమరసాగాడు. హరిత పొగిలి, పొగిలి వస్తున్న దుఖం ఆపుకుంటూ నెమ్మదిగా చెప్పసాగింది. ఇన్‌స్పెక్టర్‌ మురళి తన ఫోన్‌లో ఆమె చెబుతున్నది రికార్డు చేయసాగాడు.

***

ఇన్నోవా కార్ నిర్జనప్రదేశంలో వేగంగా వెళ్తోంది. ముందు వైపు అద్దానికి పోలీస్ అని ఇంగ్లీష్‌లో రాసి ఉన్న లేబిల్ అతికించి ఉంది.

కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తున్నాడు, ఎస్ఐ మురళీకృష్ణ అతని పక్కన సీటులో కూర్చున్నాడు. వెనకాల హరిత, ఆమె ఒడిలో బాబు, పక్కన సూర్యనారాయణ. హరిత కళ్ళల్లో నీరసం, మోహంలో విషాదం.. వడలిపోయిన తామరపూవులా ఉంది. దారి పొడుగునా కనిపిస్తున్న దృశ్యాలను, పరిసరాల మీద దృష్టి ఉన్నా, ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. ఒళ్లో పడుకున్న బాబు వీపుని నిమురుతున్నాయి మీద ఆమె చేతి వేళ్ళు.

ఆమె ఒడి వెచ్చదనాన్ని, వీపు మీద కదులుతున్న ఆమె ఎడం చేతి వేళ్ళ స్పర్శలోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ మూడేళ్ళ కన్నా హాయిగా, నిశ్చింతగా నిద్రపోతున్నాడు.

ఆమె కుడిచేయి వాడి నడుం మీద నెమ్మదిగా జో కొడుతున్నట్టుగా అసంకల్పితంగా కదుల్తోంది. ఆమె తలకి కట్టు ఉంది. మెదడు ఆలోచనలతో బరువుగా ఉంది గుండెల్లో అంతులేని దుఃఖం అనుభవిస్తున్నట్టుగా కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి.

పక్కన కూర్చున్న సూర్యనారాయణ సీరియస్‌గా ఆలోచిస్తూ విండో లోంచి బయటికి చూస్తున్నాడు. ఆయన మనసంతా వేదనగా ఉంది.. ఆయన గుండె ఉధృతంగా అలలతో ఎగసిపడుతున్న మహాసముద్రంలా అల్లకల్లోలంగా ఉంది.

కారు సరైన దారి కూడా లేని చిన్న అడవిలాంటి ప్రదేశంలో వెళ్తోంది. అక్కడ ఒక ఇల్లు ఉంది అని కొంతకాలం ఆ ఇంట్లో తాను బతుకు మీద ఆశలన్ని వదులుకుని జీవచ్చవంలా బతికానని నమ్మలేని దానిలా చూస్తోంది హరిత.

కారు కుదుపులతో వెళ్తోంది. ఆ కుదుపులకి కారులో కూర్చున్న వాళ్ళు అందరూ కూడా అటు, ఇటు ఒరిగిపోతూ కదులుతూ అసహనంగా కూర్చున్నారు. ఇన్‌స్పెక్టర్ తల వెనక్కి తిప్పి హరితను చూస్తూ “దారి ఇదేనా మీరు గుర్తించగలరా” అడిగాడు.

హరిత కలలోంచి బయట పడినట్టు చూసింది.

తల అడ్డంగా తిప్పుతూ “కారుకింద నలుగుతున్న ఈ ఎండుటాకుల శబ్దం, ఈ కుదుపులు నాకు స్పష్టంగా తెలుస్తోంది. ఇంతకన్నా వేరే ఏమీ గుర్తులు, జాడలు నాకు తెలియదు.”

ఇన్‌స్పెక్టర్ భృకుటి ముడుస్తూ అడిగాడు.. “మిమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు కళ్ళకు గంతలు కట్టారు అన్నారు కదా … అంతేనా మత్తు ఇంజక్షన్ లాంటిది ఇచ్చారా.”

