Site icon Sanchika

నాన్న లేని కొడుకు-7

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సంచిక పాఠకుల కోసం రచించిన ‘నాన్న లేని కొడుకు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]కా[/dropcap]రు ఎక్కుతుండగా హరిత బాబు చేతిలోంచి కోతి బొమ్మ తీసి పడేసింది. బాబు గబుక్కున ఆమె చేతుల్లోంచి జారి తిరిగి అది తీసుకోబోతుండగా అంది “వద్దు నాన్నా అవి తీసుకోకు… పారెయ్… మనం మళ్లీ మంచి బొమ్మలు కొనుక్కుందాం…”

వాడు తల్లి వైపు బిక్కమొహంతో చూసాడు. హరిత వాడిని ఎత్తుకుని కారులో కూర్చుని “నేను కొనిస్తాను” అంది.

వాడు విండోలోంచి బొమ్మలవైపు చూస్తూ నిశ్శబ్దంగా ఏడవడం మొదలుపెట్టాడు. హరిత హృదయం ద్రవించింది. కారు కదిలింది. బాబు ఏడుస్తూ వెనక్కి వెనక్కి తిరుగుతూ బొమ్మలు కనుమరుగయాక నెమ్మదిగా మాములు స్థితికి వచ్చి పడుకున్నాడు.

అప్పటికే పూర్తిగా అలసిపోయిన హరిత కూడా నీరసంగా సీటులో వెనక్కి వాలి “నాన్నా అమ్మని చూడాలి” అంటూ నిస్త్రాణగా కళ్ళు మూసుకుంది.

కారు నిర్జన ప్రదేశంలో నుంచి రోడ్ మీదకి వచ్చాక అడిగాడు ఇన్‌స్పెక్టర్ “డాక్టర్, నాలుగేళ్ల నుంచి ఈ వ్యవహారం ఇంత పకడ్బందీగా నడిపిస్తున్నాడంటే వాడు మామూలు క్రిమినల్ కాదనిపిస్తోంది. పైగా ఒక్కటి కూడా నాకు తెలిసి ఇలాంటి కేసులు లేవు. యాసిడ్ పోయడం, చంపడం ఇవన్నీ కామన్‌గా జరుగుతున్నాయి. కానీ ఇది మాత్రం కొంచెం విచిత్రంగా ఉంది. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి, ఇక్కడ సిటీకి ఇంత దూరంగా ఉంచి రోజు ఇక్కడికి రాత్రి వచ్చి ఉదయం వెళ్తున్నాడంటే అసలు ఊహించలేకపోతున్నాను. ఇతన్ని పట్టుకోడం అంత సులభం కాదనిపిస్తోంది. అందుకే మీడియాలో ప్రకటన ఇప్పించడం అనివార్యం అనిపిస్తోంది.. మీకేమన్నా అభ్యంతరం ఉందా?”

సూర్యనారాయణ కొంతసేపు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇన్‌స్పెక్టర్ అన్నది అక్షరాలా నిజం. వాడు ఎవరో, ఎక్కడ ఉంటాడో, ఇక్కడికి ఎలా వస్తున్నాడో.. అంతా మిరకిల్. ఇవన్నే తెలియాలంటే వాడు పట్టుబడాలి. పట్టుబడాలంటే ప్రచారం కావాలి. తప్పదు. పరువు, ప్రతిష్ఠ అని ఆలోచిస్తే ఒక క్రిమినల్‌ని కాపాడిన వాడు అవుతాడు తను. అంతకన్నా వేరే క్రైమ్ ఉందా! నో… వాడు పట్టుబడాలి.. నా కూతురుని పెట్టిన చిత్రహింసలకి రెట్టింపు హింస వాడు అనుభవించాలి.

దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు “లేదు. యు కెన్ గో ఎహెడ్”.

ఇన్‌స్పెక్టర్ ఆయన వైపు సైడ్ మిర్రర్‌లో నుంచి గౌరవభావంతో చూస్తూ చూసాడు. “డాక్టర్! అందరూ మీలా ఉంటే ఇంత మంది క్రిమినల్స్ ఈ సమాజంలో నిర్భయంగా తిరిగేవాళ్ళు కాదు. పరువు, మర్యాద అంటూ భయపడుతూ, మా పిల్ల దొరికింది చాలు వదిలేయండి అని మీరు అని ఉంటే మన ఈ శ్రమ అంతా వృథా అయేది.”

