నాన్న లేని కొడుకు-6

1
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సంచిక పాఠకుల కోసం రచించిన ‘నాన్న లేని కొడుకు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]“నే[/dropcap]ను వచ్చాకే.. ఒకేసారి ఇవన్నీ తీసుకుని వచ్చాడు. తిండి విషయంలో కూడా చాలా శ్రద్ధగానే ఉండేవాడు.”

“ఎలా వచ్చేవాడు ఇక్కడికి…”

“ఒక డొక్కు బైక్ ఉంది అని చెప్పాను కదా! దాని మీదే వచ్చేవాడు అనుకుంటా.. నాకు అతను వచ్చే ముందు ఎలాంటి శబ్దం వచ్చేది కాదు. చాలా నిశ్శబ్దంగా వచ్చేవాడు.”

తల పంకిస్తూ అన్నాడు “బహుశా బైక్ ఇంకెక్కడో ఎవరికీ కనిపించకుండా పార్క్ చేసేవాడేమో!”

మంచం మీద ఒక పులిబొమ్మ, కుక్క బొమ్మలు విసిరేసినట్టు పడి ఉన్నాయి. బాబు గబుక్కున హరిత చేతిలోంచి జారి పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ బొమ్మలు తీసుకుని, రెండు చేతులతో పట్టుకుని తల్లివైపు చూసాడు.

ఆ బాబు కళ్ళల్లో తను పోగొట్టుకున్న ఎంతో విలువైన, అమూల్యమైన వస్తువు తిరిగి లభించిన ఆనందం.. ఆ ఆనందం చూస్తుంటే హరిత కళ్ళల్లో కన్నీళ్ళు చిప్పిల్లాయి.

ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఇద్దరు గదిలో ప్రతి అణువు వెతుకుతూ ఆధారం అనుకున్న వాటిని జాగ్రత్తగా బ్యాగ్‌లో వేస్తున్నారు.

సూర్యనారాయణ కళ్ళు వర్షించసాగాయి.

ఇలాంటి చోటా నా కూతురు వాడితో నాలుగేళ్ళు బతికింది.. ఎంత దారుణం!

పూవులా పెరిగిన నా కూతురు ఈ ముళ్ళపొదలోనా గడిపింది.. ఆ గుండెలో ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో! ఆ కళ్ళ నుంచి ఎంత రక్తం స్రవించిందో !

“ఏమ్మా వాడు ఇక్కడికి ఒంటరిగానే వచ్చేవాడా, ఎవరన్నా కూడా ఉండేవాళ్ళా?” ఇన్‌స్పెక్టర్ అడిగాడు హరితను.

“ఒంటరిగానే వచ్చేవాడండి” చెప్పింది హరిత.

“వాడికి వేరే ఏ ఏ కార్యకలాపాలు ఉండేవో మీకు తెలుసా”

“లేదండి. రోజు సాయంత్రం చీకటి పడుతుండగా వచ్చేవాడు… ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటలకి వెళ్లిపోయేవాడు…”

“మీ చేతికి ఏమన్నా డబ్బు ఇచ్చేవాడా”

“లేదండి నాలుగు గోడల మధ్య బందీగా ఉన్న నాకు డబ్బెందుకు నేను అడగలేదు అతను ఇవ్వలేదు.”

“ఏమన్నా కావాలంటే కొని తెచ్చేవాడా”

“నేను ఎప్పుడు ఏది అడగలేదు… బాబు పుట్టాక మాత్రం వాడి బట్టలు, సెరెలాక్, బొమ్మలు, డైపర్స్ తెమ్మంటే తెచ్చేవాడు”

“బాబుని ప్రేమగా చూసుకునే వాడా”

ఆ ప్రశ్నతో ఆమె కళ్ళు నీటితో నిండాయి. “అతను ఎలా చూసాడు..ఏం చేసాడు అనే విషయాల సంగతి ఎలా ఉన్నా నేను, నేను…” గొంతు జీరబోతుండగా అంది.. “వీడిని నేనే హింసించాను. నేనే అసహ్యించుకున్నాను… నేనే, నేనే…” ఆవేశంగా అంటూ ఆగిపోయింది..