“ఇంజక్షన్ ఇవ్వలేదు కానీ ఏదో మత్తు వాసన తగిలిన గుర్తు.. కాన్షస్‌లో ఉండాలని ఎంత ప్రయత్నించినా ఉండలేకపోయాను… చాలాసేపు ప్రతిఘటించి అలసిపోయాను… నిద్ర, మెలకువ కాని ఓ స్థితిలో ఉన్నాను. ఆ కొంతసేపు ఇలాంటి ధ్వనులు మాత్రం వినిపించాయి. తిరిగి కళ్ళు తెరిచేసరికి గాలి, వెలుతురు లేని గదిలో ఒక మంచం మీద పడుకుని ఉన్నాను.. నా పక్కన … నా పక్కన ..” దుఃఖం అడ్డుపడడంతో ఆమె ఆగిపోయింది.

“ఇన్‌స్పెక్టర్ రిలాక్స్ …. రిలాక్స్” అన్నాడు ఓదార్పుగా.

“సర్ అటు చూడండి ఏదో ఇల్లు కనిపిస్తోంది” కానిస్టేబుల్ విండో దించుతూ కొంచెం ఉత్సాహంగా అన్నాడు ఎడం చేయి స్త్రీరింగ్ మీద ఉంచి కుడిచేయి ఎత్తి దూరంగా చూపిస్తూ.

ఇన్‌స్పెక్టర్ అతను చూపించిన వైపు చూసాడు.

చెట్ల మధ్యలో ఇంటి పై కప్పు అస్పష్టంగా కనిపిస్తోంది.

హరిత గుండె దడ, దడలాడింది… ఆ ఇల్లు, ఆ పరిసరాలు తలచుకుంటేనే గుండెల్లో అగ్నిపర్వతాలు పేలుతున్నట్టు ఉంటుంది. కానిస్టేబుల్ చూపించిన వైపు చూసింది.. ఏపుగా పెరిగిన అనేక పేరు తెలియని చెట్ల చాటున పై కప్పు కనిపిస్తూంది.

ఇదే ఇల్లు తను సూర్యచంద్రులను కూడా చూడకుండా నాలుగేళ్ళు గడిపిన ఇల్లు.. ఖచ్చితంగా ఇదే అయి.. ఎక్కడా నరసంచారం లేకుండా ఉండే చోటు ఇది తప్ప వేరే ఎక్కడ ఉంటుంది అనుకుంది హరిత.

ఇన్‌స్పెక్టర్ మళ్ళీ అడిగాడు “అలా చూడండి ఆ ఇల్లేనా మీరున్నది అక్కడేనా.”

ఉద్వేగంతో అంది హరిత… “అయి ఉండచ్చు. అప్పడప్పుడు ఏవో పక్షులు, కోతులు ఆ కప్పు మీద ఎక్కి చేసిన శబ్దాలు నాకు వినిపిస్తుండేవి” అంది హరిత.

కారులోంచి చూస్తుంటే దగ్గరగా అనిపించినా ఆ గతుకులు, గోతులు, దారికి అడ్డం పడుతున్నట్టు మధ్యలో చెల్లా చెదురుగా విసిరేసినట్టు ఉన్న చిన్న చిన్న బండరాళ్ళు దాటుకుంటూ అతి కష్టం మీద కారు ఇంటిని సమీపించింది.

ఇంటి మీద కప్పినట్టుగా చుట్టూ ఉన్న చెట్ల కొమ్మలు పడి ఉన్నాయి. ఇంటి నాలుగు వైపులా ఆ కొమ్మలకు సంబంధించిన చెట్లు అక్కడ జరిగే దుర్మార్గాలకి కాపలా కాస్తున్నట్టు కొమ్మలతో విస్తరించి ఉన్నాయి.

సూర్యనారాయణ తల తిప్పి కూతురి వైపు చూసాడు. రెప్పవేయకుండా ఆ ఇంటివైపు చూస్తూ చలనం లేకుండా కూర్చుంది. ఆ కళ్ళల్లో భయం, కసి, కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఆయన తన కుడి చేయి చాచి ఆమె భుజం మీద మృదువుగా తట్టాడు, ఆమె తండ్రివైపు చూసింది… క్షణంలో ఆమె కళ్ళు నిండుగా ప్రవహిస్తున్న జలాశాయాల్లా కనిపించాయి.

పెద్ద జర్క్ తో కారు ఆగడంతో, ఆ కుదుపుకి ఆమె ఒడిలో ఉన్న బాబు కొంచెం కదిలి కళ్ళు తెరిచి తల్లి వైపు చూసాడు.

ఆ ఇంటికి చేరువ కాగానే బాబుని గుండెలకు గట్టిగా హత్తుకుంది.