సూర్యనారాయణ కొంచెం ఒంగి అతని భుజం మీద తట్టాడు. ఆ స్పర్శలో కొండంత ధైర్యం కనిపించింది ఇన్‌స్పెక్టర్‌కి.

***

జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్ 24 లోని డాక్టర్ సూర్యనారాయణ ఇంటి గేటు తెరుచుకుంది. సెక్యూరిటీ గార్డ్ వచ్చి సూర్యనారాయణకి సెల్యూట్ చేసాడు.

ఆయన దిగి హరిత కూర్చున్న వైపు వచ్చి డోర్ తెరిచాడు. ఆ కొత్త పరిసరాలను విశాలమైన కళ్ళతో, ఆశ్చర్యంగా, విభ్రమంగా చూస్తూ “కొత్త ఇల్లా నాన్నా…” అడిగింది హరిత.

“అవునమ్మా అక్కడ ఉండలేక ఈ ఇల్లు తీసుకున్నాను.” ఆమె భుజం మీద చేయి వేసి నడిపిస్తూ అన్నాడు.

అప్పటికే ఫోన్ చేసి కూతురుని తీసుకువస్తున్నాని భర్త చెప్పడంతో ఆయన భార్య జ్యోతి బయటకి వచ్చి మెట్లమీద నిలబడి ఆత్రుతగా ఎదురుచూస్తోంది వాళ్ళకోసం.

బాబుని ఎత్తుకుని కారులోంచి దిగిన హరిత దగ్గరకు వేగంగా వచ్చి బావురుమంటూ ఆలింగనం చేసుకుంది.

“అమ్మా ….” అంటూ ఆవిడని హత్తుకుపోయింది హరిత.

సూర్యనారాయణ హరిత చేతిలోనుంచి బాబుని తీసుకుని భార్య భుజం మీద చేయి వేసి “అమ్మాయి బాగా అలసిపోయింది జ్యోతీ లోపలికి తీసుకువెళ్ళు” అన్నాడు.

ఆవిడ ఏడుస్తూనే హరితని జాగ్రత్తగా నడిపిస్తూ లోపలికి తీసుకు వెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది.

చచ్చిపోయిందనుకున్న కూతురు నాలుగేళ్ల తరవాత కళ్ళ ముందు కనిపిస్తుండడంతో ఆవిడ ఆనందానికి హద్దులేకుండా అయింది. నీరసించి, పూర్వపు అందం, లాలిత్యం కోల్పోయి అస్థిపంజరంలా ఉన్న హరితను చూస్తుంటే దుఃఖం ఆగడం లేదు.

“జ్యోతీ ముందు తనని స్నానం చేసి రానీ.. ఈ లోగా భోజనం రెడీ చేయి. బాబుకి పాలు నీళ్ళు చూడు” అన్నాడు సూర్యనారాయణ.

ఆవిడ బాబు వైపు ఏవగింపుగా చూసింది.

“ఎవరు వీడు..” అడిగింది.

“ఎవరైనా.. మన అమ్మాయి రక్తం పంచుకుని పుట్టాడు.. కాబట్టి మనకి మనవడు. తీసుకో వెంకటమ్మని పిలిచి స్నానం చేయించామను” అన్నాడు గంభీరంగా.

ఆవిడ మొహంలో అసహ్యం స్పష్టంగా కనిపించింది.. బాబుని అందుకోలేదు. హరితని లేపి “పదమ్మా స్నానం చేయి” అంది.

“అమ్మా వాడు నా కొడుకు.. ఒక నరరూప రాక్షసుడికి పుట్టాను అని వాడికి తెలియదు.. ద్వేషించకు” అంది హరిత.

ఆవిడ నిస్సహాయంగా అంది “ఏంటమ్మా ఇదంతా.. ఎవరు వాడు.. ఏం జరిగింది.. ఎక్కడ ఉన్నావు ఇంతకాలం..”

“అంతా సావకాశంగా చెప్పుకుందాం, ముందు వాళ్ళిద్దరికీ మంచి ఆహారం సంగతి చూడు” అన్నాడు సూర్యనారాయణ హెచ్చరిస్తూ.