“ఏం చేసారు?” అనుమానంగా అడిగాడు ఇన్‌స్పెక్టర్.

ఆమె కళ్ళముందు బాబు కడుపులో పడ్డ క్షణం నుంచి ఆ గర్భాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం తను చేసిన ప్రయత్నాలు ఒక్కోటి కళ్ళ ముందు కనిపించసాగాయి.

తను చచ్చిపోయినా పరవాలేదని కడుపు మీద ఏది కనిపిస్తే దాంతో కొట్టుకుంది.. ఒక పశువు బీజం తన గర్భంలో పడడం, ఆ బీజం బిడ్డగా ఎదిగి ఈ భూమ్మీదకి రావడం ఎంత మాత్రం జరక్కూడదనుకుంది. ఎలాగైనా అక్కడ నుంచి బయటపడి డాక్టర్‌ని కలవాలని ఆ పాపాన్ని కడుక్కోవాలని ఎంతో పోరాడింది.

అందుకోసం ఎంత ఘర్షణ! ఎంత పోరాటం!

హరిత కళ్ళ ముందు ఆ రోజులు కదిలాయి..

దాదాపు తొమ్మిది నెలలు గడిచాయి అతని గుహలో తను బంధించబడి.. ఆమె ఆధునిక యువతి.. యూ ట్యూబులు, సినిమాలు, మాగజైన్‌లో కనిపించే ఆర్టికల్స్, తోటి స్నేహితురాళ్ళతో జరిగిన చర్చలు, గూగుల్ నెట్‌వర్క్ వగైరా విస్తృతమైన విషయ పరిజ్ఞానం ఉంది. ఎలక్ట్రానిక్ మాధ్యమాలు అన్ని వయసుల వారికి అన్ని విషయాల పట్ల అవగాహన కలిగిస్తున్న తరుణంలో ఎవరూ పెద్దవాళ్ళు దగ్గర లేకపోయినా, ఏ డాక్టర్ నిర్ధారించకపోయినా ఆమెకి తను గర్భవతి అయిన సంగతి ఒక నెల పీరియడ్ రాకపోడంతో అర్థం అయిపొయింది.

మరుక్షణం ఉన్మాదిలా మారింది.. జరిగింది రాక్షస వివాహం, జరుగుతున్నది పాశవిక అత్యాచారం.. ఈ దౌర్భాగ్యపు స్థితికి తోడు మెడకి డోలులా తయారవబోయే ఒక మాంసం ముద్ద గురించి మధురమైన స్పందనకి అవకాశం లేదు సరికదా.. ఇదేం జీవితం..

యథాప్రకారం అతను రాత్రి తొమ్మిదింటికి రాగానే పిచ్చిదానిలా అతని మీదకి వెళ్లి కాలర్ పట్టుకుని ఆ చెంపా, ఈ చెంపా వాయిస్తూ అరిచింది.. “నన్ను ముట్టుకున్నావంటే చంపేస్తాను…దరిద్రుడా! నా జీవితం నాశనం చేసావు.. నన్ను పంపిస్తావా లేదా… నా ఇంటికి నన్ను పంపిస్తావా నిన్ను చంపేయమంటావా..”

ఊహించని ఆ దాడికి అతను ఒక్క క్షణం విస్తుబోయినా వెంటనే సర్దుకుని ఆమె రెండు చేతులూ బలంగా పట్టుకుని పళ్ళ బిగువున కోపం అణచుకుంటూ అన్నాడు “ఈ జన్మకి నువ్వు ఇంక నీ ఇంటికి వెళ్ళవు… ఇదే నీ ఇల్లు, ఇదే నీ వాకిలి…నేను నీ హస్బెండ్‌ని నాతో బతకాల్సిందే.. నీకు వేరే బతుకు లేదు.”