సూర్యనారాయణ కూతురి మొహంలో కలుగుతున్న మార్పులు చూసి అడిగాడు “ఇదేనా?”

గబ గబా తల ఊపింది. ఆయన చూపుల్లో ఇలాంటి చోటనా తల్లీ ఇన్నేళ్ళు బతికావు… ఎలా బతికావు అన్న బాధ కనిపించింది.

ఇన్‌స్పెక్టర్ ఇంటిని, పరిసరాలను తన డేగ కళ్ళతో చూస్తూ నెమ్మదిగా కారు డోర్ తీసుకుని దిగాడు. వెనకాలే కానిస్టేబుల్, సూర్యనారాయణ కూడా దిగారు. బాబుని గట్టిగా గుండెలకి హత్తుకుని సీట్ లోనే మాటలా ముడుచుకు కూర్చుంది హరిత.

ముగ్గురూ ఎండుటాకులు తొక్కుకుంటూ ఆ ఇంటి వైపు వెళ్ళారు.. తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. గుమ్మం నిండా ఎండుటాకులు ఒత్తుగా పడి ఉన్నాయి. వాళ్ళ అడుగుల శబ్దానికి రెండు ఉడుతలు అటూ, ఇటూ తత్తరపడి తిరిగి చక, చకా గోడ మీదుగా పాకుతూ చెట్ల వైపు వెళ్ళాయి. లోపల చీకటిగా ఉంది. ఎవరూ కనిపించలేదు.

“ఆవిడని పిలవండి” అన్నాడు ఇన్‌స్పెక్టర్..

కానిస్టేబుల్ హరిత కూర్చున్న వైపు వచ్చి డోర్ తీసాడు. “రండి భయం లేదు.. ఎవరూ లేరు లోపల” అన్నాడు.

ఒళ్ళో ఉన్నబాబుని జాగ్రత్తగా భుజం మీద వేసుకుని నెమ్మదిగా దిగింది, సూర్యనారాయణ గబుక్కున ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని జాగ్రత్తగా నడిపించాడు.

ఇన్‌స్పెక్టర్ దుమ్ముకోట్టుకుపోయి దుర్గంధం నిండి ఉన్న ఆ గది, ఆ పరిసరాలు చూసి హరిత వైపు జాలిగా చూస్తూ అడిగాడు “ఇదేనా మీరున్న గది.”

హరిత పెదాలు బిగపట్టి దుఃఖం ఆపుకుంటూ అంది “అవును..”

ఎక్కడా గాలి, వెలుతురూ వచ్చే అవకాశం లేదు.. అటక గోడకి ఒక పక్క ఊడి పోయి గాలిలో వెళ్ళాడుతోంది. పాత్రలన్నీ విసిరివేసినట్టు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. గోడలు మట్టిగోడలు రంధ్రాలు పడి మట్టి సన్నగా అక్కడక్కడా ఊడిపోయి కింద పడింది. విరిగిన ఇటుకలు, మట్టి కాళ్ళ కింద బర,బర మంటోంది. బంగాళా పెంకులతో పేర్చి, వాటి మీద బలంగా ఉన్న చెట్ల కొమ్మలు,కొన్ని రాళ్ళు అడ్డుపెట్టిన పై కప్పు. ఎంతో జాగ్రత్తగా చూస్తే తప్ప అక్కడ ఆ గది అనేది ఒకటుందని ఎవరికీ తెలియకుండా అనేక రకాల చెట్ల కొమ్మలు, తుప్పలు చుట్టూ పేర్చి ఉన్నాయి. ఆ గదిని చూస్తోంటే ఓ క్రిమినల్ బుద్ధికి సాక్ష్యంలా ఉంది.

ఇంత నిర్మానుష్యంగా, కేవలం జంతువులూ, పక్షులు మాత్రం నివసించే ప్రదేశంలో ఈ ఇల్లు ఇలా కట్టాడంటే వాడి మనస్తత్వం ఎలాంటిది అయి ఉంటుందో అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ అక్కడ ఉన్న ప్రతి వస్తువునీ, మట్టి పెళ్లలని కూడా అతి జాగ్రత్తగా చూస్తూ సెల్ ఫోన్ కెమేరాతో ఫోటోలు తీయసాగాడు ఇన్‌స్పెక్టర్.