ఆవిడ చేసేది లేక బాబుని అందుకుని “వెంకటమ్మా” అని పిలుస్తూ కూతురిని ఒక చేత్తో పట్టుకుని లోపలికి నడిచింది.

చాలాకాలం తరవాత ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో, విశాలమైన తన మంచం మీద, మెత్తటి పరుపుమీద ఏసి చల్లగా జో కొడుతుంటే మత్తుగా కళ్ళుమూసుకుంది హరిత.

అమ్మ కొసరి, కొసరి వడ్డించిన రుచికరమైన వంటలతో కడుపునిండా భోజనం చేసిందేమో వెంటనే కంటినిండా నిద్ర ముంచుకు వచ్చింది. మూసుకుపోతున్న కళ్ళు బలవంతంగా తెరిచి పక్కన పడుకున్న బాబు వైపు చూసింది. ఎన్నడూ ఎరుగని మెత్తటి పరుపు సుఖాన్ని ఆస్వాదిస్తూ, ఆదమరచి నిద్రపోతున్నాడు. వాడి వైపు వత్తిగిల్లి, కుడిచేయి వాడి బొజ్జ మీద వేసుకుని కొద్ది క్షణాల్లోనే గాడ నిద్రలోకి జారుకుంది.

హరిత పడుకున్నాక జరిగిందంతా భార్యకి చెప్పాడు సూర్యనారాయణ.

జ్యోతి వెక్కి, వెక్కి ఏడవసాగింది. “అయ్యో! ఇదెక్కడి దౌర్భాగ్యమండి .. ఒక్కగానొక్క కూతురు బాగా చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి, పిల్ల, పాపలతో కళ కళలాడుతూ ఉంటే చూసి మురిసిపోవాల్సిన మనకి ఈ ఆవేదన, ఆక్రోశం జీవితాంతం ఉండాల్సిందేనా.. దాని జీవితం ఇలా నాశనం అయింది.. నేనేం పాపం చేసాను?” ప్రతి తల్లి లాగే ఆమె కూడా తను చేసిన పాపపుణ్యాల ఫలితమే తన కూతురుకి దక్కిన జీవితం అనుకుంటూ.. పదే, పదే నేనేం పాపం చేసాను అంటూ ఏడవసాగింది.

భార్య దుఃఖం చూస్తుంటే ఆయనకీ కూడా దుఃఖం ఆగలేదు. కానీ తమాయించుకుంటూ అన్నాడు.

“హరిత ఎదురుగా ఈ విషయం ఇంక ఎత్తద్దు.. దాని జీవితం నాశనం అయింది అని పొరపాటున కూడా అనద్దు.. జరిగింది ఒక యాక్సిడెంట్, చాలా పెద్ద యాక్సిడెంట్. తను చచ్చి బతికింది.. ఇక ముందు తను గడపబోయేది కొత్త జీవితం.. హరిత మళ్ళీ కాలేజ్‌కి వెళ్తుంది.. చదువు కంటిన్యూ చేస్తుంది.”

ఆవిడ వణికిపోతూ అరిచింది “మళ్ళీ కాలేజ్‌కా వద్దు..”

ఆయన ఆవిడ భుజం మీద చేయెసి చిరునవ్వుతో అన్నాడు “ఇంక మన హరితకీ ఎలాంటి ప్రమాదం ఉండదు నన్ను నమ్ము. తను చదువుకోవాలి.. ఉన్నతమైన చదువులు చదువుకోవాలి. ఉన్నత స్థాయికి ఎదగాలి. అదే నా లక్ష్యం.. అదే హరితకీ లక్ష్యం కావాలి..”

“కానీ, కానీ ఎలా? ఇంత ఘోరం జరిగాక మళ్ళీ నా బిడ్డని ఒంటరిగా ఈ కీకారణ్యం లాంటి సమాజంలోకి ఎలా పంపించగలను చెప్పండి!” అంది ఏడుస్తూ.