‘నో’ వెర్రిగా అరిచింది.. అతని కబంధ హస్తాల నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ “నేను ఉండను… నన్ను వెళ్ళని… నీకు దణ్ణం పెడతా… ఈ బలవంతపు పెళ్లి, ఈ బానిస బతుకు నాకు వద్దు.. నీ పిల్లలకి జన్మనిచ్చే దౌర్భాగ్యం నాకు వద్దు… నన్ను వెళ్ళిపోనీ ప్లీజ్…” అని పెనుగులాడసాగింది.

అతను ఆశ్చర్యానందాలతో అరిచాడు “ఏంటి నువ్వు నా పిల్లలకి తల్లివి అవుతున్నావా…” నమ్మలేనివాడిలా చూసాడు. అప్పుడే అతనికి ఆమెతో చేస్తున్న ఈ కాపురంలో కేవలం తను భర్తే కాదు తండ్రి అనే మరో పదవికి అర్హుడు అని అర్థం అయినట్టుగా వింతగా మిల, మిల మెరిసే కళ్ళతో చూస్తూ ఆమెని బలంగా దగ్గరకు లాక్కుని కళ్ళు, నుదురు, బుగ్గలు, చుంబిస్తూ పెదాల దగ్గర స్థిరపడ్డాడు.

ఆబగా, అసహ్యంగా తన పెదాలు జుర్రుకుంటున్న అతను తనని మింగబోతున్న కొండచిలువలా అనిపించాడు.

అతి కష్టం మీద అతని నుంచి దూరం జరిగి పొట్ట మీద కొట్టుకుంటూ వెర్రిగా అరవసాగింది “వద్దు.. వద్దు నాకీ కడుపు వద్దు…”

క్షణంలో అతని కళ్ళల్లో ఎర్ర జీరలు.. తీక్షణంగా చూస్తూ “నువ్వు బిడ్డని కనాల్సిందే…” అన్నాడు కర్కశంగా.

“నో.. జరగదు.. ఎన్నటికీ జరగదు..” గొంతు చించుకుని అరిచింది.

“ఎట్లా జరగదో చూస్తాను..” రెండు భుజాలూ నొక్కి పట్టి క్రూరంగా నవ్వాడు.

ఆ క్షణం అతను నవ్విన ఆ వికృతమైన నవ్వు ఇంకా వెంటాడుతూనే ఉంది.. “ఇంక నిన్ను నా దగ్గరనుంచి ఆ దేవుడు కూడా తీసుకువెళ్లలేడు” అని కసిగా అన్న ఆ మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.

నెలలు నిండుతుంటే ఒక్కో గంట ఒక్కో యుగంలా గడిచింది..

డెలివరీకి ఎలాగా హాస్పిటల్‌కి తీసుకు వెళ్తాడు.. అక్కడినుంచి పారిపోవచ్చు అని ఆశ పడింది. కానీ తొమ్మిదో నెల వచ్చిన దగ్గరనుంచి ఏ క్షణాన నొప్పులు వస్తాయో అని డేగ కళ్ళతో పర్యవేక్షిస్తూ.. సరిగ్గా సమయానికి ఒక రాక్షసిని తీసుకొచ్చి డెలివరీ చేయించాడు..

తన చేతుల్లో పెట్టిన ఆ రక్తపు గుడ్డుని గొంతు పిసికి చంపేయాలి అనుకుంది ఆ క్షణం.

“మీకు డెలివరీ ఎక్కడ అయింది…” ఇన్‌స్పెక్టర్ ప్రశ్నతో ఉలిక్కి పడింది.

“ఇక్కడే… ఒక తాటకిని తీసుకొచ్చాడు..నాకు డెలివరీ చేయడానికి.”

“అంటే….” నొసలు చిట్లించాడు.

“మంత్రసాని..” అన్నాడు సూర్యనారాయణ.

“మంత్రసానా…ఐ మీన్ ఇంత సైన్సు డెవలప్ అయిన ఈ సొసైటీలో..” ఆశ్చర్యంగా చూసాడు.