సూర్యనారాయణ కంపిస్తోన్న కూతురు చేయి అలా తన కుడిచేతి గుప్పిట్లో పట్టి ఉంచాడు. ఆమె అరచేతుల్లో చెమట పట్టింది… సుడిగాలికి కంపిస్తున్న చిగురాకులా నిలువెల్లా కంపిస్తోంది.. రెండు చేతుల్లో బాబుని అలా గుండెలకి హత్తుకునే ఉంది.

కానిస్టేబుల్ కనిపిస్తున్న సిగరెట్ పీకలు, మూడో, నాలుగో ఖాళీ బ్రాందీ సీసాలు తీసి ఒక బాగ్‌లో వేస్తున్నాడు ఆధారాల కోసం. అతనెవరో ఎందుకు ఈ అమ్మాయిని దాచడానికి ఈ ప్రదేశం ఎంచుకున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. తను చేసే అవినీతి కార్యక్రమాలకి ఇది అడ్డాగా ఎంచుకున్నాడా..! ఈ అమ్మాయి ఒక్కతేనా! ఇంకా ఎంతమంది అమ్మాయిలను ఇలా కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చాడు? వాళ్ళంతా ఎక్కడున్నారు? మాఫియా గ్యాంగ్‌కి చెందిన వాడా! ఆలోచిస్తూ నిలబడి పోయిన ఇన్‌స్పెక్టర్ హటాత్తుగా హరిత వైపు తిరిగి “డ్రగ్స్ ఏమన్నా తెచ్చేవాడా” అని అడిగాడు.

“లేదు.. అలాంటివి నాకు ఏమి కనిపించలేదు..” చెప్పింది హరిత.

ఇన్‌స్పెక్టర్ వైపు చూస్తూ తను నిలబడిన చోట పడిన ఎండుటాకులు కాళ్ళతో పక్కకి జరిపి అక్కడ ఎండిపోయిన రక్తం మరకలు చూపిస్తూ అంది.. “నేను కొట్టగానే ఇక్కడే పడిపోయాడు.. ఇంత త్వరగా లేచి పారిపోయాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.”

ఇన్‌స్పెక్టర్ నవ్వాడు. “మీరు కొట్టింది సుత్తితోనా..”

“అవును చాలా సార్లు బలంగా కొట్టాను. రక్తం వచ్చింది పడిపోయాడు.”

“భారీ కాయం అన్నారు కదా. ఎలా కొట్టగలిగారు. అతను తిరగబడలేదా!”

“రెండు సార్లు నా గొంతు పట్టుకున్నాడు. కానీ చిత్రంగా నా బాబు తన కారు బొమ్మలకి కీ ఇచ్చి వాడి కాళ్ళకి అడ్డం పడేలా వదిలాడు.. అవి అతడిని చికాకు పరుస్తుంటే వాటిని కాలితో అటు,ఇటూ తోస్తున్నప్పుడు మరింత గట్టిగా కొట్టాను సుత్తితో.. పడిపోయాడు. నేను వెంటనే బాబుని ఎత్తుకుని పరిగెత్తాను.”

“ఐసీ” తల పంకించాడు. తలుపు వెనకాల ఓ మూలకి కాలితో తోసినట్టున్నాడు.. బోర్లాపడి ఉన్నాయి నాలుగైదు కారు బొమ్మలు. వాటిని కసిగా విరగ్గోట్టినట్టు ఉంది.

ఇన్‌స్పెక్టర్ దీర్ఘంగా నిట్టూర్చాడు.

సూర్యనారాయణ అదిరే గుండె చిక్కబట్టుకుని కూతురి చేయి పట్టుకుని అలాగే నిశ్చేష్టుడై నిలబడ్డాడు.

ఒక పక్క ప్లాస్టిక్ నవారు మంచం. ఒక మూల కిచెన్ గట్టు… దానిమీద సింగల్ బర్నర్ గ్యాస్ స్టవ్. చిన్న రిఫ్రిజిరేటర్.. ప్యూర్ ఇట్ వాటర్ ఫిల్టర్… రెండు కూజాలు.. ఓ మూల చెక్క బీరువా… అతి జాగ్రత్తగా చిన్న సంసారం ఏర్పాటు చేసుకున్నాడు.

“ఇవన్నీ ముందే కొన్నాడా! మీరు ఇక్కడికి వచ్చాక కొన్నాడా!” అడిగాడు హరితను ఇన్‌స్పెక్టర్.

(సశేషం)

Exit mobile version