ఆయన గంభీరంగా అన్నాడు. “జ్యోతీ! మనిషి సంఘజీవి. సంఘంతో కలిసి నడవాలి.. సంఘంతో కలిసి జీవించాలి. ఆ సంఘమే మనిషిని పడతోస్తుంది… నిలబెడుతుంది. ఆ సంఘమే తనతో నడిపిస్తుంది. తనూ నీడగా అనుసరిస్తుంది. ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. సంఘం, మనిషి వేరు కాదు.. మనిషి రెండుకాళ్ళ మీద నిలబడడానికి ఆసరా ఈ సంఘమే. సంఘాన్ని చూసి భయపడితే వెంట పడి తరుముతుంది. స్థిరంగా నిలబడి రెండు చేతులతో ఆహ్వానిస్తే చేరదీసి అక్కున చేర్చుకుంటుంది.

జీవితం నేర్పిన అనుభవంతో ఈ పాటికే హరిత రాటు దేలిపోయి ఉంటుంది. లేకపోతే నరరూప రాక్షసుడి చేర నుంచి బయట పడేదా! రావణాసురుడు లంకలో దాచిన సీతను కనుగొనడానికి హనుమంతుడు ఎన్నెన్ని సాహసాలు చేసాడో తెలుసుగా. ఈనాడు కూడా రావణాసురులు ఉన్నారు, సీతలూ ఉన్నారు. లంక లాంటి అభేద్యమైన నివాసాలు ఉన్నాయి.. కానీ హనుమంతుడు లేడు… సీత సిందూరంలో హనుమంతుడు తన శక్తి, యుక్తులను కలిపి ఇచ్చాడు. అదే ఆధునిక సీతలకు ధైర్య సాహసాలను కలిగిస్తుంది. ఆ ధైర్యంతోటే మన అమ్మాయి ముందు, ముందు బతుకుతుంది. బతకాలి. తను బతకడానికి మనం వెనక నిలబడి ప్రోత్సాహం ఇవ్వాలి. తనని భయపెట్టద్దు. ఈ విషయాలు గుర్తుంచుకో. జరిగింది అంతా ఒక పీడకల. ఆ కల మర్చిపోయి భవిష్యత్తుని గూర్చి తీయని కలలతో మనమ్మాయి ప్రశాంతంగా నిద్రపోవాలంటే నువ్వు ముఖ్యంగా ధైర్యం అనే జోల పాడాలి. చిన్నప్పుడు పాడిన జోల కాదు.. రాగాలు మారాయి, కొత్త పాటను, కొత్త రాగంతో పాడాలి.”

ఆయన మాటలకి జలదరించిపోతున్న మనసు దిటవు చేసుకుంటూ… “ఆ పిల్లవాడు.. వాడిని మనవడిగా అంగీకరించలేకపోతున్నాను” అందావిడ.

ఆయన కొన్ని క్షణాలు మాట్లాడలేదు. తరవాత గంభీరంగా అన్నాడు “మనం అంగీకరించినా, అంగీకరించకపోయినా వాడిని కన్నది మన కూతురు. అంచేత వాడు మనకి మనవడే అవుతాడు. అయినా అభం, శుభం తెలియని ఆ పసివాడిని ఎలా ద్వేషించగలం! వాడి తప్పేం ఉంది! వాడి పుట్టుకకి వాడు బాధ్యుడు కాడు కదా!”

ఆవిడ మనసులో అదే ఆలోచన సుడులు తిరుగుతుంటే మౌనంగా ఉండిపోయింది.

“జ్యోతీ.. రేపటి నుంచి హరితతో గతం గురించిన ప్రస్తావన తేవద్దు.. అలాగే బాబుని కూడా ప్రేమించడానికి ప్రయత్నించు. రేపు వాడి ఆలనా, పాలనా నువ్వే చూసుకోవాలి. మరోసారి చెబుతున్నా… జరిగింది అంతా పీడకల అనుకో.. హరిత మనసులో కూడా అదొక పీడకల అనే భావం కలిగించడానికి ప్రయత్నించు. బాబుని నేను రేపు ఓసారి పరీక్షిస్తాను.. ఒక వారం రోజుల్లో స్పెషలిస్ట్‌కి చూపిస్తాను. వాడికి తప్పకుండా మాటలు వస్తాయి. నాకా నమ్మకం ఉంది… కొంచెం మాటలు వచ్చాక ప్లే స్కూల్‌లో వేస్తాను.. అంతే కాదు రేపు ఈ కిడ్నాప్ విషయం మీడియాలో వస్తుంది. నా పేరు కూడా చెప్పచ్చు.”