సూర్యనారాయణ వేదాంతిలా నవ్వాడు. “తరతరాలుగా సాగుతున్న వృత్తుల్లో ఇది కూడా ఒకటి.. పూర్వీకుల నుంచి నేర్చుకున్న వృత్తి విద్యను జీవనోపాధికి ఉపయోగించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.. కాకపోతే అలాంటి వాళ్ళు కొందరి దృష్టిలోనే పడతారు. మా దౌర్భాగ్యం ఆ నీచుడి దృష్టిలో ఆమె పడడం, మా అమ్మాయి ఆమె చేతుల్లో పడడం.. ఒకందుకు సంతోషంగా ఉంది. నా కూతురుకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా జాగ్రత్తగా డెలివరీ చేసింది.”

“మై గాడ్ …” దీర్ఘంగా నిట్టూర్చాడు ఇన్‌స్పెక్టర్. “ఇంతవరకు ఎక్కడా ఇలాంటి సంఘటన, ఈ మాట వినలేదు.. ఇదే మొదటిసారి.”

హరిత ఆలోచనలు మళ్ళీ పసివాడి మీదకు మళ్ళాయి.

పాలివ్వు అంటూ తన ఒడిలో పడుకోబెట్టిన ఆ పసివాడిని అందుకోకుండా దూరం జరిగింది. లేత చిగురుటాకులాంటి పసివాడు గభాల్న కింద పడ్డాడు.. గుక్క పట్టి ఏడుస్తున్నా తను కళ్ళు మూసుకుని దూరంగా జరిగిందే కాని వేలేసి ముట్టుకోలేదు.

ఆ రాక్షసి తన జుట్టు పట్టుకుని వంచి వాడిని ఒడిలో పడుకోబెట్టి బలవంతంగా పాలు ఇప్పించడానికి ప్రయత్నించింది.. “పాలియ్యకుంటే పోరడు సచ్చిపోతడు” అంది..

“చావనీ… వాడు చావాలి..” అంది తను కసిగా..

హరిత ఉద్వేగంతో తన కాళ్ళ దగ్గర నిలబడి కోటి బొమ్మ తోక అటూ, ఇటూ ఊపుతూ ఆడుకుంటున్న బాబుని ఎత్తుకుని గుండెలకి హత్తుకుంది.

వాడు చావాలని ఎంతో కోరుకుంది.. ఎన్నోసార్లు చేతులు గొంతు వరకూ తీసికెళ్ళి అంత అరాచకత్వం చేయలేక కుళ్ళి, కుళ్ళి ఏడ్చింది..

తవ్వుతున్నా కొద్దీ శకలాల్లా బయటపడుతున్న ఆ జ్ఞాపకాలు వదిలించుకుంటూ అంది. “అతని సంగతి ఎలా ఉన్నా నేను, నేను వీడిని విపరీతంగా అసహ్యించుకున్నా.. ఒక నీచుడి ద్వారా పొందిన ఈ పసివాడిని ద్వేషించాను.. ఈ పసివాడి తప్పు లేకున్నా ఒక తల్లిగా కాక రాక్షసిలా ప్రవర్తించి వీడికి పాలు కూడా ఇవ్వకుండా కర్కశంగా ప్రవర్తించాను. ఎన్నో సార్లు చంపడానికి ప్రయత్నించాను.. ఆ భగవంతుడు ఒకే ఒక్క చిన్న దయ నా మీద చూపించి నేను శిశు హంతకిని కాకుండా కాపాడాడు..” అంటూ వెక్కి, వెక్కి ఏడవసాగింది. సూర్యనారాయణ హరిత భుజం పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు.

ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ సానుభూతిగా ఆమె వైపు చూసారు.

హరిత బలవంతంగా దుఃఖం దిగమింగి బాబు తల నిమురుతూ ఉండిపోయింది.

అంగుళం, అంగుళం వెదికిన కానిస్టేబుల్ కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఇన్‌స్పెక్టర్‌కి ఇచ్చాడు “ఇవి దొరికాయి సర్.”

“ఇక్కడ అతనికి సంబంధించిన వస్తువులు ఇవి తప్ప ఏమీలేవు. అతనికి వేరే ఇల్లువాకిలి ఉండేవన్నమాట…” కానిస్టేబుల్ వెదికి తీసిన రెండు పాంట్లు, షర్ట్స్ అండర్‌వేర్ చూస్తూ అడిగాడు ఇన్‌స్పెక్టర్.

హరిత మాట్లాడలేదు. అవన్నీ తను పట్టించుకోలేదు.. వాడికి వండి పెట్టమంటే అసహ్యంతో వణికిపోయేది.. వాడు ముట్టుకుంటే కంపరంతో కుళ్ళి పోయేది..

ఒక నరరూప రాక్షసుడితో, కామపిశాచితో ఐదేళ్ళపాటు గడిపిన ఒక నికృష్టమైన జీవితం… ఎంత ప్రయత్నించినా మర్చిపోలేక పోతోంది.. క్షణం, క్షణం కళ్ళ ముందు కదులుతోంది. వాడు ఎవరు, ఏం చేసేవాడు, ఎక్కడ నుంచి వచ్చాడు.. ఎక్కడ ఉంటాడు..తన దగ్గరకు ఎలా వస్తున్నాడు.. ఎలా వెళ్తున్నాడు.. ఏమి ఆలోచించే పరిస్థితిలో లేదు.. ఒకటే ఆలోచన … ఆ నరక కూపంలోంచి బయట పడాలి.. ఎలా.. అమ్మ, నాన్న, బంధువులు, స్నేహితులు అందరికి దూరంగా ఈ అడవిలో ఒక మృగంలా వాడు, ఓ బలి పశువులా తను… ఈ ఒక్క గదిలో వంట, పడక, కాలకృత్యాలు, అన్నీ ఈ నాలుగు గోడల మధ్య….

అసలు తను తిరిగి వెలుగు చూస్తాననుకుందా… ఆత్మహత్య చేసుకోడానికి కూడా అవకాశం లేని చోట.. క్షణం, క్షణం నరకం అనుభవిస్తూ మరో ప్రాణి కనిపించని ఈ అడవిలో ఆ అడవి మృగంతో బతికిన తనకి ఆలోచనా జ్ఞానం ఏది.. మనసు, మమకారాలు, ఆశలు, కలలు, ఆలోచనలు, స్పందనలు అనే మానవ సహజమైన అనుభూతులకు, భావాలకు అతీతంగా, ఓ రాయిలా బతికింది.

తెరలు, తెరలుగా దుఃఖం ఎగసిపడుతోంటే రెండు చేతుల్లో మొహం దాచుకుని కుమిలిపోసాగింది.

“బాధపడకండి.. ఇప్పుడు బాధపడుతూ కూర్చుంటే మనం ఈ కేసులో ముందుకు వెళ్ళలేము. మీరు ధైర్యంగా ఉండి మాకు సహకరిస్తే మేము వాడిని పట్టుకుని ఉరికంబం ఎక్కించ గలము” అన్నాడు ఇన్‌స్పెక్టర్.

సూర్యనారాయణకి కూడా దుఃఖం ఆగలేదు. కూతురిని దగ్గరకు తీసుకుని వీపు మీద ఓదార్పుగా రాస్తూ ఇన్‌స్పెక్టర్‌తో అన్నాడు. “ఇన్‌స్పెక్టర్ గారూ నా కూతురి జీవితం ఇలా చేసిన ఆ నరరూప రాక్షసుడు ఎక్కడున్నా పట్టుకోండి.. వాడిని చిత్రహింస చేయండి, ఆ రాక్షసుడు మామూలుగా చావకూడదు క్షణం క్షణం నరకం చూడాలి.. అది నేను కళ్లారా చూడాలి.”