ఆవిడ విహ్వలంగా చూసింది. “మీడియాలోనా” అంది వణికిపోతూ.

“రాకపోతే ఎలా? వాడిని పట్టుకోవాలి.. అరెస్టు చేయాలి.. వాడికి శిక్ష వేయాలి.. లేకపోతే హరిత సుఖంగా ఎలా ఉండగలదు! కాబట్టి పరువు, ప్రతిష్ఠ అని భయపడకు. ఎవరన్నా ఫోన్ చేసి అడిగినా, ఇంటికి వచ్చి ఎంక్వయిరీ చేసినా బరస్ట్ అవకు. గంభీరంగా ఉండు.. మనకి కావాల్సింది మనమ్మాయి భవిష్యత్తు.. ఎవరైనా ఏ విషయం అయినా కొంతకాలమే చర్చించుకుంటారు. సుదీర్ఘకాలం చర్చించుకునే సమయం ఎవరికీ లేదు. ఈ విషయం గుర్తుంచుకో చాలు..”

భర్త వైపు చూస్తూ ఆయన మాటలు వింటూ కళ్ళముందు హరిత భవిష్యత్తుని అందంగా ఊహించుకోడానికి ప్రయత్నించసాగింది జ్యోతి. నెమ్మదిగా కళ్ళు మూతలు పడ్డాయి.

నాలుగు రోజులు గడిచాయి. హరిత నెమ్మదిగా కోలుకుంటోంది. ఆమె మొహంలో క్రమంగా పూర్వపు నాజూకుదనం, కళ , కాంతి వస్తోంది. కళ్ళల్లో వెలుగు నిండి కళ్ళు ప్రకాశవంతం అవుతున్నాయి.

బాబుని పరీక్షించిన సూర్యనారాయణ వాడికి తప్పకుండా మాటలు వస్తాయని నిర్ధారించి, స్పెషలిస్ట్ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు. హరితని మళ్ళీ కాలేజ్‌లో చేరమని ప్రోత్సహించాడు.

తండ్రి ఇస్తున్న ప్రోత్సాహం, ఆయన తనకి జీవితం పట్ల కలిగిస్తున్న మమకారం, ప్రేమ చూసిన హరిత కళ్ళు చెమ్మగిల్లాయి. ఇలాంటి అమ్మ, నాన్నలకి నాలుగేళ్ళు దూరంగా ఉన్నానన్న భావనే ఆమెని దుఃఖంలో ముంచేస్తోంది.

“నాన్నా! నా జీవితం నాశనం అయింది ఇంక నాకు చావే శరణ్యం అనుకున్నాను.. కానీ నువ్వు నాలో ఆశలు చిగురింప చేస్తున్నావు.. నాకు ఇప్పుడు ఇదివరకు కన్నా ఎక్కువ ఉత్సాహం కలుగుతోంది. ఎప్పటికన్నా ఇంకా గొప్పగా బతకాలని ఉంది. తప్పకుండా చదువు కంటిన్యూ చేస్తాను” అంది ఆయన గుండెల మీద వాలిపోయి.

ఆమె తల మీద వాత్సల్యంగా రాస్తూ మనసులో అనుకున్నాడు.. “ఉన్నతమైన చదువు, ఉన్నతమైన ఉద్యోగం సంపాదించావంటే నీకు జరిగిన ప్రమాదంలో తగిలిన గాయాల తాలూకు మచ్చలు పూర్తిగా మాసిపోతాయి తల్లి.. అప్పుడు నీకు నువ్వే కొత్తగా కనిపిస్తావు.. తన తప్పు లేకున్నా తన జీవితంలో ఎదురయే ఇలాంటి ప్రమాదాలకి స్త్రీనే బాధ్యురాలిని చేసే ఈ దిక్కుమాలిన సమాజాన్నిఎదుర్కోడానికి నీ చదువే నీకు అండగా నిలబడుతుంది.”

మరునాడు ఇన్‌స్పెక్టర్ మురళి ఫోన్ చేసి నేరస్థుడు దొరికాడని ఒకసారి స్టేషన్‌కి రమ్మని చెప్పాడు.

(సశేషం)

Exit mobile version