ఇన్‌స్పెక్టర్ సానుభూతిగా చూస్తూ అన్నాడు “మా ప్రయత్నం అదేనండి. త్వరలోనే పట్టుకుంటాం. వాడు ఎక్కడున్నా జల్లెడ వేసి గాలిస్తాం. వాడు అసలు ఎక్కడినుంచి వచ్చాడు, ఈ అమ్మయినేనా ఇలా హింసించింది? ఇలాంటి అమ్మాయిలు ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఇలాంటి అనైతిక కార్యకలాపాలు ఇంకా ఏం చేస్తున్నాడు? వాడికి ఏదన్న మాఫియా ముఠాతో సంబంధం ఉందా.. డ్రగ్స్ కేసులో ఇన్వాల్వెమెంట్ ఉందా? వగైరా అన్ని విషయాలు ఆరా తీస్తాను. వాడు మీ అమ్మాయి కొట్టిన దెబ్బలకి ఇక్కడే పడి ఉంటాడని నేను అనుకోలేదు. బలిష్టమైన వ్యక్తి కాబట్టి కొంత సేపటికి లేవగలిగాడు.. క్లూ ఏమన్నా లభిస్తుందేమో అని ఇక్కడికి వచ్చాను. దొరికినవి చాలు.. ఇక నా పని మొదలు పెడతాను. విచిత్రం ఏమిటంటే ఇంతవరకు మీ అమ్మాయి తప్ప ఇంకెవరూ ఇలాంటి కంప్లయింట్ చేయలేదు. అంతా అయోమయంగా ఉంది… కానీ వదలం… పట్టుకు తీరతాం” దృఢంగా అన్నాడు.

కానిస్టేబుల్ మంచం కింద, వంట సామాను పెట్టిన షెల్ఫ్‌లో, బట్టలు పెట్టుకున్న చెక్క బీరువా అన్ని అంగుళం కూడా వదలకుండా వెదకసాగాడు.

ఒక మూల ఒక మనిషి మాత్రం వెళ్ళగల సందు కనిపించింది. కానిస్టేబుల్ ఆ సందు వైపు వెళ్లి తొంగి చూసాడు.. కంపు.. సందు కాదు చిన్న నడవా.. నాలుగు అడుగులు వేస్తే బాత్రూం కం లావేటరి. చీకటిగా ఉంది. కర్చీఫ్‌తో ముక్కు మూసుకుని వచ్చాడు.

ఇన్‌స్పెక్టర్ వైపు చూస్తూ “ఏమి లేవు సర్” అన్నాడు.

ఇన్‌స్పెక్టర్ పెదాలు బిగించి తల పంకించాడు. పెండ్యులంలా ఊగుతున్న చెక్క దగ్గరకు వెళ్లి ఇదేంటి అని అడిగాడు హరితని.

హరిత సిగ్గుతో కుంచించుకుపోతూ తల వంచుకుని “బాబు పడుకోడానికి అతను ఏర్పాటు చేసిన చెక్కబల్ల.. సగం అటకలాగా, సగం వాడికి పడక లాగా ఉపయోగించేదాన్ని.”

ఇన్‌స్పెక్టర్ తల పంకించాడు.

“సర్ ఇంక ఇంతకన్నా ఏమీ క్లూ దొరకలేదు” కానిస్టేబుల్ మాట వింటున్న ఇన్‌స్పెక్టర్ చురుకైన కళ్ళల్లో చిన్న స్పార్క్ …

మంచం వైపు నడిచి కానిస్టేబుల్ని పిలిచాడు.

అతను దగ్గరకు రాగానే మంచం కింద చూపిస్తూ “ఆ మఫ్లర్ తీయి” అన్నాడు.

మెరూన్ రంగు మఫ్లర్. కానిస్టేబుల్ అది ఎడం చేయి మునివేళ్ళతో పట్టుకుని బయటకు తీసాడు.

అది చూపిస్తూ అడిగాడు హరితను “అతను మఫ్లర్ వాడే వాడా.”

“అవును.. పూర్తిగా తల, మొహం కప్పుకుని కళ్ళు మాత్రం కనిపించేలా వచ్చేవాడు.”

“సేవ్ ఇట్” చెప్పాడు … కానిస్టేబుల్ పేపర్ కోసం చుట్టూ చూశాడు. ఓ మూల పాత న్యూస్ పేపర్ లోని ముక్క కనిపించింది. అది తీసి మఫ్లేర్ చుట్టాడు.

ఇన్‌స్పెక్టర్ “ఓకే లెట్స్ గో” అని బయటకి నడిచాడు. అతన్ని అనుసరించారు అందరూ.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here